స్టార్టప్ స్టోరీ మొదలైందే ఇప్పుడు..!
మరిన్ని స్టార్టప్స్ లో పెట్టుబడి - ఆనంద్ మహీంద్రా
భారత్‌లో రాబోయే రోజుల్లో ఆంట్రప్రెన్యూర్షిప్ ఓ విస్ఫోటనంలా (వర్చువల్ ఎక్స్‌ప్లోషన్) అభివృద్ధి చెందక తప్పదంటున్నారు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.
''ఎక్స్‌ప్లోషన్ అనే విశేషణాన్ని వాడడం వల్ల దీన్ని ఎక్కువ చేసి చూపించినట్టు కానేకాదు. ప్రపంచవ్యాప్తంగా మన దగ్గరున్న క్వాలిటీ, క్వాంటిటీ ఎనర్జీ మరెక్కడా లేదు. రాబోయే రోజుల్లో పారిశ్రామికీకరణలో ఓ విస్ఫోటనం లాంటిది వచ్చినా ఆశ్చర్యం లేదు''
బ్రిటిష్ రాజ దంపతులు ప్రిన్స్ విలియమ్, కేట్‌ను సందర్శించడంలో భాగంగా ప్రారంభమైన ఓ స్టార్టప్ అవార్డ్ సందర్భంగా మహీంద్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంత మంది స్టార్టప్ బుడగ పేలుతోందని చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించలేదు. స్టార్టప్ ఎకో సిస్టమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెంచర్ మహీంద్రా పార్ట్‌నర్స్ ద్వారా మరిన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఆయన వివరించారు.
స్టార్టప్ చేస్తున్న పనేంటి, ఎందుకోసం చేస్తున్నారు, వాళ్లు చేస్తున్న పని/ఆలోచనలో ఎంత విలువుంది అనే విషయాలను బేరీజు వేసుకోవడంతో పాటు, తాము ఇప్పటికే ఉన్న వ్యాపారాలకు సదరు స్టార్టప్ ఆలోచనతో ఏదైనా ముప్పు ఉంటుంది అని భావిస్తే.. ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడబోమని మహీంద్రా చెబ్తున్నారు.
అయితే, తమ ప్రత్యేక సంస్థ మహీంద్రా వెంచర్స్ ద్వారా ఎన్ని స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టారు అనే విషయాన్ని మాత్రం ఆనంద్ మహీంద్రా వెల్లడించలేదు.
ఆంట్రప్రెన్యూర్షిప్‌కు ప్రభుత్వ ప్రోత్సాహానికి కూడా తోడైంది. ఫ్లిప్ కార్ట్, పేటిఎం వంటి యునికాన్ (1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వేల్యుయేషన్ ఉన్న కంపెనీలు) సంస్థల విజయోత్సాహం ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్స్‌లో ఆశలను రేకెత్తిస్తున్నాయి. వాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన వాతావరణం కూడా దేశంలో ఉంది - ఆనంద్ మహీంద్రా.
తాజాగా స్మార్ట్ షిఫ్ట్ అనే స్టార్టప్‌లో మహీంద్రా సంస్థ పెట్టుబడి పెట్టింది. కార్గో ఓనర్లు, ట్రాన్స్‌పోర్టర్లను కలిపే వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. కమర్షియల్ వాహనాల అమ్మకాలపై ఇలాంటి వేదికలు ప్రభావం చూపుతాయని తెలిసినా, తమ కోర్ బిజినెస్‌కు ఇది వ్యతిరేకమనిపించినా ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం తమ ఆలోచనా పరిధికి అద్దం పడుతోందని ఆనంద్ మహీంద్రా అంటున్నారు.