సంకలనాలు
Telugu

మురికి బట్టల్లో పుట్టిన కోట్ల వ్యాపారమే వాషప్ లాండ్రి

ఫోన్ అయినా, ఆన్‌లైన్ అయినా... ఆర్డర్ చేస్తే చాలు ఉతికేస్తామంటున్న వాషప్ లాండ్రి..కొత్త స్టార్టప్ వాషప్ లాండ్రి డాట్ కామ్..రోజురోజుకీ పెరుగుతున్న మార్కెట్..ఫ్రాంఛైజీల కోసం ఎదురుచూస్తున్న స్టార్టప్.

Poornavathi T
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
image


వస్తు, సేవల రంగం నానాటికీ తన పరిధిని విస్తరించుకుంటోంది. వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ నెట్‌ఫ్లిక్స్, కాల్‌ క్యాబ్ రంగంలో ఓలా క్యాబ్స్ , గ్రాసరీ రంగంలో బిగ్‌బాస్కెట్.. ఇలా ఒకటేమిటి ఎన్నో రంగాల్లో స్టార్టప్‌ల హవా నడుస్తోంది. తాజాగా లాండ్రి రంగంలోనూ ఉపాధి అవకాశాల జోరు ఊపందుకుంది.

వాషప్ లాండ్రీ

ఫ్యాషన్ రంగంలో పనిచేసిన ఆర్.బాలచందర్ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. తాను నివాసం ఉండే చోట ఉన్న ఓ లాండ్రీ షాపుని రోజూ గమనించేవాడు బాలచందర్. ఆ పరిశీలనే ఓ స్టార్టప్‌కి నాందిగా మారింది. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూనే ఇతర బిజినెస్ ప్లాన్స్ రచించేవారు. రిటైల్ ఫ్యాషన్ నుంచి డాట్ కామ్‌కు ఆయన ఐడియాలు మారాయి. చివరకు దుర్గా దాస్‌ అనే స్నేహితురాలితో కలిసి లాండ్రీ సేవల దిశగా అడుగులు వేశాడు. ఆమెకు సిలికాన్ వ్యాలీలో 20 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉంది. దాస్ స్టార్ వెంచర్స్ తొలివిడత ప్రాధమిక పెట్టుబడిగా రూ.4 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 'వాషప్ బ్రాండ్‌' (wassup) పేరుతో ప్రారంభించిన ఈ స్టార్టప్‌కి కెనరా బ్యాంక్ రూ.4 కోట్లు లోన్‌గా అందచేసింది.

image


వాషప్ లాండ్రి ఎలా పనిచేస్తుంది?

వాషప్ బ్రాండ్ లాండ్రీ పనితీరు ఆశ్చర్యకరంగా సాగుతుంది. కస్టమర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే .. సిబ్బంది ఇంటికొచ్చి బట్టలు తీసుకెళతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ట్యాగ్. ప్రతీ బట్టకు ట్యాగ్ వేస్తారు సిబ్బంది. ఆ బట్టల్ని ఎలా ఉతకాలో కూడా వారు ఆ ట్యాగ్‌లో వివరిస్తారు.

ఈ ట్యాగ్‌ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒకరి బట్టలు ఒకరికి మారడం జరగదు. అలాగే ఖరీదైన బట్టలు పాడైపోతాయని దిగులు అక్కర్లేదు. బట్టల్ని వివిధ రకాలుగా విభజించి వేటిని ఎలా ఉతకాలో వారు నిర్ణయించి శుభ్రమయిన నీటిలో ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి మరీ మన ఇంటికి చేరుస్తారు.

ఎన్నిరోజులు పడుతుంది?

సాధారణంగా వాషప్ లాండ్రి వాళ్ళు నాలుగు రోజులలోపు బట్టల్ని కస్టమర్లకు డెలివర్ చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఆర్డర్ అయితే కేవలం ఒక రోజులోనే పూర్తిచేస్తారు. రోజుకి వాషప్ లాండ్రీలో 5 టన్నుల బట్టల్ని ఉతికే సామర్ధ్యం ఉంది. దేశంలోనే బెస్ట్ కమ్యూనిటీ లాండ్రీగా వాషప్ లాండ్రీ పేరు తెచ్చుకుంది. సేవల విషయంలో తాను రాజీ పడేది లేదంటున్నారు బాలచందర్. అంతేకాదు సామాన్యులకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామంటున్నారు. బట్టల నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ధరలు కూడా తమ దగ్గరే తక్కువ అంటారు. సగటున ఒక కుటుంబానికి చెందిన 20 జతల బట్టలు వాష్ చేసి, ఐరన్ చేయడానికి రూ.1299 ఛార్జ్ చేస్తారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ వచ్చి ఇంటి నుంచి బట్టలు తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడం వరకూ అన్నీ కలిపే ఉంటాయి. 'మా సేవల నాణ్యతను పరిశీలించినవారు పర్మినెంట్ కస్టమర్లుగా మారిపోతారు ' అంటారు బాలచందర్.

‘‘వారాంతంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడానికి జనాలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో సంప్రదాయంగా సెలవులు, వారాంతాల్లో బట్టల ఉతికేందుకు ఎవరికీ తీరికలేదు. అదే మాకు కలిసొస్తోంది ’’ అంటారు వాషప్ లాండ్రీ వ్యవస్ధాపకులు బాలచందర్. గతంలో తల్లి వంటలు చేస్తే, భార్య బట్టలు ఉతకడానికి సమయం వెచ్చించేది. కానీ ఇప్పుడు అన్నీ ఇన్‌స్టంట్ అయిపోయాయి. మారుతున్న జీవన శైలికి అనుగుణంగానే తామూ ఇలాంటి సర్వీసులను విస్తరిస్తున్నామని అంటున్నారు.

వాషప్ సర్వీసులు బాగా చౌకగా ఉన్నాయని తమకు ప్రశంసలు వస్తున్నాయంటారు బాలచందర్. అందుకే వాషప్‌ని కస్టమర్లు రెగ్యులర్‌గా వాడుతున్నారని చెబుతున్నారు. యువకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఉద్యోగులైన భార్యాభర్తలు, బిజీగా ఉన్న వ్యక్తులు వాషప్‌ని ఎంచుకుంటున్నట్టు వివరించారు.

image


‘‘ ప్రతీ గార్మెంట్‌కి వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగానే మేం వాషప్‌లో శుభ్రత పాటిస్తాం. వాటర్ విషయంలోనూ మేం రాజీపడే ప్రసక్తి లేదు ’’ అంటున్నారు బాలచందర్.

వాషప్ ఇప్పుడు స్టార్ హోటల్స్‌కి కూడా తన సేవలను అందిస్తోంది. తాజ్‌ వివాంతా, ర్యాడిసన్, ది ఒబెరాయ్, ఐఐటీ చెన్నై, ఇండియన్‌ నేవీ, మహింద్రా వరల్డ్ సిటీ వంటి పెద్ద కంపెనీలు వాషప్ నుంచి సేవలు అందుకుంటున్నాయి.

వినియోగదారులకు తాము అందిస్తున్న సేవల నేపధ్యంలో భారీ కంపెనీలు తమకు అవకాశం ఇస్తున్నాయని అంటారు నిర్వాహకులు. ఇండియాలో లాండ్రి మార్కెట్ బాగా విస్తరిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కెపీఎంజీ అంచనాల ప్రకారం భారతీయ లాండ్రి మార్కెట్ విలువ రూ.5000 కోట్లు. ఇక అసంఘటిత రంగంలో గ్రామాల నుంచి నగరాల వరకూ ఈ తరహా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి విలువ 2 లక్షల కోట్లు. జ్యోతీ ఫ్యాబ్రికేర్ సర్వీసెస్ వంటి సంప్రదాయ సంస్థలు ఇందులో ఉండనే ఉన్నాయి. 

ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన సేవల వల్ల వాషప్ లాండ్రీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పనితీరు మెరుగ్గా ఉన్న ఉద్యోగులకు సోడెక్సో కూపన్‌లు అందిస్తోంది. దీంతో సిబ్బందిలో కూడా అంకితభావం పెరిగిందంటారు బాలచందర్.

దేశంలో మొదటిసారిగా ఐటిఐ కర్నాటకతో కలిసి ఒక ఒప్పందం చేసుకుంది. ‘వాషప్ అకాడమీ ఫర్ లాండ్రి’ పేరుతో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. లాండ్రీ ఇండస్ట్రీలోని వర్కర్లు ఈ కోర్సుల్లో చేరి తమ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. మంచి నాణ్యతతో కూడిన సేవలు చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడాలంటారు బాలచందర్. అలాగే డ్రై క్లీనింగ్‌లో పిహెచ్‌డీ కోర్సు కూడా ఉందని మీకు తెలుసా. వాషప్ లాండ్రీకి చెందిన ఎస్ బాబు డ్రై క్లీనింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశాడట.

రూ.100 కోట్ల టర్నోవర్ చేస్తాం !

వాషప్ లాండ్రీని మరింతగా విస్తరించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏడాది టర్నోవర్ రూ.3.2 కోట్లకు చేరింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్టు టర్నోవర్‌ని రూ.8 కోట్లకు పెంచాలని భావిస్తున్నారు. 2017 నాటికి రూ.100 కోట్లకు చేరుస్తామని ధీమాగా ఉన్నారు బాలచందర్.

మే నెలలో వాషప్ 2 మిలియన్ డాలర్ల ఫండింగ్ అందుకుంది. జబాంగ్ వ్యవస్థాపకులైన అరుణ్ చంద్రమోహన్, ప్రవీణ్ సిన్హా సహా ఏంజిల్ ఇన్వెస్టర్ మికీ వాత్వానీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు.

image


జాతీయ స్ధాయిలో తమ ఫ్రాంచైజీలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 100 చదరపు అడుగుల స్థలం ఉండి రూ. 6 లక్షల పెట్టుబడి పెట్టగలిగేవారి ఫ్రాంచైజీ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వారం పాటు అలాంటి వారికి శిక్షణ ఇస్తామంటున్నారు. ఇలాంటి ఫ్రాంఛైజీల్లో 70 శాతం మంది మహిళలు ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు. చెన్నై, ఢిల్లీ, బెంగళూరుల్లో ఇప్పటికే 11 స్టోర్స్ ప్రారంభించారు. 6 ఫ్రాంచైజీలకు అనుమతి ఇచ్చారు. వాషప్ లాండ్రీని త్వరలో పూణే విస్తరించనున్నారు.

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ తన పరిధిని విస్తరించుకుంటోంది. అయితే ధోబీ వాలాల ఉపాధికి తాము అవరోధం కాదంటున్నారు. స్టీమ్‌ ఐరన్‌కి స్వస్తి చెప్పి ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక మెషీన్ ఐరన్‌ చేస్తున్నారు. దోభీ వాలాలకు కూడా ఐడీ కార్డులు ఇచ్చి వారిని భాగస్వాములుగా చేస్తున్నారు. వాళ్లకూ సమాజంలో వారికి మంచి గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. ధోభీవాలాలను తమ కంపెనీలో చేర్చుకుని ఐడీ కార్డులు ఇవ్వడం వల్ల ఫిక్స్‌డ్ శాలరీ కూడా అందుతుందని... పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇది గౌరవాన్ని పెంచుతుందన్నారు.

వాషప్ లాండ్రీ ఒక్కో నగరంలో ఒక్కో రేటును వసూలు చేస్తోంది. కాటన్ చీరలు లాండ్రీ చేసి ఇస్తే రూ.80, డ్రై క్లీనింగ్‌కి 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. షర్టులు, టీ షర్టులు లాండ్రీకైతే రూ.35, డ్రై క్లీనింగ్ అయితే రూ.55 వసూలుచేస్తారు. వెబ్‌సైట్‌లోకి వెళితే నగరాన్ని బట్టి రేటు అందుబాటులో ఉంటుంది.www.wassupondemand.com లో వాషప్‌కు సంబంధించిన సకల సమాచారాన్ని తెలుసుకునే వీలుంది.

సెలూన్ల లాగే లాండ్రీ షాపులూ..

గతంలో హెయిర్ కటింగ్ సెలూన్లంటే సంప్రదాయంగా కొనసాగేవి. హెయిర్ స్టయిల్ రంగంలో టోనీ అండ్ గౌ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. అదే మన ఇండియాలో అయితే జావెద్ హబీబ్ హెయిర్ స్టయిల్స్‌లో కొత్త శకానికి నాంది పలికారు. గతంలో చాకళ్ళు బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చేవారు. అవన్నీ ఇప్పుడు కనుమరుగై వాషప్ లాండ్రీల్లాంటివి రంగంలోకి దిగాయి.

ఇప్పుడు వాషప్ లాండ్రీ సేవలను కేవలం ఇంటర్నెట్‌లోనే అందుబాటులో ఉంచారు. ముందు ముందు స్మార్ట్‌ఫోన్లకు అనుగుణంగా యాప్‌ను విడుదలచేస్తామంటున్నారు బాలచందర్. యూజర్స్ షెడ్యూల్ ద్వారా లాండ్రీ పికప్ అండ్ డెలివరీ సౌకర్యం ఫోన్లలో అందుబాటులో తెచ్చారు. wash-dry clean-fold-deliver అనే కాన్సెప్ట్‌తో క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా తమ చెల్లింపులు జరిపేలా వినియోగదారులకు దగ్గర అవుతున్నామంటున్నారు బాలచందర్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags