పాయింట్ బ్లాంక్‌ లో పాయింట్లు.. తొలిసారిగా హైదరాబాదులో ట్రాఫిక్ పెనాల్టీ విధానం

4th Jul 2017
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఇన్నిరోజులు హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే వందో రెండొందలో ఫైన్ కట్టేసి దులపుకున్నారు! సిగ్నల్ జంప్ అని ఈ-ఛలానా వస్తే ఆన్ లైన్లో పేమెంట్ చేసి లైట్ తీసుకున్నారు! కానీ ఇప్పుడా పప్పులు ఉడకవ్! ఇకనుంచి అడ్డగోలుగా బండి నడిపితే పక్కలో బల్లెంలా పాయింట్లు వెంటాడుతాయ్! వాటి సంగతేంటో ఒకసారి చదవండి!

image


హైదరాబాద్ ట్రాఫిక్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సందుదొరికితే ఆటో దూరుతుంది. ట్రాఫిక్ పోలీస్ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా టూవీలర్ సిగ్నల్ జంప్ చేస్తుంది. నడిరోడ్డుమీద కారు పార్క్ చేసి అడిగేదెడ్రా నా ఇష్టం అన్నట్టు మాట్లాడతారు! హెల్మెట్ పెట్టుకోరు! సీటు బెట్లు పట్టించుకోరు! డ్రంకెన్ డ్రైవ్, రేసింగ్ వగైరా వగైరాలకు చెక్ పెట్టేందుకు మోటార్ వెహికిల్ చట్టానికి మరింత పదును పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆగస్టు 1నుంచి పెనాల్టీ పాయింట్ సిస్టంని అమల్లోకి తీసుకు రాబోతోంది.

దేశంలోనే మొదటిసారి హైదరాబాదులో పెనాల్టీ పాయింట్ విధానం అమల్లోకి వస్తోంది. ఆ రూల్ ప్రకారం వాహనదారులు 24 నెలల్లో 12 పాయింట్లకు చేరుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు రద్దవుతుంది. రద్దు చేసినా కూడా మళ్లీ వాహనం నడుపుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసారి రెండేళ్ల పాటు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహనదారులు రూల్స్ అతిక్రమించి 5 పాయింట్లను దాటితే లైసెన్స్ రద్దు చేస్తారు.

మందుకొట్టి బండి నడిపితే టూ వీలర్ కి 3 పాయింట్లు, ఫోర్ వీలర్ కి 4 పాయింట్లు, బస్, క్యాబ్ కి 5 పాయింట్లు విధిస్తారు. సిగ్నల్ జంప్ కి 2 పాయింట్లు, ఓవర్ స్పీడుకి 3 పాయింట్లు, రేసింగ్ చేసే వారికి 3 పాయింట్లు, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు నమోదు చేస్తారు. అలాగే సీటు బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకుంటే 1 పాయింట్, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లను వేస్తారు.

తెలంగాణ మోటార్‌ వెహికల్‌ చట్టం 1989 లోని 45A(1), 45A(6) లకు సవరణ చేస్తూ ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక నుంచి ప్రతి ఉల్లంఘనను పాయింట్స్ రూపంలో ఇస్తూ, 12 పాయింట్స్ చేరితే ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. ఒక వ్యక్తి ఖాతాలో రెండేళ్లలో రెండోసారి 12 పాయింట్లు నమోదైతే, డ్రైవింగ్ లైసెన్స్ రెండేళ్లపాటు సస్పెండ్‌ చేస్తారు. మూడోదఫా నుంచి 12 పాయింట్లు దాతే మూడేళ్ల పాటు లైసెన్స్ సస్పెండ్‌ అవుతుంది. లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లకైతే 5 పాయింట్స్ దాటితేనే రద్దు చేస్తారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండు రకాలుగా జరిమానాలుంటాయి. ట్రాఫిక్ పోలీసులు పాయింట్‌ డ్యూటీల్లో ఉంటే, రోడ్లపై వాహనాలను ఆపి పీడీఏ మిషన్ల ద్వారా చెక్ చేయడం మొదటి పద్దతి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారుడిని కెమెరాల ద్వారా షూట్‌ చేసి, ఆర్టీఏ డేటాబేస్‌ లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఈ–చలాన్‌ పంపడం రెండో రకం. అయితే పోలీసులు తనిఖీలు చేసినప్పుడు మాత్రమే ఈ పాయింట్స్‌ ను లెక్కలోకి తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. 

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Our Partner Events

Hustle across India