'గెట్‌నౌ'తో చిన్న నగరాల్లోనూ ఆన్‌లైన్ షాపింగ్ అనుభూతి

12th Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

భారత రిటైల్ పరిశ్రమ విలువ 2020 నాటికి దాదాపు ట్రిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.65 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. ఇందులో ఈ-కామర్స్ వాటాయే 60 బిలియన్ డాలర్లు (40 వేల కోట్లు)వరకూ ఉంటుందని ఓ లెక్క. కానీ ఇప్పటికీ ఈ పరిశ్రమ ఇంకా అవ్యవస్థీకృతంగానే ఉంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ అమ్మకాల మధ్య వ్యత్యాసం భూమ్యాకాశాల్లానే ఉంది. దీన్నే ఓ అవకాశంగా మార్చుకున్న ఓ యువ బృందం నాగ్‌పూర్ మార్కెట్‌ను దున్నేస్తోంది. జనాలకు ఇంటికి దగ్గరికే కిరాణా సహా మరిన్ని సరుకులు డెలివరీ చేస్తూ దూసుకుపోతోంది. అదే గెట్‌నౌఎట్ (GetNow at).

గెట్‌నౌఎట్ అనేది ఓ ఓమ్నీ ఛానల్ వ్యవస్థ. ఆన్ లైన్, ఆఫ్ లైన్‌ను కలిపి వినియోగదారులకు హైబ్రిడ్ షాపింగ్ అనుభవాన్ని పంచేందుకు ఏర్పాటైన సంస్థ. అయితే అందరిలా మెట్రో నగరాలకు మాత్రమే వీళ్లు పరిమితం కాలేదు. వీళ్ల టార్గెట్ అంతా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు మాత్రమే. కస్టమర్లు ఇంట్లోనే కూర్చుని కంప్యూటర్లోనో, మొబైల్ యాప్ ద్వారానో లేకపోతే చాలా సింపుల్‌గా వాట్సాప్‌తోనే సరుకుల కోసం ఆర్డర్ చేసేయవచ్చు. నాగ్‌పూర్‌లో మొదలైన ఈ గెట్‌నౌఎట్‌కు ప్రస్తుతానికి 10,000 మంది కస్టమర్లు ఉన్నారు. 3,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంతే కాదు నెలకు 2,000 ఆర్డర్లను సర్వీస్ చేస్తోంది. కిరాణా, ఫ్రెష్ వస్తువులు, స్వీట్లు, నమ్కీన్, బేకరీ పదార్థాలు, మొబైల్ - కంప్యూటర్ వస్తువులు విభాగాల్లో ఉన్న సరుకులను కస్టమర్లను డెలివర్ చేస్తోంది. త్వరలో టికెట్లు, ఔషధాల్లోకి కూడా అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

image


ఆఫ్ లైన్‌ టు ఆన్‌లైన్

గెట్‌నౌఎట్ వ్యవస్థాపకులు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేముందు బాగానే కసరత్తు చేశారు. ఇందులో ఉన్న లోటుపాట్లను తెలుసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేశారు. వాళ్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏంటంటే.. ఆఫ్ లైన్ రిటైలర్లు ఇప్పటికీ టెక్నాలజీ అంటే మొహం చాటేస్తున్నారని, భయంతో దూరం జరుగుతున్నారని అర్థం చేసుకున్నారు. ''కానీ దేశంలో జరిగే వ్యాపారంలో 57 శాతం ఆహారం, గ్రాసరీదేననే విషయం చాలా మందికి తెలియదు. హైపర్ లోకల్, నియర్ కామర్స్ ఇప్పుడు చాలా పెద్ద మార్కెట్. కస్టమర్లు తాము ఉన్న కిలోమీటర్ పరిసర ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు. అందుకే ఇప్పటికీ ఆఫ్ లైన్ మార్కెట్ అంత బలంగా పాతుకుపోయింది'' అంటారు గెట్‌నౌఎట్ కో ఫౌండర్ జయేష్ బాగ్దే.

''ఆఫ్ లైన్ టు ఆన్‌లైన్ స్పేస్‌లోకి అడుగుపెట్టాలని మేం నిర్ణయించుకున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను అధిగమించాలని అనుకున్నాం. ఇందుకు సర్వీసులో నాణ్యత, నమ్మకం కూడా తోడైతే తిరుగు ఉండదు. మేం స్థానిక రిటైలర్లకు కూడా ఓ ప్లాట్‌ఫాం రూపొందించాం. వాళ్ల దగ్గరున్న సరుకుల వివరాలను కూడా ఇందులో పొందుపరుచుకోవచ్చు. కస్టమర్లే నేరుగా వాళ్లతో సంప్రదించి ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుకలుగుతుంది. స్టోర్ పికప్స్, సేమ్ డే డెలివరీ, బిల్లు వసూళ్లలో మేం రిటైలర్లకు సాయపడతాం'' అంటారు మరో కో ఫౌండర్ శైలేష్ దేశ్‌పాండే. కస్టమర్లకు సౌకర్యంగా ఉండేందుకే టెక్నాలజీని ఉపయోగిస్తాం తప్ప.. వాళ్లను ఇబ్బందిపెట్టేందుకు కాదు అంటారు.

జూన్ 2015లో ప్రీ సీడ్ ఫండింగ్‌ను పొందింది గెట్‌నౌఎట్ సంస్థ. ముంబైకి చెందిన ఇన్వెస్టర్‌ అతుల్య మిట్టల్.. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. విసి-సర్కిల్‌లో గెట్‌నౌఎట్ కో ఫౌండర్ జయేష్ ఇచ్చిన ప్రెజెంటేషన్‌కు మెచ్చి అతుల్య ఈ సంస్థపై నమ్మకం పెంచుకున్నారు.

''సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న ఈ కంపెనీపై వ్యవస్థాపకులకు ఉన్న ఉత్సాహం, వాళ్లు ఇప్పటి వరకూ సాధించిన ప్రగతి నన్ను ప్రభావితుడిని చేసి, పెట్టుబడి పెట్టేందుకు కారణమైంది. చిన్న చిన్న సమస్యలకు కూడా వాళ్లు చూపిస్తున్న పరిష్కారం నాకు బాగా నచ్చింది. సందు చివర్లో ఉండే కిరాణా కొట్టు యజమానికి కూడా గిరాకీని కల్పించేందుకు వాళ్లు చేస్తున్న కృషి బాగుంది'' అంటారు ఇన్వెస్టర్ అతుల్య.

జయేష్ ఓ సీరియల్ ఆంట్రప్రెన్యూర్ కూడా. టూరిస్ట్ లింక్ (Touristlink.com) అనే కంపెనీని కూడా స్థాపించారు. హాలిడే డాట్ కామ్, గో ట్రిప్ ఇండియా, సాల్ట్ లేక్ ఎస్ఎంఎస్ అనే సంస్థలకు సిఓఓగా వ్యవహరిస్తూనే కొత్త సంస్థను మొదలుపెట్టారు. గెట్‌నౌఎట్‌ను 2014 నవంబర్‌లో సొంతంగా ఒక్కరే ప్రారంభించారు. ఇదే సమయంలో వర్జీనియా టెక్ అలుమ్ని అయిన శైలేష్ కూడా నాగ్‌పూర్‌ వచ్చారు. అక్కడ ఇండీలోఫ్ట్ అనే కోవర్కింగ్ స్పేస్‌ను లాంఛ్ చేశారు. వీళ్లిద్దరూ ఓ స్టార్టప్ మీట్‌లో కలుసుకుని స్నేహితులుగా మారి ఇప్పుడు భాగస్వాములయ్యారు.

స్థానిక కిరాణా యజమానులకు ఆన్‌లైన్‌ పరిష్కారం చూపించి వాళ్ల వ్యాపార పరిధిని విస్తృతపరిచేందుకు వీళ్లిద్దరూ పరిష్కారం చూపారు. '' మేం ప్రతీ డెలివరీకి కమిషన్ వసూలు చేస్తాం. మా ప్లాట్‌ఫాంలోకి వచ్చి చేరినందుకు మేం ఎలాంటి రుసుమూ వాళ్ల దగ్గరి నుంచి వసూలు చేయబోం. పూర్తైన లావాదేవీలకే మేం అమ్మకందారు నుంచి సక్సెస్ ఫీజును వసూలు చేస్తాం. కస్టమర్లకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు'' అని వివరించారు శైలేష్.

image


మరి ఈ తరహా వ్యాపారం నిర్వహించడం ఇదే మొదలా ? గెట్‌నౌఎట్ అంత విభిన్నంగా ఏం చేస్తోంది ? కాంపిటీషన్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ? అంటే.. ''రిటైల్ కామర్స్‌లో 57 శాతం వాటా గ్రాసరీల నుంచే వస్తోందని మాకు తెలుసు. 570 బిలియన్ డాలర్ల మార్కెట్‌ మా కళ్ల ముందు కనిపిస్తోంది. వీటిలో 40 శాతం మెట్రోలకే పరిమితమైందని అనుకుందాం. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఎంత లేదన్నా 340 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో మనం ఊహించిన దానికంటే ఇంకా చాలా లోతుగా ఉంది. ఎంతో మంది పెద్ద వ్యాపారులకే కాదు చిన్న, స్థానిక ప్లేయర్స్‌కు కూడా ఇందులో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ''అంటారు జయేష్.

పెద్ద పెద్ద ఈకామర్స్ సంస్థలు, ఆన్ డిమాండ్ డెలివరీ సంస్థలైన గ్రోఫర్స్, పెప్పర్ ట్యాప్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలను పోటీదారులకు చూడడం లేదు. వాళ్లు మాకు వ్యూహాత్మక భాగస్వాములు. రెండో దశ నిధుల సమీకరణ కోసం వెంచర్స్ క్యాపిటలిస్ట్స్, ఇన్వెస్టర్లతో చర్చలు మొదటి దశలో ఉన్నాయంటున్నారు శైలేష్.

గెట్‌నౌఎట్ ప్రస్తుతానికి నాగ్‌పూర్‌లో తన సత్తా చాటాలని చూస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ''మేం కొద్దికాలం క్రితమే 'కిరాణా యాజ్ ఏ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్'ను ప్రారంభించాం. మొదట్లోనే దీనికి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకెళ్లి లాభాలను గడించడమే లక్ష్యంగా ఉన్నాం. నగరాల్లోని పెద్ద కస్టమర్లను చేరేందుకు బి2బి విభాగాన్ని కూడా ప్రారంభించాలని చూస్తున్నాం అంటారు.

ఏం నేర్చుకున్నారు

ప్రతీదీ హైపర్ లోకల్ కాదు - కొన్ని సరుకులు, వ్యాపారాలు కేవలం స్థానిక కిరాణాదార్లకే ప్రయోజనకరంగా ఉంటాయి.

స్పీడ్ కాదు.. సర్వీస్ ముఖ్యం - నాలుగు గంటల్లో వంద శాతం డెలివరీ చేస్తాం అనేకంటే తొంభై నిమిషాల్లో 50 శాతం ఆర్డర్లును సరఫరా చేసుకోవడం మంచిది. ప్రతీసారి కస్టమర్ .. స్పీడ్ ఒక్కదాన్నే కోరుకోడు. మనం ఎలాంటి సేవలు అందిస్తున్నాం, కస్టమర్‌కు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపై దృష్టిపెట్టాలి.

డిస్కౌంట్ల కంటే నోటిమాటకే విలువ ఎక్కువ - డిస్కౌంట్లు, కూపన్లు ఇవ్వడం, యాడ్స్‌తో ఊదరగొట్టేకంటే కస్టమర్లకు మనం ఇచ్చే సేవలే ఎక్కువ మాట్లాడతాయి. మౌత్ పబ్లిసిటీని మించింది లేదు.

ప్రతీవిషయంలోనూ కొత్తదనం వద్దు - ప్రతీసారి కస్టమర్‌కు కొత్తదనాన్ని పరిచయం చేయాలనే తాపత్రయం వద్దు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మార్గంలోకి మనం వెళ్లడం కూడా మంచి పద్ధతే.

''చిన్న గ్రామాల్లో ఉండి పెద్ద పెద్ద కలలు కనేవాళ్లు, అంతర్జాతీయ సంస్థతో స్థానిక కంపెనీ పోటీపడేలా తీర్చిదిద్దే వాళ్లను చూసి నేను గర్వపడ్తాను. రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌ నన్ను అమెరికా నుంచి ఇండియాకు పిలిపించింది. తెలివైన వాళ్లంతా తమ దేశాలకు, ఊళ్లకు వస్తారని నేను ఆశిస్తున్నా. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత లబ్ధి పొందినప్పుడే భారత వృద్ధి నిజమైనదిగా నేను భావిస్తాను అని ముగించారు శైలేష్.

website

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India