సంకలనాలు
Telugu

ప్రమాదం తర్వాత పట్టుదలే 'మిస్ వీల్‌చైర్‌'గా మార్చింది

Sri
24th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మిస్ వీల్ ఛైర్-2014 కాంటెస్ట్ విన్నర్ రాజలక్ష్మి.

జీవితాన్ని మలుపుతిప్పిన దుర్ఘటన.

డెంటిస్ట్ గా సేవలందిస్తున్న మహిళ.


జీవితకాలం ఒకటే... కానీ జీవితాలు రెండు. ఒకటి సాధారణ మనిషిగా... మరొకటి వికలాంగురాలిగా...! ఇది మామూలు విషాదం కాదు. కానీ ఇలా రెండు జీవితాలను ఒకేసారి అనుభవించే అవకాశం తనకు దక్కిందంటూ ఎంతో గుండె ధైర్యంతో చెప్తారు డాక్టర్ ఎస్.జె. రాజలక్ష్మి.


గుండెధైర్యంతో అడుగు ముందుకు

రాజలక్ష్మి... ఓ డెంటిస్ట్. గతేడాది ముంబైలో నిర్వహించిన మిస్ వీల్ ఛైర్-2014 కాంటెస్ట్ విన్నర్. ఈ అవార్డు ఆమెకున్న వైకల్యానికి వచ్చింది కాదు. ఆమె గుండె ధైర్యానికి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే శారీరక దౌర్బల్య సమస్యలు, సవాళ్లు మునుపెన్నడూ ఆమెకు తెలియవు. సాధారణ మనిషిలా విజేతగా నిలవడమే ఆమెకు తెలుసు. చిన్నవయస్సులోనే డాక్టర్ కావాలని కలలు కన్నారు రాజలక్ష్మి. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. ఒకే బిల్డింగ్‌లో క్లినిక్ నిర్వహించేవారు. అందుకే చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉండేది. కర్నాటక ప్రజలు డాక్టర్‌ను దేవరు (దేవుడు) అని పిలిచేవారు. ఎందుకంటే డాక్టర్లు ప్రాణాలను కాపాడుతారన్న నమ్మకం ప్రజలది. రాజలక్ష్మి పదో తరగతి చదువుతుండగానే తండ్రిని కోల్పోయారు. చదువులో ముందుండేవారామె. బీడీఎస్ పరీక్షలో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచిన రాజలక్ష్మిని ఓ జాతీయ సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వమని ప్రొఫెసర్లు పంపించారు. సెమినార్ కోసం కారులో చెన్నై వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె వెన్నెముక దెబ్బతింది. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత అతికష్టమ్మీద తనకు తాను కూర్చో గలిగారు. వీల్ చైర్‌పై కూర్చోవడం మొదట్లో చాలా చికాకు కలిగించింది. వీల్ చైర్ వద్దని నిరాకరించింది.

డా. ఎస్.జె. రాజలక్ష్మి

డా. ఎస్.జె. రాజలక్ష్మి


"వీల్ ఛైర్ వద్దని అనుకున్నన్నాళ్లూ నేను ఒకే స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందని నాకు తర్వాత అర్థమైంది. కానీ అది నా వల్ల కాదు. ధైర్యం కూడదీసుకొని వీల్ చైర్ లో నా జీవన ప్రయాణం మొదలుపెట్టా. ఇప్పుడు వీల్ ఛైర్ నా బెస్ట్ ఫ్రెండ్. ఒకవేళ నాకు ప్రమాదం జరగకపోయి ఉంటే... ఇప్పుడున్నంత విజయవంతం కాకపోయేదాన్ని"అంటారు రాజలక్ష్మి.

విషాదం నుంచి విజయానికి బాటలు

ఘోర రోడ్డు ప్రమాదం ఛిద్రం చేసిన జీవితాన్ని అందంగా మలచుకోవడంలో రాజలక్ష్మికి కుటుంబం ఎంతో మద్దతుగా నిలిచింది. కానీ చుట్టూ ఉన్న జనం నుంచే ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. అయ్యో... నీకు యాక్సిడెంట్ అయ్యిందా అంటూ జాలిచూపే వాళ్లు తప్ప... అంతకు మించి సపోర్ట్ చేసేవాళ్లు కాదు. "ఆ పరిస్థితి నాకెంతో విసుగు తెప్పించింది. వికలాంగులకు జాలి, దయ, సానుభూతి అక్కర్లేదు. వారికి సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కానీ నిరుత్సాహపరచకూడదు" అంటూ తనకెదురైన చేదు అనుభవాలను వివరిస్తారు రాజలక్ష్మి. అయితేనేం... చెక్కుచెదరని గుండెధైర్యంతో ముందుకెళ్లారు. ఎండీ పరీక్షలో 73 శాతం మార్కులతో కర్నాటక టాపర్‌గా నిలిచారు. అది కూడా అంత సులువు కాలేదు. విద్యాసంస్థల్లో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగంలో నిబంధన ఉంది. పట్టించుకునే విద్యాసంస్థలు తక్కువే. 2010లో న్యాయస్థానంలో పోరాడి మరీ మాస్టర్స్ డిగ్రీ లో అడ్మిషన్ సంపాదించారు రాజలక్ష్మి. ఎండీ చేసిన తర్వాత డెంటల్ హెల్త్ ఆఫీసర్‌గా గవర్నమెంట్ కాలేజీలో చేరాలనుకున్నారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. రెండేళ్ల క్రితం సొంతంగా డెంటల్ క్లినిక్ ప్రారంభించారు.

image


మిస్ వీల్ ఛైర్ కాంటెస్ట్ విన్నర్

తనకు మోడలింగ్ పైనా ఆసక్తి ఎక్కువ. కొంతకాలం చదువులకు బ్రేక్ ఇచ్చి ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరారు. అందుకే 2014లో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు మరో ఆలోచన చేయలేదు. వ్యాయామం దగ్గర్నుంచీ హెయిర్ కేర్, డైటింగ్ వరకు అన్నీవీల్ ఛైర్‌లో కూర్చునే చూసుకున్నారు. మిస్ వీల్ ఛైర్ కాంటెస్ట్ చాలా ఉద్వేగభరితంగా జరిగింది. 250 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. టైటిల్ రాజలక్ష్మికే దక్కింది. ఈ కాంటెస్ట్ లో ఓ ప్రశ్నకు రాజలక్ష్మి చెప్పిన సమాధానం ప్రేక్షకుల్ని, న్యాయనిర్ణేతలను మంత్రముగ్ధుల్ని చేసింది. 

"మీరు ఎవరి జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు" అని అడిగితే "నా జీవితాన్ని" అని సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచారామె. "సాధారణ వ్యక్తిలా ఉన్నప్పుడు చేసిన నా తప్పులన్నీ నేను సరిచేసుకున్నాను. ఈ దేశంలో వికలాంగులు జీవించేందుకు పరిస్థితుల్ని మెరుగుపర్చాలి" అంటారు రాజలక్ష్మి. ఈ డిసెంబర్ లో బెంగళూరులో నిర్వహించబోయే మిస్ వీల్ ఛైర్ కాంటెస్ట్ నిర్వహణ బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు రాజలక్ష్మి.

మిస్ వీల్ ఛైర్ కాంపిటీషన్‌లో పాల్గొంటూ..

మిస్ వీల్ ఛైర్ కాంపిటీషన్‌లో పాల్గొంటూ..


ఇక రాజలక్ష్మి శారిరక స్థితి గురించి చెప్పాలంటే ఆమె జీవితాంతం ఇలాగే ఉండిపోవాల్సిందే. "ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు చికిత్స అందించే మార్గాలేవీ లేవు. స్టెమ్ సెల్ రీసెర్చ్ అయితే జరుగుతోంది. కానీ నన్నడిగితే ఇక ఎలాంటి చికిత్సా లేదనే చెప్పాలి" అంటారామె. ప్రమాదం తర్వాత చాలా ఫిజియోథెరపీ సెషన్స్ జరిగాయి. వాటి ద్వారా రాజలక్ష్మి ఇప్పుడు స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. ఆమె తన కార్ డ్రైవింగ్ చేస్తారు. దృఢమైన సంకల్పశక్తి ఉంది. ఆ బలంతోనే వీల్ ఛైర్‌లో కూడా ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పటికీ భారతదేశంలోని చాలా ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. విదేశాలకూ వెళ్తుంటారు. ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశమంత అందమైనది వేరొకటి లేదంటారామె.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags