ఆయుర్వేద మూలికలను అమ్మడంలో ఈ హైదరాబాదీ సంస్థకు 170 ఏళ్ల చరిత్ర

22nd Oct 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

హైదరాబాద్‌ చార్ సౌ సాల్ షెహర్ అంటారు. అంటే ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందీ అని. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ సంస్థకూ అంతటి స్టోరీ ఉంది. ఓ చిన్న వ్యాపారంగా మొదలైన ఆ షాప్‌కూ దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నాణ్యమైన ఆయుర్వేద మూలికలు అమ్మడంలో వారికి తిరుగులేదు. కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి మరీ ఎంతో మంది ఆ మూలికలు కొనుక్కుని మరీ వెళ్తారు. ఇప్పుడు నాలుగో తరం ఆ షాపును నిర్వహిస్తోంది. అదే మున్నాలాల్ దవాసాజ్. 170 ఏళ్లుగా ఎన్నో లక్షల మంది మన్ననలు అందుకున్న ఆ సంస్థే ఇప్పుడు యువరక్తంతో ఉరకలు వేస్తూ.. కొత్త పుంతలు తొక్కుతోంది. ఆన్‌లైన్‌ బాట పట్టి ఎంతో మందికి చేరువవుతోంది.

image


1844లో రాజస్థాన్‌లోని నాగోర్ ప్రాంతం నుంచి వచ్చారు విజయ్‌వర్గీ లక్ష్మినారాయణ, సీతారాం అనే అన్నాదమ్ములు. వ్యాపార నిమిత్తం ఎక్కడి నుంచో ఇక్కడికి వలస వచ్చారు. వచ్చీ రాగానే.. ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో హైదరాబాద్‌లో హకీంల సంఖ్య పెద్దగా ఉండేది కాదు. ఉన్నా వాళ్లంతా ఓల్డ్ సిటీలో ఉండడంతో జనాలకు వాళ్ల గురించి తెలిసింది తక్కువే. అందుకే ఆయుర్వేద ఉత్పత్తులు, మూలికలు, తైలాలు కావాలంటే వీళ్ల దగ్గరికే రావాల్సిన పరిస్థితి ఉండేది. అలా అలా అన్నాదమ్ములిద్దరూ వ్యాపారాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చారు. ఆ తర్వాతి తరంలో బాలకిషన్ ఈ వ్యాపారాన్ని ఉరకలెత్తించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయుర్వేద వస్తువులను దిగుమతి చేసుకోవడం, ఏ ప్రాంతంలో ఏవి ఎక్కువ దొరుకుతాయి, అక్కడ ప్రాచుర్యం పొందిన వస్తువులన్నీ తెచ్చి హైదరాబాద్‌లో అమ్మడం మొదలుపెట్టారు. అంతే కాదు.. ఆయన కొంత మంది హకీంలను, ఆయుర్వేద వైద్యులను తమ షాపులోనే నియమించుకున్నారు. అక్కడికి వచ్చిన వారికి వైద్యం అందించడంతో పాటు వాళ్ల షాపులోనే వస్తువులూ అమ్మేలా ఏర్పాటు చేశారు. బాలకిషన్‌ను అందరూ మున్నా అని పిలవడంతో అప్పటి నుంచి ఆ షాపు పేరు మున్నాలాల్ దవాసాజ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అఫ్జల్‌గంజ్‌లో ఉన్న షాపు 170 ఏళ్ల క్రితం అక్కడే ప్రారంభమైంది. ఆ తర్వాత మూడోతరం భగవాన్‌దాస్ ఈ షాపు బాధ్యతలు చూసుకున్నారు. ఇప్పుడు నాలుగో తరమైన దీపక్, వికాస్, ఆకాశ్‌లు ఈ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

image


ప్రస్తుతం మున్నాలాల్‌కు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్, బంజారా హిల్స్‌ సహా రాజేంద్రనగర్, గచ్చిబౌలీలోని గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఔట్‌లెట్స్ ఉన్నాయి. కొత్త ఔట్‌లెట్స్‌లో ఆయుర్వేద మూలికలతో పాటు రెగ్యులర్ గ్రాసరీ ఐటెమ్స్‌ కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు షాపు బాధ్యతలు చూసుకుంటున్న వారిలో ఒకరైన దీపక్.. ఆయుర్వేదంలో కొన్ని కోర్సులు చేశారు. ఆ అనుభవంతో పాటు ఎప్పటి నుంచి వాళ్ల దగ్గర పనిచేస్తున్న హకీంలతో కలిసి సొంత లేబుల్ ఆయుర్వేద ఉత్పత్తులనూ తయారు చేసి అమ్ముతున్నారు. ఈయన ఫార్మా విభాగం బాధ్యతలను చూస్తారు. వికాస్.. విస్తరణ, బ్రాండింగ్ వంటి వ్యవహారాలు పట్టించుకుంటారు. ఆయన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి ముంబై ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొన్నారు. అయితే కుటుంబ వ్యాపారం వీడకూడదనే భావనతో మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆకాశ్.. సేల్స్ పై దృష్టిసారిస్తారు. ఇలా ముగ్గురు అన్నాదమ్ములు ఎవరికి వారు.. సంస్థ వృద్ధికి దోహదపడ్తున్నారు. ప్రస్తుతం మున్నాలాల్ దవాసాజ్‌లో 65 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.

ఏంటి వీళ్ల ప్రత్యేకత

మున్నాలాల్‌లో దొరకని ఆయుర్వేద మూలిక ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం వీళ్ల దగ్గర 1500పైగా హెర్బ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రాంతాల నుంచి సేకరించినవే. ఏ ప్రాంతంలో ఆ మూలిక ఎక్కువగా దొరుకుతుందో, ఏ వాతావరణంలో అయితే కలుషితం కాకుండా స్వచ్ఛమైన ఉత్పత్తి దొరుకుతుందో అక్కడి నుంచే వాటిని తెప్పించుకుంటామని చెబ్తున్నారు నిర్వాహకుల్లో ఒకరైన వికాస్.

''అమృతసర్‌ బ్రాహ్మీ, ఆమ్లాకు ఫేమస్. విదేశాల్లో కంటే కశ్మీర్‌లో పండే కుంకుమ పువ్వు శ్రేష్టం. రాజస్తాన్‌లోని సోజత్ నుంచి మెహందీ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి కరక్కాయ - భృంగరాజ, తమిళనాడు నుంచి వట్టివేరు.. ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో వస్తువుకు ఫేమస్. అక్కడి భూమి, వాతావరణం, నీరు వాటిల్లో తత్వాలను అందిస్తాయి. అందుకే అక్కడి నుంచే వాటిని తెప్పిస్తాం. ఈ మధ్యకాలంలో ఏ వస్తువు ఎక్కడైనా పండిస్తున్నారు.. కానీ వాటికి ఆ ఔషధ గుణం ఉండదు '' అంటారు వికాస్.

ఈ మధ్యకాలంలో జనాల్లో ఆయుర్వేదంపై విపరీతమైన అవగాహన పెరుగుతోందని అందుకే అమ్మకాలు కూడా జోరందుకున్నాయని చెబ్తున్నారు. రాందేవ్ బాబా, బైధ్యనాధ్ వంటి సంస్థలు తమకు పోటీయే కావని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ విడిగా మూలికలు అమ్మడం లేదని... అవి కేవలం తమ దగ్గరే దొరకడం వల్ల తమకు అలాంటి ఆందోళన ఏదీ లేదంటున్నారు. అయితే ఇంతకాలం నగరంలోని ఒక ప్రాంతానికే పరిమితమైనట్టు ఒప్పుకుంటూనే.. త్వరలో వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.

image


వ్యాపారం, విస్తరణ

ఒక ఆయుర్వేద మూలికలు అమ్మే షాపు.. ఎంత టర్నోవర్ చేస్తుంది.. ? మహా అయితే లక్షల్లో ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ.. మున్నాలాల్ దవాసాజ్ వార్షిక టర్నోవర్ రూ. 3 కోట్ల పైమాటే అంటే ఆశ్చర్యపోకతప్పదు. ఏటికేడు తమ ఆదాయం పెరుగుతూనే ఉందని చెప్తున్నారు. అందుకే ప్రస్తుతం కూకట్‌పల్లి, మాదాపూర్‌ ప్రాంతాల్లో విస్తరణకు వీళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో కూడా ఔట్‌లెట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు

నాలుగో తరం వ్యాపారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల ఆలోచలు కూడా అదే స్థాయిలో వేగంగా ఉన్నాయి. ఇప్పుడు జనమంతా ఆన్‌లైన్, ఈ-కామర్స్ బాట పట్టడంతో వీళ్లు అదే తరహాలో ఆలోచించారు. మున్నాలాల్ మందులు, ఆయుర్వేద ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ఆరు నెలల క్రితం మొదలైన ఈ కామర్స్‌ బిజినెస్‌కు మెరుగైన స్పందనే వస్తోందని నిర్వహకులు చెబ్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని వివరిస్తున్నారు. తమ ఉత్పత్తులను మరింత ప్రాచుర్యం కల్పించి బిజినెస్ పెంచుకునేందుకు ఫ్లిప్ కార్ట్‌తో చర్చలు జరుపుతున్నట్టు వికాస్ తెలిపారు.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ మూలికలు తెప్పించే మున్నాలాల్ సంస్థ, విదేశీ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నేపాల్, ఆప్ఘనిస్తాన్ సహా.. వివిధ ప్రాంతాల నుంచి కూడా వీళ్లు మూలికలను, ముడిపదార్థాలను తెప్పించుకుంటున్నారు.

image


పేరు నిలబెడితే చాలు

తాతలు, తండ్రుల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారమంటే తమకు ఎంతో గౌరవం అంటోంది నేటితరం. డబ్బుల కంటే ఎక్కువగా ఆ పేరు వల్ల సమాజంలో ఎంతో గొప్పగా చూస్తూ ఉంటారని మురిసిపోతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. మున్నాలాల్ నుంచి వచ్చాం అన్నప్పుడు వాళ్లు చూపించే ఆదరాభిమానాలు చాలని సంతోషపడిపోతారు. తమ పూర్వీకలు నిర్మించిన గొప్ప పేరును నిలబెడితే అదే చాలనేది వీళ్ల ఆలోచన. తమ తర్వాతి తరం.. ఈ వ్యాపారంలో ఉంటుందో, ఉండదో చెప్పలేం కానీ.. తమకు ఓపిక ఉన్నంత వరకూ కొనసాగిస్తామని అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా గ్రామీణులు, సామాన్యుల వైద్య అవసరాల కోసం తాము పనికి వస్తున్నామనే తృప్తే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోందని ముగించారు. 

అన్నింటికంటే ముఖ్యం నాణ్యత, నమ్మకం వీళ్లను ఏళ్ల తరబడి ముందుకు నడిపిస్తోంది. ఒకే వ్యాపారంలో స్థిరపడి క్వాలిటీలో రాజీపడకపోతే.. ఎన్నేళ్లైనా కస్టమర్లు ఆదరిస్తూనే ఉంటారు అనడానికి మున్నాలాల్ దవాసాజ్ ఓ ఉదాహరణ.

website

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags