సంకలనాలు
Telugu

విద్వేషాన్ని వీడితేనే ఉజ్వల భవిష్యత్తు!

uday kiran
22nd Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

1948 సెప్టెంబర్‌ 11. అప్పటి కేంద్ర హోంమంత్రి, ఉప-ప్రధాని వల్లభాయ్‌ పటేల్‌ RSS చీఫ్‌ గురూజీ గోల్వకర్‌కి సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. భారత ప్రభుత్వం RSSను నిషేధించింది అని రాసి ఉంది. RSSపై నిషేధం ఎత్తివేయాలని అభ్యర్థిస్తూ గోల్వల్కర్‌ పటేల్‌కు లేఖ రాశారు. దానికి సమాధానంగా మరోలేఖ పంపారు పటేల్‌. అందులో “RSS హిందువుల కోసం ఎంతో చేసిందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు కూడా”. కానీ లేఖలో ఆయన రాసిన కొన్ని వాక్యాలు RSSకు అస్సలు నచ్చలేదు. “ముస్లింలపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారిపై దాడికి పాల్పడటం లాంటి చర్యలవల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. హిందువులకు సాయంచేయడం మంచిదే కానీ, పేదలు, నిస్సహాయులు, మహిళలు చిన్నారులను టార్గెట్‌ చేయడాన్ని సహించలేం” అని రాశారు పటేల్‌.

పటేల్ తన లేఖలో చెప్పాల్సిన విషయాన్ని కరాఖండిగా చెప్పారు. “RSS వల్లే దేశంలో అస్థిర వాతావారణం నెలకొంది. వారు మత ప్రసంగాలు, మాటల ద్వారా విషం చిమ్ముతారు.” హిందువులను రక్షించేందుకు విద్వేషాన్ని వ్యాప్తిచేయాల్సిన అవసరముందా అని ప్రశ్నించారు. “ఈ విద్వేషం కారణంగానే దేశం జాతిపితను కోల్పోయింది. మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడం తప్పనిసరి. ” అన్న ఆయన మాటల్లో బాధ కనిపించింది. అప్పట్లో RSSను నిషేధించిన పటేల్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తమవాడని చెప్పుకోవడం, అతడిని మోడీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవడం విడ్డూరంగా అనిపిస్తోంది. పటేల్‌- కాంగ్రెస్‌ వ్యక్తి. మహాత్మాగాంధీకి నమ్మిన బంటు. తొలిప్రధాని పండిత్ జవహార్‌ లాల్‌ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. నెహ్రూ, పటేల్‌ మధ్య బేధాభిప్రాయాలు సృష్టించేందుకు RSS చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. పటేల్‌ ప్రైమ్ మినిస్టర్ అయ్యుంటే దేశం పరిస్థితి మరోలా ఉండేదన్నదన్నది RSS వాదన. గత కొన్ని నెలలుగా నెహ్రూ వ్యక్తిత్వాన్ని చెడుగా చిత్రీకరించేందుకు శతవిధాలా యత్నించింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు నెహ్రూనే కారణమని నిరూపించాలనుకుంది. అయితే పటేల్‌, నెహ్రూల్లో ఎవరు గొప్పన్న విషయాన్ని చరిత్రే నిర్ణయిస్తుంది. అలాగే RSS చేసిన ఆకృత్యాలకు ఆ సంస్థను చరిత్ర ఎన్నటికీ క్షమించదు.

పటేల్‌ తన లేఖలో చెప్పినట్లుగా మళ్లీ అలాంటి విద్వేషపూరిత వాతావరణాన్నే సృష్టించారు. గత 10 రోజులుగా జాతీయతపై కొత్తరకం చర్చ మొదలైంది. JNUలో కొందరు స్టూడెంట్స్‌ జాతి వ్యతిరేక నినాదాలతో రెచ్చగొట్టారని, అందులో JNUSU ప్రెసిడెంట్‌ కన్హయ్య కుమార్‌ కూడా ఉన్నారని అతన్ని అరెస్ట్‌ చేశారు. అయితే, ఇక్కడ వాళ్లు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారు. JNU ఉగ్రవాదులకు అడ్డాగా మారినందున దాన్ని మూసేయాలన్నది ఒకటైతే.. ఈ వాదనను వ్యతిరేకించేవారంతా జాతి ద్రోహులేనన్నది రెండోది.

నేనూ JNUలోనే చదువుకున్నాను. నాకు తెలిసినంత వరకు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే బెస్ట్‌ క్యాంపస్‌లలో ఇది ఒకటి. ఉదారవాద సంస్కృతికి నిలయం, రాజ్యాంగంలోని ప్రతి అంశంపై చర్చకు ప్రోత్సహించే దేవాలయం. అలాంటి క్యాంపస్‌లో వివిధ రకాల అభిప్రాయాలు, సిద్దాంతాలున్న విద్యార్థులుండటం వింతేమీ కాదు. ఉదారవాదంతో పాటు అతివాదులు, తీవ్ర భావజాలం ఉన్న వారు కూడా JNUలో ఉన్నారన్నది అంగీకరించాల్సిన సత్యం. ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులే కాదు... కొందరు కాశ్మీరీ అతివాదులూ ఉన్నారు. అయితే ఈ ఒక్క కారణంతోనే JNU జాతి వ్యతిరేకులకు అడ్డాగా మారిందని తీర్పు ఇవ్వడం సరికాదు. నిజానికి ఇలాంటి తీవ్రభావజాలం ఉన్న వారికి JNUలో ఎవరూ అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదన్న విషయాన్ని నా స్వానుభవంతో చెబుతున్నాను.

JNU ప్రతిష్టను దిగజార్చాలని ఎందుకు అనుకుంటున్నారన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. గోల్వల్కర్‌ తాను రాసిన ది బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలు గుర్తుచేయాలనుకుంటున్నాను. భారత్‌కు ముగ్గురు శత్రువులున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు. JNU ఎప్పుడూ హిందుత్వ సిద్దాంతాన్ని నమ్మేదికాదు. JNU లో ఆ సిద్ధాంతానికి ఏనాడూ ప్రాధాన్యం లభించలేదు. లెఫ్ట్‌ సిద్ధాంతాలకు పటిష్ఠ పునాదులు ఉండటంతో సహజంగానే రెండింటి మధ్య శత్రుత్వం పెరిగింది. హిందూ భావజాలం ఉన్నవారి దృష్టిలో JNU తమను వ్యతిరేకించే సంస్థ. అక్కడ కొందరు విద్యార్థులు చేసిన నినాదాలతో వీరికి ఒక అవకాశం దొరికింది. అయితే వీళ్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్లు ఏర్పాటు చేయడానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. అయితే వాటిని ధ్వంసం చేయడానికి నిమిషం చాలు. విద్యారంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న JNU ప్రతిష్ఠ దిగజార్చాలనుకోవడం దేశానికి మంచిది కాదు.

JNU విద్యార్థులకు మద్దతుగా నిలిచి, వాక్‌ స్వాతంత్ర్యం గురించి మాట్లాడేవారిపై జాతి వ్యతిరేకులన్న ముద్ర ఎందుకు వేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. దేశద్రోహం చట్టంకింద కన్హయ్యపై కేసు పెట్టారు. ఇప్పటివరకు పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో ఆధారాలు సమర్పించలేకపోయారు. అయినా ఇప్పటికీ ఆయన ఒకవిలన్‌. కోర్టు ఆవరణలోనే కన్హయ్యపై దాడి చేశారంటే పరిస్థితి అతని ఏస్థాయిలో ప్రాణహానిఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు వ్యవహారిస్తున్న తీరు వీటన్నింటి కన్నా చాలా ప్రమాదకరం. నిందితుల తరఫున న్యాయంకోసం పోరాడాల్సిన లాయర్లే స్వయంగా ఎలాంటి వాదోపవాదాలు లేకుండానే కన్హయ్యను శిక్షించాలని అంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసను ప్రేరేపిస్తున్నారు. మీడియా అయినా, సుప్రీంకోర్టు అపాయింట్‌ చేసిన అబ్జర్వర్లైనా, తమ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారపై దాడులు చేయడమే వారి లక్ష్యం. పోలీసులు మూగ ప్రేక్షకుల్లా మారిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశించినా దాడులకు పాల్పడిన లాయర్లు ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఓ వర్గం టీవీ ఛానళ్ల పోషించిన పాత్ర బాధకలిగిస్తోంది. కొందరు ఎడిటర్లు, యాంకర్లు ఆన్‌ ఎయిర్‌ లోనే లాయర్ల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఓ రకమైన టీవీ హిస్టీరియాను సృష్టించి సగటు ప్రేక్షకునికి తాము చెబుతున్నదే నిజమనే భ్రమ కల్పించి కన్హయ్యపై ద్వేషం కలిగేలా చేస్తున్నాయి. తమ దేశభక్తి నిరూపించుకునేందుకు కన్హయ్యకు సంబంధించి కుట్రపూరిత వీడియోలను ప్రసారం చేసి అతనిపై ద్వేషం పెరిగేలా చేశారు. అదృష్టవశాత్తూ మరో వర్గం టీవీ ఛానళ్లు ఈ దుర్మార్గాన్ని బహిర్గతం చేశాయి. ఇప్పటికైనా సదరు టీవీఛానళ్లు క్షమాపణలు చెప్పి ఆదర్శంగా నిలవాల్సి ఉన్నా.. అలా జరగడంలేదు. ఇది వారి నైజం. ఇలాంటి చర్యల వల్ల నాలాంటి వాళ్లు సదరు టీవీ ఛానళ్ల వారు కూడా నేరంలో భాగస్థులేనన్న అభిప్రాయానికి రావాల్సివస్తోంది.

భారత్‌ ప్రజాస్వామ్య దేశం. చట్ట ప్రకారం నడుచుకుంటుంది. JNUలో దేశ వ్యతిరేక పనులు నినాదాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని అరెస్ట్‌ చేసి రాజ్యాంగం ప్రకారం శిక్షించాలి. ఈ విషయంలో ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరంలేదు. అంతే తప్ప, దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడం సరికాదు. లాయర్లు జడ్జిల్లా మారకూడదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. MLA ఓ ఆందోళనకారునిపై దాడి చేయకూడదు. ప్రత్యర్థి రాజకీయపార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయకూడదు. పోలీసులు నిష్క్రియాత్మకంగా వ్యవహరించకుండా తమ విధులు నిర్వహించాలి. మీడియా ప్రొఫెషనల్స్‌పై దాడులు జరగకూడదు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించకూడదు. టీవీ ఎడిటర్లు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే భారత భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు.

ప్రస్తుత పరిస్థితులు పటేల్‌ - గోల్వల్కర్‌కు లేఖ రాసిన సమయంలో ఉన్న వాతావరణాన్ని తలపిస్తున్నాయి. విద్వేషం రగిలించడం సులభం. కానీ ఈ విద్వేషం కారణంగానే గాంధీజీ హత్యకు గురయ్యారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి పరిస్థితి మళ్లీ ఎదురైతే దాన్ని తట్టుకోవడం కష్టం. ఇప్పటికైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. ఇది ఎవరికీ మంచిది కాదన్న విషయం గ్రహించాలి.

         

       

రచయిత- అశుతోష్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ జర్నలిస్ట్‌

undefined

undefined


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags