సంకలనాలు
Telugu

ఒకప్పుడు 10 రూపాయల కూలీ.. ఇప్పుడు 700 కోట్ల సామ్రాజ్యాధినేత్రి..

అవమానాలను తట్టుకుని అంచలంచెలుగా విజయం సాధించిన కల్పన స్వీయానుభవం  

30th Mar 2015
Add to
Shares
753
Comments
Share This
Add to
Shares
753
Comments
Share


కల్పనా సరోజ్ ని ‘స్లమ్ డాగ్ మిలియనీర్ (మురికిలో మాణిక్యం)’గా చెప్పుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా అనిపించినా నిజం. అతి బీదరికంలో పుట్టి, చెప్పలేనంత వివక్షను చవిచూసినా, ఈ రోజున దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు. అంచెలంచెల అభివృద్ధితో 112 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.672 కోట్లు)కు అధిపతి. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం!. ఆమె జీవనయానం నుంచి నేర్చుకోవలసిన పాఠం ఇదే. తీగలా సాగే డిగ్రీ చదువులతోనో, ఫ్యాన్సీ ఎంబిఎలతోనో విజేత కాజాలరని కల్పన స్వీయానుభవం చెబుతుంది. మీలో నిబిడీకృతమైన స్థైర్యం, పట్టుదల, మానవాతీత సామర్థ్యంపైన విశ్వాసంతో ముందడుగు వేస్తే సాధ్యపడుతుందని ఆమె విశ్వసిస్తారు. ఆమె మాటల్లోనే... కల్పన కథ ఇది :

కల్పనా సరోజ్

కల్పనా సరోజ్


తొలినాటి జీవితం :

విదర్భలో ఓ కానిస్టేబుల్ కూతురిగా జన్మించాను. నాకు ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు. అందరమూ పోలీసు క్వార్టర్స్ లోనే ఉండేవాళ్లం. నేను చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థినే. స్కూలంటే నాకు ప్రాణం. క్వార్టర్స్ లో నా ఈడు పిల్లలతో కలిసి ఆడుకోవడానికి పెద్దవాళ్లు ఒప్పుకునే వారు కాదు. నన్ను చూసినా, వాళ్ల పిల్లలు నాతో ఆడుకున్నా తిట్టిపోసేవారు. వాళ్లను మా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవారు కాదు. నేను ఏదైనా ఇచ్చినా తీసుకోనిచ్చేవారు కాదు.

ఇలాంటి పరిస్థితి బాధాకరమే అయినప్పటికీ, విడ్డూరమేమీ కాదు. అయితే, బడిలోనూ ఇలాంటి వాతావరణమే ఎదురయ్యేసరికి నేను షాకయ్యాను. నన్ను ఇతరులతో వేరుగా కూర్చోబెట్టేవారు. ఆటపాటల్లో పాల్గొనడానికి అనుమతించేవారు కాదు. స్కూలంటే నేను కన్న కలలన్నీ కల్లలై పోయాయి. నాకు ఏడో తరగతిలోనే పెళ్లయిపోవడంవల్ల ఇక పట్టించుకోలేదు.

బాల్య వివాహం

మా నాన్న అంతగా చదువుకున్న వ్యక్తి కాదు. కాకపోతే వృత్తిరీత్యా ఆయనలో ఉదాత్తమైన గుణాలుండేవి. నేను విద్యాభ్యాసం పూర్తిచేయాలని కోరుకునేవాడు. కానీ, నేను పుట్టి పెరిగిన దళిత సామాజిక వాతావరణంలో బాల్య వివాహం అతి సాధారణమైన సంప్రదాయం. దాంతో, మా నాన్న అభ్యంతరాలన్నీ కుటుంబ సభ్యుల పెళ్లి పెత్తనాలు, సందడి నడుమ మరుగునపడిపోయాయి. వాళ్లెవరికీ అన్నెం పున్నెం ఎరుగని పిల్ల బతుకు భవిష్యత్తులపై ఎలాంటి పట్టింపులు బాధ్యతలూ లేవు. వాళ్ల ముందు మా నాన్న నిస్సత్తువుగా మిగిలాడు. నేను నిస్సహాయురాలినయ్యాను.

వైవాహిక జీవితం

నా సామాజిక నేపధ్యం రీత్యా నాకు వైవాహిక జీవితమనేది పూల పానుపు కాదు. నేను చేయాల్సిన చాకిరీకి మానసికంగా సిద్ధమైపోయాను. అయితే, మరీ ఇంత నరకమనుకోలేదు.

నేను పన్నెండుమంది నడుమ బక్కచిక్కిన పిల్లను. ఇంట్లో పదిమందికి నేనొక్కర్తినే వండి వార్చడం, బట్టలుతకడం, పాచిపని చేయాల్చి వచ్చేది. ఇది చాలదన్నట్టు, మా అత్తింటివాళ్లు మహా క్రూరస్వభావులు, ప్రతి చిన్నదానికీ నన్నే బలిపశువును చేసి వేధించేవారు. కూరలో ఉప్పు ఎక్కువైనా, ఇల్లు సరిగ్గా తుడవకపోయినా తిట్లు, తన్నులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత బండచాకిరీ చేసినా ఏదో ఒక వంకతో దెబ్బలు పడేవి. మానసికంగా, శారీరకంగా నన్ను ఘోరంగా చిత్రవధ చేసేవాళ్లు. కాపురానికి పంపేసిన ఆరు నెలలకు మా నాన్న నన్ను చూడడానికి వచ్చారు. చిక్కి చీపురుపుల్లలా మారిన నన్ను చూసి ఆయన నిర్ఘాంతపోయారు. ‘నేను చూస్తున్నది కూతురినా? నడుస్తున్న శవాన్నా?’ అన్నారు.

image


తడబడే అడుగులు

ఆడపిల్లలంటే మా సామాజిక వర్గంలోనే కాదు, దేశంలో బీదరికపు కోరల్లో చిక్కుకున్న ఏ వర్గానికైనా గుదిబండల్లాగే తోస్తారు. పెళ్లి చేసి అత్తింటికి పంపేస్తే కనీసం పట్టించుకోరు. అలాంటిది మా నాన్న నన్ను పుట్టింటికి తిరిగి తీసుకువచ్చేసరికి, నన్ను కన్నెత్తి చూసినవాళ్లు లేరు. మా కుటుంబానికి, సమాజానికి, సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చినట్టుగా భావించారు.

మా నాన్నకు బరువు కాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. స్థానికంగా కానిస్టేబుల్ నియామకాల క్యాంపు నడుస్తుంటే అప్లయి చేసుకున్నాను. నర్సింగ్ స్కూలుకి, మిలిటరీకి కూడా దరఖాస్తు చేశాను. ప్చ్... చాలినంత వయసు లేదనో లేక చదువు లేదనో తిరస్కరించారు. ఈలోగా కొంత టైలరింగ్ నైపుణ్యం సాధించి, జాకెట్లు కుట్టసాగాను. జాకెట్ ఒక్కంటికీ రూ. 10 నా కుట్టుకూలీ.

మరోవంక, నా వయస్సుతో పాటే సూటిపోటీ మాటలు, ఈసడింపులు పెరుగుతూనే వచ్చాయి. మా నాన్న మాత్రం నన్ను మళ్లీ బడికి వెళ్లమని ప్రోత్సహించారు. ఇల్లు వదిలి బయటకు అడుగెట్టగానే అవమానాలు, దుర్భాషలు కుంగదీసేవి. నేను ఆత్మహత్య చేసుకోవడంకంటే మా కుటుంబీకులే చంపి పాతరేయాలని గుసగుసలాడుకునేవారు.

రెండో అవకాశం

ఈ మాటలు వినలేక, బతకడం కంటే చావడం తేలిక అనుకొని సీసాడు విషం తాగేశాను. అది మా మేనత్త చూసింది. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా మారింది. 24 గంటల్లోగా నాకు స్పృహ రాకపోతే, ప్రాణాలపై ఆశలు వదులుకోమని డాక్టర్లు స్పష్టం చేసేశారట!

ఆశ్చర్యం! అంత విషం తాగాకకూడా నేను ఎలా బతికి బయటపడ్డానో మరి!! ఆసుపత్రిలో నేను కళ్లు తెరిచాక మునుపటి వ్యక్తిని మాత్రం కాదని నాకెందుకో అనిపించింది. నిస్సహాయురాలైన అమాయకపు బాలిక చచ్చిపోయింది. నేను మానసికంగా చాలా దృఢంగా, పునరుత్తేజితురాలిగా మారాను. నాకు రెండో అవకాశం లభించింది. లోలోన కుమిలిపోతూ ఇక ఎంతమాత్రం వృధాగా గడపకూడదని తీర్మానించుకున్నాను.

కొత్త జీవితం

ముంబై వెళ్తానని మా అమ్మానాన్నలకు నచ్చజెప్పి, ముంబైలో మా చిన్నాన్న దగ్గరకి చేరాను. టైలరింగుకే పూర్తి సమయం కేటాయించారు. కొంతకాలానికి పోలీసు యంత్రాంగంలో మార్పుల మూలాన మా నాన్నకు ఉద్యోగం పోయింది. ఇంటికి నేనే పెద్దదానిని. కుటుంబానికి నేనే అండగా నిలిచాను. నేను దాచుకున్నవాటినే అడ్వాన్సుగా చెల్లించి, నెలకు రూ. 40 తో అద్దెకు ఒక చిన్న గది తీసుకున్నాను. చాలీచాలని సంపాదనతో ఉండడానికి, తినడానికి నానా ఇబ్బందులు పడుతున్నా, అందరం ఒక్క దగ్గరే ఉన్నామనే తృప్తి మాత్రం ఉండేది.

ఆ మరణం నన్ను మార్చింది !

డబ్బుకు నానా అగచాట్లు పడ్డామని చెప్పాను కదా! ఇలాంటి కష్టాలలోనే, మా ఆఖరి చెల్లెలు అనారోగ్యం పాలయ్యింది. ఆమె చికిత్స మాకు తలకు మించిన భారమైంది. ఎక్కడా చిల్లిగవ్వ అప్పు పుట్టలేదు. మరో పక్కన, ‘నాన్నా నాకు చావాలని లేదు, నన్ను కాపాడు’ అంటూ మా చెల్లెలు బోరున ఏడ్చేసేది. ఏమీ పాలుపోయేది కాదు. ఆమె ఏడుపు నా మనసులో నాటుకుపోయింది. డబ్బు లేని జీవితం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి, నేను డబ్బు సంపాదించి తీరాలనుకున్నాను. రోజుకు 16 గంటలపాటు కష్టపడసాగాను. ఈ రోజుకీ అలాగే శ్రమిస్తున్నాను.

తొలి అడుగు

ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని, మహత్మా జ్యోతిభాయి ఫూలే పథకానికి రుణం కోసం దరఖాస్తు చేశాను. ఒక చిన్న విత్తనంతో, ఫర్నీచర్ వ్యాపారాన్ని ఆరంభించాను. ఉల్లాస్ నగర్ నుంచి ఆధునిక ఫర్నీచర్ కు సంబంధించిన చౌక రకాలు తెచ్చి అమ్మసాగాను. అలాగని నా టైలరింగ్ని మానుకోలేదు. మా పరిస్థితులు క్రమంగా మెరుగుపడసాగాయి. ఈ వ్యాపారం ద్వారా... ముడిసరుకుల లభ్యత, బేరాలాడడం, మార్కెట్ పై అవగాహన, ట్రెండ్స్ గుర్తించడం వంటివన్నీ నేర్చుకున్నాను. వీటితోపాటుగా అవకాశం కోసం కాచుకునే గుంటనక్కల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను.

పనిలో పనిగా నాలాంటి ఔత్సాహికులకు సహాయకారిగా ఉండడంకోసం ఒక చిన్న ఎన్జీఓ స్థాపించాను. దీనిద్వారా వివిధ ప్రభుత్వ ఋణ పథకాల గురించి, స్కీమ్ల గురించి సమాచారం సేకరించి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అందజేయసాగాను. ఆడ అయినా, మగ అయినా నావలె ఒంటరి పయనం సాగించకూడదని అనుకున్నాను. వాళ్లు ఎలాంటి అద్భుతాలు చేయాలనుకుంటున్నారో... అందుకు తగిన సమాచారాన్ని అందించడంద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చేయాలనుకున్నాను.

అవకాశాలకోసం ఎదురుతెన్నులు

నా మొదటి రుణం తీర్చడానికి రెండేళ్లు పట్టింది. ఈలోగా ఇతర వ్యాపార అవకాశాలపై దృష్టి సారించాను. ఒక మంచి అవకాశం దక్కింది. వివాదాల్లో చిక్కుకున్న ఒక భూమి యజమానికి అత్యవసరంగా సొమ్ము కావలసి వచ్చింది. ఆ భూమిని కారుచౌకగా నాకు అమ్మేస్తానని చెప్పాడాయన. ఎందుకంటే, ఆ భూమి ఆయనకు ఉన్నా లేనట్టే. నేను ‘బెగ్, బారో అండ్ స్టీల్' అన్నట్టుగా సొమ్ము సేకరించి, భూమిని కొనేశాను. అంతమాత్రాన భూమి నా చేతికి చిక్కలేదు. వివాదాల మూలంగా చట్టపరమైన హింసకూ లోనయ్యాను.

తదుపరి రెండేళ్లపాటు కోర్టుల్లో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా తిరిగి మొత్తానికి భూమిని దక్కించుకున్నాను. దానిని అభివృద్ధి చేద్దామంటే మళ్లీ పాత కథే ! అదే నిధుల కొరత. లాభాల్లో 65% ఇచ్చే ఒప్పందంపైన ఒకరిని భాగస్వామిగా చేసుకోవలసి వచ్చింది. అక్కడ భవంతిని నిర్మించాం. ఫర్నీచర్, రియల్ఎస్టేట్ వ్యాపారాలతో నా జీవితం ఒక కొలిక్కి వచ్చిందని భావించినా, తృప్తి పడలేదు.

కమాని ట్యూబ్స్ వారి అసాధారణ కేసు

రాంజీభాయ్ కమానీ స్వతంత్ర భారతదేశపు తొలి వ్యాపారవేత్తల్లో ఒకరు. గాంధీ, నెహ్రూలకు శిష్యుడు. స్వాతంత్య్రం సిద్ధించగానే ఆయన కుర్లా వచ్చి కమానీ ట్యూబ్స్, కమానీ ఇంజినీరింగ్, కమానీ మెటల్ అనే మూడు సంస్థలు నెలకొల్పారు. ఆయన ఆలోచనలు కార్మికుల శ్రేయస్సు, హక్కుల దిశగానే సాగేవి. దేశ ఆర్థిక పురోగతికి సంబంధించి చాలా అంచనాలుండేవి. జాతి అభివృద్ధిలో తాను కీలక పాత్ర వహించాలన్నది కమానీ అభిలాష.

కమానీ ఆలోచనలకు తగ్గట్టు, ఆయన బతికున్నంతవరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ, ఆయన కన్నుమూసిన కొన్నాళ్లకే, 1987లో కమానీ కొడుకులు తగువులు పడ్డారు. యజమానులు సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున యాజమాన్యం తమకు అప్పగించాలని కార్మిక సంఘం కోర్టుకెక్కింది. ఇటువంటివి అప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో జరిగినా, భారతదేశంలో ఎదురవడం అదే ప్రథమం. కమానీ వారసుల నుంచి కార్మికులకు యాజమాన్యాన్ని బదలాయిస్తూ సుప్రీం కోర్టు తీర్చునిచ్చింది. కానీ, కార్మికుల సంఖ్య దాదాపు మూడు వేలు. అంతమందిలో నిర్వహణ చేపట్టేదెవరు?

image


క్రమేపీ అవాంఛనీయమైన అహంకారం, ఆధిపత్య పోరు, ఘర్షణలు మొదలయ్యాయి. కార్మిక సంఘాల నాయకులకు ఎంత త్వరగా గట్టెక్కాలా అన్న ఆలోచన తప్ప, కంపెనీపట్ల ఎలాంటి స్వార్థ చింతన లేదు. కార్మిక హక్కులు పరిరక్షించిన మొదటి ఉదంతం కావడంతో, కమానీ ఇండస్ట్రీస్ విజయాన్ని విప్లవానికి తొలి అడుగుగా జనం భావించారు.

బ్యాంకులు ఋణాలను గుప్పించాయి. ఋణాల చెల్లింపును పొడిగించాయి. పరపతి సదుపాయాన్ని పెంచాయి. ప్రభుత్వం కూడా తన వంతుగా వివిధ నిధులు, లాభాలు సమకూర్చి పెట్టింది. భారీగా నిధులు సమకూరాయిగానీ, వాటిని వినియోగించడానికి సమర్థులు కరువయ్యారు. 1987 నుంచి 1997 నడుమ దశాబ్ద కాలంలోనూ కంపెనీ కుంటి నడక సాగించింది. మూసివేయడం మినహా గత్యంతరం లేదు. కార్మికులంతా నిపుణులే. మూతవేయడానికి కారణం ఏముంటుంది? వాస్తవాలు వెలుగు చూసేసరికి మదుపు పెట్టినవాళ్లంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయాయి. IDBI రంగంలో దిగి పరిస్థితిని సమీక్షించి, కార్మికులు డిఫాల్టర్లు అయ్యారని గుర్తించింది. కొత్త ప్రమోటర్ని తీసుకోమని కోర్టు ఆదేశించింది.

కంపెనీపై 140 లిటిగేషన్ కేసులు దాఖలయ్యాయి. ఋణ మొత్తాలు రూ. 116 కోట్లకు చేరుకున్నాయి. ఆధిపత్యం కోసం రెండు యూనియన్లు కొట్లాడుకుంటున్నాయి. కమానీ సంస్థలు మూడింటిలోనూ రెండు అప్పటికే మూసివేతకు వెళ్లిపోయాయి. మూడోది సైతం నేడో రేపో అన్నట్టుగా ఉంది. ఆ పరిస్థితుల్లో కార్మికులు నా వద్దకు వచ్చి, కంపెనీని నిలబెట్టి తాము రోడ్డునపడకుండా చూడాల్సిందిగా ప్రాధేయపడ్డారు. నేను నిర్వహిస్తున్న ఎన్జీఓ, నా వ్యాపార చతురత కొన్ని వర్గాల్లో అప్పటికే నాకు కొంత ఖ్యాతిని గడించిపెట్టాయి. అయితే, నాకున్న జ్ఞానం శూన్యం. 566 కుటుంబాలు రోడ్డున పడతాయనేసరికి కాస్త ఆలోచించాను. నేను పోగొట్టుకునేదేమీ లేదు కదా అనుకున్నాను.

యుద్ధం

రంగంలో దిగగానే ఆయా విభాగాల్లో నిపుణులైన పదిమందితో ఒక కోర్ టీం సిద్ధం చేశాను. కొందరు కన్సల్టెంట్ల సాయం తీసుకున్నాను. నష్ట నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఒక ప్రతిపాదన తయారు చేశాం. IDBI తదితర బ్యాంకు ప్రతినిధులతో కూడిన బోర్డు ముందు ఆ ప్రతిపాదన పెట్టేసరికి, ‘మీరు గనుక బోర్డులో కూర్చుని అన్ని బకాయిలకు బాధ్యత వహించేటట్టయితే, మీ ప్రతిపాదనను మేము అంగీకరిస్తాం’ అన్నారు. నేను సరేనన్నాను. బోర్డువారు నన్ను ప్రెసిడెంటుగా నియమించారు. ఇది జరిగింది 2000 సం.లో.

ఆ క్షణం నుంచి ఆరేళ్లపాటు అంటే 2000 నుంచి 2006 వరకూ మళ్లీ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. సంస్థ బకాయి పడ్డ రూ.116 కోట్లలో జరిమానా పద్దులు, వడ్డీలే అధికంగా ఉన్నాయని గ్రహించాను. ఆర్థిక మంత్రి దగ్గరకు వెళ్లి సమస్యనంతా వివరించి, జరిమానాలు వడ్డీలు రద్దు చేయమని కోరాను. ‘కంపెనీ గనుక లిక్విడేషన్ కి వెళ్తే ఏ ఒక్కరికీ ప్రయోజనం ఉండదు. అదనపు భారాన్ని రద్దు చేసినట్టయితే కనీసం ఋణదాతలకు అసలు సొమ్ము వెనక్కి వస్తుంది’ అని వివరించాను. ఆయన బ్యాంకులతో సవివరంగా చర్చించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాలంటే చాలా గర్వంగా భావిస్తాను. కేవలం జరిమానాలు, వడ్డీలు మాత్రమే రద్దు చేసి ఊరుకోలేదు. అసలులోసైతం 25% తగ్గించుకున్నాయి బ్యాంకులు! దీనివల్ల అనుకున్న బకాయికి సగంకంటే తక్కువ చెల్లించాల్సి వచ్చేసరికి, ప్రాణం తెప్పరిల్లింది. 2006లో కంపెనీ చైర్మన్ గా నియమితురాలినయ్యాను. కమానీ ట్యూబ్స్ యాజమాన్యాన్ని కోర్టువారు నాకు బదలాయించారు. ఏడేళ్లలో బ్యాంకు ఋణాలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు.

ఏడాదిలోపలే చెల్లించేశాం !

కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలను మూడేళ్లలోగా చెల్లించాలని కోర్టు గడువు విధిస్తే, మేము మూడు మాసాల వ్యవధిలోనే జీతాలు ఇచ్చేశాం! ఇవ్వాల్సింది అయిదు కోట్లే అయినప్పటికీ, మేము అయిదు కోట్ల 90 లక్షలు ఇవ్వగలిగాం. అప్పులు, బకాయిలు తీర్చేటప్పుడే కంపెనీ తన కాళ్లపై తాను నిలబడేలా ఉత్పత్తిని పునః ప్రారంభించడం విధాయకం అనుకున్నాం. కంపెనీని నేను చేతుల్లోకి తీసుకునేసరికి కంపెనీలో మెషినరీ చాలామటుకు దొంగతనమో, లేక కనిపించకుండా పోవడమో జరిగింది. అసలు కుర్లాలోగల ఫ్యాక్టరీ భూమి సైతం ఇతరులకు అమ్మేశారు. ఇవన్నీ అప్పట్లో కంపెనీ బాధ్యతలు చేపట్టిన కార్మిక సంఘం చేసిన నిర్వాకాలు. ఇలా కాదనుకుని, 2009లో వాడాలో ఏడెకరాల స్థలం కొని ఫ్యాక్టరీని అక్కడకు మార్చాను.

భవిష్యత్తు

రాంజీభాయ్ కమానీ కొత్తగా ఏర్పడిన భారతదేశానికి దీర్ఘకాల భవిష్యత్తును ఊహిస్తూ కమానీ ఇండస్ట్రీస్ ఆరంభించారు. జాతి అభివృద్ధిలో తాను నెలకొల్పిన కంపెనీలు మూలస్తంభాలై ఉంటాయని ఆయన తలపోశారు. ఆయన స్వప్నాన్ని నేను స్వీకరించి, ఆయన అనుకున్నట్టుగా నిష్పాక్షికంగా, సమానత్వంగా కంపెనీని ముందుకు నడిపిస్తున్నాను.

image


కమానీ నెలకొల్పిన మూడింటిలో మిగతా రెండు కంపెనీలనుకూడా తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. కమానీ సామ్రాజ్యానికి తొందరలోనే మునుపటి ప్రాభవాన్ని చేకూరుస్తాను.

సలహా :

కష్టించినంత మాత్రాన విజయం సిద్ధిస్తుందనుకోవడం వెర్రితనం. ఏదేమైనా కావచ్చు- మీరు సాధించాలనుకున్న దానిపై ఏకాగ్ర చిత్తం నిలపండి. మనస్ఫూర్తిగా పనిచేస్తేనే అనుకున్నది తప్పకుండా సాధించగలరు.

Add to
Shares
753
Comments
Share This
Add to
Shares
753
Comments
Share
Report an issue
Authors

Related Tags