55 ఏళ్ల తర్వాత అయినవాళ్లను కలుసుకున్న చైనా సైనికుడు

55 ఏళ్ల తర్వాత అయినవాళ్లను కలుసుకున్న చైనా సైనికుడు

Saturday February 18, 2017,

2 min Read

భారత్‌-చైనా యుద్ధం ముగిసిన టైం అది. వాంగ్‌ అనే చైనా సైనికుడు చీకట్లో దారితప్పాడు. అసోం సమీపంలో భారత భూభాగంలో అడుగుపెట్టాడు. అక్కడే మాటువేసి వున్న రెడ్ క్రాస్ టీంకి చిక్కాడు. ఆరేళ్ల శిక్ష అనుభవించాక భారత ప్రభుత్వం అతడికి పునరావాసం కల్పించింది. బతుకుదెరువు కోసం మిల్లులో పనిచేసి 55 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లాడు. ఐదు దశాబ్దాల తర్వాత తనవాళ్లను కలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. 

image


అది1962 డిసెంబర్. భారత్‌-చైనా యుద్ధం ముగిసిన సమయం. సరిహద్దు వెంబడి వాంగ్ అనే చైనా సైనికుడు దారి తప్పాడు. చీకట్లో ఎటుపోతున్నాడో తెలియక అస్సాం బోర్డర్ లో తేలాడు. అక్కడే మాటువేసి ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ టీంకి దొరికిపోయాడు. అస్సాం జైల్లో వాంగ్ ఆరేళ్లపాటు శిక్ష అనుభవించాడు. 1969లో పంజాబ్ హర్యానా కోర్టు అతడిని విడుదల చేయాలని తీర్పిచ్చింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం పునరావాసం కల్పించింది. మధ్యప్రదేశ్‌ బాలాఘాట్ లోని ఒక మిల్లులో వాంగ్ వాచ్ మన్ గా చేరాడు. స్థానికంగా అతణ్ని అందరూ రాజ్ బహదూర్ అని పిలిచేవారు. ఎందుకంటే వాంగ్ ముఖంలో నేపాలీ ఫీచర్స్ ఉన్నాయని అలా సంబోధించేవారు.

కొన్నాళ్లకు సుశీల పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 1975లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వాంగ్ కి ప్రభుత్వం నెలకు వంద రూపాయల పెన్షన్ ఇచ్చేది. ఎప్పుడైతే సుశీలను పెళ్లిచేసుకున్నాడో, అప్పటి నుంచి పెన్షన్ నిలిపివేసింది. విడుదలైన రోజు నుంచి చైనాకు వెళ్లి తన బంధువులను కలుసుకోడానికి వాంగ్ చేయని ప్రయత్నమంటూ లేదు. 2006లో వాంగ్ తల్లి చనిపోయింది. అప్పుడు చైనా వెళ్లడానికి వాంగ్ శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. 2009లో మధ్యప్రదేశ్ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఒక్కసారి తన దేశానికి వెళ్లే అవకాశం కల్పించమని కోర్టును వేడుకున్నాడు.

image


మూడేళ్ల క్రితం వాంగ్ మేనల్లుడు తన మామ జాడ తెలుసుకుని ఇండియాకు వచ్చాడు. బాలాఘాట్ లో ఉన్న వాంగ్ ని కలుసుకున్నాడు. చైనా ప్రభుత్వాన్ని ఆశ్రయించి పాస్ పోర్టు, వీసా వచ్చేలా కృషి చేశాడు. ఐదు దశాబ్దాల తర్వాత వాంగ్ తన సొంత గడ్డమీద అడుగు పెట్టాడు. తన ఆత్మీయులను కలుసుకున్నాడు. ఐదు దశాబ్దాల తర్వాత వాళ్లు కంటపడేసరికి వాంగ్ గుండె బాధను ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఇన్నాళ్లపాటు ఇండియాలో ఎలా బతికిందీ వివరించాడు. భారతీయుల గొప్ప మనసుని వారితో పంచుకున్నాడు. దేశంకాని దేశం వచ్చి ఒంటరిగా మిగిలిపోయిన వాంగ్ ని పెళ్లాడి.. నేనున్నానంటూ తనతో ఏడడుగులు నడిచిన సుశీలను వారికి పరిచయం చేశాడు. కొడుకు కూతురిని చూపించాడు.