సంకలనాలు
Telugu

చలి గిలిగింతనే ''మనాలి''..?

మనల్ని మైమరిపించే మనాలి

team ys telugu
11th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

చలిని పులి అంటారు. అంతలా భయపెట్టే చలిని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? ఎముకలు కొరికే చలిలో ఎంచక్కా విహరిస్తే ఏమవుతుంది. చలి పులి రూపం వదిలి గిలిగింతలు పెడుతుంది. అందాల లోకంలో విహరింపజేస్తుంది. మంచు ఆనందాల అంచులకు తీసుకెళ్తుంది. సహజసిద్ధమైన శీతాకాలపు అందాలను పరిచయం చేసిన చలి గిలిగింతనే``మనాలి``.. కులు మనాలి అనాలి.

image


ఎండా కాలంలో హిమాలయాల్లోకి వెళితే ఆహ్లాదంగా ఉంటుంది. కానీ చలికాలం..అదీ వణికించే చలిలో మంచుకొండల్లోకి వెళితే అదో డిఫరెంట్ అనుభవం. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉదయించాడో లేడో తెలియని భానుడి పరోక్షంలో మంచులో విహరిస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒళ్లంతా థర్మల్స్, స్వెట్టర్స్‌ తో కప్పేసుకున్నా చలి ఒంటికి తగులుతూనే ఉంటుంది. మనల్ని గజగజా వణికిస్తూనే ఉంటుంది. ఆ అనుభూతి కోసమే డిసెంబర్ చివరి వారంలో ఫ్యామిలీతో మనాలి ప్రయాణం.

అసలు మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఢిల్లీలో దిగగానే చలి గాలి రివ్వున తగిలింది. డిసెంబర్ 25న ఉదయం ఢిల్లీలో దిగేసరికి టెంపరేచర్ 4 డిగ్రీలే. స్వెటర్, గ్లోవ్స్ వేసుకున్నా చలి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఆ రోజు మనాలి టెంపరేచర్ చూస్తే మైనస్ 4 డిగ్రీలు. హోటల్ రూమ్ లో హీటర్ పక్కన కూర్చొని ఆలోచనలు. మనాలి వెళదామా? వద్దా? అయితే ఇంతదూరం వచ్చాక వెనుకడుగు ఎందుకని ముందుకెళ్లాం.

మరునాడు ఉదయం ఆరున్నరకు ఢిల్లీ నుంచి కారులో బయలుదేరాం. చుట్టూ పొగమంచు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. కారు నెమ్మదిగా ఢిల్లీ దాటి హర్యానాలోకి ప్రవేశించింది. విశాలమైన రహదారి. నేషనల్ హైవే నంబర్ 1. రోడ్డుకి రెండు వైపులా పెద్ద పెద్ద హోటళ్లు, పంజాబీ ధాబాలు. వేడి వేడిగా బ్రేక్ ఫాస్ట్ చేశాక కారు రయ్యున దూసుకుపోయింది. హర్యానాలో చారిత్రక యుద్ధం జరిగిన పానిపట్టు, కురుపాండవ రణక్షేత్రం కురుక్షేత్రం మీదుగా ప్రయాణం సాగుతుంది. ఆనాటి యుద్ధసంగతులు మాట్లాడుకుంటూ ప్రయాణిస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న తెలుగు, సోషల్ క్లాసులు గుర్తొస్తాయి. ఆ కబుర్లలో నుంచి బయటపడేసరికి హర్యానా దాటి పంజాబ్‌ లో అడుగుపెట్టాం.

సిక్కులకు అత్యంత పవిత్రమైన మాసం కావడంతో పంజాబ్ లో రోడ్డుకిరువైపులా టెంట్లు వేసి అన్నదానాలు చేస్తున్నారు. పేదలకు మాత్రమే కాదు, వచ్చిపోయే వాహనాలను ఆపి మరీ చపాతీ, కుర్మా, స్వీటు, పానకం అందజేస్తున్నారు. రెగ్యులర్ గా వార్తల్లో కనిపించే అంబాలా మొహాలీ, చండీగఢ్, ఆనంద్ పూర్‌ సాహిబ్ ల మీదుగా ప్రయాణం సాగుతుంటే ఆ ప్రాంతాలతో మనకేదో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది.

వ్యాసకర్త చంద్రమౌళి

వ్యాసకర్త చంద్రమౌళి


ఇక సాయంత్రం అయ్యేకొద్దీ చలి పెరగడం ప్రారంభమైంది. అప్పటికే పంజాబ్ దాటి హిమాచల్ ప్రదేశ్ లోకి ఎంటరవడంతో మనల్ని పర్వతాలు పలకరిస్తుంటాయి. టైమ్ గడుస్తున్నా కొద్దీ పర్వతాల ఎత్తు పెరుగుతూ ఉంటుంది. దానితోపాటే చలి కూడా. ప్రయాణం హిమాలయ పర్వత పాదాల్లోని శివాలిక్ కొండల్లో సాగుతూ ఉంటుంది. మనతోపాటే బియాస్ నది పరుగులు పెడుతూ ఉంటుంది. బిలాస్ పూర్ చేరేసరికి భారీ పర్వతాలు స్వాగతం పలుకుతాయి. సుందర్ నగర్, మండి, కులూ మీదుగా మనాలి చేరేసరికి రాత్రి 9 అయింది.

చలి కారణంగా రోడ్లపై జన సంచారం పెద్దగా లేదు. హోటళ్లు, షాపులు మాత్రం తెరిచే ఉన్నాయి. హోటల్ రూములోకి వెళ్లి తలుపులు మూసి హీటర్ ఆన్ చేస్తే 10 నిమిషాల్లో వేడెక్కింది. మరునాడు ఉదయం నిద్ర లేచి రూమ్ లో కర్టెన్ తీసి మంచుకోసం హిమాలయ పర్వతాల వైపు చూస్తే మా హోటల్ గది బయటే మంచుగడ్డలు, చుట్టూ ఉన్న హోటళ్ల పైకప్పులపైనా తెల్లటి మంచు ముద్దలు మంత్ర ముగ్ధుల్ని చేశాయి. నెమ్మదిగా తల పైకెత్తితే, చుట్టూ ఉన్న పర్వతాలన్నీ మంచుతో నిండిపోయి కనువిందు చేస్తాయి. చలి, పొగమంచు కారణంగా మార్నింగ్ 8 దాటినా రోడ్లపై జనం అలికిడి కనబడదు. తొమ్మిది దాటాకే టూరిస్టులంతా నెమ్మదిగా సొలాంగ్ వ్యాలీ వైపు కదలడం ప్రారంభమైంది.

వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనాలి దాకా వెళ్లింది ఈ వ్యాలీ కోసమే. ఎండాకాలంలో అయితే పర్వతాల్లో విహరించాలంటే 50 కిలోమీటర్ల దూరంలోని రోహ్ తంగ్ పాస్ దాకా వెళ్లాలి. చలికాలమైతే కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాంగ్ వ్యాలీ వెళితే చాలు. ఆకాశంలోకి ఎగబాకిన పర్వతాల నుంచి కిందనున్న లోయల వరకూ సర్వం మంచు మయమే. పాలనురగల్లా మెరిసి పోతున్న మంచును చూసి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాల్సిందే. అయితే మంచులోకి దిగాలన్నా, స్కీయింగ్ చేయాలన్నా ప్రత్యేకంగా తయారు చేసిన లెదర్ బూట్లు, లాంగ్ కోట్లు వేసుకోవాల్సిందే. కాకపోతే అద్దె మాత్రం కొంచెం ఎక్కువే. డ్రెస్సులు, బ్లేడ్స్ గైడ్ తో కలిపి ఒక్కో మనిషికి వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తారు.

గుట్టల్లా పడి ఉన్న మంచుపై స్కీయింగ్ చేయడం ఓ అద్భుతమైన అనుభూతి. కాళ్లకు బ్లేడ్స్, చేతుల్లో స్టిక్స్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ మంచులో కిందకు జారుతుంటే మనసు గాల్లో తేలిపోతుంది. మొదట ఒకటీ రెండు సార్లు కిందపడినా నెమ్మదిగా అలవాటుపడి స్వయంగా చేయగలుగుతాం. ఆ మంచులో ఎంతసేపు ఆడుతున్నా టైమే తెలీదు. పాలనురగల్ని ముద్ద చేసినట్టు, మంచుతో ముద్దలు చేసి బంతుల్లా ఎగరేశాం. మంచుతో పిట్టగూళ్లు, కోటలూ, శివలింగాలు తయారు చేశాం. చుట్టూ జనం కేరింతలు ఆటపాటలతో సందడిగా ఉంటుంది ఆ ప్రాంతం. డజన్లకొద్ది టూరిస్టులు మంచులో పై నుంచి కిందకు సర్రున జారుతుంటారు. మంచులో తిరిగే ప్రత్యేకమైన బైక్ పై కొండలపైకి ఎక్కడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. 

ఇది కాకుండా రోప్ వేలో మరో పెద్ద కొండపైకెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఓవైపు చలి, మరోవైపు ఆకలి దంచేస్తోంటే వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్, నూడిల్స్ తయారుచేసి ఇస్తుంటారు. అయితే సోలాంగ్ వ్యాలీలో ఎప్పుడూ ఉంటే పారా గ్లైడింగ్ ఈసారి క్యాన్సిల్ చేయడం నిరాశపరిచింది. కాలుష్యం పెరిగిపోతుందనే కారణంతో రద్దు చేసినట్టు స్థానికులు చెప్పారు. ఈ టూరులో మొదటి రోజు సోలాంగ్ వ్యాలీలోనే గడిచిపోయింది. మధ్యాహ్నం వెండికొండల్లా తెల్లగా మెరిసిపోయే హిమాలయాలు, సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి బంగారురంగులో మెరిసిపోతూ కనువిందు చేస్తాయి.

ఇక రెండో రోజు మనాలిలో లోకల్ సైట్ సీయింగ్. ఇక్కడ ముఖ్యమైనవి హిడింబీ టెంపుల్, హిడింబీ కొడుకు ఘటోత్కచుడి గుడి, మనువు ఆలయం చెప్పుకోదగ్గవి. హిడింబీకి చెక్కలతో కట్టిన గుడి, పూజలు జరుగుతున్నాయి. అయితే ఘటోత్కచుడి విగ్రహం మాత్రం ఓ చెట్టు కిందే ఉంది. ఘటోత్కచుడికి కానుకలుగా కత్తులు, శూలాలు మాత్రమే సమర్పించడం ఇక్కడి వింత ఆచారం. అందుకే ఆ చెట్టు చుట్టూ గుట్టలు గుట్టలుగా కత్తులు, శూలాలు కనిపిస్తాయి.

దేశంలో ఎక్కడా లేని విధంగా హిందూ ధర్మశాస్ర్త రచయిత మనువుకు ఇక్కడ ఆలయం ఉంది. ఓల్డ్ మనాలిలో కొండలపైన మనువు గుడి ఉంది. హిందూ మతంలో దొంతరల వర్ణవ్యవస్థను ఏర్పరిచిన మనువు ఆలయం కూడా దొంతర్లలాగే ఉంది. అసలు మనాలి పేరు మను+ ఆలయం పేరుతో వచ్చింది.

తాడు సాయంతో వేలాడుతూ నదిని దాటే సాహస క్రీడ ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది కాకుండా బోటింగ్ కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. రోజంతా టూరు ముగించుకుని సాయంత్రానికి మాల్ రోడ్డుకు చేరుకుంటే మరో విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. మనాలిలో టూరిస్టులంతా ఒకే చోట చేరే కాంప్లెక్స్ ఇది. ఇక్కడ ప్రధానంగా హోటళ్లు, షాపింగ్ సెంటర్లున్నాయి. అక్కడే తింటూ షాపింగ్ చేస్తూ వందలాది మంది టూరిస్టులు కనిపిస్తుంటారు. 

ఇక్కడ దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వాళ్లే కాకుండా విదేశీ టూరిస్టులు కనిపిస్తారు. అయితే రాత్రయ్యేసరికి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయి వణికిస్తూ ఉంటుంది. స్వెటర్లు, మంకీ క్యాప్స్ ధరించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చలి బారినుంచి తప్పించుకోలేం. మేము మాల్ రోడ్డులో పచార్లు చేస్తున్నప్పుడు, మైనస్ 4 డిగ్రీల చలి మమ్మల్ని కదలకుండా చేసింది. రోడ్ల పక్కనే గ్యాస్ స్టవ్స్ పెట్టి వేడి వేడిగా తయారు చేస్తున్న స్నాక్స్ తింటూ టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటారు.

image


మనాలి చుట్టూ హిమాలయాలే కావడంతో ఏ హోటల్ రూములో నుంచి చూసినా మంచుకొండలు కనిపిస్తుంటాయి. ఓ వైపు కొండలు, మరోవైపు లోయలు.మధ్యలో అందమైన భవంతులు.చూడడానికి మనాలి ఓ పెయింటింగ్ లా ఉంటుంది. 6800 అడుగుల ఎత్తున ఉన్న మనాలి లడఖ్ వెళ్లే దారిలో ఉంటుంది. ఈ దారిలో మనాలి దాటితే అంతా మంచుమయమే. డజన్ల సంఖ్యలో హోటళ్లు, వందల సంఖ్యలో రూములు ఉండడం వల్ల వసతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హీటర్లు, 24 గంటల వేడినీళ్లు అందుబాటులో ఉన్న రూములున్నాయి.

ఇక మూడో రోజు కులు మీదుగా మణికరణ్ ప్రయాణం. కులులో రివర్ రాఫ్టింగ్, పారా గ్లైడింగ్ ప్రధాన ఆకర్షణ. అయితే చలికాలంలో నీళ్లు గడ్డ కట్టడం ద్వారా బియాస్ నదిలో నీరు తక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల రాఫ్టింగ్ మరింత థ్రిల్లింగ్ గా ఉంటుంది. కులు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే మణికరణ్ లో శివాలయం, గురుద్వారా పక్కపక్కనే ఉంటాయి. అయితే అక్కడ విశేషం అది కాదు. వీటి పక్కనే ప్రవహించే పార్వతి నదిలో నీళ్లు గడ్డ కట్టేంత చల్లగా ఉంటే.. దానిని ఆనుకొని పొగలు కక్కే వేడినీళ్లు వస్తుంటాయి. ఆ నీటిలో జనం స్నానాలు చేస్తుంటారు. ఈ వేడి నుండి గుండాలలో నుంచి పొగలు వెలువడుతుంటాయి. ఈ కాంట్రాస్ట్ చూడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ వేడి నీటి గుండాలకు ఆనుకునే వేడి గుహలున్నాయి. బయట వణికించే చలి. ఈ గుహల్లో కూర్చుంటే వేడిగా ఉంటుంది. 

మణికరణ్ చూసి ఇక నేరుగా ఢిల్లీ ప్రయాణమే. 580 కిలోమీటర్ల దూరం ఉండే మనాలి మార్గంలో సగం దూరం కొండల మీదే ప్రయాణం. చుట్టూ కొండలు. కొండలపైనే నివాసాలు. రాత్రిపూట కొండలపై వెలుగుతున్న ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల్లా కనిపిస్తాయి. సుధీర్ఘంగా సాగే ప్రయాణంలో మనకు తోడుగా బియాస్ నది ప్రవహిస్తూ వస్తుంది. రకరకాల గ్రామాలు, పట్టణాలు దాటుతూ, కొండలు ఎక్కుతూ లోయల్లోకి దిగుతూ సాగే ఆ ప్రయాణం ఎంతో అద్భుతం. గమనమే గమ్యంలా ఉంటుంది. ఎంత టైమ్ గడిచినా బోర్ కొట్టదు. అలసట రాదు. నాలుగు రోజుల మనాలి ప్రయాణం మనకు మంచి అనుభూతి, ఆనందాన్ని మిగులుస్తుంది.

రచయిత: 

వొడ్నాల చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags