సంకలనాలు
Telugu

భారత రాజకీయాల్లో విలక్షణ నేత..!

విప్లవ నాయకి జయలలిత

6th Dec 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఎదురుదెబ్బలు తిని బతకడం నేర్చుకుంది. పోరాడితేనే బతకగలమన్న పాఠాన్ని చిన్నతనం నుంచే ఒంటబట్టించుకుంది. లక్ష్యం ఒకటైతే.. కష్టాలు మరో దారి చూపాయి. అడుగడుగునా అవమానాలు. అడ్డంకులు. అయినా ఎదురుదెబ్బ తగిలినప్పుడల్లా తిరగబడింది. సవాళ్లను ఎదుర్కోవడం, పోరాడి విజయం సాధించడమెలాగో నేర్చుకుని అసాధ్యురాలు అనిపించుకుంది జయలలిత.

తమిళనాడులోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అన్నాడీఎంకే సారథి జయలలిత. ఆమె ఓ పడిలేచిన కెరటం. ఓ మొండిఘటం. కన్నుకు కన్ను ధోరణితో ప్రత్యర్థుల్ని ముప్పుతిప్పలుపెడతారని పేరున్న జయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సాగిన దుశ్శాసన పర్వంలో బాధితురాలైంది. కాలం కలిసిరాక జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. రాజనీతి గురించి పక్కనబెడితే రాజకీయాల్లో తప్పటడుగులు వేశారు. జయకు మితిమీరిన అహంభావం, లెక్కలేనితనం, అతి విశ్వాసం అని చాలా మంది అంటారు. కానీ తమిళలకు మాత్రం ఆ పోకడ ఇష్టం. అందుకే ఆమెను ఆప్యాయంగా అమ్మ అని, విప్లవ నాయకి అని పిలుచుకుంటారు.

తమిళ అయ్యంగార్ కుటుంబంలో పుట్టిన జయలలితది సంపన్న కుటుంబం. ఆమె తాత మైసూరు రాజు దగ్గర పనిచేసేవారు. తల్లి సినిమా నటి. పిన్ని ఎయిర్ హోస్టెస్‌. జయలలితకు చిన్నప్పటి నుంచి ఒకటే కల.. బాగా చదువుకోవాలని. కానీ, కోరుకున్నట్లే జరిగితే అది జీవితమెందుకు అవుతుంది. వేదవల్లి, జయరామ్‌ల గారాలపట్టి జయలలిత అసలు పేరు కోమలవెల్లి. ఏడాది వయస్సు వచ్చాక ఆమెకు జయలలిత అని పేరు పెట్టారు. ఈమెకు జయకుమార్ అనే సోదరుడు కూడా ఉండేవారు. రెండేళ్ల వయసులో తండ్రి చనిపోవడం, బంధువులు పట్టించుకోకపోవడంతో ఆమె కుటుంబం కష్టాలపాలైంది.. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి వేదవల్లి.. సంధ్యగా సినిమాల్లో నటించాల్సి వచ్చింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే పిన్ని దగ్గర కొంతకాలం పెరిగిన జయ.. సమ్మర్‌ హాలీడేస్‌లో మాత్రమే తల్లిని చూసే అవకాశం ఉండేది. తల్లి దగ్గరగా లేకపోవడంతో బంధువుల ఈసడింపులు, చులకనగా మాట్లాడటం ఆమెను బాధించేవి. ఒంటరి బతుకుతో ఆమె మానసికంగా కుంగిపోయారు.

imageకుటుంబ కష్టాలో లేక ఆమె ఇష్టమో తెలియదుగానీ జయలలిత నటన వైపు అడుగులేశారు. మొదట నాటకాలు, ఆ తర్వాత కన్నడ, తెలుగు సినిమాల్లో నటించిన ఆమెకు అప్పటి అగ్రహీరో ఎంజీఆర్ తో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో పార్టీలో చేరిన జయకు ఎదురులేకుండా పోయింది. అయితే సినిమా, రాజకీయ రంగాల్లో ఎదురైన అనుభవాలు ఆమెను పురుషాధిక్యతను ఏ మాత్రం భరించలేకుండా మార్చాయి. ఇంగ్లీషుపై ఆమెకున్న పట్టుతో ఎంజీఆర్ 1984లో రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆయన చనిపోయాక పార్టీ నుంచి ఆమెను తరిమేసేందుకు ఎన్నో ప్రయత్నాలు. మరెన్నో అవమానాలు. అన్నింటినీ ఎదుర్కొంది. MGR మృతితో ఆయన భార్య జానకీ రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినా.. ఆమె పార్టీని నడపలేకపోవడం జయకు కలిసొచ్చింది.

1991లో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు జయలలిత. చిన్నవయస్సులోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రికార్డు సృష్టించిన ఆమె అక్రమాస్తుల కేసులో జైలు పాలవడం, పదవి నుంచి దిగిపోవడం, మళ్లీ కోర్టు తీర్పు మేరకు అధికారంలోకి రావడం ఓ సంచలనం. డీఎంకే అధినేత కరుణానిధిని బద్ధశత్రువుగా భావిస్తారు జయ. అసెంబ్లీ సాక్షిగా డీఎంకే ఎమ్మెల్యేలు చీర లాగి చేసిన అవమానానికి ప్రతీకారంగా కరుణను అరెస్టు చేయించిన తీరు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తనకు అవమానం జరిగిన సభలో అధికారంలోకి వచ్చే వరకు అడుగుపెట్టనని శపథం చేసిన ఆమె ఆ మాట నిలబెట్టుకున్నారు. తనను గౌరవించకపోతే ఎవరినీ లెక్క చేయనితత్వం ఆమె సొంతమనడానికి ఇదే నిదర్శనం.

బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు, వాచ్‌లు, చెప్పులంటే జయకు ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు జయ వాటన్నింటికి దూరంగా ఉంటున్నారు. ఇందుకు కారణం బహుశా జైలు జీవితం నేర్పిన పాఠం కావచ్చు. రాజకీయ ఆటుపోట్లు, న్యాయ వివాదాలతో దేశంలో మరే రాజకీయ నేత ఎదుర్కోనన్ని ఇబ్బందులు పడ్డారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మ స్థైర్యం కోల్పోకుండా సవాళ్లను ఎదుర్కొన్నారు. అహంకారానికి మారు పేరు జయలలిత అనేది కొందరి అభిప్రాయం. కానీ ఆమె జీవితాన్ని దగ్గరి నుంచి గమనించిన వారెవరైనా ఈ మాట నిజం కాదని అంటారు. ఆమె సాత్వికురాలని చెబుతారు. కుటుంబ పరిస్థితులు, రాజకీయాలు ఆమెను కఠినంగా మార్చాయని అంటారు.


imageవాస్తవానికి జయకు చదువంటే ఇష్టం. టెన్త్‌ లో టాపర్‌. కానీ పరిస్థితుల వల్ల పై చదవులు కొనసాగించలేక పోయారు. ఇంగ్లీషులో నిష్ణాతురాలైన జయకు కన్నడ, తమిళ, తెలుగు భాషలపైనా పట్టుంది. ఆమెకు పుస్తకాలంటే మక్కువ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివడం జయకు అలవాటు. ఇంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే జయకు నమ్మకమైన స్నేహితులు ఎవరిని అడిగితే ఆమె చెప్పిన సమాధానం పుస్తకాలు. ఆమె నివాసం పోయెస్‌ గార్డెన్‌లో 3 వేల పుస్తకాలతో లైబ్రరీ ఉంది. జయలలిత దాదాపు 140 సినిమాల్లో నటిస్తే వాటిలో 125 చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. భరతనాట్యం, మోహినీఆట్టం, మణిపురి, కథక్‌ నృత్యరీతుల్లో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. పియానో వాయించడం అంటే జయలలితకు చాలా ఇష్టం. రిథమ్‌ అనే పత్రికలో కాలమిస్టుగా ఎన్నో వ్యాసాలు అచ్చయ్యాయి. జయ ఒక నవల కూడా రాశారు.

తమిళ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా, గత చరిత్రలను తిరగరాసిన ఘనత జయలలిత సొంతం. నిర్భయంగా, నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరూ తనకు సాటిరారని నిరూపించుకున్నారు. వివాదాలు చుట్టుముట్టినా ధైర్యంగా ముందుకు వెళ్లిన జయ.. ప్రజలే తన కుటుంబమని నమ్మేవారు. ప్రత్యర్థులు ఏకం కాకుండా ఎత్తులు వేయడం, ఒంటరిగా పోటీ చేయడం, కాంగ్రెస్‌, బీజేపీతో తటస్థంగా వ్యవహరించడం లాంటి వ్యూహాలు ఆమెను గొప్ప నాయకురాలిని చేశారు. అచ్చమైన తమిళయాసలో ప్రజలకు అర్థమయ్యేలా సూటిగా మాట్లాడటం జయం ప్రత్యేకత. అందుకే భారత రాజకీయాల్లో ఆమె ఓ విలక్షణ నేత.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags