సంకలనాలు
Telugu

తాను పస్తులుండి.. పక్కవాడి కడుపు నింపే ‘స్కిప్ ఎ మీల్’

hari prasad
6th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఈ దేశంలో ఆకలి చావులు ఉండకూడదనుకున్నాడు. మనిషి అంతరిక్షానికి నిచ్చెన వేస్తున్న ఈ కాలంలోనూ పిడికెడు మెతుకుల కోసం అల్లాడుతున్న అభాగ్యులను చూసి చలించిపోయాడు. వారి కడుపులు నింపడానికి తాను పస్తులున్నాడు. మరికొందరు కూడా అతనికి జత కలిశారు. కాలేజీ రోజుల్లోనే ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న అతని పేరు అర్పణ్ రాయ్. ఇదీ అతను ప్రారంభించిన ‘స్కిప్ ఎ మీల్’ సక్సెస్ స్టోరీ.

image


స్కిప్ ఎ మీల్.. బరువు తగ్గించుకోవడానికి కొంతమంది చేసే పని కాదిది. ఆకలితో అలమటిస్తున్న వారి కడుపులు నింపే ఓ మహోన్నత ఆశయం. పన్నెండో తరగతిలోనే పక్కవారి క్షేమం గురించీ ఆలోచించడం మొదలుపెట్టిన అర్పణ్ రాయ్ అనే విద్యార్థి మెదడులో నుంచి వచ్చిన అద్భుత ఆలోచన. తన ప్రతి పుట్టిన రోజునూ నిరుపేద పిల్లల మధ్యే జరిపి చిన్నతనం నుంచే ఎదుటివారి గురించి ఆలోచించేలా చేసిన తన తల్లిదండ్రులు చూపిన బాటలోనే ఇప్పటికీ నడుస్తున్నాడు రాయ్. జీవితం ఎలాంటి కఠిన సవాళ్లను విసురుతుందో తనకు తెలిసేలా చేయడమే అతని తల్లిదండ్రుల ఉద్దేశం. అవకాశం దొరికితే అలాంటి ఎందరో నిరుపేదలకు అతను ఆసరాగా నిలవాలని వారు కలలు గన్నారు. సరిగ్గా ఇప్పుడు అతను కూడా అదే చేస్తున్నాడు. తన చిన్నతనంలో కొన్నేళ్లు ఒడిశాలోని కలహండి ప్రాంతంలో ఉన్న అర్పన్.. అక్కడి ప్రజల ఆకలి పోరాటాలను కళ్లారా చూశాడు. 2012లో తాను మహారాష్ట్ర తుల్జాపూర్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో చదివే రోజుల్లో ప్రతిరోజూ పెద్ద ఎత్తున ఆహారం వృధాగా పోవడాన్ని అర్పణ్ గమనించాడు. 

‘ఒక్క మహారాష్ట్రలోనే ఏడాదికి 3000-4000 మంది పిల్లలు ఆకలికి తాళలేక చనిపోతున్నారని పత్రికల్లో చదివాను. మరోవైపు కాలేజీ హాస్టళ్లలో ఇంత ఆహారం వృధాగా పోతోంది. అందుకే కొంతమంది వలంటీర్లను నియమించి దీన్ని అరికట్టాలని సంకల్పించాం’ అని అర్పణ్ చెప్పాడు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలోనే తనకు ‘స్కిప్ ఎ మీల్’ ఆలోచన వచ్చింది.

image


ఆకలిపై పోరాటం

'స్కిప్ ఎ మీల్' ఆలోచన ఒక విధంగా తన తల్లిదండ్రులు ఒకప్పుడు నేర్పిన పాఠమే. నీకు సంబంధించిన వస్తువును నీ కన్నా ఎక్కువ అవసరం ఉన్నవారికి ఇవ్వమని అర్పణ్‌కు చిన్ననాటి నుంచే అతని తల్లిదండ్రులు నూరిపోశారు. ఆ ఉద్దేశంతోనే తాను ఓ పూట పస్తులుండి ఆ ఆహారాన్ని నిరుపేద పిల్లలకు ఇవ్వాలని సంకల్పించాడు. కాలేజీలోని మరికొందరితో కలిసి ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు అనాథ పిల్లలు అనుభవిస్తున్న దుర్భర జీవితాలను గమనించాడు అర్పణ్. ఎండిపోయిన రొట్టెలు, కారంపొడితో కడుపు నింపుకుంటున్న చిన్నారులను చూసి చలించిపోయాడు. మన దేశంలో ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ లాంటి మహమ్మారి బారినపడి చనిపోయే వారి కంటే ఆకలితో మరిణించే వారే ఎక్కువని అర్పణ్ చెబుతాడు. ప్రతీ ఏడాది దేశంలో 25 వేల ఆకలి మరణాలు సంభవిస్తుండగా.. ప్రతీ రోజు సుమారు ఐదు కోట్ల మంది కాలే కడుపుతోనే పడుకుంటున్నారని అతను చెప్పాడు. తొలిసారి 2012, జూన్ 18న స్కిప్ ఎ మీల్‌కు శ్రీకారం చుట్టాడు అర్పణ్. అలా మిగిలిన ఆహారాన్ని అన్నార్తులకు పంచిపెట్టారు. ప్రస్తుతం తుల్జాపూర్‌లోని టిస్ క్యాంపస్‌లో 300 మంది విద్యార్థులు ప్రతీ శనివారం ఒక పూట పస్తులుండి దానిని నిరుపేదలకు అందజేస్తున్నారు.

image


ఎందరికో ఆదర్శం

స్కిప్ ఎ మీల్‌ను తాను ఓ ఎన్జీవోగా మార్చాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఇదొక విద్యార్థి ఉద్యమంలా మారాలని అనుకుంటున్నానని అర్పణ్ తెలిపాడు. దేశంలోని ఇతర కాలేజీలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని అతను భావిస్తున్నాడు. ప్రస్తుతానికి చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలు ఈ స్కిప్ ఎ మీల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ‘ఈ రెండు కాలేజీల్లాగే దేశంలోని మిగతా రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ముందుకు వస్తే ఆకలిని తరమికొట్టవచ్చు. ప్రభుత్వ విధానాల కంటే కూడా విద్యార్థుల ఉద్యమమే సమర్థవంతంగా ఈ పని చేయగలదని నేను బలంగా విశ్వసిస్తాను’ అని అంటున్నాడు. వారంలో ఒక పూట పస్తులుండటం విమర్శకులకు చాలా చిన్న విషయంగానే కనిపించవచ్చేమోగానీ.. చుక్క నీటి కోసం అలమటిస్తున్న వారికి తాము అందజేసేది విందు భోజనంతో సమానమని అంటాడు. ఏమీ చేయకుండా ఉండే కంటే ఎంతోకొంత చేయడం మంచిదే అని నమ్ముతాడు అర్పన్. తాము ఆహారాన్ని పంచుతున్న సమయంలో ఎదురైన అనుభవాలనూ అతను పంచుకున్నాడు. 

‘ఓ వారం ఆహారాన్ని ఇవ్వడానికి ఓ సెంటర్ కు వెళ్లినపుడు అక్కడి పిల్లల స్పందన చూసి నా కళ్లు చెమర్చాయి. తమ కన్నా దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం తాము కూడా ఓ పూట పస్తులుంటామని.. ఆ ఆహారాన్ని వారికి అందజేస్తామని వారు చెప్పడం మా హ్రుదయాలను కదిలించింది. అంతటి కష్టంలోనూ వారు చేస్తున్న త్యాగానికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు’ అని అర్పన్ చెప్పాడు.

రెసిడెన్షియల్ కాలేజీల్లోనే కాదు.. హోటళ్లు, పెళ్లిళ్లలోనూ ఇలా పెద్ద ఎత్తున ఆహారం వ్రుథాగా పోతోంది. దీనిని కూడా పంచిపెడితే.. అటు ఎంతోమంది ఆకలి తీర్చడంతోపాటు ఆహార వృథాను అరికట్టినవాళ్లమవుతామని అర్పన్ చెబుతున్నాడు.

image


విద్య, సాధికారత సాధించే దిశగా..

అనాథాశ్రమాల్లో ఆహారం అందించడంతోపాటు ఇప్పుడు చదువుపై కూడా దృష్టిసారిస్తోంది స్కిప్ ఎ మీల్ టీమ్. ఈ పిల్లలు బాగా చదవడంతోపాటు మెరుగైన భవిష్యత్ కోసం పాటుపడాలని అర్పణ్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రాధమికంగా ఇంగ్లిష్ విద్యను ప్రమోట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇతర కార్యకలాపాలపైనా దృష్టిసారిస్తామని స్కిప్ ఎ మీల్ టీం చెబుతోంది. ఇంగ్లిష్ విద్యతో ఇబ్బంది పడే గ్రామీణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సిలబస్ రూపొందిస్తున్నట్లు అర్పణ్ తెలిపాడు. ఇక తమ లక్ష్యం కేవలం ఆహారం అందించడం మాత్రమే కాదని.. అనాథ పిల్లలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాల్లో స్థిరపడేలా చేస్తామని చెప్పాడు. తను ఇప్పుడు డిగ్రీ పూర్తి చేశాడు. ప్రతీ ఏడాది తనలాగే ఆలోచించేవారు ఎంతోమంది జత కలుస్తుండటంతో స్కిప్ ఎ మీల్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని అంటున్నాడు. భవిష్యత్తులో మరింత విస్తరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. 

ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో వారానికి 1300 మంది కడుపు నింపుతోంది స్కిప్ ఎ మీల్ టీమ్. మన దేశంలో యువతకు కొదవ లేదని.. వారు ముందుకొస్తే ఆకలిని తరమికొట్టడం పెద్ద కష్టమేమీ కాదని అర్పణ్ అంటాడు. ‘ప్రపంచంలోని చాలా దేశాల్లో వయసు పైబడుతున్నవారు ఎక్కువవుతుండగా.. మనదేశంలో సగటు వయసు 28 మాత్రమే. మన చుట్టూ ఉన్న సమస్యలకు యువత వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తే అనతికాలంలోనే వాటిని పరిష్కరించవచ్చు’ అన్నది అతని విశ్వాసం. ‘నేనెప్పుడూ గొప్ప కలలే కంటాను. వయసు పైబడినవారు, అంగవైకల్యం ఉన్నవారు, గూడు లేని వారు, తల్లిదండ్రులు లేనివారి కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం. దేశంలోని ప్రతి పిల్లవాడు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదువుకోవాలన్నదే నా కల’ అని ముగించాడు. 

ప్రతి ఒక్కరూ అర్పణ్ లానే ఆలోచిస్తే.. అతని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తే ఆకలి చావులు లేని ప్రపంచాన్ని సాధించడం అసాధ్యమేమీ కాదు. ఏమంటారు ?

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags