యూత్ లో నయా జోష్ నింపుతున్న జోష్ టాక్స్

యువతకు స్పూర్తి మంత్రంలా పనిచేస్తున్న జోష్ టాక్స్-వ్యక్తుల విజయగాథల స్పూర్తితో యువతను లక్ష్యంవైపు నడిపే ప్రయత్నం -

29th Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

లెక్చర్స్, ఎగ్జామ్స్, ఫ్రెండ్స్ తో చిట్ చాట్.. చాలా మంది స్టూడెంట్స్ టీనేజ్ లో చేసేది ఇదే. లక్ష్యంపై క్లారిటీ ఉండదు. పోటీని ఎలా తట్టుకోవాలన్న అవగాహన ఉండదు. కనీసం జీవితంలో ఒడిదొడుకులు ఎదురైతే వాటితో ఎలా పోరాడాలన్న విషయం తెలియదు. వారికి తెలియదు అనడం కన్నా ఇది చేయండి, ఇలా చేయండని చెప్పేవారుండరు అనడం కరెక్ట్. ఇలా సరైన గైడెన్స్, ప్రోత్సాహం లేక చాలా మంది యూత్ టార్గెట్ అంటూ లేక దారితప్పుతున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో స్ఫూర్తి నింపే తారక మంత్రమే జోష్ టాక్స్.

image


శోభిత్ బంగా. ఏజ్ 21, వరల్డ్ క్లాస్ సైక్లిస్ట్ కావాలన్నది అతని కల. దాన్ని నిజం చేసుకునేందుకు 15 ఏళ్ల వయసులో బెంగళూరులో అడుగుపెట్టాడు. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ సర్వెంట్ క్వార్టర్స్ లో ఉంటూ సైక్లింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. స్పెషలైజ్డ్ సంస్థ స్పాన్పర్ చేస్తున్న ప్రొఫెషనల్ సైక్లింగ్ టీంలో మెంబర్ అయ్యాడు శోభిత్. సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఓ వైపు చదువు, మరోవైపు పార్ట్ టైం జాబ్ చేశాడు. 2013లో కుటుంబ సమస్యల కారణంగా బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీకి షిఫ్ట్ అయిన శోభిత్ జీడీ గోయెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ లో బ్యాచిలర్ డిగ్రీలో చేరాడు.

“జీవితంలో ఎదగాలన్న తపనతో రోజూ 10 నుంచి 15 గంటల పాటు పని చేసేవాణ్ని. అలా కష్టపడ్డానని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా” –శోభిత్.

కాలేజ్ లో చేరాక తోటి విద్యార్థులకు తనకు ఎంతో తేడా ఉందని శోభిత్ కు అనిపించింది. తనకంటూ లక్ష్యం ఉంది.. దాన్ని సాధించాలన్న పట్టుదల ఉంది. కానీ తనచుట్టూ ఉన్నవారిలో మాత్రం అలాంటిదే లేదు. కనీసం వారిని మోటివేట్ చేసే వారు ఒక్కరూ కనిపించలేదు. సమస్య కేవలం తాను చదువుతున్న కాలేజ్ వరకే కాదు అందరు విద్యార్థులది అని అర్థమైంది. పనిని ప్రేమించాలన్న విషయాన్ని స్టూడెంట్స్ ఎప్పుడో మర్చిపోయారన్న స్టీవ్ జాబ్స్ మాటలు శోభిత్ ను ఆలోచనలో పడేశాయి. స్టూడెంట్స్ ను ఇన్ స్పైర్, మోటివేట్ చేసేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు.

అపూర్వ కలయిక

సుప్రియ పాల్, ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ స్టూడెంట్. ఓ రోజు పార్టీకి వెళ్లిన ఆమెకు అనుకోకుండా శోభిత్ పరిచయమయ్యాడు. రూంలో ఒక చివరన ఒంటరిగా నిలబడ్డ శోభిత్ ను పలకరించింది సుప్రియ. అలా మొదలైంది వారి పరిచయం.

“అతనితో మాట్లాడాలని వెళ్లా. ఇద్దరం కలిసి చాలా విషయాలు డిస్కస్ చేశాం. స్టూడెంట్స్ ఆలోచన విధానంలో మార్పు తేవాలన్న శోభిత్ ఐడియా నాకు నచ్చింది.”-సుప్రియ

తన క్లాస్ మేట్స్ అంతా సీఏలో చేరడంతో సుప్రియ అదే కోర్సును ఎంచుకుంది. అయితే సీఏ చేయడం తనవల్ల కాదన్న విషయం తొందరలోనే అర్థమైంది. తనలాగే చాలా మంది స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేక పడుతున్న ఇబ్బందుల్ని తీర్చేందుకు ఏదో చేయాలనింపింది. సుప్రియ. శోభిత్, సుప్రియ మధ్య కొన్ని నెలల పాటు ఈ విషయంపైనే చర్చించారు. చివరకు స్టార్టప్ జోష్ టాక్స్ కు పునాదులు వేశారు. జీవితంలో ఎదురైన ఒడిదొడుకులను ఎదుర్కొని విజయ శిఖరాలకు చేరుకున్న వ్యక్తుల స్ఫూర్తిగాథలు పది మందికి చెప్పి స్ఫూర్తి నింపే వేది. స్టూడెంట్స్, ఫ్రొఫెషనల్స్ ను తమ ఆశయం వైపు నడిపించేందుకు సహకరించే మంత్రమే జోష్ టాక్స్.

జోష్ టాక్స్ ప్రస్థానం

2014 ఏప్రిల్ 6. ఢిల్లీలోని దౌలా కాన్ ఎయిర్ ఫోర్స్ ఆడిటోరియంలో జోష్ టాక్ ఫస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు శోభిత్, సుప్రియ. ఇప్పటి వరకు 5 పోగ్రాంలు హోస్ట్ చేసిన వారిద్దరు- దాదాపు 50మంది విజయ గాథలు ప్రపంచానికి పరిచయం చేశారు. గూంజ్ ఫౌండర్ అన్షు గుప్తా, చెత్త ఏరుకునే స్థాయి నుంచి సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ గా ఎదిగిన వికీ రాయ్, యాసిడ్ అటాక్ బాధితురాలు సోనియా, ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్ అక్కై పద్మశాలి, వెయిటర్ నుంచి యాక్టర్ గా మారిన బొమన్ ఇరానీ, గ్రూప్ ఆన్ ఇండియా సీఈఓ అంకుర్ వారిక్కో, దుండగుల దాడిలో కాలు కోల్పోయినా ఆత్శవిశ్వాసంతో ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళా వికలాంగురాలు, వాలీబాల్ మాజీ క్రీడాకారిణి అరుణిమా సిన్హా గాథలు ఎంతో మందిని మోటివేట్ చేశాయి.

image


“దేశంలోని స్పూర్తిదాతల విజయగాథల్ని, విజయం సాధించేందుకు వారు చేసిన పోరాటం, అనుభవించిన బాధ, పట్టుదల గురించి ప్రజలకు తెలియజేయడమే మా లక్ష్యం.” -శోభిత్, సుప్రియ

ఎన్నో సవాళ్లు

జోష్ టాక్స్ లో తమ అనుభవాలు పంచుకునేలా వక్తల్ని ఒప్పించేందుకు శోభిత్, సుప్రియ చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా వక్తల వెంట పడి మరీ వారిని ఒప్పించేవారు. టీనేజ్ లోఉన్న ఈ ఇద్దరి పట్టుదల చూసి చాలా మంది ముందుకొచ్చారు.

“మేం నమ్మిన విషయాన్ని ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పడమన్నది పెద్ద సవాల్ లా అనిపించింది. విజేతల పట్టుదల, సవాళ్లను ఎదుర్కొన్న తీరు, అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొన్నారన్న విషయాలు తెలిపే వేదికగా జోష్ టాక్స్ మారాలని కోరుకున్నాం.”-సుప్రియ
“రెండేళ్లలోపే కోరుకున్న మార్పు సాధించగలిగాం. జోష్ టాక్స్ ద్వారా ఎంతో మంది స్పూర్తిగాథలతో పాటు వారు ఎదుర్కున్న సవాళ్లను, విజయానికి ఎలా చేరువయ్యారన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాం.”-శోభిత్
image


తెర వెనుక కష్టాలు

చదవు వదిలేసి జోష్ టాక్స్ బాధ్యతల్ని చూసుకుంటానన్న కూతురి నిర్ణయం సుప్రియ పేరెంట్స్ లో ఆందోళన కలిగించింది. బిజినెస్ మేన్ అయిన సుప్రియ తండ్రి ఆమెను సీఏగా చూడాలన్న కల కలగానే మిగిలిపోతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా ఓపిక పట్టారు. మొదటి ఈవెంట్ తర్వాత కూతురు తనంతట తానే నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న నమ్మకంతో ఓకే చెప్పారు.

“ ఫస్ట్ ప్రోగ్రాం రోజున మా నాన్న మొదటి వరుసలో కూర్చొన్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. నేను, శోభిత్ ఏం సాధించామో కళ్లారా చూసి ఎంతో గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకున్నారు. జోష్ టాక్స్ ఐడియాను ప్రోత్సాహిస్తున్నారు.”- సుప్రియ

జోష్ టాక్స్ కు అవసరమైన సీడ్ ఫండింగ్ కోసం శోభిత్ తన సైకిల్ ను వదలుకోవాల్సి వచ్చింది. తానెంతో కష్టపడి కొనుక్కున్న సైకిల్ ను ఎలాంటి సంశయం లేకుండా అమ్మేశాడు.

“ప్రొఫెషనల్ సైకిల్ ను అమ్మేయడాన్ని త్యాగం అనుకోను. నేను చేయగలిగింది చేశాను. ఇది నాకెంతో సంతోషాన్నిచ్చింది.”- శోభిత్

జోష్ టాక్స్ స్పాన్సర్ షిప్ కోసం శోభిత్, సుప్రియ పడని కష్టమంటూలేదు. 20ఏళ్లు కూడా లేని ఇద్దరు పిల్లల్ని నమ్మి పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.

“ఒకప్పుడు స్పాన్సర్ షిప్ కోసం ఆఫీసుల బయట గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ కాలంతో పాటు పరిస్థితిలో మార్పు వచ్చింది. మొదటి ఈవెంట్ కోసం స్పాన్సర్ ను ఒప్పించడానికి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పాత ఈవెంట్లకు సంబంధించిన వీడియోలు చూపించి ఈజీగానే స్పాన్సర్ షిప్ పొందగలుగుతున్నాం. ఎంతో మంది వ్యక్తులు మాకు సాయం చేస్తున్నారు. స్పాన్సర్లకు కూడా మాపై నమ్మకం కుదిరింది. పెట్టుబడి పెట్టిన వారికి అందుకు తగ్గ ప్రతిఫలం వచ్చేలా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం.”- సుప్రియ

టెక్నాలజీ, ఎంటర్ టైన్ మెంట్, డిజైన్ ఐడియాల గురించి చెప్పే TEDకు జోష్ టాక్స్ కు ఎంతో తేడా ఉందంటోంది సుప్రియ. జీవితంలో ఎంతో కొంత విజయం సాధించిన వారికి TED ఉపయోగపడుతుంది. కానీ జోష్ టాక్స్ అలా కాదు. వ్యక్తుల సొంత అనుభవాలు, విజయ గాథల ద్వారా స్పూర్తి కలిగించడమే తమ ఉద్దేశ్యం అంటారామె. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండే 16 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్స్ నుంచి 30 ఏళ్ల యంగ్ ప్రొఫెషనల్స్ తమ టార్గెట్ గ్రూప్ అని వారిని లక్ష్యంవైపు నడిపించడమే తమ పని అని చెబుతారు.

“యూత్ కు సులువుగా అర్థమయ్యేలా, ఏదో చేసేయాలన్న వారి భావోద్వేగాలను ప్రభావితం చేసేలా మా కంటెంట్ ఉంటుంది. ఈ ఏడాది నుంచి మరికొన్ని కొత్త ప్రోగ్రామ్స్ చేపట్టాలని నిర్ణయించుకున్నాం. అవి TEDకు, జోష్ టాక్స్ కు మధ్య ఉన్న బేధాన్ని మరింత స్పష్టం చేస్తాయి.”-శోభిత్.

ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న జోష్ టాక్స్ త్వరలోనే పానిపట్, మండి, ధర్మశాల, చండీగఢ్ లాంటి టైర్ 2, టైర్ 3 సిటీల్లోనూ సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. యూత్ ను, నిపుణులను ఒకచోట సమావేశపరిచి యువత అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు అనుమానాలు నివృత్తి చేసేందుకు సిటీ మీటప్స్ కు ప్లాన్ చేస్తున్నారు.

image


జోష్ యూత్

జోష్ టాక్స్ ప్రేరణతో జోష్ యూత్ పేరుతో ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ తమ కాలేజ్ క్యాంపస్ లలో ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, స్పాన్సర్ షిప్, టీం బిల్డింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. స్టూడెంట్స్, స్ఫూర్తిదాతల మధ్య వారధిగా నిలిచేలా యాప్ డెవలప్ చేయాలన్నది జోష్ టాక్స్ ఆలోచన.

పట్టుదల ఉంటే ప్రపంచాన్నే మార్చేయొచ్చు. నమ్మకం మనిషిని నిలబెడుతుంది. అసాధ్యమనుకున్న పనుల్ని సుసాధ్యం చేస్తుంది. ఇదే స్పూర్తితో విజయాలు సాధించిన వారి ప్రేరణతో మరికొందరిని లక్ష్యంవైపు నడిపించాలని.. అలాంటి వారందరి సాయంతో ప్రపంచాన్నే మార్చేయాలనుకుంటున్న శోభిత్ ఆశయం నిజమవ్వాలని యువర్ స్టోరీ మనస్పూర్తిగా కోరుకుంటోంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding Course, where you also get a chance to pitch your business plan to top investors. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India