సంకలనాలు
Telugu

ల్యాబ్ అసిస్టెంట్ నుంచి గ్లోబల్ ప్రెసిడెంట్... అమలాపురం కుర్రాడి సూపర్ సక్సెస్ స్టోరీ

Nagendra sai
5th Dec 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ఆ అబ్బాయిది అమలాపురం. తండ్రి పేరు బివి నర్సింహరాజు. అప్పటికే ఆ ఊళ్లో బాగా పేరుమోసిన డాక్టర్, సామాజిక వేత్త. ఉచితంగా అక్కడి ప్రజలకు హోమియో వైద్యం చేస్తూ.. అందరితో కలిసిపోయిన కుటుంబమది. అప్పట్లో నర్సింహరాజు అంటే.. ఆ ఊరి జనాలకు దేవుడితో సమానం. మరి అలాంటి గొప్పవాళ్ల పిల్లలు.. సామాన్యంగానే.. అక్కడి వాతావరణాన్ని చూసి ప్రభావితమవుతారు. మన కథలో హీరో... రాజు భూపతి కూడా ఇందుకు ఏమీ మినహాయింపు కాదు. తండ్రి లాంటి పేరుప్రఖ్యాతలు మనమూ సంపాదించుకోవాలని అనుకున్నాడు. డాక్టర్‌గా స్థిరపడితేనే ఆ ఖ్యాతి సాధ్యపడుతుందని నమ్మాడు. టెన్త్ క్లాస్ వరకూ నెంబర్ వన్ స్టూడెంట్. ఇంటర్మీడియెట్‌లో బైపిసిలో చేరాడు. ఇంతవరకూ ఆల్ హ్యాపీస్. అయితే స్టోరీ అంతా సాఫీగా సాగిపోతే ట్విస్ట్ ఏముంటుంది... ? ఇక్కడ అసలు సినిమా మొదలైంది. ఇంటర్‌లో చేరాక మనోడికి చదువు మీద ఇంట్రస్ట్ తగ్గింది. బైపిసి భారంగా మారింది. ఫెయిల్ అయితేనేమో... అదే జరిగితే- రాజు గారి అబ్బాయి ఇంటర్‌ తప్పాడనే అపవాదు మోయాలి. అలా అని ఎందుకో చదువు వైపు మనసు వెళ్లడం లేదు. ఈ సందిగ్ధంలో అలా ఇంటర్ అయిందనిపించేశాడు. ఎంసెట్ ర్యాంక్ ఆల్మోస్ట్ ఫోన్ నెంబరంత వచ్చింది. ఆ ర్యాంకుకు కనీసం బిహెచ్ఎంఎస్ సీట్ అయినా వస్తుందో రాదో అని లాస్ట్ మినిట్ వరకూ టెన్షన్ టెన్షన్. ఇక ఇలా కాదని.. హుబ్లీ వెళ్లి మేనేజ్‌మెంట్ కోటాలో బిహెచ్ఎంఎస్ చేయాలని బలంగా పట్టుబట్టారు చిన్న రాజా వారు. కొడుకు పట్టుదల చూడలేక అప్పటికి ఓకే అన్న తండ్రి.. తీరా డబ్బుకట్టి చేరే సమయానికి వద్దనేశారు. చేసేది లేక బిక్కమొహం వేసుకుని హుబ్లీ నుంచి అమలాపురానికి వచ్చేశారు. మళ్లీ రెండో యుద్ధం. ఎంసెట్‌కు మళ్లీ ప్రిపరేషన్. అయిష్టంగానే సాగిన ఆ చదువులో ఈసారి ఆ ర్యాంకు మరింత బరువెక్కింది. చదువు మానేద్దామనుకుని కొద్ది రోజులు గ్యాప్ కూడా తీసుకున్నాడు.

image


ఇక ఇవన్నీ కాదనుకుని కాకినాడకు మకాం మార్చేశాడు. అక్కడ బిఎస్‌సిలో చేరిపోయాడు. ఊరికి దూరంగా ఉన్న వాతావరణానికి తోడు ఉడుకు రక్తం... పైగా శివ లాంటి సినిమాల ఇన్స్‌పిరేషన్. దీంతో కాలేజీ పాలిటిక్స్‌లో తెలియకుండానే దూరిపోయి ఓ చిన్నపాటి లీడర్ అయిపోయాడు. ఇక్కడ తనకు తెలియకుండానే లీడర్షిప్ స్కిల్స్ మెల్లిగా వంటబడుతూ వచ్చాయి. ఆశ్చర్యం ఏంటంటే.. మూడేళ్ల సబ్జెక్ట్స్ అన్నీ ఒకేసారి క్లియర్ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా బొటాబొటీ మార్కులతో.

ఇక్కడ ఈ స్టోరీ ఇప్పుడు జిల్లాలు, పట్టణాలు దాటి ఏకంగా రాష్ట్రాలు మారింది. తల్లిదండ్రుల బలవంతంతో ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేందుకు భోపాల్ పయనమయ్యాడు. అక్కడా అదే రాజకీయాల వ్యవహారం. ఇక్కడ తత్వం బోధపడడంతో మంచి మార్కులతోనే పాసయ్యాడు భూపతిరాజు.

హైదరాబాద్‌లో తెలిసొచ్చింది తన విలువేంటో !

ఇక చదువైపోయింది. ఏదో ఒకటి చేయాలి. అప్పటికే అన్న విజువల్ సాఫ్ట్‌లో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లి ఏదో ఒకటి చేద్దాం అనుకుని 1998లో భాగ్యనగరంలో కాలుమోపాడు. ఐటివైపు వెళ్దామని ఓ మూడు నెలల పాటు సి, సి++ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ లోపు చిన్ననాటి ఫ్యామిలీ ఫ్రెండ్ గిరి.. విదేశాల నుంచి తిరిగివచ్చి ఓ కంపెనీ పెడదామని నిర్ణయించుకున్నారు. సచి సాఫ్ట్ అనే ఆ కంపెనీలో కేవలం రూ.1000కు ల్యాబ్ అసిస్టెంట్‌ ఉద్యోగానికి కుదిరాడు. అప్పటికే తన ఊళ్లో ఓ చిన్నపాటి పిల్ల జమీందార్‌లా ఫీలైనోడు.. ఇక్కడ వెయ్యి రూపాయల ఉద్యోగానికి చేరడమనేది జీవితంలో ఓ పెద్ద మొట్టమొదటి కాంప్రమైజే. అప్పటివరకూ తన యమహా బైక్ పెట్రోల్ ఖర్చే రూ.3 వేలు పైన ఉండేది.

ఉద్యోగంలో చేరనైతే చేరాడు కానీ.. లోలోపల ఏదో అలజడి. బిటెక్ అప్పుడే పాస్ అయివచ్చిన వాళ్లకు... ఎక్కువ జీతం ఇవ్వడం, అప్పటికే పిజి చేసి కంపెనీలో పనిచేస్తున్న తనకి.. తక్కువ జీతం ఇవ్వడం బాధ కలిగించింది. ఇక్కడ డిగ్రీ ప్రధానమా.. లేక టాలెంట్ ముఖ్యమా.. అనే రెండు ప్రశ్నలూ మెదడును తొలచివేయడం మొదలైంది. కానీ వాళ్లకే ఎందుకు ఎక్కువ జీతం ఇస్తున్నారు ? నా కంటే ఎక్కువ గౌరవాన్ని ఎలా అందుకుంటున్నారు ? అనే ఆ రెండు ప్రశ్నలు మెదడును తొలిచేయడం మొదలుపెట్టాయి. ఛీ.. అయితే మనం ఎందుకూ పనికిరామా ? అనే ఆక్రోషం కట్టలుతెచ్చుకుంది. అలానే రాత్రింబవళ్లూ కష్టపడుతూ.. సబ్జెక్ట్‌పై పట్టుపెంచుకున్నారు. కుర్రాడిలో ఏదో మార్పు కనిపించిందని భావించిన మేనేజ్‌మెంట్ ఓ చిన్న ప్రాజెక్ట్‌లో అవకాశం కల్పించింది. ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని మనోడు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. అప్పటికే బాగా వంటబట్టిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు బాగా పనికివచ్చాయి. ప్రాజెక్ట్ అనుకున్న సమయం కంటే ముందుగానే క్లైంట్లకు చేరి ప్రశంసలు అందుకుంది. దీంతో కాస్త అగౌరవంగా... చిన్నతనంగా చూసిన వాళ్లతో సరిసమానంతో జీతం అందుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే తాను ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఫీలయ్యాడు. డిగ్రీలతో ఉన్న వ్యత్యాసాన్ని స్కిల్‌తో వాటిని అధిగమించాడు.

image


అదే మొదటి మెట్టు !

తనపై తనకు నమ్మకం పెరిగింది. తానూ ఏదో ఒకటి చేయగలననే ధైర్యం పూర్తిస్థాయిలో కలిగింది. టీంలో ఓ మామూలు మెంబర్ స్థాయి నుంచి రెండేళ్లలోనే మేజర్ లీడ్‌గా ఎదిగారు. పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేయాలని చెన్నై నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇదే సమయంలో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆకాశాన్ని తాకేవి. తనలా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్లలో స్ఫూర్తి నింపేందుకు బ్లాగ్స్ రాయడం మొదలుపెట్టారు. ఇంగ్లిష్ మీడియం నుంచి వచ్చినంత మాత్రాన వాళ్లేమీ ఎక్కడి నుంచో ఊడిపడలేదని చెబ్తూ.. గ్రామీణ విద్యార్థుల్లో ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపడం మొదలుపెట్టారు. భూమిని చీల్చుకుని విత్తు తలెత్తుకుంటున్న దశలో ఉండగానే.. 1999లో తండ్రి మరణవార్త కుంగదీసింది.

2001లో యాప్ ల్యాబ్స్‌లో చేరారు. చిన్న కంపెనీ నుంచి పెద్దదానికి వెళ్లడంతో అక్కడ నలుగురిలో ఒకడిగా ఉండాల్సి వచ్చింది. కష్టపడి పనిచేస్తున్నా.. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమయ్యేవారు. పెద్ద సంస్థలోకి వెళ్లేసరికి ఏదో తెలియని ఆత్మన్యూనతా భావం నానాటికీ కుంగదీసేసేది. వీటికి తోడు బిడియం, సిగ్గు కాంప్లిమెంటరీ ఐటమ్స్. కాన్ఫిడెన్స్ అంటూ లేకపోతే.. ఎంత స్కిల్ ఉన్నా, దమ్మున్నా.. ఎదగడం కష్టమనే పాయింట్ జీవితకాలానికి సరిపడ అనుభవాన్ని ఇక్కడే ఇచ్చింది. ఈ లోపు ఓ ప్రాజెక్టుపై అమెరికా వెళ్లారు. దేశాన్ని వదిలిపెట్టి ఉండలేక, తల్లికి దూరంగా బతకలేక ఏదో ఒక కారణం చెప్పి ఆరు నెలలకే ఇండియా వచ్చేశారు. మేనేజ్‌మెంట్ మళ్లీ మరో బాధ్యత చేపట్టేందుకు యూకె పంపింది. అక్కడా ఆరు నెలలే ఉద్యోగం.

వీటన్నింటితో విసిగిపోయి 2007లో ఉద్యోగాన్ని మానేద్దాం అనుకునే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే మ్యూజిక్‌పై అభిమానం. 2010లో ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ కూడా క్రియేట్ చేశారు. దీన్ని రిలీజ్ చేద్దామనే ఉత్సాహంలో ఉండగానే మరో అతిపెద్ద షాక్ తగిలింది. అప్పటికే తండ్రి బాధ నుంచి తేరుకుంటున్న సమయంలో తల్లి కూడా ఈ లోకాలను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్‌ నుంచి తేరుకోవడానికి మళ్లీ మ్యూజిక్‌పైనే మమకారం పెంచుకుని ఆ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఇక ఎప్పుడూ అమెరికా వెళ్లకూడదు అని ఒట్టేసి నిర్ణయించుకుని రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ అమెరికా అవకాశం తలుపుతట్టింది. ఈ సారి మరింత పెద్ద బాధ్యతలు భుజాలపై పడ్డాయి. ఈ సారి 2010లో మళ్లీ యూఎస్‌లో రీఎంట్రీ. అయితే ఈ సారి రెట్టించిన ఉత్సాహం. కంపెనీ ఆశించిన స్థాయి కంటే పదిరెట్లు ఎక్కువగానే నిరూపించి చూపించారు. ఈ సక్సెస్‌ను ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో మరో ట్విస్ట్. అదేంటంటే.. ఇక ఇండియాలో నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో.. యూఎస్‌లో సెటిల్ అయిపోదామని నిర్ణయించుకున్నారు. జీతం కూడా కోట్ల రూపాయల్లోకి మారింది. ఓ లేక్ సైడ్ బంగళా తీసుకుని సరిగ్గా అందులో చేరేరోజు ఇండియాలోని మేనేజ్‌మెంట్ నుంచి ఫోన్ కాల్. ఈ సారి మరింత పెద్ద బాధ్యతలను నిర్వర్తించడానికి భారత్ రావాల్సిందిగా పిలుపు. అప్పటిదాకా నార్త్ అమెరికాకే పరిమితమైన ఉద్యోగ బాధ్యతలు ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమ్‌ను మేనేజ్‌ చేయాల్సి వచ్చింది.

ల్యాబ్ అసిస్టెంట్ నుంచి గ్లోబల్ డెలివరీ హెడ్ స్థాయికి

2012 సమయంలో యాప్ ల్యాబ్స్‌ను సిఎస్‌సి కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ సంస్థలో దాదాపు 4500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1998లో ల్యాబ్ అసిస్టెంట్‌గా మొదలైన ప్రస్థానం 14 ఏళ్లు తిరిగే సరికి గ్లోబల్ లీడర్ స్థాయికి చేరింది. దీంతో మళ్లీ ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. 35 ఏళ్ల వయస్సులో అంత పెద్ద పోస్ట్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. కనీసం 30 ఏళ్ల అనుభవం ఉంటే తప్ప అలాంటి పోస్టులకు ఎవరినీ తీసుకోని కంపెనీ రాజును ఉన్నత సింహాసనంపై కూర్చోబెట్టింది. ఆ క్షణం అతడి కళ్లలో ఆనందం చూడడానికి తల్లిదండ్రులు భూమిపై లేరు. అల్లరిగా తిరుగుతున్న కొడుకు ఆకాశానికి నిచ్చెనవేసేంత పెద్ద ఉద్యోగాన్ని పొందుతాడని వాళ్లు ఊహించి కూడా ఉండరు.

ఇక ఈ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరిపోయారు. చిన్న వయస్సులో పెద్ద బాధ్యతలు మోయడంలో మెల్లిగా ఏదో తెలియని పొగరు వస్తోందనిపించింది. ఇక ఎంత చేసినా ఈ ఉద్యోగంలో అదే ఫైనల్ పాయింట్. అంతకు మించి గ్రోత్ కూడా ఏమీ ఉండదని అర్థమైంది. ఇలానే కొనసాగితే.. అధికారం వల్ల పొగరు పెరిగి, తలబిరుసుతనం వస్తుందేమోననే ఆందోళన మొదలైంది. బాధ్యత తెచ్చిన బరువు భారమైంది. కొద్దికాలం తర్వాత ఇక ఉద్యోగంపై మొహం మొత్తేసింది. ఎంతకాలం చేసినా.. ఎవరో కింద పనిచేయడమే కదా.. అనే భావన వచ్చింది. ఒన్ ఫైన్ మార్నింగ్.. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేస్తున్నట్టు మేనేజ్‌మెంట్‌కు సమాచారం. వాళ్లు షాక్ నుంచి తేరుకునే లోపే బయటకు వచ్చేశారు. ఈ లోపు తన జీవితంలో పెద్ద మార్గదర్శిగా ఉన్న తన తండ్రి రుణం ఏదో విధంగా కొంతైనా తీర్చుకోవాలని అనుకున్నారు. ఆయన జీవితాన్ని విశ్లేషిస్తూ.. 'DIVINE SHOWERS' అనే పుస్తకాన్ని రచించారు.

image


ప్రపంచ హెడ్ ... ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేశాడు

ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తన కజిన్‌ సందీప్ వర్మతో కలిసి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు రాజు. 2013 జూన్‌లో హలో కర్రీ పేరుతో ఓ అత్యాధునిక హోండెలివరీ సంస్థగా మొదలైంది ఈ స్టార్టప్. తన కెరీర్‌కు మార్గదర్శకంగా నిలబడిన ఏంజిల్ ఇన్వెస్టర్ శశిరెడ్డి నుంచి వివిధ దశల్లో రూ.9 కోట్ల సీడ్ ఫండింగ్ కూడా వచ్చింది. ఫుడ్ ఇండస్ట్రీలో ఓ విప్లవం తీసుకురావాలని అనుకున్నారు. ఓ గ్యారేజీలో మొదలైన సంస్థ మెల్లిగా అడుగులు వేసింది. శుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని... అద్భుతమైన ప్యాకింగ్‌తో ఆర్డర్ చేసిన అరగంటలోపు ఇంటికి డెలివర్ చేసే కాన్సెప్ట్‌తో ప్రారంభమైందే హలో కర్రీ. రెండేళ్లు తిరగకుండానే 30 యూనిట్లలో ఇప్పుడు హలో కర్రీ కొనసాగుతోంది. రెండు కంపెనీలను కొనుగోలు చేసి విస్తరణలో దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇప్పుడు హలో కర్రీకి అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రాజు, సందీప్. ప్రస్తుతం ఉన్న 30 ఔట్‌లెట్లను 300కి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పుడు రూ.12 కోట్ల రెవెన్యూ సాధిస్తున్న సంస్థను ఏడాదిలోగా రూ.100 కోట్లకు పెంచడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. చిపోట్లే, మెక్‌డోనాల్డ్స్‌లా ఇండియా నుంచి హలో కర్రీ అనే బ్రాండ్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా విస్తరించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు రాజు.

స్టార్టప్స్‌కు సలహా ఏంటంటే..

  • ఏదైనా వ్యాపారం మొదలుపెట్టగానే.. అమ్మేయాలని చూడొద్దు.
  • కాపీ, పేస్ట్ మోడల్ వర్కవుట్ కాదు.
  • దీర్ఘకాలం వ్యాపారం చేయడానికి సిద్ధపడితేనే అందులోకి దిగండి.
  • ఇన్వెస్టర్ డబ్బుల కోసం అత్యాశతో పరిగెత్తకండి.
  • మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఏం తెలియదో.. దాన్ని తెలుసుకోండి.
  • మీరు ఎందులో బలహీనంగా ఉన్నారో మీకే తెలుసు. దాన్ని అధిగమించాలంటే ఆ పరిస్థితులను పదే పదే ఎదుర్కోవడమే అంటారు రాజు.

చివరగా..

రాజు భూపతి సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే.. ఓ చిన్న గ్రామంలో తెలుగు మీడియం స్థాయి నుంచి వచ్చి ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఎంఎస్‌సి చదివి ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి కూడా సిద్ధపడడం మొదటి విషయమైతే.. తన లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం రెండో టర్నింగ్ పాయింట్. ఉద్యోగాలు రెండు, మూడు సార్లు మానేసిన తర్వాత కూడా కంపెనీలు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికాయంటే కారణం అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్, లీడర్షప్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్. మనకంటే తోపు ఎవరూలేరిక్కడ అనే సింగిల్ పాయింట్‌ను బలంగా మైండ్‌లో ఫిక్స్ చేసుకోవడం వల్లే ప్రపంచ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేసుకుని ఓ ఫుడ్ స్టార్టప్ పెట్టడం వెనుక కూడా అదే ధైర్యం. రాజుతో మాట్లాడుతున్నంత సేపూ.. ఏదో పాజిటివ్ ఎనర్జీ మనల్ని కమ్మేస్తుంది. పని ఎంత పెద్దదైతే ఏంటి.. మనం చేయలేమా అనే కాన్ఫిడెన్స్ తెలియకుండానే కలుగుతుంది. ఈ స్పిరిటే అతనని నడిపిస్తోంది.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags