సంకలనాలు
Telugu

పేదలపాలిట దేవుడు ఈ మెడిసిన్ బాబా

team ys telugu
28th Oct 2016
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share


ఓంకార్ నాథ్ శర్మ. ఢిల్లీలో సవాలక్ష పేర్లలో ఇదొక పేరు. అలా అడిగితే ఎవరికీ తెలియదు కూడా. అదే మెడిసిన్ బాబా అని అనండి. ఆగకుండా అతని గురించి వివరంగా చెప్తారు. ఓంకార్‌ నాథ్ శర్మ ఎందుకంత పాపులర్ అయ్యాడు? యావత్ ఢిల్లీయే అతని గురించి ఎందుకు గొప్పగా చెప్తుంది?

సాధారణంగా 80 ఏళ్లు మీదపడితే కృష్ణా రామా అంటూ మూలకి పడిపోతారు. సాయం పడితే తప్ప.. రోజువారీ పనులు సాగవు. అలాంటి వయసులో ఓంకార్ నాథ్‌ శర్మ ఒక గొప్ప సమాజసేవకు నడుం కట్టాడు.

ఈ రోజుల్లో పేదోడికి ఏదైనా జబ్బు చేస్తే అంతే సంగతులు! డాక్టర్లయినా, ఆసుపత్రులైనా శ్రీమంతులకే సేవలు చేస్తారు! ఈ వివక్ష ఓంకార్ నాథ్ శర్మను ఈ విషయం తీవ్రంగా కలచివేసింది. కనీసం ఒక మాత్ర కూడా కొనలేని నిస్సహాయులను చూసి కదిలిపోయాడు. వారికి అలాంటి కష్టం రావొద్దని భావించాడు. ఇంటింటికీ తిరిగి, వాళ్లు వాడకుండా ఎక్స్‌ పైర్ అవని టాబ్లెట్లను, టానిక్కులను సేకరించే పనిలో పడ్డాడు. గత ఏడేళ్లుగా పేదవాళ్లకు మందుగోలీలు ఉచితంగా ఇస్తున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని కైలాష్‌ హాస్పిటల్ లో బ్లడ్ బ్యాక్ టెక్నీషియన్ గా పని చేసి రిటైరయ్యాడు. 2008లో జరిగిన ఒక ఘటన ఆయన ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఒకసారి తూర్పు ఢిల్లీలో మెట్రో పనులు జరుగుతుంటే.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోయింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఏం లాభం? సరైన వైద్యం లేదక్కడ! పేదోడి విషయంలో ఇంత అన్యాయమా అని ఆవేదన చెందాడు. వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని ఆరోజే నిర్ణయించుకున్నాడు. అలా మెడిసిన్ బాబాగా అవతారమెత్తాడు.

image


మెడిసిన్ బాబా అడిగితే టాబ్లెట్లు లేవు అని ఎవరూ అనరు. వాటి అవసరం ఉన్నా సరే, వేరే తెచ్చుకుంటాంలే అని ఉన్నవన్నీ అతని చేతిలో మందులు పెడతారు. ఆఖరికి టించర్ అయోడిన్ అయినా సరే. ఒకవిధంగా చెప్పాలంటే ఓంకార్ తమ వీధిలో కనిపించడమే మహాభాగ్యం అనుకుంటారంతా. ఎవరూ చేయని గొప్పపని ఈ మెడిసిన్ బాబా చేస్తున్నాడని, అతనికి సాయ పడుతున్నందుకు గర్వంగా కూడా ఉందని ప్రతీ ఒక్కరూ చెప్తుంటారు. ధనికులు ఉండే ఏరియాల కంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, గవర్నమెంటు కాలనీవాసులే తన ఆశయానికి మద్దతు పలుకుతుంటారట. సంపన్నులు ఉండే కాలనీల్లో అతి తక్కువ మంది సాయం చేస్తుంటారని ఓంకార్ నాథ్ అంటున్నారు.

ఓంకార్ నాథ్‌ చేసే పని అంత ఈజీగా అయ్యేది కాదు. ఎన్నో అవాంతరాలు. అంతెందుకు అతను ఉంటున్న ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నదే. భార్య, కొడుకు ఉన్నారు. విషాదం ఏంటంటే 45 ఏళ్ల తన కుమారుడు మెంటల్లీ ఛాలెంజ్డ్‌ పర్సన్.

నెలకు ఎంత లేదన్నా 4 నుంచి 6 లక్షల విలువైన మెడిసిన్స్ పంచుతాడు. ఆనోటా ఈనోటా విని మీడియా ఓంకార్ నాథ్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలా మెడిసిన్ బాబాగా పాపులర్ అయ్యాడు. జనం కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలేజీలు, గుళ్ల దగ్గర మెడిసిన్ కలెక్షన్ బాక్సులు పెట్టి మందులు సేకరిస్తున్నారు. ఓంకార్ నాథ్ ఇప్పుడు ఢిల్లీలో కనిపించే దేవుడు. మూర్తీభవించిన కారుణ్యంతో సగర్వంగా తలెత్తుకుని నడుస్తున్న దయామయుడు.   

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags