సంకలనాలు
Telugu

ఎన్ఆర్ఐలకు ఎంటర్‌టైన్‌మెంట్ ఈయన చలువే !

Nagendra sai
1st Jan 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

అతనిది కరీంనగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. విద్యాభ్యాసం అలాంటి ఊళ్లోనే సాగింది. అక్కడ మొదలైన ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగింది. ఇప్పుడా ఆ వ్యక్తి రూపొందించిన ఓ వ్యవస్థ ఎన్‌ఆర్‌ఐలకు భారత్‌ను దగ్గర చేస్తోంది. మరో రకంగా చెప్పాలంటే విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఇతను రూపొందించిన వ్యవస్థ లేకపోతే వినోదం లేదు.. అంటే అతిశయోక్తి కాదు. ఆయనే పాడి ఉదయనందన్ రెడ్డి. అతని ఆలోచనల నుంచి పుట్టిందే యప్ టీవీ.

భారత్‌లో ఉంటున్న వాళ్లకు టీవీతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సీరియళ్లు, సినిమాలు, రియాల్టీ షోస్.. ఇలా ఒక్కటేమిటి.. బుల్లిపెట్టె లేకపోతే బతకు భారమైపోయిన రోజులివి. అలాంటిది విదేశాలకు వెళ్తే మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ పూర్తిగా మిస్ కావాల్సిందే. మనలా ఇన్ని ఛానల్స్ అక్కడ రావు.. ఒకవేళ ఉన్నా.. ఒకటో రెండో. ఇదే ఉదయ్‌కి ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియాలా అనిపించింది. అలా మొదలైన ఆలోచనే ఇప్పుడు వివిధ దేశాలకు పాకి.. లక్షలాది మందికి ఆనందాన్ని పంచుతోంది.

image


నార్మల్ ఫ్యామిలీ టు నార్టెల్ !!

ఉదయ్ రెడ్డి కుటుంబ నేపధ్యమంతా గ్రామీణ ప్రాంతంలోనే సాగింది. తాత, తండ్రులది వ్యవసాయ కుటుంబం. అందరికంటే ముఖ్యంగా తాత పాడి సుధాకర్ రెడ్డి.. ఉదయ్‌కి రోల్‌మోడల్. వ్యవసాయంలోనే కాదు.. ఊరికి సాయం చేయడంలో కూడా ఆయన తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. గ్రామంలో ఆస్పత్రులు, స్కూళ్లే కాదు ప్రభుత్వ ఆఫీసులు నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని తానే ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపన చిన్ననాటి నుంచి ఉదయ్‌లో ఉంది. కలెక్టర్ అయితే.. తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావించారు. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా మద్దతునిస్తూ వచ్చారు.

అయితే ఊళ్లో ఉంటే... ఇది సాధ్యపడదని ఢిల్లీకి పయనమయ్యారు. ఆనర్స్ గ్రాడ్యుయేషన్ కోసం అక్కడి ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో చేరారు. గ్రామీణ స్థాయి నుంచి ఒకేసారి ఢిల్లీ వెళ్లడంతో మొదటి ఏడాది కాస్త ఇబ్బందిగానే సాగింది. సబ్జెక్ట్ ఉన్నా.. కాన్ఫిడెన్స్ లేకపోవడంతో.. బెరుకుగా ఉండేది. తర్వాత మెల్లిగా సర్దుకుని ఆరితేరాడు. ఈ లోగా గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో సీమెన్స్ నుంచి బంఫర్ ఆఫర్ వచ్చింది. కానీ ఇదే సమయంలో తాను ఢిల్లీ వచ్చింది సివిల్ సర్వీసెస్ కోసమనే విషయం కూడా మనసును వెనక్కి లాగుతోంది. కుటుంబ సభ్యులు కూడా సివిల్స్ వైపే ఎక్కువగా పట్టుదలగా ఉన్నారు. కానీ ఆఫర్ చాలా బాగుండడం, అప్పుడప్పుడే టెలికాం బూమ్ కూడా స్టార్ట్ కావడంతో ఇక ఆలస్యం చేయకుండా 1993లో సీమెన్స్‌లో చేరిపోయారు ఉదయ్. అదే అతని జీవితంలో పెనుమార్పులకు కారణమైంది.

ఉద్యోగంలో భాగంగా 50కి పైగా దేశాల్లో పర్యటించారు ఉదయ్. అక్కడి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులపై ఎంతో అవగాహన వచ్చింది. వృత్తిలో వృద్ధికి దోహదపడేందుకు సీమెన్స్ నుంచి మరో ప్రముఖ సంస్థ నార్టెల్‌ నెట్వర్స్‌లోకి మారారు. అక్కడ సీనియర్ మేనేజర్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. నార్టెల్‌లో పనిచేసిన 11 ఏళ్ల కాలం అతన్ని ఓ సక్సెస్‌ఫుల్ ఉద్యోగిగా మార్చింది. కరీబియన్, లాటిన్ అమెరికా మార్కెట్లను లీడ్ చేసి కంపెనీకి 100 మిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించిపెట్టారు. సేల్స్ విభాగంలో రెండేళ్ల పాటు టాప్ ఎంప్లాయ్‌గా నార్టెల్‌లో పేరుతెచ్చుకున్నారు.

మొత్తం 14 ఏళ్ల పాటు టెలికాం విభాగంలో అనుభవం సంపాదించిన తర్వాత మెల్లిగా తానూ ఓ ఆంట్రప్రెన్యూర్ కావాలనే కోరిక మొదలైంది. అయితే అప్పటికే కోట్లలో జీతం.. ఉన్నతోద్యోగం.. కానీ రిస్క్ తీసుకోవాలనిపించింది. ఉద్యోగంలో భాగంగా 50 దేశాల్లో తిరిగినప్పుడు.. తనకి తట్టిన బిజినెస్ ఐడియాను ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు తమ దేశ ప్రాంతీయ కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వద్దని వారించారు. అయినా సరే ధైర్యం చేశారు. తన దగ్గర దాచుకున్న డబ్బు, కుటుంబ సభ్యుల నుంచి అప్పు తీసుకుని 2006లో యప్ టీవీ మొదలుపెట్టారు. అయితే ఆడంబరాలకు దూరంగా ఓ ఆఫీసులో నాలుగైదు కుర్చీలున్న ఓ టేబుల్ తీసుకుని పనిమొదలుపెట్టారు. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో బిజినెస్ నడిపించారు.

image


ఇంటర్నెట్ టీవీ సేవలు అందించడానికి మొదలైన యప్ టీవీ మొదటి రెండు, మూడేళ్లు చాలానే కష్టపడింది. ఇక్కడి టీవీ ఛానళ్లతో మాట్లాడి ఆ కంటెంట్‌ను విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఇంటర్నెట్ ద్వారా అందించడం ఈ ప్రాజెక్ట్ అజెండా. అంతేకాదు వాళ్ల భాషలో వాళ్లకు నచ్చిన న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లన్నీ యప్ ద్వారా చూసే వీలుకలుగుతుంది. ఒక వేళ ప్రోగ్రాం మిస్ అయితే వీడియో ఆన్ డిమాండ్ ద్వారా ఇష్టమైన సీరియల్‌ను మళ్లీ చూసే వెసులుబాటూ ఉంది. అయితే మొదటి ఏడాది కేవలం రెండు ఛానళ్లు మాత్రమే ఇందుకు అంగీకరించాయి. ఉదయ్ పట్టుదల, అతని ఆలోచనల్లో వినూత్నన, విదేశాల్లో వాళ్ల ఛానళ్లకు ఉన్న డిమాండ్, మార్కెట్‌ వాళ్లకు కూడా అర్థమైంది. దీంతో ఇప్పుడు యప్ టీవీ 12 భాషల్లో 200కి పైగా ఛానళ్లను విదేశీ వీక్షకులకు అందిస్తోంది. 5,000 సినిమాలతో మూవీ లైబ్రరీని కూడా నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 10,000 గంటలకుపైగా టీవీ కంటెంట్‌ను జనాల కోసం సిద్ధం చేసింది. వీళ్లకు ముఖ్యంగా అమెరికా, కెనడా మార్కెట్లకు చాలా కీలకమే అయినా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన దేశాల్లోనూ యప్ తన సేవలను అందిస్తోంది. నెలకు ఎంత లేదన్నా 60 లక్షల మంది యూజర్ ట్రాఫిక్ కంపెనీ సొంతం.

ఏంజిల్ ఇన్వెస్టర్ శశిరెడ్డి నుంచి రూ.16 కోట్ల ఫండింగ్‌ను అందుకుంది యప్ టీవీ. తాజాగా 50 మిలయన్ డాలర్ల ఫండింగ్ సమీకరించుకునేందుకు యత్నాలు ప్రారంభించింది. కొద్దికాలం క్రితం భారతీయ ఆపరేషన్స్‌ను ప్రముఖ క్రికెటర్ బ్రియాన్ లారా ప్రారంభించారు. వివిధ దేశాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ యూఎస్‌లో ఉన్నా డెవలప్‌మెంట్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉంది. యప్‌లో దగ్గర ప్రస్తుతం 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం యప్ టీవీ ఏడాదికి 100 కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

image


నేర్చుకున్న పాఠాలు

సాధారణంగా స్టార్టప్ అనగానే ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉన్నతోద్యోగాన్ని వదిలేసి మరీ వ్యాపారం ప్రారంభించిన ఉదయ్‌ ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఉద్యోగం ఉన్నప్పుడు వ్యాపారం సులువు అనుకున్నారే కానీ.. దిగాక తెలిసింది ఎంత కష్టమో. ఫోకస్డ్‌గా లేకపోతే చాలా ఇబ్బందని అర్థమైంది. మొదటి రెండుమూడేళ్ల పాటు ఎంతో కష్టపడ్డా నిలదొక్కుకోవడం వల్లే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్ ఇంటర్నెట్ టీవీ స్పేస్‌లో నెంబర్ వన్‌లో ఉన్న యప్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

సోషల్ యాంగిల్

సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్‌గా ఎదిగిన ఉదయ్‌నందన్ రెడ్డిలో సోషల్ యాంగిల్ కూడా ఉంది. తాను పుట్టిపెరిగిన వీణవంక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలనే కోరిక ఇప్పటికీ తనలో బలంగా ఉంది. అందులో భాగంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విశేష కృషిచేస్తున్నారు.

image


గ్రామీణులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ నెలా 50 మంది విద్యార్థులకు కంప్యూటర్స్‌లో బేసిక్స్‌తో పాటు పవర్ పాయింట్, ఎక్సెల్, ఇంటర్నెట్ వాడకం వంటి వాటిపై శిక్షణనిస్తున్నారు. ఇప్పటివరకూ 700 మందికిపైగా పిల్లలు ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందారు. అవసరమైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నారు. మోడర్న్‌విలేజ్ 2020 పేరు మీద ఓ మోడల్‌ను రూపొందించి.. అది సక్సెస్ అయితే అందరికీ ఈ ప్రాజెక్ట్‌ గురించి వివరిస్తామంటున్నారు ఉదయ్.

అయితే సామాజిక కోణం తన లైఫ్ యాంబిషన్ అంటున్న ఉదయ్.. మొదట.. యప్ టీవీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. స్థిరత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి సమయాన్ని మోడ్రన్ విలేజ్ కాన్సెప్ట్ కోసం వెచ్చిస్తామని ముగించారు ఉదయ్‌నందన్ రెడ్డి.


Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags