ఈ కుర్రాడి తెలివితేటల ముందు ఐన్ స్టీన్, హాకింగ్స్ మేథస్సు తీసికట్టు

ఈ కుర్రాడి తెలివితేటల ముందు ఐన్ స్టీన్, హాకింగ్స్ మేథస్సు తీసికట్టు

Wednesday August 23, 2017,

1 min Read

బుర్ర ఉండగానే సరిపోదు. అందులో కూసింతైనా గుజ్జుండాలి అంటారు. అంతకంటే కాస్త ఎక్కువుంటేనే మహా తెలివైనోడు అంటారు. ఇక అపర మేథావి అనిపించుకోవడం అంత ఆషామాషీ యవ్వారం కాదు. బేసిగ్గా తలపండితేనే మేథావితనం బయటపడుతుంది. కానీ లోకం పోకడ తెలియని వయసులోనే మహామహా మేథావుల్నే అబ్బురపరిచాడో పిల్లోడు.

image


భారత సంతతికి చెందిన లండన్ కుర్రాడు రాహుల్ 12 ఏళ్ల వయసులోనే చైల్డ్ జీనియస్ అనిపించుకున్నాడు. చానల్ 4 నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ బాలమేథావి బుర్ర అనన్య సామాన్యం అని తేలింది. 19 మంది పిల్లలు పాల్గొన్న ఈ షో వారంపాటు నడిచింది. ఫైనల్ క్వశ్చన్ 19వ శతకానికి చెందిన ఆర్టిస్టులు విలియర్ హోల్మన్ హంట్, జాన్ ఎవెరెట్ మిలాయిస్ పై అడిగారు. ఆ ప్రశ్నలో రాహుల్ ప్రత్యర్ధి తొమ్మిదేళ్ల కుర్రాడితో పోటీపడి సరైన సమాధానం ఇచ్చి టైటిల్ సాధించాడు.

ఇంతకూ రాహుల్ ఐక్యూ ఎంతో తెలుసా? 162. ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫన్ హాకింగ్ లాంటి మేథావులకంటే రెండాకులు ఎక్కువే అన్నమాట. అంటే తనవయసుకు మించిన ఇంటలెక్చువల్. ఇంకేముంది అతని పాదరసంలాంటి అతని బుర్ర మెన్సాలో సభ్యుడిని చేసింది. మెన్సా అనే గ్రూపు ప్రపంచంలోనే హై ఐక్యూ సొసైటీ. అందులో స్థానం సంపాదించాలంటే మామూలు బుర్ర ఉంటే సరిపోదు.

ఫైనల్లో రాహుల్ సెలెక్ట్ చేసుకున్న అంశం 18 శతాబ్దానికి చెందిన ఎడ్వర్డ్ జెన్నర్స్ మెడికల్ ఇన్నోవేషన్ అండ్ మెథడాలజీ. ఫైనల్ ప్రత్యర్ధి రోనన్ కూడా రాహుల్ తో సమానంగా 15 మార్కులతో ఫైనల్ రౌండ్ లో నిలిచారు. అయితే రాహుల్ సమాధానాలు ఇచ్చిన తీరు క్విజ్ మాస్టర్ ను, ఇటు ప్రేక్షకులను అబ్బుర పరిచింది.

రాహుల్ తండ్రి మినేష్ ఐటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. తల్లి కోమల్ ఫార్మాసిస్ట్. తమ కొడుకు చైల్డ్ ప్రాడజీగా టైటల్ సాధించడంతో వాళ్లు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. పెద్దయిన తర్వాత ఫైనాన్షియల్ అడ్వయిజర్ అవడమే తన లక్ష్యం అంటున్నాడు రాహుల్.