సంకలనాలు
Telugu

బైక్ పై ప్రపంచాన్ని చుట్టేస్తున్న 21 ఏళ్ల వీరుడు.. ఫండ్స్ కోసం సరికొత్త మార్గం..

Pavani Reddy
22nd Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఉదయం లేస్తే చాలు ట్రాఫిక్ రణగొణ ధ్వనులు… ఆఫీసుకు వెళ్లాలన్న టెన్షన్… అక్కడ బాస్ ఏమంటారోనన్న భయం… బిజీ బిజీ లైఫ్… జీవితంలో కొన్ని రోజులైనా మనకు నచ్చినట్లు ఉండలేమా అనిపిస్తుంది. మనకు నచ్చినట్లు ఉంటే… బతుకుబండి సాగేదెలా? మళ్లీ టెన్షన్ మొదలవుతుంది. ఇదంతా లేని ఓ జీవితాన్ని కనిపెట్టాడు రోహిత్ సుబ్రమణ్యం. 

బండే అతడి దైవం.. రోడ్డే అతని నేస్తం..

రోహిత్ వయసు 21. కానీ తిరిగింది మాత్రం 46 దేశాలు. అదికూడా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై. నమ్మశక్యంగా లేదుకదా. కానీ నిజం. రోహిత్ ప్రతి రోజూ సరికొత్త అనుభవమే. ఏ పర్వత ప్రాంతాల్లోనో నిద్రలేస్తాడు. ప్రకృతి ఒడిలో హాయిగా పడుకుంటాడు. సుందర జలపాతం దగ్గర బండి ఆపి రెండు చేతులు చాపుతాడు. పిల్లకాలువలతో ముచ్చట చెప్తాడు. వాహనాల హారన్ బదులు పక్షుల కిలకిలారావాలు వింటాడు. ట్రాఫిక్ అంటే… ఉదయం రోడ్డుదాటే ఆవులు, దుమ్మురేపుతూ వెళ్లే మేకల మందలే అంటాడు. మార్గం మధ్యలో కనిపించే ప్రతి సీనరీనీ ఎంజాయ్ చేస్తాడు.

పొలంలో నాట్లేసే సీన్ కనిపించగానే వెంటనే బండి ఆపి, ప్యాంట్ పైకి మడిచి, బూట్లు విప్పి బురదలో దిగి వారితో పాటు నాటేస్తాడు. మనిషి సంచారం అంతగా లేని రోడ్డువారగా ఓ పూరిగుడిశె హోటల్ ముందు బైక్ స్టాండేసి, స్టీలు గ్లాసులో షుగర్ కాస్త ఎక్కువున్న వేడివేడి టీ తాగి, ముసలి యజమానితో సెల్ఫీ దిగుతాడు. పోలీస్ స్టేషన్ ముందు బండి ఆపి.. ఎస్సై గారూ.. నేను ఫలానా.. ఈ రాత్రి ఇక్కడే పడుకుంటా అని బెరుకు లేకుండా చెప్తాడు. ఊరికి దూరంగా బస్టాపులో కాళ్లు డొక్కలోకి ముడుచుకున్న ఓ ముసలాయన పక్కన బ్లాంకెట్ పరుచుకుని పడుకుంటాడు. చెక్కముక్కతో క్రికెట్ ఆడే పిల్లలో కలిసి కాపేపు ఆడుతాడు. ఏదో ఒక వ్యవసాయ బావి పంపుసెట్టు కనిపిస్తే అక్కడ ఆగి బట్టలు ఉతుక్కుంటాడు. తీరిగ్గా అవి ఆరిన తర్వాత బ్యాగులో సర్దుకుని బండి స్టార్ట్ చేస్తాడు. 

దారి పొడవునా రకరకాల మనుషులు కనిపిస్తారు. కొందరితో మాట్లాడతాడు. భాష రాకపోయినా వారిని ఇట్టే ఆకర్షిస్తాడు. ఇతని ఆటిట్యూడ్ చూసి, వాళ్లు తినడానికి ఏమైనా ఇస్తారు. వాళ్ల ఆతిథ్యాన్ని రోహిత్ హాపీగా స్వీకరిస్తాడు. ఎవరో తెలియని మనుషుల మధ్య, నులక మంచంలో కూచొని, వేడివేడి జొన్నరొట్టెలు పచ్చడిలో నంజుకుని తినడం కంటే లోకోత్తర సౌందర్యం మరేముంటుంది చెప్పండి. రోహిత్ ప్రయాణంలో అలాంటి మరపురాని సన్నివేశాలెన్నో.. అసలైన భారతదేశం అంటే ఏమిటో రోహిత్ తెలుసుకున్నాడు. ఒక డఫెల్ బ్యాగ్. అందులో బట్టలు. ఓ ల్యాప్ టాప్, ఛార్జర్స్, కెమెరా. ఇంతకు మించి లగేజీ లేదు. జర్నీ అంతా రికార్డ్ చేయడానికి హెల్మెట్ లో చిన్న కెమెరా. 

అవగాహన

బేసిగ్గా 21 ఏళ్ల కుర్రాడంటే ఏం చేస్తాడు. అప్పుడే ఫ్రెష్ గా డిగ్రీ పట్టా చేత పుచ్చుకుని లైఫ్ మీద ఏ క్లారిటీ లేక, ఏదో లక్ష్యాన్ని పెన్సిల్ తో గీసుకునే పనిలో పడతాడు. కానీ రోహిత్ అలా చేయలేదు. ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పైనే ప్రపంచాన్ని చుట్టిరావాలనుకున్నాడు అలా ఏడాదిన్నరలో 46 దేశాలు… లక్ష కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎంత మెచ్యురిటీ ఉంటే ఈ సాహసానికి ఒడిగట్టాలి చెప్పండి. ఒంటరిగా ఎవరూ తిరగని అటవీ ప్రాంతంలో, గంటలో ఒక వాహనం కూడా వెళ్లని ఘాట్ రోడ్లపై… నిర్మానుష్య దారివెంట చీకట్లో ఒక్కడే బండిమీద వెళ్లడమంటే- ఒక్కసారి ఊహించుకోండి. ఆ ప్రయాణం ఎంత భయానకంగా ఉంటుందో. కానీ భయం అనేది మనోడి బ్లడ్ లోనే లేదు. ట్యాంకులో పెట్రోలు, టైర్లో గాలి ఈ రెండు ఉంటే చాలు.. ఆత్మవిశ్వాసం యాక్సిలరేట్ మీద నుంచి కదలదు. బెంగళూరు వయా హంపీ నుంచి గోవా మీదుగా ప్రయాణం మొదలైంది. గోకర్ణ నుంచి గోవా టూర్ జీవితంలో మరచిపోలేనని చెబుతున్నాడు. గోవాలో ఆ మధ్య జరిగిన మోటార్ బైక్ వీక్ ఫెస్టివల్ పార్టిసిపెంట్స్ తో కలిసి ఫుడ్ బాల్ ఆడాడు కూడా.

డ్రీమ్ భేషుగ్గానే ఉంది.. మరి డబ్బెక్కడిది?

ప్రపంచ యాత్ర చేయాలన్న కల చాలా మందికి ఉంటుంది. స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో, స్కాండినేవియన్ బీచుల్లోనే విహరించాలని ఎవరికుండదు చెప్పండి? మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఉద్యోగాలు చేయక టూర్లు తిరిగితే జీతం ఎలా.. జీవితం ఎలా? దీనికి కూడా ఒక మార్గం కనిపెట్టాడు రోహిత్ సుబ్రమణ్యం. ఫండ్ మై డ్రీమ్ అన్న క్రౌడ్ ఫండింగ్ స్టార్టప్ ప్రారంభించాడు. అలా టూర్ కోసం వచ్చిన నిధులతోనే ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. అయితే ఇదంత ఈజీగా జరగలేదు. ఊళ్లు తిరుగుతాను డబ్బులివ్వండి అంటే ఎవరూ ఇవ్వరు. 

గత ఏడాది కొందరు స్పాన్సర్లను కలిశాడు. ఇతని వాలకం చూసి ఎల్లెలవో అన్నారు. ఆ వయసు కుర్రాడు అలాంటి మాట చెప్పారంటే ఎవరైనా అదే అంటారు. కానీ మనోడు పట్టువదలని విక్రమార్కుడి టైపు. నమ్మకం కలగాలంటే ఏదో చేయాలి. అలా ఆలోచిస్తే అప్పుడే పెరుగుతున్న లేతగడ్డాన్ని నిమురుతున్నాడు. అక్కడ ఆగిపోయాడు. ఎస్.. గెడ్డం పెంచితే రేటింగ్ పెరుగుతుందనుకున్నాడు. అనుకున్నట్టే గెడ్డానికి ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే అతని లుక్కే స్పాన్సర్లను తెచ్చిపెట్టింది. బియర్డుని మెచ్చి ఉత్సారా అనే కంపెనీ ఫండింగ్ చేయడానికి ముందుకు వచ్చింది. ఏకతా భావాన్ని చాటే వోయినా అనే మరో సంస్థ కొంత డబ్బును సమకూర్చింది. వారికి నా వంతు ప్రచారం చేసి పెడుతున్నా.. అంతకంటే కావాల్సిందేముంది.. అంటారు రోహిత్. 

 మోటార్ సైకిల్ డైరీ

అమెరికా రచయిత రాబర్ట్ ఆర్టికల్ చదివాక ఇలాంటి ట్రావెల్ చేయాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ టూర్ వేద్దామనుకున్నా… బిజీగా ఉండటం వల్ల సాధ్యంకాలేదంటూ రాబర్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు వయసు మీద పడటంతో కుటుంబ బాధ్యతల్లో ఇరుక్కున్నాడు. రాబర్ట్ ఆర్టికల్ చదివి సీరియస్ గా ఆలోచించా అంటున్నాడు రోహిత్. బైక్ రైడింగ్ తనకో ధ్యానం లాంటిదంటాడు. ఇది చుక్కల్ని కలుపుతూ ఒక మంచి ముగ్గు వేయడం లాంటిదని కవితాత్మకంగా చెప్తున్నాడు. ఈ జర్నీలో తనను తాను తెలుసుకో గలుగుతున్నాడు. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. మనుషులను తెలుసుకుంటున్నాడు. జీవితంలో ఏం కోల్పోతున్నామో అవన్నీ అర్ధం చేసుకుంటున్నాడు. జెన్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ పుస్తకంలో రాబర్ట్ ఒక మాట రాశారు. ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రాంతంగా మార్చాలంటే ముందు మన ఆత్మను శుద్ధి చేసుకోవాలని… అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది. దాన్నే అనుసరిస్తున్నానని చెబుతున్నాడు రోహిత్. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags