Telugu

విలువైన వస్తువు పోయిందా..? నో టెన్షన్ ! ఈ-లాస్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..!

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండానే మీ వస్తువు మీ చెంతకు

team ys telugu
8th Jan 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

జయేశ్ చంద్ర సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. లంచ్ అవర్ లో ఒక హోటల్ కి వెళ్లాడు. బ్యాక్ ప్యాక్ టేబుల్ మీద పెట్టి వాష్ రూంకి పోయాడు. వెళ్లి వచ్చేసరికి బ్యాగ్ ఉంది కానీ అందులో లాపీ లేదు. ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రాజెక్ట్ వర్కంతా దాంట్లోనే ఉంది. పరుగుపరుగున దగ్గర్లోని పోలీస్ స్టేషన్ వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వమన్నారు కాప్స్. ట్రేస్ చేయగానే కబురు పెడతామన్నారు. ఉసూరుమంటూ బయటకు నడిచాడు జయేశ్ చంద్ర. ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఉండాల్సిందే.

అయితే ఇప్పుడా టెన్షన్ లేకుండా ఈ-లాస్ట్ అనే యాప్ తయారుచేశారు బెంగళూరు పోలీసులు. వాలెట్ నుంచి లాప్ టాప్ దాకా ఏది పొగొట్టుకున్నా.. ఆ యాప్ లో వివరాలు ఎంట్రీ చేస్తే సరిపోతుంది. మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు. ఉరుకులు పరుగుల మీద పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కంప్లయింట్ ప్రాసెస్ ఈజీ చేశారు. ఫిర్యాదు ఎంట్రీ చేయగానే డిజిటల్ సైన్డ్ అక్నాలెడ్జ్ కాపీ మెయిల్ కు వస్తుంది. ఉదాహరణకు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొగొట్టుకుంటే- యాప్ ద్వారా రిపోర్ట్ చేసిన అక్నాలెడ్జ్ కాపీని ఆర్టీవో ఆఫీసులో చూపిస్తే చాలు.. డూప్లికేట్ గానీ, కొత్తది గానీ ఇష్యూ చేస్తారు.

అయితే చాలామంది బాధితులు వస్తువు పోగొట్టుకున్న తర్వాత ఎంతోసేపటికిగానీ మేల్కోవడం లేదు. అదీగాక ఎక్కడ పోగొట్టుకున్నదీ, ఏ టైంలో అది మిస్సయిందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా టూరిస్టులు సరిగా రిపోర్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు అది కొత్తప్లేస్ కావడం.. ఆ వివరాలు తెలియకపోవడం.. ఫలితంగా యాప్ ద్వారా రిపోర్ట్ చేయడం కష్టమవుతోందని ఓ పోలీస్ అధికారి యువర్ స్టోరీతో చెప్పారు. అందుకే అలాంటి వారు స్టేషన్ కు రాకుండా బెంగళూరు పోలీసులు వెబ్ బేస్డ్ కంప్లయింట్ వెసులుబాటు కూడా కల్పించారు.

image


పీసీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ డెవలప్ చేసిన 1.1 వెర్షన్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. బెంగళూరు, ఢిల్లీ చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఈ యాప్ వాడుతున్నారు.

ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. టూరిస్టులు ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకుంటే వాళ్లుండే లాడ్జ్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో వారికి తెలియదు. ఫలితంగా స్టేషన్ వరకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంలో అనేక వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. అదే ఈ యాప్ ద్వారా అయితే.. బాధితుడు ఏ లాడ్జిలో దిగాడో ఎంటర్ చేయగానే- దాని పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఫిర్యాదుదారుడికి కనెక్ట్ అవుతుంది. దాంతో కంప్లయింట్ ఈజీ అవుతుంది.

ఇప్పటికే బెంగళూరు సిటీలో ఈ-లాస్ట్ యాప్ డౌన్ లోడ్ 50వేల దాకా వచ్చింది. వేలమంది ఫిర్యాదులు చేశారు. సెల్ ఫోన్ పోయిందని, వాలెట్ ఎవరో కొట్టేశారని, హెల్మెట్ దొంగిలించారని, డ్రైవింగ్ లైసెన్స్ మిస్సయిందని, బ్యాంక్ పాస్ బుక్ కనిపించడం లేదని.. ఇలా రకరకాల కంప్లయింట్స్ వచ్చాయి.

యాప్ ఎలా పనిచేస్తుంది..?

సింపుల్. యాప్ డౌన్ లోడ్ చేసుకుని, ఈమెయిల్ ఐడీ ద్వారా లాగివ్ అవ్వాలి. ఆ తర్వాత మిస్సింగ్ రిపోర్ట్ రిజిస్టర్ చేయాలి. ఇంకా ఏమైనా కన్ ఫ్యూజన్ ఉంటే.. ఎఫ్ఏక్యూ సెక్షన్ ఫాలో అయితే సరిపోతుంది. రికవరీ అయిందీ లేనిదీ కూడా తెలిసిపోతుంది. పేరు, అడ్రస్, తేదీ, టైమ్, ఘటన ఎక్కడ జరిగింది.. తదితర వివరాలు ఎంటర్ చేశాక ఫిర్యాదుకు సంబంధించి రశీదు జెనరేట్ అవుతుంది. అది కావాలంటే పీడీఎప్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రింటవుట్ కూడా తీసుకోవచ్చు. వస్తువు ట్రేస్ చేసిన తర్వాత అవసరమైతే పోలీసులే బాధితుడికి సమాచారం చేరవేస్తారు.

ఇలాగే ఒకసారి ఫారిన్ యువతి విలువైన కెమెరా పోగొట్టుకుంది. యాప్ ద్వారా కంప్లయింట్ ఇస్తే ఒకటీ రెండ్రోజుల్లోనే కేసు ఛేదించారు. ఆమెను పిలిచి మరీ కెమెరా అందజేశారు. వాస్తవానికి ఆ ఫారిన్ లేడీకి ఈ యాప్ గురించి తెలియదు. కెమెరా ఆటో సీట్లో పెట్టింది. మరిచిపోయి దిగి వెళ్లిపోయింది. ఆటో వెళ్లిపోయాకగానీ సంగతి గుర్తురాలేదు. లబోదిబోమని మొత్తుకుంది కానీ ఏం చేయలేకపోయింది. ఎందుకంటే ఆటో నంబర్ ఏంటో తెలియదు. ఎక్కడ ఎక్కిందో కూడా ఐడియా లేదు. ఖర్మ అనుకుని వదిలేసింది. ఆ తర్వాత ఈ యాప్ సంగతి తెలిసింది. వెంటనే లాగిన్ అయ్యి, వివరాలన్నీ నమోదు చేసింది.

అయితే, మరుసటి రోజు ఆటో డ్రైవర్ సత్యనారాయణ ఏం చేశాడంటే.. ఎవరో ఫారిన్ అమ్మాయి కెమెరా తన ఆటోలో మరిచిపోయందని.. నిజాయితీగా వెళ్లి ఫ్రేజర్ టౌన్ పోలీసులకు అందజేశాడు. అప్పటికే ఫారినర్ ఇచ్చిన కంప్లయింటుని అన్ని స్టేషన్లకు సర్క్యులేట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదులో ఉన్న డిస్క్రిప్షన్- ఆటో డ్రైవర్ తీసుకొచ్చిన కెమెరా ఫీచర్స్ సరిగ్గా సరిపోయాయి. వెంటనే ఫ్రేజర్ టౌన్ పోలీసులు ఆమెను పిలిచి కెమెరా ఇచ్చారు. కంప్లయింట్ చేసిన నిమిషాల్లో విలువైన కెమెరా తిరిగి వచ్చందని ఆ యువతి ఎంతో సంతోషించింది.

యాప్ పాపులర్ కావాలని..

ఇలాంటి యాప్ ఒకటి ఉందని జనానికి ఇంకా తెలియదు. పాపులర్ కావాల్సిన అవసరం ఉందని భావించి.. దాన్ని మళ్లీ గత నెలలో ట్రాఫిక్ ఏసీపీ చేతుల మీదుగా రీ లాంఛ్ చేశారు. గత రెండున్నర ఏళ్లలో ఢిల్లీ పోలీసులు ఈ-లాస్ట్ యాప్ ద్వారా 25 లక్షల కేసులను స్వీకరించారు. ప్రతీ రోజు ఎంత లేదన్నా సగటున 2,500 ఫిర్యాదుదారులు లాగిన్ అవుతారు. బెంగళూరుతో పోల్చుకుంటే నిత్యం 400 నుంచి 500 కంప్లయింట్స్ ఎక్కువగా వస్తాయి.

మిస్సింగ్స్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఏదైనా రాబరీ జరిగినా, రోడ్డుమీద పోకిరీలు వెధవ వేషాలు వేసినా, వేధించినా, అత్యాచారయత్నం చేసినా ఈ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఎం-గవర్నెన్స్ లో భాగంగా ఈ-లాస్ట్ యాప్ బెంగళూరులో సక్సెస్ అయింది. జనం స్టేషన్ మెట్లెక్కడం.. ఎఫ్ఐఆర్ రాయించుకోవడం మరిచిపోయారు. 

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags