సంకలనాలు
Telugu

రాజకీయమూ మంచి వ్యాపారమే !

ఈ రెండూ ప్రజలను ఒప్పించి తమ దారికి తెచ్చుకునేవే !ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ యువర్ స్టోరీకి ప్రత్యేక కాలం

team ys telugu
23rd May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పాత్రికేయ ప్రపంచం నుంచి రాజకీయాల వైపునకు మళ్ళడమనేది నా జీవిత గమనంలో సునాయాసంగా జరిగిపోయింది. జీవనోపాధి కోసం నేను చేసిన అన్ని వ్యవహారాలలోను కాసింత ఆందోళన, అభద్రతా భావం చోటు చేసుకునేది . నేను ఉద్యోగాలు మారిన సమయంలో కొంచెం కంగారు, ఇబ్బంది సహజంగా చోటు చేసుకునేవి. అందులో అత్యంత కష్టమైన నిర్ణయం… నేను ఐబిఎన్-7 నుంచి వచ్చిన అవకాశాన్ని స్వీకరించడం. అప్పుడు, నా భార్యతో…“అనిశ్చితమైన ప్రయాణం మొదలయ్యింది. ఓ ఏడాది తరువాత నేను వీధిలో ఉంటానో లేక ఏ.సి. గదిలో ఉంటానో తెలియదు” అన్నాను. ఆ క్షణం నా జీవితంలో అత్యంత పెను ఘటనగా మిగిలింది. అప్పటినుంచి 11 సంవత్సరాలపాటు నేను ‘ఆజ్ తక్’లో పని చేసిన కాలమంతా సౌకర్యవంతంగానే గడిచింది.

image


నేను రాజీనామా సమర్పించి మరో చోట చేరేవరకూ కంటిమీద కునుకు పడితే ఒట్టు. అయినప్పటికీ అంతా సవ్యంగానే ఉన్నట్టుగా నటించేవాణ్ణి.

చివరిగా నేను నీటి వాటం ఎంచుకున్నాను. దీనివల్ల నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఎక్కడైనా ఓ పద్దతే పని చేస్తుంది. నాయకుడిగా నా పని... నాయకత్వం వహించడంతో పాటు సరైన నిర్ణయాలు తీసుకోవడం వరకేనని గ్రహించాను. ఆ పద్ధతిలోనే ముందుకెళ్ళాను. ఈరోజు నేను నా కర్తవ్యాన్ని ఎంతో బాగా నిర్వర్తించానని ఆత్మ విశ్వాసంతో చెప్పుకోగలను.

విలేకరులకు నాయకత్వం వహించడం అంత సులభమైన వ్యవహారం కాదు. స్వతహాగా వారు చంచల స్వభావులైనప్పటికీ, వారిలో ప్రశ్నించే తత్వం అధికంగా ఉంటుంది. దేన్నైనా చూసినంత మాత్రాన ఒప్పుకునే మనస్తత్వం కాదు. మామూలు మనుషులు అధికారంలో ఉన్నవారిపట్ల భయభక్తులు చూపితే, విలేకరులు మాత్రం కష్టమైన ప్రశ్నలతో నిలదీయాలని చూస్తారు. అధికారమనే గాలి నిండిన బెలూన్ సామర్ధ్యాన్ని సూదితో గుచ్చే నైజం వారిది. ప్రసార మాధ్యమంలో నాయకత్వం చాలా క్లిష్టమైంది. రక్షణ వ్యవస్థలోనూ, పోలీసు డిపార్టుమెంటులోనూ అలా ఆజ్ఞాపిస్తే ఇలా అనుసరించడం అనేది రివాజు. కానీ, ప్రసార మాధ్యమాల్లో ఈ రివాజు సాధ్యపడదు. మనకన్నా చిన్నవాళ్ళ నైనా స్నేహితులుగా మలచుకోవాలి. వాళ్ళతో కలిసి సిగరెట్టు తాగడం, పరాచికాలు ఆడడంవంటి చిట్కాలు పాటించాలి. వాళ్ళ నమ్మకాన్ని పొందగలగాలి. ఇది మేధో మధనానికి మించిన కసరత్తు. వారి ప్రేమాభిమానాలు, నమ్మకం పొందగలిగారంటే చాలు, ఆ తరువాత మీ మాటే శాసనంగా అమలవుతుంది. మీరు ఎలాంటి కొరడానీ ఝళిపించనక్కర్లేదు. కేవలం వారికి ఊతమిస్తూ, కలిసి పయనిస్తున్నామన్న భావన కలిగించడం అవసరం. ఈ ప్రక్రియ నాకు ఎంతో మేలు చేసింది. అలాగే, ఎల్లప్పుడూ అధికార యంత్రాగాన్ని ప్రశ్నించేవారు గానీ, ఎల్లవేళలా సందేహాలు వ్యక్తం చేసేవారుగానీ మూర్ఖులు కారు. వారి ప్రశ్నలో ఏదో కారణం ఉంది, వారు మీ హోదాను ప్రశ్నించడం లేదు. సరైన హేతుబద్ధమైన జవాబు తెలియనందువల్ల దానికోసం ఆరాటపడుతున్నారనే విషయం గ్రహించాను. రాజకీయం కూడా మనలో మసులుతున్న అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రక్రియే అనే అంశాన్ని గ్రహించాను.

రాజకీయ వ్యవస్థలో మేనేజుమెంట్ అనేది ఓ బ్రహ్మపదార్థంగా తోచేది. అదంతా పై పైన జరిగే ప్రక్రియే అనే అపోహ నాకు చాలాకాలంగా ఉండేది. రాజకీయాలు నాకు నూతన గవాక్షాలను తెరిచాయి. రాజకీయం నేను ఊహించినంత అస్పృశ్య రంగం కాదనిపించి, నా ఆలోచన సడలింది. నేను రాజకీయాల్లో చేరడమనేది ఎవరికైనాగానీ కొరుకుడుపడని విషయం. విడమరచి చెప్పడానికి నా అనుభవం చాలదు. ఈ తర్కాన్ని కూడా నేను కొంతవరకే ఒప్పుకోగలను. “ఆప్” సంప్రదాయ పార్టీల కోవకు చెందినది కాదు. ఇది సంప్రదాయిక శైలిలో పనిచేయదు. దీని వ్యవహార శైలి భిన్నమైనది. ఇది ఓ ఉద్యమంలో నుంచి పురుడు పోసుకున్న పసిగుడ్డు. దీని వయసు చాలా తక్కువ. రాజకీయ పార్టీగా ఎదిగే క్రమంలో ఇంకా సంపూర్ణ రూపం దాల్చలేదు. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “ఆప్” అనే పార్టీ కూడా అన్ని పార్టీలవలెనే జనంలోకి వెళ్ళి, వాళ్ళతో మమేకమై బాగోగులు విచారించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అనేవారు ఒకేరకమైన గుంపునుంచి రారు, అన్ని వర్గాలవారు ఉంటారు. వీరందరినీ సమష్టిగా నడిపించే బాధ్యతను పార్టీ చేపట్టాల్సి ఉంది.

ఒక పాత్రికేయుడిగా జన సమూహంతో నా పరిచయం చాలా తక్కువ. ఈ మాట ఒప్పుకోవడంలో నాకెలాంటి మొహమాటం లేదు. కానీ, రాజకీయాల్లో ఆ పద్ధతి చెల్లదని మొదటి రోజే గ్రహించాను. నేను ముడుచుకు కూర్చోవాలన్నా కుదరని పని. రాజకీయాల్లో అందరితోను కలుపుగోలుగా ఉండి తీరాలి. అంత వైవిధ్యం కలది రాజకీయం. మెల్లగా నాకు తెలిసి వచ్చింది ఏమిటంటే, ఈ క్షణంలో నేను రాష్ట్ర రాజధానిలోనే అత్యంత ధనవంతుడితో మాటామంతీ జరిపితే, ఆ మరుక్షణంలోనే అతి నిరుపేద తన బతుకు బాధల గురించి తీసుకునే క్లాసును ఓపిగ్గా వినాల్సి వస్తుంది. ఒక సమయంలో నేను గొప్ప గొప్ప మేధావులతో వాడి వేడి చర్చల్లో నిమగ్నమైతే, రెండో నిమిషంలో ఓ తెలివి తక్కువవాడిని భరిస్తూ ఉంటాను. వారిరువురితోనూ నేను సమాన మర్యాదతో సున్నితంగా హుందాగా వ్యవహరించాలి. మిగతా రంగాల్లో మొండిగా, పొగరుగా ఉన్నా చెల్లుబాటవుతుంది. రాజకీయాల్లో ఆ మొరటుతనం చెలామణి కాదు. ఓట్లు పోతాయి. జనంలోకి ఈ విషయం వెళ్తే కార్యకర్తలు దూరమవుతారు. అందుకే రాజకీయ దురంధరులు, మన పూర్వ ప్రధాన మంత్రి, శ్రీ చంద్ర శేఖర్ ఓ సందర్భంలో “రాజనీతి అనగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే ఓ అద్భుత కళ” అన్నారు.

కాలక్రమంలో ఓర్పు ఎంత గొప్ప సుగుణమో తెలుసుకోగలిగాను. రాజకీయాల్లో కొనసాగాలంటే, నాయకత్వం వహించాలంటే కాస్త తోలు మందంగా ఉండాలని గ్రహించాను. అసలు హేతుబద్ధంగా లేని అంశాలు, పరిస్థితులు తారసపడతాయి. రాజకీయాల్లో ఇది సహజం, ఇక్కడ ఓర్పు- నేర్పు లేకపోతే భవిత లేదు. మీరు ఊహించగలరా…! నేను అర్ధరాత్రి పూటల్లోనో, లేదా తెల్లవారుజామున 3 గంటలప్పుడో అపరిచితులైన సాధారణ జనం నుంచి టెలిఫోన్ గంట మోగితే మాట్లాడేవాడిని, ఆ సమయాల్లో కొంప మునిగిపోయే సమాచారం ఏదీ వాళ్ళ దగ్గర ఉండేది కాదు. కేవలం వాళ్ళకు నిద్ర పట్టక, నాకు ఫోన్లు చేసేవారు. ఒకప్పటి అవతారంలోనైతే… అలా ఫోన్ చేసిన వాడికి నానా గడ్డి పెట్టేవాణ్ణి. ఇప్పుడు జర్నలిస్టును కాను, అవతారం మారింది. రాజకీయాల్లో మనకంటూ సొంత సమయం ఉండదు. నేను నేర్చుకున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సంప్రదించడం, కబురు చెయ్యడం, వివరాలు తెలుసుకోవడం వగైరాలు చేస్తున్నాను.

రాజకీయాల్లో ఎలాంటి విజయగాధ అయినా, అది ప్రజలతో నెరిపే సంబంధ బాంధవ్యాలకు సంబంధించినదే! నేను సమాచార స్రవంతి అనగానే ఇదేదో మేధోపరమైన అంశంగానో, అద్భుతమైన విషయ పరిజ్ఞాన ప్రక్రియగానో, గొప్పగా ఉపన్యసించడం అనో అనుకోవద్దు. ప్రజా బాహుళ్యాన్ని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు, వారు సులభంగా అర్థం చేసుకుని, వక్తతో మానసిక సంఘీభావాన్ని ఏర్పరచుకోగలగాలి. గాంధీజీ గొప్ప వక్త కాదు, మహామేధావి అని కూడా చెప్పజాలరు. అయినా, ఆయన ప్రజల మనిషయ్యారు. దీనిని ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఆ కళ ఇంత వరకు ఎవరికీ పట్టుబడలేదు. అది అసాధారణం, సాటిలేని ప్రక్రియ. అరవింద్ కేజ్రీవాల్ కూడా అంత గొప్ప ఉపన్యాసకుడు కాదు, పార్టీలో ఆయన కన్నా గొప్పగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అయితే, జనంతో అయన ఏర్పరచుకున్న అనుబంధం ఆశ్చర్యకరం, వర్ణనాతీతం. ఏ అంశాన్ని తీసుకున్నా ప్రజల మనసును చూరగొనేలా చెప్పి, ఒప్పించి, వారి హృదయానికి హత్తుకునేలా చేస్తారు. ఆ అనూహ్యమైన తీగతో సామాన్యులని కట్టేయడం కేజ్రీలోని అద్బుత కళ. 1884లో జర్మనీ నాయకుడు బిస్మార్క్ ఇలా అన్నాడు- “రాజకీయాలు సూత్రానుసారంగా సాగే శాస్త్రం కాదు, ఓ అద్భుతమైన కళ”.

గొప్ప గొప్ప నాయకులు అందరూ ఈ జన సంబంధ సమాచార స్రవంతిని ఓ కళగా మలుచుకున్నవారే . ఇది మనసుతో పాడే గీతంలా కాకుండా సమస్త ప్రకృతితో ఏర్పరచుకునే అంతర్లీన సంబంధంగా భావించాలి. ఇది సూటిగా జనాల మనసును దోచుకునే ప్రక్రియ, మేధస్సుకు తాకకుండా మనస్సును స్పృశించే ప్రవచనం. మాటలతో మనుషులను సమ్మోహనపరచే నైజం. ఎవరైనా ఏ వ్యాపారంలోనైనా విజయాన్ని చవి చూడాలంటే రాజకీయాల నుంచే నేర్చుకోవాలి. సముద్రానికి ఉండే ఓర్పు ఉండాలి. లేని వారికి ఇక్కడ భవిత లేదు. సమాచార నైపుణ్యం లేకపోతే… ఎవరిని ఉద్దేశించయితే రంగంలో దిగామో వారికి తమ ఆలోచనలను అమ్మలేరు. వ్యాపార విస్తరణ అనగా హద్దులు చెరిపేస్తూ జన బాహుళ్యంలోకి చొచ్చుకెళ్ళి విజయం సాధించడం. ఓ విజయవంతమైన రాజకీయవేత్తకు ఇది రోజువారీ ప్రక్రియ. ఇది చెయ్యలేని వారికి భవిష్యత్తు ఉండదు సరికదా, సాలెపురుగులా చట్రంలో ఇరుక్కుపోతారు. జనంలోకి తీసుకెళ్ళడానికి వారు ఎంచుకున్న అంశం మానవ ఉద్వేగాలను, సంస్కృతి సంప్రదాయాలను, రీతి రివాజులను అధిగమించి నూతన వారధులను నిర్మించాలి. కోక్ అనే కోకాకోల చైనాలోని చిన్న పట్టణంలోనైనా, చికాగో మహా నగరంలోనైనా ఒకేరకమైన దూకుడుతో అమ్మకాలు సాగిస్తుంది. అదే దాని సక్సెస్ మంత్రం! గాంధీజీ అటు దక్షిణాఫ్రికాలోనూ, ఇటు భారత దేశంలోనేగాక, అమెరికాలోని మార్టిన్ లూథర్ కింగ్ అభిమానాన్నికూడా సంపాదించుకున్నారు. కావున నేను చివరిగా చెప్పదలిచినదేమిటంటే, “రాజకీయం కూడా మంచి వ్యాపారం లాంటిదే, మంచి వ్యాపారం కూడా శ్రేష్ట రాజకీయాల వంటిదే! ఈ రెండూ ప్రజలను ఒప్పించి తమ దారికి తెచ్చుకునేవే!


Guest writer- అశుతోష్

రాజకీయవాదిగా మారిన అశుతోష్, పూర్వాశ్రమంలో టివి జర్నలిస్ట్. ప్రస్తుతం అశుతోష్ 'ఆప్ ' అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టుగా ఆయన టివి18 గ్రూపులోని IBN7కి మేనేజింగ్ ఎడిటరుగా పనిచేశారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags