సంకలనాలు
Telugu

అక్షరం ముక్క ఇంగ్లిష్ రాని వాళ్లనూ కార్పొరేట్ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్న విజయ్

హైదరాబాదీ సోషల్ ఆంట్రప్రెన్యూర్ విజయ్ పెంటారెడ్డి సక్సెస్ స్టోరీ

30th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


హైదరాబాద్ జెఎన్‌టియులో బిటెక్ పూర్తైంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంఎస్‌ కోసం అమెరికాకు పరుగు. అక్కడ ఆ చదువూ ముగిసింది. అప్పుడప్పుడే డాట్ కామ్ బూమ్ ఆకాశాన్ని తాకుతోంది. ఏ నోట విన్నా ఇదే మాట. ఎవరినీ కదిపినా కోట్లు వస్తున్నాయంటూ మాటలు కోటలు దాటాయి. ఇదే జోరులో కొంత మంది భాగస్వాములతో కలిసి 25 మిలియన్ డాలర్లతో కంపెనీ ఏర్పాటైంది. ఇంతలోపే బూమ్ బుడగలా బద్దలైంది. ఆశలన్నీ ఆవిరయ్యాయనే లోపే విప్రో లాంటి మంచి కంపెనీలో ఉన్నతోద్యోగం. ఇదీ ఓ మధ్యతరగతి హైదరాబాదీ యువకుడి స్టోరీ.

విజయ్ భాస్కర్ పెంటారెడ్డి, లాస్ట్ మైల్ సిఈఓ

విజయ్ భాస్కర్ పెంటారెడ్డి, లాస్ట్ మైల్ సిఈఓ


కానీ ఇందులో స్టోరీ ఏముంది ? ప్రతీ ఒక్కరి లైఫ్‌లో జరిగే రొటీన్ కథ ఇది. హ్యాపీ ఎండింగ్‌తో శుభం కార్డ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు అని అనుకోవద్దు. ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. అమెరికా వీధుల్లో అట్టహాసంగా బతికిన ఆ వ్యక్తే.. అమీర్‌పేట్‌ రోడ్డు మీదికి వచ్చేశాడు. అక్కడితో కథ ఆగలేదు. డిగ్రీలు, పీజీలు, ఎంబిఏలు చేసి ఉద్యోగాలు రాక, ఏం చేయాలో తెలియక సతమతమయ్యే విద్యార్థులకు అతడో దిక్సూచిలా మారాడు. ఊహల్లో విహరించే విద్యార్థులకు ఊతమై నిలిచాడు. ఆరంకెల జీతం, అంగరంగ వైభవమైన జీవితాన్ని వదులుకుని.. గ్రామీణ విద్యార్థులను ఉద్యోగాలకు సన్నద్ధం చేశారు. చదువున్నా నోరుపెగలని వాళ్లు, ఇద్దరి ముందు మాట్లాడాలంటే నోరు ఎండిపోయి మౌనంగా నిలుచుండి పోయేవాళ్లను నాయకుల్లా తీర్చిదిద్దడంలో ఆరితేరాడు. ఇవన్నీ అతిశయోక్తులు అనుకుంటే పొరపాటే. ఇంతసేపూ మనం మాట్లాడుకున్న ఆ వ్యక్తే లాస్ట్ మైల్ సంస్థ వ్యవస్థాపకుడు, ఫేస్ బుక్‌లో కైజన్ గ్రూప్ రూపశిల్పి విజయ్ పెంటారెడ్డి.

డాలర్ డ్రీమ్స్ వద్దని.. పేద విద్యార్థుల డ్రీమ్స్ నిజం చేయడమే తన లక్ష్యమంటూ నడుం బిగించారు. ఇంతకీ విప్రోలో అంత అత్యున్నత ఉద్యోగం వదిలి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ? వచ్చి సాధించింది ఏంటి ? గ్రామాలు, చిన్న నగరాల నుంచి వచ్చిన విద్యార్థులు చదువు పూర్తైన వెంటనే విజయ్‌ ఇంటి ముందు ఎందుకు వాలిపోతున్నారో తెలుసుకోవాలంటే కాస్త డీటైల్డ్‌గా చదవాల్సిందే !

''అమెరికాలో ఎంఎస్ పూర్తైన వెంటనే నాకు యాక్సెంచర్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అప్పుడే వస్తున్న డాట్ కామ్ బూమ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఆరుగురు స్నేహితులతో కలిసి 'గ్రానిటార్' అనే ఈ-కామర్స్ సంస్థ స్థాపించాం. 350 మంది ఉద్యోగులతో కంపెనీ మొదట బాగానే నడుస్తున్నట్టు అనిపించింది. అంతలోపే డాట్ కామ్ ఇబ్బందుల్లోకి జారుకోవడం, మా క్లైంట్లంతా ఒకొక్కరుగా జారిపోయారు. ఆ కంపెనీ పనైపోవడంతో నా మొదటి ఫెయిల్యూర్‌ అక్కడే ప్రారంభమైంది " - విజయ్ పెంటారెడ్డి

ఫెయిల్యూర్ తర్వాత కుంగిపోలేదు విజయ్. ఆ తర్వాత ఒకటి రెండు మంచి అవకాశాలు వచ్చినా తిరస్కరించారు. భారత్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ అప్పుడప్పుడే ఐటి పరిశ్రమ కూడా మెరుగైన వృద్ధిని కనబర్చడం అతడిని ఆకర్షించింది. గైనకాలజిస్ట్ అయిన భార్య, పిల్లలతో కలిసి ఇండియా వచ్చేశారు. తన ప్రొఫైల్ చూసి ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు మంచి వేతనంతో ప్యాకేజ్ ఆఫర్ చేశాయి. చివరకు బెంగళూరు వెళ్లి విప్రోలో చేరాలని నిర్ణయించుకున్నారు విజయ్. తన పనితీరుతో మెల్లిగా మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తులకు దగ్గరయ్యారు. అప్పటి విప్రో సిఈఓ కురియన్ వంటి వాళ్ల మన్ననలు పొందారు. ఇదే సమయంలో ఒకసారి 2007లో విప్రో యూరోప్ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం విజయ్‌కు దక్కింది. అయితే ఇది లీన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్. అందుకే అప్పుడే చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వాళ్లను తీసుకుని పని నడిపించాల్సి వచ్చింది. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో ముందుకు జరగడం లేదని యాజమాన్యం గుర్తించింది. సమస్యేంటో తెలుసుకోవాలనే ఆతృత విజయ్ రెడ్డిలో పెరిగింది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పుతుందని తానూ ఊహించలేదు. ఇక్కడి ఉద్యోగుల పనితీరు పరిశీలనలో తనకో విషయం స్పష్టంగా అర్థమైంది. 'వీళ్లంతా కాలేజ్ నుంచి నేరుగా క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థులు. పరిశ్రమ గురించి కానీ వాళ్లు చేసే ప్రాజెక్ట్‌పై కానీ ఏ మాత్రం అవగాహన లేదు. ఇంకొంత మందికైతే బేసిక్ స్కిల్స్ కూడా లేవు. థియరీని బట్టీ పట్టడం తప్ప వాళ్లేం నేర్చుకోలేదని' అతని అవగతమైంది. ఇక్కడ చాలా పెద్ద గ్యాప్ ఉందని విజయ్ తెలుసుకున్నారు. దీన్ని ఎలా అయినా ఫిల్ చేయాలని, నాణ్యమైన విద్యార్థులను పరిశ్రమకు అందించాలని అప్పుడే బలంగా నిర్ణయించుకున్నారు.

టర్నింగ్ పాయింట్ 1

ఇక అప్పటి నుంచి విజయ్‌లో ఏదో తెలియని ఆందోళన చెలరేగింది. ఉద్యోగం వల్ల ఆర్థిక సంతృప్తే కానీ ఆత్మ సంతృప్తి మాత్రం లేదు. వెనక్కి తిరిగి చూస్తే పదమూడు సంవత్సరాల ఐటి రంగ అనుభవం. కానీ గ్రామాలు, చిన్న నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలనే బలమైన కోరిక. మరోవైపు తనపై ఆధారపడిన కుటుంబం... ఇలా వివిధ రకాల ఆలోచన మధ్య కొద్దికాలం సతమతమై ఒక రోజు ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. సన్నిహితుల సలహా, కుటుంబ సభ్యుల సహకారంతో ఐటి నుంచి విద్యారంగంలోకి కాలుమోపాడు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాలేజీల దగ్గరకు పరుగు పెట్టాడు. తన అనుభవన్ని అంతటినీ రంగరించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను తయారు చేశారు. కంపెనీలకు ఏం కావాలో, విద్యార్థులను వాళ్ల అవసరాలకు తగ్గట్టు ఎలా తయారు చేయాలో పక్కా స్కెచ్ రెడీ అయింది. అయితే విజయ్‌ను, అతని అనుభవాన్ని చూసి అంతా అనుమానించే వాళ్లే కానీ.. అవకాశమిచ్చిన వాళ్లు మాత్రం అరుదు. 'ఐటి ఉద్యోగం మానేసి ఇందులోకి వచ్చాడా.. ? ఏంటి లెక్క ? ఇందులో ఏదైనా మతలబు ఉందా ? ఏదో ఒకటి లేకపోతే అమెరికా వదిలి మనలాంటి కాలేజీల వెంటపడ్తాడా ? ' అనే ప్రశ్నలే ఎదురయ్యాయి. ఇవన్నీ ఇలా ఉండగా అప్పుడే ఆర్థిక సంక్షోభం దేశదేశాలను కమ్మేసింది. ఉద్యోగం పుట్టడమే గగనమైపోతున్న రోజులవి ! అయినా వెనకడుగు వేయకుండా కాలేజీల చుట్టూ తిరుగుతూ కొన్ని ఫ్రీ లెక్చర్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకసారి బిటెక్ విద్యార్థులకు క్లాస్ తీసుకోమని చెప్పి చివరకు ఎంబిఏ విద్యార్థులను కూర్చోబెట్టింది ఓ కాలేజ్ యాజమాన్యం. అప్పటికప్పుడు వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాక, ఆర్థిక రంగంలో ఉన్న అవకాశాలపై తనకు తోచింది చెప్పి క్లాస్ ముగించారు విజయ్. అయితే క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులంతా గుమిగూడారు. తమ ముందున్న అవకాశాలను తెలుసుకుని.. స్కిల్స్ బోధించమని కోరారు. అదే విజయ్ లైఫ్‌లో మరో టర్నింగ్ పాయింట్.

విద్యార్థులకు మెళకువలు బోధిస్తున్న విజయ్

విద్యార్థులకు మెళకువలు బోధిస్తున్న విజయ్


టర్నింగ్ పాయింట్ 2

నాలుగైదు మందితో ఇంట్లోని గ్యారేజ్‌లో క్లాసులు ప్రారంభమయ్యాయి. కేవలం ఎంబిఏ, ఎమ్.కాం, బి.కాం విద్యార్థులకు మాత్రమే శిక్షణా తరగతులను తీసుకున్నారు. లాస్ట్ మైల్ పేరుతో కంపెనీ ఏర్పాటైంది. విద్యార్థులు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపెనీలో ఉద్యోగం పొందేందుకు అవసరమైన స్కిల్ సెట్‌ను బోధించడం విజయ్ లక్ష్యం. వాళ్లతో కొంత మందికి అక్షరం ముక్క ఇంగ్లిష్ రాకపోయేది, మరికొంత మందికి ఎంత నాలెడ్జ్ ఉన్నా.. నలుగురి ముందు నోరుపెగలదు. ఇంకొందరికి ఇంటర్వ్యూ అనగానే ముచ్చెమటలు పట్టేవి. ఆశ్చర్యంగా వీళ్లంతా గ్రామీణ, చిన్న పట్టణాల నుంచి వచ్చిన విద్యార్థులే అధికం. వీళ్లకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడంతో రోజులు గడిచేవి. ఈ లోపే ఆ నోటా, ఈ నోటా మెల్లిగా లాస్ట్ మైల్ పేరు విద్యార్థుల చెవిన పడింది. మెల్లిగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

image


ఇదే సమయంలో కొంత మంది విద్యార్థులు ఫేస్‌బుక్‌లో KAIZEN గ్రూప్ ఏర్పాటు చేశారు. కైజన్ అంటే జపనీస్‌లో కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అని అర్థం. ఇక్కడ ఉచితంగా కన్సల్టెన్సీ సేవలను విజయ్ రెడ్డి సంస్థ అందించేది. విద్యార్థులకు అవసరమైన కౌన్సిలింగ్ సేవలతో పాటు వాళ్ల సందేహాలను నివృత్తి చేయడం మొదలుపెట్టారు. కామర్స్ విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉన్న ఓపెనింగ్స్‌ సహా వాళ్లకు అవసరమైన సమాచారాన్ని మొత్తం కైజన్‌లో పొందుపరిచేవారు. ఇలా ఒకొక్కరుగా విద్యార్థులంతా చేరుతూ ఇప్పుడా క్లోజ్డ్‌ గ్రూపులో 25 వేల మందికి పైగా స్టూడెంట్స్ సభ్యులుగా ఉన్నారు. ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి రెండు, మూడు వేల రూపాయలు తీసుకుని చెప్పే వివరాలన్నీ విజయ్ ఏర్పాటు చేసిన కైజన్‌లో ఉచితంగా దొరికేసేవి. దీంతో కాలేజ్ విద్యార్థులంతా ప్రతీ రోజూ పేపర్ చదువుతారో లేదో తెలీదు కానీ కైజన్‌ను దర్శించకుండా ఉండలేకపోయారు.

ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన లక్ష్యాన్ని చేరుకుంటున్నారు విజయ్. ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా 600 మంది విద్యార్థులు లాస్ట్ మైల్ సంస్థ ద్వారా ఎంఎన్‌సిలలో ఉద్యోగం సంపాదించారు. ఇది నిజమా అంటే.. ముమ్మాటికీ నమ్మాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతీ విద్యార్థీ తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు.. తన దగ్గర మూడు నాలుగు నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఎలా మారాడు అనే ప్రతీ విషయాన్నీ విజయ్.. వీడియోలో బంధించారు. తమను తాము చూసుకుని విద్యార్థులు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలని ఈ వీడియో కాన్సెప్ట్ అంటున్నారు విజయ్. ప్రత్యక్షంగా ఆరువందల మందికి ప్రయోజనం చేకూరితే పరోక్షంగా మరో 3 వేల మంది ఉచిత కౌన్సిలింగ్ ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందారు. నాలుగైదేళ్లలో సాధించింది ఇంతేనా అని అనిపించొచ్చు కానీ దీని వెనుక ఎంత కృషి, పట్టుదల, కన్నీళ్ల కష్టం ఉందో తెలిస్తే అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సంస్థను ఏర్పాటు చేసిన ఐదేళ్ల తర్వాత కానీ తన తల్లిదండ్రులకు తానేం చేస్తున్నాడో గర్వంగా, ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్లూ అర్థం చేసుకుని వెన్నుతట్టడం ఆనందంగా ఉంది అంటారు విజయ్.

అంతా అయిపోయిందని అనుకున్నా ...

''అమెరికాలో లగ్జరీ లైఫ్, విప్రో లాంటి సంస్థలో ఉన్నతోద్యోగం.. అప్పటివరకూ సమాజంలో ఎక్కడ లేని గౌరవం ఉండేది. ఏదో చేద్దామని ఇండియా వచ్చాను. అనుకోకుండా ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత తేరుకునే లోపు హైదరాబాద్‌లో వివిధ కారణాల వల్ల జరిగిన ఆందోళనలు నా లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో దెబ్బతీశాయి. ఒక్కోసారి ఒక్క స్టూడెంట్‌ కూడా దొరక్క నానా కష్టాలు పడ్డాను. ఫ్రీగా అయినా క్లాస్ చెప్తే వినే వాళ్లూ కరువైన రోజులు ఉన్నాయి. 2010-2011 మధ్య ధైర్యంగా ఒక్క ఫంక్షన్‌కీ వెళ్లలేని స్థితి ఎదురైంది. అసలు బయటకు వస్తే ఎవరు ఏం అడుగుతారో అనే భయంతో వణికిపోయిన రోజులున్నాయి. ఒక్కో సందర్భంలో పిల్లలు రెస్టారెంట్‌కి తీసుకెళ్లమని అడిగినా వాళ్ల ముచ్చట తీర్చలేని పరిస్థితి ఎదురైంది. ఇంతటి కష్టం జీవితంలో మళ్లీ ఎదురు కాకూడదని లోలోపల కుమిలిపోయిన రోజులు ఎన్నో ఎన్నెన్నో. అందుకే మధ్యలో ఒకటి రెండు సార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఎందుకనో నా కోరిక మొత్తం దీనిపైనే ఉంది''.

విజయ్ రెడ్డి కష్టం ఐదేళ్ల కష్టం ఇప్పుడిప్పుడే మెల్లిగా ఫలితాలను ఇస్తోంది. కేవలం కాలేజీలో డిగ్రీ పూర్తి చేయడంతోనే సరిపోదు... ఉద్యోగం సంపాదించేందుకు అవసరమైన స్కిల్స్‌ కూడా నేర్చుకుంటేనే ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీపై అవగాహన పెంచుకుంటున్నారు. అయితే ఇదేదో పూర్తిగా సోషల్ సర్వీస్ ప్రాజెక్ట్ అని అనుకోలేం. ఒక్కసారి తమ సంస్థలో ఎన్‌రోల్ అయిన తర్వాత మూడు నెలలు కావొచ్చు, ఆరు నెలలు కావొచ్చు.. టైమ్‌తో సంబంధం లేకుండా ఉద్యోగం వచ్చేంత వరకూ విద్యార్థి రోజూ తర్ఫీదు పొందొచ్చు. ఇప్పటివరకూ లాస్ట్ మైల్ సంస్థ సక్సెస్ రేట్ 70 శాతం వరకూ ఉంది. అయితే ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా ఉండి, విద్యార్థుల్లో పట్టుదల ఉందని భావిస్తే.. ఉచితంగానైనా స్కిల్స్ నేర్పేందుకు లాస్ట్ మైల్ సిద్ధంగా ఉంటుంది.

రోడ్ ఆఫ్ స్పిరో టీమ్

రోడ్ ఆఫ్ స్పిరో టీమ్


రోడ్‌ ఆఫ్ స్పిరో

ప్రముఖ దర్శకుడు అన్షుల్‌ సిన్హాతో కలిసి విజయ్ రెడ్డి రోడ్ ఆఫ్ స్పిరో పేరుతో ఓ డాక్యుమెంటరీ నిర్మించారు. ఓ రైతు తన బిడ్డను చదివేందుకు ఎంత వరకూ కష్టపడ్తాడు, ఆ కన్నవారి కలలను పిల్లలు అంత సులువుగా తీర్చగలరా, గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు సిటీ కాలేజీల్లో పడే కష్టాలేంటి అనే సునిశితమైన అంశాలను జోడిస్తూ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి అనూహ్య స్పందనే లభించింది. చూసిన వాళ్లు కళ్లనీళ్లు పెట్టుకోకుండా బయటకు రాలేరనేది విజయ్ రెడ్డి మాట. డాక్యుమెంటరీ కేటగిరీలో ఈ సినిమా దర్భంగ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గౌతమ్ బుద్ధ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫస్ట్ కట్ ఫిల్మ్ వంటి వాటిల్లో నామినేషన్ పొంది ప్రదర్శితమైంది.

భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన లాస్ట్‌ మైల్‌ను ఐదేళ్లలో 100 సెంటర్లకు పెంచాలనేది విజయ్ రెడ్డి ఆలోచన. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులే తమ ముఖ్య లక్ష్యం కావడంతో ద్వితీయ శ్రేణి నగరాలకే విస్తరించాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం కొన్ని సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నారు. గ్రామాల నుంచి వచ్చే ప్రతీ విద్యార్థికీ 'మేమున్నాం అనే భరోసా' కల్పించడమే తన ఆశయమనేది విజయ్ మాట.

విజయ్ ఆలోచనలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీపై అతనికి ఉన్న స్పష్టతను తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. తెలంగాణ సర్కార్ కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ ఎకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో కీలక బాధ్యతలను విజయ్ సంస్థకు అప్పగించింది ప్రభుత్వం. టాస్క్ ఉన్నతోద్యోగులతో కలిసి ఇప్పుడు లాస్ట్ మైల్‌ మరింత ముందుకు దూసుకుపోనుంది.

చివరగా విజయ్ రెడ్డి చెప్పే మాట ఒకటే.. ''ఉద్యోగానికి పనికిరాని విద్యార్థి అంటూ ఎవరూ ఉండరు. అవసరానికి తగ్గట్టు తమన తాము మలుచుకోవడమే ముఖ్యం. ఉద్యోగం సంపాదించడం గొప్ప విషయమేమీ కాదు''.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags