సంకలనాలు
Telugu

ఆప్తులకు.. అనాధలకు మధ్య వారధి - వినాయక్ లొహానీ

ఐఐటి,ఐఐఎం చదివి సోషల్ ప్రెన్యూర్ గా మారాడుదిక్కులేని వాళ్లను చదివించేది ఎవరు అని మదిలో ప్రశ్నచిన్నప్పటి నుంచీ అదే ఆలోచనలుఉద్యోగం పక్కకుబెట్టి పరివార్ ఆశ్రం ఏర్పాటుఇప్పుడు 1150 మంది పిల్లలకు ఆశ్రయం

team ys telugu
12th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఐఐటీ క‌ర‌గ్ పూర్ లో బీటెక్ అయిపోయింది..

ఐఐఎం కోల్ క‌తాలో ఎంబీఏ కూడా కంప్లీట్ అయ్యింది..

ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా దొరికింది....

హ‌మ్మ‌య్యా! లైఫ్ లో సెటిలైపోయాం..

ఇంకేం ప‌ర్లేదు.... అనుకున్నాడ‌త‌ను..

కానీ శ్రీరామ‌కృష్ణుల వారు.. వివేకానందుల వారు అత‌న్ని అలా అనుకోనివ్వ‌లేదు.. మ‌న‌కు కావ‌ల్సిన‌వి మూడు.. ప్రేమించే హృద‌యం.. భావించే మ‌న‌సు.. ప‌నిచేసే చెయ్యి..అన్న వివేకానంద సూక్తులు.. ఆలోచింపచేశాయి. అవును మ‌నం మాత్ర‌మే బీటెక్, చ‌దివి ఇన్ఫోసిస్ లో జాబ్ చేయ‌డంతో స‌రిపోతుందా? మ‌న‌కంటూ వికీపీడియాలో అంత చోటు ద‌క్కించుకోన‌క్క‌ర్లేదా? మ‌న పేరు ప్ర‌తిష్ట‌ల సంగ‌తి స‌రే.. త‌న‌లా గొప్ప విద్యాసంస్థ‌ల్లో గొప్ప చ‌దువులు చ‌ద‌వ‌లేని వాళ్ల ప‌రిస్థితి ఏమిటి? త‌ల్లీదండ్రీ లేక.. దిక్కూ మొక్కూ లేక.. అనాథ‌ల్లా రోడ్డు మీదే జీవితం గ‌డుపుతున్న వారి దుస్థితి రూపు మాపేదెలా? వారికి విద్యా బుద్ధులు నేర్పేదెలా.. కుటంబ‌మే లేని వారికో కుటుంబం ఏర్ప‌రిచేదెలా? అన్న ప్ర‌శ్న‌లు అత‌న్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి...!

వినాయక్ లొహానీ, పరివార్ ఆశ్రమ స్థాపకుడు

వినాయక్ లొహానీ, పరివార్ ఆశ్రమ స్థాపకుడువాళ్ల గురించి ఆలోచించ‌డానికి చాలా మందే ఉన్నారులే గురూ.. నీ ప‌ని నువ్ చూసుకో అన్న మాట‌లు అప్పుడ‌ప్పుడూ సైర‌న్ మోత మోగిస్తున్నాయి. నువ్వేంటో.. నీ చదువేంటో.. నీ పెళ్లి.. త‌ర్వాత ఏర్ప‌డే నీ పెళ్లాం పిల్ల‌ల‌నే ప‌రివార‌మేంటో అని ఉండ‌క ఎందుకొచ్చిన తిప్ప‌లు చెప్పూ..! అస‌లు సోష‌ల్ స‌ర్వీస్ అంటే అదో స్టంటు.. ఇప్పుడెవ‌రూ దీని గురించి గొప్ప‌గా మాట్లాడుకోవ‌డం లేదు తెలుసా? అనే వాళ్లు కొంద‌రైతే.. వ‌చ్చాడండీ మేల్ మ‌ద‌ర్ థెరిసా! అని కామెంట్ చేసేవాళ్లు మ‌రి కొంద‌రు. ఈ ప్ర‌పంచంలో జ‌ర‌గాల్సినవెన్నో జ‌ర‌క్కుండా ఉండి పోతాయి. ఎందుకో తెలుసా? జ‌స్ట్ ప్ర‌య‌త్నించ‌కుండానే అది జ‌ర‌గ‌ద‌ని మ‌న‌కు మ‌న‌మే నిర్ధారించుకోవ‌డం వ‌ల్ల‌.. వివేకానంద స్ఫూర్తి ఒక్క‌సారిగా గుండెను మేల్కొలిపింది. నిజ‌మే క‌దా? అనుకున్నాడు.. అనుకున్న‌ది సాధించ‌డానికి ప్ర‌య‌త్నం ప్రారంభించాడు.. ఇప్పుడ‌త‌ని పేరు దేశంలో సుప్ర‌సిద్ధం. ఎంద‌రో అనాథ‌ల పాలిట ఆప‌ద్భాంద‌వుడు.. పిల్ల‌ల పాలిట‌ ఆరాధ్య దైవం.. అత‌డే ప‌రివార్ ఆశ్ర‌మ్ స్థాప‌కుడు వినాయ‌క్ లొహానీ.. !

దివ్య‌త్వం ఎక్క‌డో లేదు బ్ర‌ద‌రూ.. ఒక్క సారి నీ గుండె మీద చెయ్యి వేసుకుని చూడు.. ల‌బ్ డ‌బ్ లో వినిపిస్తుంది. అదే చేత్తో నీకోసం ప‌నిచేసుకోడ‌మే కాక.. ఇత‌రుల కోసం ప‌నిచేసి చూడు.. ఇంకాస్త‌ స్ప‌ష్టంగా వినిపిస్తుంది.. మ‌నిషిగా పుట్టి మ‌నిషిగా చ‌నిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రూ చేస్తారు.. కొంద‌రు మాత్ర‌మే ఓ రామ‌కృష్ణుడు ఓ వివేకానందుడు అవుతారు. వాళ్ల‌కూ ఇత‌రుల‌కు తేడా.. వాళ్లు తామ‌నుకున్న‌ది చేస్తారు.. అదే మాములు మ‌నుషులు.. ఇత‌రులు అనుకున్న‌ది చేసి మిగిలిన జీవితాన్ని నిశ్శేషంతో నింపేస్తారు. బాసూ జీవితం ఒక స‌మ‌స్యలాంటిదైతే.. అందులోంచి బ‌య‌ట ప‌డే శేష‌మే నువ్వు.. నీ మ‌ర‌ణం త‌ర్వాత కూడా నువ్వు బ‌తికే ఉండాలంటే.. ఆ శేషంలో ఏదో ఒక విశేషం ఉండాలి.. అన్న వివేకానంద‌ స్ఫూర్తి వినాయ‌క్ మ‌న‌స్సు ను ఆక్ర‌మించేసింది.

వినాయ‌క్ లొహానీ 1978 ఏప్రిల్ 12న‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని భోపాల్లో జ‌న్మించాడు. భోపాల్ అంటే తెలిసిందేక‌దా? ప‌్ర‌పంచ ప్ర‌ఖ్యాత విష‌వాయు బాధితుల న‌గ‌రం.. అలాంటి న‌గ‌రంలో వినాయ‌క్ లాంటి మ‌న‌సున్న మంచి మ‌నుషుల‌ను కూడా పుట్టించాడు దేవుడు. అత‌ని విద్యాభ్యాసం మొత్తం ఈ న‌గ‌రంలోనే జ‌రిగింది. ఆవేద‌న అంటే ఏమిటో స‌రైన అర్ధం తెలిసిందీ అక్క‌డే. అంద‌రికీ అన్నీ వ‌స‌తులండ‌వ‌నీ.. కొంద‌ర‌స‌లు ఏ సౌకర్యం లేకుండా జీవితంలో రాణించాల్సి వుంటుంద‌ని అర్ధ‌మైందీ అక్క‌డే . క‌త్తి లేకుండానే యుద్ధం చేయాల్సిన బాల వీరుల సంఖ్య ఈ స‌మాజంలో చాలానే ఉంద‌ని అవ‌గ‌మైంది అక్క‌డే. వినాయ‌క్ తాను ఖర‌గ్ పూర్ ఐఐటీలో బీటెక్ చేస్తున్న‌ప్పుడు కూడా మ‌న‌స్సు నిండా ఇవే ఆలోచ‌న‌లు ఆవ‌హించేవి. అదే స‌మ‌యంలో ఐఐఎం కోల్ క‌తాలో ఎంబీఏ చ‌దువుతున్న‌ప్పుడూ ఇవే భావాలు క‌లిగేవి. త‌న‌లోని ఆలోచ‌న‌ల‌కు వివేకానంద సూక్తులు తోడ‌య్యేవి. అలా చ‌దువుతుండ‌గానే ముగ్గురు పిల్ల‌ల‌ను చేర‌దీసి వారిని ఒక అద్దె ఇంట్లో ఉంచి బాగోగులు చూడ్డం ప్రారంభించాడు వినాయ‌క్. ఒక‌రిద్ద‌రిని చేర‌దీయ‌డంతోనే త‌న ప‌ని అయిపోలేద‌ని తెలిసింది. అత‌నిలో ఆలోచ‌న తీవ్ర‌మైంది. అప్ప‌టికి వినాయ‌క్ ద‌గ్గ‌ర అంత ఆర్ధిక ప‌టుత్వం లేదు. అయినా స‌రే ఏదో చెయ్యాల‌నే ఉద్దేశంతో. 15 మంది పిల్ల‌ల‌తో 2003లో ప‌రివార్ ఆశ్ర‌మ్ స్థాపించాడు. 

పరివార్ ఆశ్రం పిల్లలు

పరివార్ ఆశ్రం పిల్లలు


నిర్వ‌హ‌ణ కోసం త‌నకు తెలిసిన మేనేజ్ మేంట్ సూత్రాల‌తో కూడిన లెక్చ‌ర్స్ ఇచ్చేవాడు. ఇవి ఎంబీఏలో చేరాల‌నుకునేవారికి ఎంత‌గానో ఉప‌యోగ పడేవి.. నెమ్మ‌దిగా వినాయ‌క్ సేవాత‌త్ప‌ర‌త అర్ధం చేసుకుందీ స‌మాజం. వినాయ‌క్ మంచి ప‌ని చేస్తున్నాడ‌న్న పేరు వ‌చ్చింది. మొత్తంగా అత‌ని గురించి అంద‌రికీ బాగా తెలిసి పోయింది. ప‌రివార్ ఆశ్రంలో స‌భ్యుల సంఖ్య కూడా పెరిగింది. 2004 పూర్త‌య్యే నాటికి ప‌రివార్ సొంత స్థ‌లం సంపాదించుకోగ‌లిగింది. ఇది ప‌రివార్ ఆశ్ర‌మ్ తొలి సొంత ప్రాంగ‌ణం.. 2011నాటిక‌ల్లా ప‌రివార్ ప‌రిధి పెరిగింది.. బాల, బాలిక‌ల‌కోసం ప్ర‌త్యేక విభాగాలు ఏర్పాట‌య్యాయి.

పరివార్ ఆశ్రంలో చదువుకుంటున్న పిల్లలు

పరివార్ ఆశ్రంలో చదువుకుంటున్న పిల్లలు


వినాయ‌క్ గొప్ప‌ద‌న‌మేంటంటే.. స్వార్ధం ఏ విష‌యంలోనూ ప‌నికిరాద‌నే త‌త్వం గ‌ల‌వాడ‌త‌ను. ప‌రివార్ బాగోగులు ఇత‌ర‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో మాత్ర‌మే అత‌ను మ‌మేక‌మ‌వ‌లేదు. త‌న‌లా క‌ష్ట‌ప‌డుతున్న ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల కోసమూ ప‌నిచేసేవాడు. దాత‌ల‌కూ స్వీక‌ర్త‌ల‌కూ అనుసంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించేవాడు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే వినాయ‌క్ అనాథ‌ల పాలిట వార‌ధిలా ప‌నిచేయ‌డం అల‌వ‌ర్చుకున్నాడు. ఇత‌రుల‌కు సాయం చేయాల‌న్న ఆస‌క్తి ఉన్న‌వారిని ఒకే వేదిక‌పైకి తెస్తూ కేరింగ్ ఫ్రెండ్స్ అనే సంస్థ స్థాప‌న‌లో భాగ‌స్వామి అయ్యాడు. ఎన్జీవో సంస్థ‌ల ఉత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డ‌మే.. ఈ సంస్థ ప్ర‌ధాన‌ ల‌క్ష్యం! వినాయ‌క్ కృషి ప‌ట్టుద‌ల చూసి మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అత‌న్ని త‌మ టాస్క్ ఫోర్స్ మెంబ‌ర్ గా చేర్చుకుంది. ఇది కొంద‌రికి మాత్ర‌మే ద‌క్కే అరుదైన గౌరవం.


అవార్డులకన్నా ఆత్మసంతృప్తే మిన్న

అవార్డులకన్నా ఆత్మసంతృప్తే మిన్న


మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ఉన్న ఈ రోజుల్లో సామాజిక సేవ కూడా ఒక వృత్తేన‌ని.. అందులోనూ ఆర్గ‌నైజేష‌న‌ల్ కెపాసిటీ అవ‌స‌ర‌మ‌నీ గుర్తించిన కొంద‌రంటే కొంద‌రిలో ఒక్క‌డు.. వినాయ‌క్. వినాయ‌క్ సూచ‌న‌ల‌పై బిజినెస్ స్కూళ్ల‌లో చ‌ర్చ‌లు న‌డిచాయి కూడా. ర‌ష్మీ బ‌న్సాల్ అనే ప్రఖ్యాత ర‌చ‌యిత పుస్త‌కంలో వినాయ‌క్ అత‌ని ప‌రివారం మీద ఒక పూర్తి పాఠం ఉందంటే అర్ధం చేసుకోవ‌చ్చు.. అత‌ని నిస్వార్ధ‌ సేవ‌కు ఎలాంటి ప్ర‌తిఫ‌లం ల‌భిస్తోందో. గ‌త కొన్నేళ్లుగా వినాయ‌క్ స్థాపించిన‌ ప‌రివార్ యువ‌త‌ను విప‌రీతంగా ఆక‌ర్షించ‌గ‌లుగుతోంది. ప‌రివార్ ఆశ్ర‌మ్ లో స్వ‌చ్ఛందంగా ప‌నిచేయ‌డానికి వ‌చ్చి చేరేవాళ్ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. అక్క‌డే ఉండి అనాథ బాల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పే వీళ్ల‌ను సేవా-వ్ర‌తీస్ అంటారు. వినాయ‌క్ చూపిన దారిలో న‌డుస్తూ కోట్ల రూపాయ‌లు పెట్టినా దొర‌క‌ని సంతృప్తిని ఆస్వాదిస్తున్నారు. ఈ సంతృప్తి త‌న‌కూ త‌న‌తో ప‌నిచేస్తున్న‌వాళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై పోకూడ‌దు. దేశంలో చాలా మంది ఈ విష‌యం తెలీక వీకెండ్ పార్టీలూ, ప‌బ్బుల్లో సంతృప్తి వెతుక్కుంటున్నారు. విష‌యం తెలీక వాళ్ల‌లా మ‌త్తులో జోగుతున్నారుగానీ వాళ్ల‌కు కూడా స‌రైన అవ‌గాహ‌న క‌లిగిస్తే మ‌రింత మెరుగైన ఫ‌లితాలుంటాయ‌న్న‌దే అత‌ని ఆలోచ‌న‌.


తమ ఆశ్రం పిల్లలతో కలిసి వినాయక్

తమ ఆశ్రం పిల్లలతో కలిసి వినాయక్


అందుకే సోష‌ల్ ఎంట‌ర్ పెన్యూర్ షిప్ మీద ఒక ఇన్ స్పిరేష‌న‌ల్ కోర్సు త‌యారు చేశాడు వినాయ‌క్. త‌న‌కున్న ప‌లుకుబడితో ఐఐఎం ఇండోర్ లో మేనేజ్ మెంట్ స్ట‌డీస్ లో దీన్ని ప్ర‌వేశ పెట్టాడు. ఇందువ‌ల్ల భార‌త‌దేశంలో ఎక్కువ మంది ఎదుర్కుంటున్న బాధ‌ల‌ను తెలుసుకునే అవ‌కాశం క‌లుగుతుంది. ఫ‌లానా స‌మ‌స్య ఫ‌లానా చోట‌ ఉందని తెలిస్తే దాన్ని ప‌రిష్క‌రించ‌డం మీద కొంద‌రిలోనైనా ఆలోచ‌న వ‌స్తుంది. అలా జ‌రిగితే రేప‌టి పౌరుల బ‌తుకు బాగు ప‌డుతుంది. దీంతో పాటు దేశ భ‌విష్య‌త్తు మెరుగ‌వుతుంది. అంద‌రిలా ఆలోచించ‌కుండా భిన్నంగా ఆలోచించ‌డమే కాదు.. అందులో నిస్వార్ధ‌మ‌నే సుగుణానికి కాస్త చోటు ఇవ్వ‌డం వ‌ల్ల మ‌రిన్ని మెరుగైన ఫ‌లితాలుంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకు వినాయ‌క్ జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌. అందుకే అత‌న్ని ఈ పుష్క‌ర‌కాలంలో అనేక అవార్డులూ రివార్డులూ వ‌రించాయి. అంత‌క‌న్నా మించి ఎంద‌రో అనాథ‌లు, గిరిపుత్రులు, వ్య‌భిచారుల పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు పుష్క‌లంగా దొరుకుతున్నాయి. వినాయ‌క్ నీ స్ఫూర్తి మ‌రింత విస్త‌రించాలి. నీ వ‌సుదైక కుటుంబ‌ ప్రేర‌ణ ప్ర‌పంచ‌మంతా పాకాల‌ని ఆశిద్దాం..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags