సంకలనాలు
Telugu

ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్- అంతర్జాతీయంగా ఎదిగిన ఇండియన్ కుర్రాళ్ల స్టార్టప్

SOWJANYA RAJ
10th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


గాల్లో నిలబడి ఉండే స్పీకర్స్...

వైర్లు అవసరం లేకుండా చార్జింగ్ చేసుకునే టాబ్లెట్స్...

సర్వం చూసి, చేసి పెట్టే స్మార్ట్ గ్లాసెస్...

గడియారంలో ఇమిడే స్మార్ట్ సామ్రాజ్యం..

ఈ ప్రొడక్ట్స్ గురించి చదవడమో.. వినడమో చేసి ఉంటాం. ఓ అమెరికా వాడు.. డిజైన్ చేస్తే దాన్ని ఓ చైనావాడు తయారు చేస్తాడని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఓ భారతీయ యువబృందం తమ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. వీరి ప్రతిభను విదేశీయులు నిండు మనసుతో అభినందించారు. ఎంతగా అంటే.. అమెరికా, యూరప్, యూకే మార్కెట్లలో భారీ వాటాను కట్టబెట్టేంత. 

విదేశీ మార్కెట్లలో స్మార్ట్ డివైజస్ కి గట్టిపోటీదారుగా ఉన్న భారతీయ యువకుల సంస్థ ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్. రవి, ఆదిత్య, రోహిత్ అనే ముగ్గురు యువకుల క్రియేటివ్ జర్నీతో సక్సెస్ ఫుల్ గా నిలదొక్కుకున్న స్మార్ట్ స్టార్టప్.

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయింది. ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవదు. అదే ఐదేళ్ల క్రితం... చేతిలో ఫీచర్ ఫోన్ ఉండేది. అప్పుడు కూడా అది లేకపోతే ఎలా బతకాలి అనే ఆలోచన వచ్చేది. కానీ అంతకు ముందు ఐదేళ్ల క్రితం.. ఫోన్ కేవలం ఉన్నత ఆదాయ వర్గాలకు మాత్రమే ఉపకరణం. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు ఐదేళ్ల క్రితం సెల్ ఫోన్ అంటే అలంకారం. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు మానవ జీవతంలో ఫోన్ విడదీయలేని భాగమైంది. అలా మారడానికి కారణం- ఫోన్ ఎప్పటికప్పుడు స్మార్ట్ గా మారిపోతుండటమే. చేతిలో ఫోన్ ఉంటే ఇప్పుడు కడుపులో చల్ల కదలకుడా అన్ని పనులు పూర్తి చేసేయవచ్చు. ఇంతటితో ఆగిపోతే ఫోన్ స్మార్ట్ గానే ఉండిపోతుంది. మరింత అత్యాధునికంగా ఎలా మారాలి..? అందుకే దీన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేసేవాళ్లదే భవిష్యత్ అయింది. ఈ విషయంలో ప్రస్తుతం ఛాంపియన్లుగా మారారు మిత్రత్రయం రవి, ఆదిత్య, రోహిత్. వీరి సంస్థ ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ రూపొందించిన స్మార్ట్ ఉత్పత్తులు యూరప్, అమెరికా, యూకే మార్కెట్లలో హాట్ కేకుల్లా మారాయి.

వైర్ లేకుండా చార్జింగ్ అనే ఆలోచన ఐదేళ్ల కిందట ఎవరికైనా వచ్చి ఉంటుందా..? వచ్చినా దాన్ని సుసాధ్యం చేస్తామని భావించేవారా..?.. ఈ ముగ్గురు మిత్రులకు అలాంటి ఐడియానే వచ్చింది. సుసాధ్యం చేస్తామనే కాన్ఫిడెన్స్ కూడా. అలా 2011లో ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ అనే సంస్థను ప్రారంభించారు. వైర్ లెస్ చార్జింగ్ టాబ్లెట్ల ఆవిష్కరణలో ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. వీరి టెక్నాలజీకి ఫిదా అయిన కంపెనీలు.. ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అలా వారు సొంత బ్రాండ్ ను డెవలప్ చేసుకోవడంతో పాటు, ఇతర కంపెనీలకు ఉత్పత్తులు కూడా రూపొందించారు. రెండేళ్లలోనే అంటే, 2013కల్లా వీరు రూ.40 కోట్ల రూపాయల టర్నోవర్ ఇతర సంస్థలకు ఉత్పత్తులు రూపొందించడం ద్వారా... రూ.10 కోట్ల టర్నోవర్ సొంత బ్రాండ్ల అమ్మకాల ద్వారా సాధించారు.

ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ ఫౌండర్స్<br>

ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ ఫౌండర్స్


అంతర్జాతీయ మార్కెట్ పై పట్టు

భారత్ లాంటి దేశాల్లో కంటే డెవలప్ఢ్ కంట్రీల్లో ఇంకా ఎక్కువ మార్కెట్ ఉంటుందని అంచనా వేసి అటువైపు అడుగేశారు. పరిశోధన, ఉత్పాదన అతి ఖరీదైన వ్యవహారం కావడంతో.. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే నిలదొక్కుకోగలుగుతామనేది వారి నమ్మకం. అలా అమెరికా, యూరప్, యూకే మార్కెట్లలో గాల్లో నిలిచి ఉండే స్పీకర్, స్మార్ట్ గ్లాసెస్ ను ఆవిష్కరించారు. ఏ ఆధారం లేకండా గాల్లో నిలిచి 365 డిగ్రీల కోణంలో సౌండ్ అందించడమే లెవిటేటింగ్ స్పీకర్ స్పెషాలిటీ. స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతుంది. ఈ ఉత్పత్తుల్ని మొదట విదేశాల్లో అమెజాన్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. స్టార్టప్ ల కొత్త ఉత్పత్తుల్ని ప్రొత్సహించేందుకు అమెరికా లాంఛ్ ప్యాడ్ పేరుతో ప్రత్యేకంగా ఓ మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేసింది. ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఉత్పత్తుల్ని చూసి ఫ్లాటైపోయిన అమెజాన్... తమ లాంఛ్ ప్యాడ్ పై వాటికి చోటిచ్చింది. ఇలా అవకాశం దక్కించుకున్న మొట్టమొదట కంపెనీ ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్.

స్మార్ట్ డ్రోన్లు, స్మార్టు రింగులు

స్మార్ట్ గ్లాసెస్, లెవిటేటింగ్ స్పీకర్, స్మార్ట్ వాచెస్, వైర్ లెస్ చార్జింగ్ లాంటి ఉత్పత్తుల్లో అంతర్జాతీయ మార్కెట్లో పట్టునిలుపుకుంటున్న ఐస్ఎక్స్.. మరో రెండు కొత్త ఉత్పత్తులను అతి త్వరలోనే లాంఛ్ చేయడానికి సిద్ధమయింది. అవి స్మార్ట్ రింగ్స్, డ్రోన్లు. వీటి రీసెర్చ్, డెవలప్మెంట్ అంతా విదేశాల్లోనే చేస్తున్నారు. ఎందుకంటే డ్రోన్ల తయారీ, వాడకం, టెస్టింగ్ పై భారత్ లో బోలెడన్ని ఆంక్షలున్నాయి. అందుకే విదేశాలనే ఎంచుకున్నారు. దేశాలను బట్టి, అక్కడి పరిస్థితులను బట్టి, ఉత్పత్తులను పనితనాన్ని టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే డివైజస్ మెరుగైన పనితీరును చూపేలా తీర్చిదిద్దగలరు. ఈ ఇబ్బందులను అధిగమించడానికే రిసెర్చ్, డెవలప్ మెంట్ టీంను విదేశాలకు విస్తరించారు. ఐస్ ఎక్స్ ఉత్పత్తులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ అందుబాటులో ఉంచారు.

" అంతర్జాతీయ మార్కెట్లో మా వాటా పెంచుకునేందుకు వివిధ దేశాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పెంచుకుంటన్నాము. మిడిల్ ఈస్ట్ లో కూడా మా ఉత్పత్తుల్ని లాంఛ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. 2020కల్లా మేము గ్లోబల్ బ్రాండ్ గా అవతరించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాము" ఆదిత్య

స్నాప్ డీల్ ద్వారా భారత మార్కెట్ లోకి..!

వీరు రూపొందించిన అల్టిమా అనే టాబ్లెట్ ను ఇప్పటికే స్నాప్ డీల్ లో అందుబాటులో ఉంచారు. కేవలం ఐదు వేల రూపాయలకే అద్భుతమైన ఫీచర్లతో ఉన్న ఐస్ అల్టిమా టాబ్లెట్ మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. త్వరలో 4జీ ఫోన్లను భారతీయుల అభిరుచులకు అనుగణంగా ఉండేలా తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఐస్ ఎక్స్ టీం చేస్తున్న ప్రయత్నాలు తుది దశలో ఉన్నాయి. ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఉత్పత్తులు ఇప్పుడు విదేశాల్లో నెలకు పది లక్షల డాలర్ల మేర అమ్మకాలు సాగుతున్నాయి. అయితే భారత్ లో పూర్తిగా ధర ఆధారంగా నడిచే మార్కెట్. అందుకే ప్రజల అంచనాలు, ఆలోచనలు, వారి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

"టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మేము ఇన్నోవేషన్ సృష్టించాలనుకుంటున్నాం. అందుకే మేం ఇక నుంచి సొంత బ్రాండ్లను క్రియేట్ చేయడంపైనే దృష్టి పెడుతున్నాం. ఈ రంగంలోకి ఇప్పటికే మొదటివి, మాదైన ఉత్పత్తుల్ని విడుదల చేశాం.."ఆదిత్య

భవిష్యత్ బంగారం

వేరబుల్ డివైజస్ దే భవిష్యత్ అని ఇప్పుడు అంగీకరిస్తున్న మాట. అందుకే స్మార్ట్ వాచ్ లతో సంచలనం రేపిన వీరు.. ఇప్పుడు స్మార్ట్ రింగులపై కన్నేశారు. దీనిపై ఐస్ ఎక్స్ రీసెర్చ్ టీం.. సంతృప్తికరమైన ఫలితాలు సాధించింది. బహుశా ఈ ఏడాదే ఐస్ ఎక్స్ నుంచి స్మార్ట్ రింగులు మార్కెట్ లోకి రావచ్చు. టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ తో పాటు వేరబుల్ స్మార్ట్ డివైజస్ రంగంలో ప్రతీ వ్యక్తి వాడుకునేలా ఐస్ ఎక్స్ ఉత్పత్తులను రీపొందించాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఇప్పటి వరకు ఇతర సంస్థలకు స్మార్ట్ డివైజెస్ తయారు చేసి ఇవ్వడంపై ఫోకస్ తగ్గించి.. సొంత బ్రాండ్ల ఉత్పాదనపైనే అధిక సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అనేక సవాళ్లను వీరు సులువుగా ఎదుర్కొన్నారు. గత ఆరు నెలలుగా మూడు వందల శాతం వృద్ధిని నమోదు చేస్తున్నారు. భారత్ లో నెలకు అరవై వేల టాబ్లెట్లను అమ్ముతున్నారు. నెలకు 250శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ-కామర్స్ తో పాటు టీవీ-కామర్స్ రంగంపైనా వీరు ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పుడు ఐస్ ఎక్స్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చాలా..చాలా హాట్ గురూ..!


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags