సంకలనాలు
Telugu

ఇలాంటి దొంగలు కూడా ఉంటారు జాగ్రత..!!

ఇంటలెక్చువల్ ప్రాపర్టీని అక్రమంగా ఉపయోగించుకున్న ఓ సంస్థ కథ..

GOPAL
8th May 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


సంస్థను నడిపించే విధానమే ఆ సంస్థ నాయకుడి సామర్ధ్యాన్ని బయటపెడుతుంది. ఒకరి దగ్గర పనిచేయడం కంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. అలాగే ఒకరి నిర్ణయాలపై పనిచేయడం కూడా కష్టమే. చాలాసార్లు మీ ఓర్పు ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటుంది. ప్రతి పరీక్షలోను విజయం సాధిస్తేనే జీవితం. లీడర్‌గా ఎదురైన ప్రతి సమస్యను సమర్థంగా ఎదుర్కొని, మనల్ని మనం నిరూపించుకుంటాం. ఏం జరుగుతుందోనన్న భయంతో కాకుండా ఈ సమస్యలన్నింటినీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, మైదానం వదిలి పారిపోకుండా పోరాడాలి. స్టార్టప్‌ల యుగంలో కొత్త కొత్త సవాళ్లు ఎదరవుతున్నాయి. తప్పుడు దారిలో డబ్బు సంపాదించాలన్న తొందరలో కొందరు అనైతిక పద్ధతులు పాటిస్తున్నారు. ఓ సంస్థ చేసిన మోసాన్ని కోర్టులో సవాలు చేసి విజయం సాధించిన సీరియల్ ఆంట్రప్రెన్యూర్ రాజీవ్ ధావన్ తన అనుభవాలను వివరిస్తున్నారు. అనైతిక చర్యలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువ పారిశ్రామికవేత్తలకు సూచిస్తున్నారు.

దురదృష్టవశాత్తూ చాలామంది వ్యాపారంలో నైతిక విలువలను గురించి పట్టించుకోరు. న్యాయమా.. అన్యాయమా అన్నది ఆలోచించరు. వ్యాపారం అంటే కేవలం లాభనష్టాలే వారి భావనలో. అందులో తప్పేమీ లేదు. అలాగే లాభనష్టాల నిర్వచనం కూడా లీడర్‌ను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమంది పుస్తకాల్లో కనిపించే లెక్కలే లాభాలుగా అంచనా వేస్తుంటారు. అనైతిక చర్యల ద్వారా ఆ నంబర్లు వచ్చినా వారికి అభ్యంతరం ఉండదు. మరికొందరికి వ్యాపారం అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మనం లాభపడుతూ ఇతరులకు చేయూత అందించడం. పరస్పరం సహకరించుకుంటూ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం. అయితే సులభంగా డబ్బు సంపాదించే మార్గం కనిపిస్తే అప్పుడు ఈ సహకార విండోను ఆటోమెటిక్‌గా మూసేస్తాం. అప్పుడే అవతలి వ్యక్తికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది. ఆ బాధాకర సమయంలోనే వాస్తవం బోధపడుతుంది. మనమెక్కడ ఉన్నాం.. ఎందుకున్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం.

image


ఇతరుల కంటే ఏ వ్యాపారం కూడా పెద్దది కాదు. ప్రతి ఒక్క బిజినెస్‌మెన్ తన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లాలి.. ఆస్థాయికి తీసుకెళ్లాలి అనుకుంటాడు. అందులో ఉండే సమస్యలు, పోరాటాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అది వేరు విషయం. కానీ అందరిదీ ఒకటే దృక్పథం. ప్రతి ఒక్కరూ వారి సొంత పోరాటాలతోనే యుద్ధం చేయాలి. నేను కూడా కొన్ని పోరాటాలు చేశాను.

అది 2013 వ సంవత్సరం. మా సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయమది. విదేశీ వ్యాపారంపై దృష్టిపెట్టిన ఓ సంస్థ వెబ్ పోర్టల్ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి వచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా ఈ-మేగజైన్లను ఆఫర్ చేసే సంస్థ అది. అలాగే భారత్‌లో జరిగే వ్యాపారాలను వరల్డ్ మార్కెట్‌లోకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌కూడా చేపట్టింది. తమ ప్రాంతాలకే పరిమితమై వ్యాపారం నిర్వహిస్తున్న చిన్న, మధ్య తరగతి ఇండస్ట్రీలే ఆ సంస్థ లక్ష్యం. మాకు అది చాలా ప్రధాన ప్రాజెక్ట్. ఎందుకంటే ఆ సంస్థ విస్తరణ ప్రణాళికలు చాలా సమగ్రంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ చాలా ఆసక్తికరంగా, క్లిష్టంగా కూడా ఉంది. అందుకు కారణాలు రెండు. ఒకటి క్లయింట్ అంచనాలు. రెండు ఈ ఇండస్ట్రీ ప్రవేశిస్తున్న బ్రాండ్. ఏదేమైనా వారితో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. యాడ్ ఏజెన్సీగా మా రీసెర్చ్ మేం నిర్వహించి, ప్రాజెక్ట్ పని ప్రారంభించాం. అప్పటివరకు కంఫర్ట్ జోన్‌లో ఉన్న మేము.. దాని నుంచి బయటకు వచ్చి పనిచేయాల్సిన సందర్భం అది. కానీ మా పెర్ఫార్మెన్స్‌ను ఎవరు జడ్జ్ చేయాలి. క్లయింటే మా పనితీరును అంచనా వేయాలి. మా పనితీరు బాగుందో లేదో చెప్పడం క్లయింట్ ఇష్టాయిష్టాలపైనే ఉంటుందా.. అంటే కానే కాదు.

తొలిసారి క్లయింట్‌తో సమావేశమైన సమయంలోనే వారి అంచనాలను అర్థం చేసుకున్నాను. విశాలమైన కార్యాలయంలోకి ప్రవేశించగానే మా మనసు గాల్లో తేలిపోయినట్టనిపించింది. వందమందికిపైగా పనిచేసేందుకు అవకాశమున్న ప్లేస్ అది. కానీ కొద్ది ప్రాంతాన్ని మాత్రమే వారు వినియోగించుకుంటున్నారు. ఓ రెండు డజన్లమంది పనిచేస్తున్నారు. ఇదే విషయాన్ని సీఈవో దగ్గర పనిచేసే వ్యక్తిని అడిగాను. ‘మా కార్యకలాపాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఉద్యోగులను తీసుకుంటున్నాం. త్వరలోనే ఆఫీస్ నిండిపోతుంది’ అంటూ ఆయన సమాధానమిచ్చాడు. అలాంటి సమాధానాన్నే నేను ఊహంచాను.

అలాగే వారితో చర్చల సందర్భంగా, పెద్ద స్థాయిలో ఆదాయం వచ్చే బిజినెస్ మోడల్‌ కోసం వారు చూస్తున్నారని అర్థమైంది. అప్పుడే మాకెందుకో సంస్థ గురించి తప్పుడు ఆలోచనలు వచ్చాయి. వీరిది ఆత్మ విశ్వాసం కాదు.. అతి విశ్వాసమని. తొలి సమావేశంలోనే వారు తమ మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలను బయటపెట్టారు. అయితే వారి ఆలోచనలతో మాకు సంబంధం లేదు. వారి వ్యాపారాన్ని వారు ఎలా నిర్వహించుకుంటారో కూడా మాకు అక్కర్లేదు. మాకు అప్పగించని పనిని చేయడం మా బాధ్యత. అలాగే మా పనిని కూడా పూర్తి చేశాం.

మా టీమ్ నుంచి ముగ్గురు కీలక ఉద్యోగులు, ఆ సంస్థ నుంచి ఎనిమిది మంది. కంపెనీ ప్రొఫైల్‌ గురించి, చరిత్ర గురించి వివరించాం. కొన్ని గంటలపాటు జరిగిన ఆ సమావేశం సక్సెస్ కాలేదు. వారు కొన్ని ప్రశ్నలడిగారు. వారడిగిన ప్రశ్నలకు మేము సమాధానమిచ్చాం. ఇద్దరం కలిసి నడవాలని నిర్ణయించుకుని, రెండో సమావేశానికి డేట్‌ను ఫిక్స్ చేశాం. వారం తర్వాత మరోసారి సమావేశం.

క్లయింట్‌తో తొలి సమావేశం ముగిసింది. మా ప్రొఫైల్‌ను వారితో పంచుకున్నాం. వారి ఆశయాలను అంచనా వేశాం. ఆరంభ రీసెర్చ్ పూర్తిచేశాం. చర్చల వివరాలను రికార్డు చేశాం. ఇరువురికి పరస్పరం అనుకూలంగా ఉండేలా సమయాన్ని నిర్ధేశించాం. తదుపరి చర్యలు కూడా నోట్ చేసుకున్నాం. పరిస్థితి చూస్తుంటే సరైన దారిలోనే వెళ్తున్నమనిపిచింది.

తొలి సమావేశం జరిగిన ప్లేస్‌లోనే రెండో మీటింగ్ కూడా. వారి వైపు నుంచి రిప్రజెంటేటీవ్స్ తగ్గారు. మా వైపు నుంచి ఒక్కరు మాత్రమే మీటింగ్‌కు హాజరయ్యారు. మాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. కాంట్రాక్టు, ఫార్మాలిటీలను పూర్తి చేయాలని సూచించారు. కానీ మాకు ఇచ్చిన ప్రాజెక్ట్‌ ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే మా ఆలోచన. ఎనిమిది ప్రధాన నగరాల్లో సంస్థను ప్రమోట్ చేయాలి. అందుకోసం ప్రధాన మీడియా ఓఓహెచ్ (ఔట్ ఆఫ్ హోమ్ లేదా ఓఓహెచ్ బిల్‌బోర్డ్స్, రోడ్ మీడియన్స్. ఇంకా పబ్లిక్ ప్లేసుల్లో, ప్రయాణ సమయాల్లో ప్రచారం నిర్వహించాలి). పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం కాకుండా, కాన్సెప్ట్ స్థాయిలో జాబ్‌ను అప్పగించారు. మేం ఏవిధంగా ప్రచారం చేయాలనుకుంటున్నామో వారికి ముందుగా చెప్పి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు మేము అంగీకరించి, మూడు నాలుగు రోజుల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేశాం.

సంస్థ ప్రచారానికి సంబంధించి ఇన్‌ డెప్త్‌గా రీసెర్చ్ చేశాం. మా కీలక బృందం రఫ్ స్కెచెస్ వేసింది. క్లయింట్ అంచనాలను అందుకునేందుకు ఓ నోట్‌ను కూడా సిద్ధం చేసింది. ట్రేడ్, ఎక్స్‌పోర్ట్స్ అన్న రెండు కీవర్డ్స్ ఆధారంగా ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇదో డ్రై సబ్జెక్ట్. కానీ దీన్ని మేం ఆసక్తికరంగా మలిచి, మైలేజ్ సంపాదించాలనుకున్నాం. రెండు మార్గాలను సిద్ధం చేశాం. ఆ రెండు రూట్‌లను ఎందుకు ఎంపిక చేశామో కూడా వివరించాం. సంస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలా ఉపయోగపడుతుందో కూడా వివరించాం. ఆ తర్వాత క్లయింట్‌తో జరిగిన సమావేశంలో మా ఆప్షన్లను వివరించాం. మేము చెప్పినదాన్ని ఆసక్తిగా విన్న క్లయింట్స్.. ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. సంస్థ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో మా ఆనందానికి అంతులేదు. క్లయింట్ నుంచి అనుమతి రావడంతో ఆ ఐడియాను మరింత విస్తరించాం. నోట్స్‌ను విజువల్ కమ్యూనికేషన్‌గా మార్చేశాం. మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట్‌పైకి వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. అంతలోనే క్లయింట్‌ నుంచి కాల్. మరోసారి సమావేవమవుతామని దాని సారాంశం.

అంతకుముందు జరిగిన సమావేశాలకు.. ఇప్పటి సమావేశానికి ఎంతో వ్యత్యాసం. వారితో సమావేశం మాకు తొలి దెబ్బ. కాన్సెప్ట్ విజువల్ ఎగ్జిక్యూషన్‌ను చూసిన క్లయింట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా, అది ‘వావ్’ అనిపించుకునే స్థాయిలో లేదన్నారు. ‘వావ్’ ఫ్యాక్టర్ మిస్సయిందని చెప్పారు. వారి అభిప్రాయం కూడా కరెక్టేనేమో అనిపించింది. ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడ విఫలమయ్యామో తెలుసుకునేందుకు మరిన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ సమయంలో మాకు మరింత సమాచారం లభ్యమైంది. మంచి లీడర్‌కు సరైన ప్రశ్నలు అడిగే సామర్థ్యం ఉండాలి. నేను అలాగే అడిగాను. కానీ వారు నా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాన్ని సరిగా విశ్లేషించడంలో విఫలమయ్యాను. క్లయింట్ అస్పష్ట ఉద్దేశాలను వారి సమాధానాలు ప్రతిబింబించాయి. అయితే ఆ సంకేతాలను మేం పూర్తిగా స్వీకరించలేకపోయాం. మరికొన్ని యాడ్స్ సిద్ధం చేసి తీసుకొస్తామని హామీ ఇచ్చి వెనుదిరిగాం.

మొదట్లో ఉన్న కుతూహలాన్ని మా టీమ్‌కు కలిగించేందుకు నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను. లీడర్‌గా ఇది చాలా అవసరం. ఈ ప్రాజెక్ట్‌లో మేం ఎంతవరకు సక్సెస్ అవుతామో నాకు తెలియదు. కానీ మా పని మేం చేస్తాం. మా టీమ్ మళ్లీ డ్రాయింగ్ టేబుల్స్ ముందేసుకున్నారు. డెడ్‌లైన్‌ లోపల పని పూర్తి చేసేందుకు అర్ధరాత్రిళ్ల వరకు పనిచేస్తున్నారు. మరికొన్ని కొత్త యాడ్ క్యాంపైన్లను రూపొందిస్తున్నారు. మరికొన్ని యాడ్స్‌లతో ఓ సెట్‌ను సిద్ధం చేశాం. ఈసారి క్లయింట్‌ను ఒప్పించగలుగతామన్న ఆత్మవిశ్వాసం మాకు కలిగింది. క్లయింట్‌తో సమావేశానికి సమయం రానే వచ్చింది. షెడ్యూల్డ్ డేట్ ప్రకారం క్లయింట్‌ను కలిసి మా ఐడియాలను ప్రజెంట్ చేశాం. ఈ కొత్త ప్రజంటేషన్లు చూసిన తర్వాత కూడా క్లయింట్ నుంచి సేమ్ రియాక్షన్. మూడు వారాల్లోనే మాకు రెండు ఎదురుదెబ్బలు. మేం రూపొందించిన అన్ని నోట్స్‌ను మరోసారి చెక్ చేసుకున్నాం. తొలి సమావేశాల్లో క్లయింట్ అందించిన సమాచారాన్ని మరోసారి పరిశీలించాం. ఎక్కడ విఫలమవుతున్నామో తెలుసుకునేందుకు కూలంకుషంగా అన్ని విషయాలను పరిశీలించాం. ఎక్కడా పొరపాటు జరిగినట్టు అనిపించలేదు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి. కానీ క్లయింట్ స్పందన మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఏం జరుగుతుందో మాకు అస్సలు అర్థం కాలేదు.

మొత్తం ఎపిసోడ్‌ను మరోసారి సరైన స్ఫూర్తితో తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేసేందుకు మరింత చాలెంజింగ్‌గా వర్క్ చేయాలని డిసైడయ్యాం. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయాలనుకున్నాం. వారధి మధ్యలో ఉన్నాం. అసలు చివర్లో ఏముందో చూడాలన్న కుతూహలం పెరిగిపోయింది. ఏముందో అంచనావేయలేం. చాలా సమయంపాటు చర్చోపచర్చలు జరిగిన తర్వాత మరో తేదీని ఫిక్స్ చేశాం.

ఈ పరిస్థితి కాస్త నిరాశజనకంగానే ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌తో పోరాడేందుకు మమ్మల్ని మేం సిద్ధం చేసుకున్నాం. సత్తా చాటాలని డిసైడయ్యాం. కొత్త ఆలోచనలతో పని ప్రారంభించాం. కొన్ని రోజుల తర్వాత మరికొన్ని కొత్త సృజనాత్మక ఐడియాలతో సిద్ధమైపోయాం. సమావేశంలో మరోసారి వైఫల్యం చెందకుండా ఉండేందుకు మరింత రీసెర్చ్ చేశాం. క్లయింట్ వెబ్‌సైట్‌ను ఓ సారి పరిశీలించి, ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. క్లయింట్ మేం గతంలో రూపొందించిన క్రియేటివ్ కమ్యూనికేషన్‌ను అప్పటికే ఉపయోగించుకుంటున్నారు. అప్పుడు మాకు అర్థమయింది. ముందుగా అంగీకరించిన ఖర్చుకే మరిన్ని కాన్సెప్ట్‌లు రాబట్టుకోవాలన్న క్లయింట్ వక్రమార్గంలో ఆలోచిస్తున్నట్టు అర్థమైంది. వారి అనైతిక ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. అయినా మాకు సంతోషమే అనిపించింది. ఎందుకంటే కలిసిన తొలి సమావేశంలోనే మేము క్లయింట్‌ను సంతృప్తిపర్చగలిగాం.

ఈ విషయాన్ని ఆ కంపెనీ దృష్టికి తీసుకొచ్చి, తప్పును సరిదిద్దాలనుకున్నాం. సీఈఓకు ఈ విషయం తెలుసో లేదోనన్నది మా అనుమానం. అతని దృష్టికి తీసుకెళ్లి పొరపాటు సరిదిద్దాలనుకున్న మా ప్రయత్నాలను బెడిసి కొట్టాయి. అతను కూడా ఉద్యోగుల మాదిరే ప్రవర్తించాడు. కంపెనీ విశ్వసనీయతను పెంచాల్సిన ఆ పెద్ద మనిషి.. తాము చేసిన అనైతిక పనులను సమర్థించుకున్నాడు. అతనేమన్నాడటే.. ‘‘మీరు రూపొందించిన కాన్సెప్ట్‌లను ఉపయోగించుకునే హక్కు మాకుంది. ఈ కాన్సెప్ట్‌లకు సంబంధించి, ఒప్పందం ప్రకారం ముందుగానే డబ్బులు చెల్లించేశాం. ఇప్పుడు మీరు రూపొందించిన కాన్సెప్ట్‌లన్నీ మా సొంతం. మేం ఎలాగైనా వాటిని వాడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. అంతేకాదు ఒప్పందం ప్రకారం ముందుగా అనుకున్న మొత్తంలో ఇవ్వాల్సిన 50 శాతాన్ని కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

అయితే ఆ ఒప్పందంలో రెండు లూప్‌హోల్స్ ఉన్న విషయాన్ని ఆ సీఈఓ దృష్టికి తీసుకొచ్చాం. 

1) మేం చేసిన పనిని అనవసరంగా నిందించడం, పనికిరావని అంటూనే మాకు తెలియకుండా మేం రూపొందించి కాన్సెప్ట్‌లను వాడుకోవడం. 

2) ఒప్పందం పూర్తి అయ్యే వరకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎప్పటికీ బదిలీకావు. ఈ విషయాలను ముందుగానే అగ్రిమెంట్‌లో రాసుకున్నాం. 50:50 నిబంధనతో అగ్రిమెంట్‌ను రూపొందించాం. ఒప్పందం కుదిరినప్పుడు సగం, అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత మిగతా సగాన్ని ఇచ్చి కాన్సెప్ట్స్‌ను ఉపయోగించుకోవాలి. ఆరంభంలో 50 శాతం అమౌంట్ పేచేసిన క్లయింట్, మిగతా సగాన్ని కూడా ఇవ్వాలి. పూర్తి మొత్తాన్ని సెటిల్ చేయకపోతే కాంట్రాక్ట్ పూర్తి కాదు.

రావాల్సిన మిగతా మొత్తం ఇచ్చేందుకు క్లయింట్ తిరస్కరించడంతో కోర్టులో తేల్చుకోవాలని మేము నిర్ణయించాం. అంత పెద్ద కంపెనీతో న్యాయ పోరాటం చేసేందుకు మాలాంటి చిన్న సంస్థలు అంతగా ఆసక్తి చూపవు. కానీ మేం మాత్రం మా పట్టును నిలుపుకోవాలనుకున్నాం. మా హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించాం. మొత్తం ప్రక్రియ భారీ ఖర్చుతో అసౌకర్యంగా ఉంది. ఈ ఎపిసోడ్‌ను సరైన విధంగా ముగించేందుకు మేం చాలా సమయాన్ని, డబ్బును వెచ్చించాల్సి వచ్చింది. అయినా అలాంటి పెద్ద మనుషుల ముందు తలవంచడానికి ఇష్టపడలేదు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకముంది.

కొన్ని విచారణల తర్వాత కోర్టు మాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. జడ్జ్‌మెంట్‌లో కొన్ని కీలక అంశాలు. 

1) క్లయింట్‌కు మా పని నచ్చింది. మాకు తెలియకుండా వాటిని వాడుకోవడం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కాంట్రాక్ట్ కిందకు వస్తుందని నిరూపించబడింది.

2) మా పనికి క్లయింట్ సగం అమౌంట్‌ను మాత్రమే చెల్లించారు. మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. మా పనిని ఉపయోగించుకున్నందున మొత్తం డబ్బును చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

కోర్టు తీర్పు మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. క్లయింట్‌కు మాత్రం షాక్. ఇవ్వాల్సిన మొత్తంతో పాటు నష్టపరిహారం, కోర్టు ఖర్చులు, అన్నీ చెల్లించేశారు. మ్యాటర్ క్లోజ్ అయింది.

ఇప్పటికీ ఆ సంస్థ మేం రూపొందించిన కాన్సెప్ట్‌లనే ఉపయోగించుకుంటోంది. ఇది గుర్తొస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. కానీ తప్పుడు వ్యక్తులతో పనిచేయడం ఎంత సమస్యాత్మకమో ఈ సంఘటన తెలియజేస్తుంది. మాకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో తేల్చుకోవాలనుకోవడం అంత సులభమేమీ కాదు. తీర్పు ఎవరికైనా అనుకూలంగానైనా రావొచ్చు. కానీ నైతికంగా, ఈ ఘటనను ముందుకు తీసుకెళ్లాలని నాకు బలంగా అనిపించింది. ఓ లీడర్‌గా నేను ఈ కేసును ముందుకు తీసుకెళ్లాను.

ఏదేమైనా ఈ ఎపిసోడ్ మాకు మంచి పాఠాలు నేర్పింది. మేం ఎవరితో కలిసి పనిచేస్తున్నామో దాని ప్రభావం మా పనితీరుపై ప్రభావం చూపలేకపోయింది. అటు అంతర్గతంగాను, ఇటు బహిర్గతంగానూ అంతిమంగా పనిమీద మా ప్రేమే విజయం సాధించగలిగింది.

(గమనిక: ఈ స్టోరీలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఉద్దేశాలు రచయిత వ్యక్తిగతం. యువర్‌స్టోరీ అభిప్రాయాలుగా భావించకూడదు)

 

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags