సంకలనాలు
Telugu

పాత టైర్లతో పాదరక్షలు... పర్యావరణానికి మేలు అంటున్న ‘పాదుక్స్’

ఒక ఆర్టికల్ కొన్ని వందల జీవితాలను మార్చేసింది..పాత టైర్లతో పాదరక్షల తయారీతో ప్రకృతికి మేలు..సాధారణంగా చెల్లించే మొత్తానికి 3 రెట్ల కూలీ ఇస్తున్న పాదుక్స్..

ABDUL SAMAD
1st Jul 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

నిత్యజీవితంలో ప్రతీరోజూ మనల్ని ప్రేరేపించేలా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలావాటిని మనం ఇట్టే మర్చిపోతుంటాం. దాన్ని ఎవరైనా చేస్తే... అరే, నేను చేద్దామనుకున్నానే, చేసుంటే బాగుండేదే అనుకుంటుంటాం. అయితే... అప్పటికప్పుడే యుద్ధ ప్రాతిపదికన చేయాలనిపించే, ప్రేరణ కలిగించేవి కూడా కొన్ని ఉంటాయి. ఇలాంటి సంఘటనే జే, జోత్స్న రెజీల జీవితాల్లోనూ జరిగింది.

పాత టైర్లతో తయారు చేసి, కొత్త సొబగులు అద్దుకున్న చెప్పులు

పాత టైర్లతో తయారు చేసి, కొత్త సొబగులు అద్దుకున్న చెప్పులు


ఓ అమెరికన్, ఇండోనేషియా నుంచి పాడైపోయిన పాత టైర్లు దిగుమతి చేసుకుని, వాటితో శాండల్స్, షూస్ తయారు చేస్తుంటారనే ఆర్టికల్ చదివారు జే, జ్యోత్స్న. ఇలా పనికిరాని వాటి రీసైక్లింగ్‌తో పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా... వాటిని తగిన విధంగా ఉపయోగించే ప్రాజెక్టు వారిని ఎంతో ఆకట్టుకుంది. అంతే సమాజానికి తమకు తోచినంతలో ఏదైనా చేయాలనే లక్ష్యంతో, పాదుక్స్ పేరుతో... స్లిప్పర్స్ తయారీ వెంచర్‌ను ప్రారంభించేశారు. కేవలం ప్రకృతి కోసమే కాకుండా.. చెప్పుల తయారీయే జీవితంగా ఉండే మోచీస్ వంటి కొన్ని సామాజిక వర్గాలకు కూడా తగిన విధంగా మేలు చేయచ్చనే విషయం వారికి అర్ధమైంది. ఈ వెంచర్ ద్వారా వచ్చే మొత్తం లాభాలను తమ దగ్గర పని చేసే కార్మికుల అభ్యున్నతికే ఖర్చు చేస్తున్నారు వీరు.

హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమే పాదుక్స్

వ్యాపార రంగంలోకి ఇలా ప్రవేశించడం జే, జ్యోత్స్నలకు ఇదే మొదటిసారి కాదు. పాదుక్స్ వారి రెండో వెంచర్. విద్యార్ధులకు తమ చదువు, కెరీర్ అవకాశాలపై గైడెన్స్ ఇచ్చే ప్రాజెక్ట్‌ను వారు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. పాదుక్స్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని మేం హఠాత్తుగా నిర్ణయం తీసుకుని, అమలు చేశామంటారు జే. వీరిద్దరిలో ఎవరికీ ఫుట్‌వేర్ రంగంపై అంతగా అవగాహన లేకపోయినా.. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలనే భావించారు. ప్రకృతితోపాటు పదిమందికీ సాయపడే పని చేయాలని అనుకున్నారు.

image


ముంబై, గోవండి ప్రాంతంలో కొందరు మోచీలు అప్పటికే స్క్రాప్ టైర్స్‌తో స్లిప్పర్స్ తయారు చేసి మహరాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలకు పంపుతున్నారనే విషయం తెలుసుకున్నారు జ్యోత్స్న. ఈ తరహాలో టైర్లతో తయారు చేసిన చెప్పులు.. ప్రకృతికి సహకరించడంతోపాటు... మరో ఉపయోగం కూడా ఉందని తెలుసుకున్నారు వారు. అవి చాలా గట్టిగా ఉండడంతో మన్నిక ఎక్కువగా ఉండడమే కాకుండా.. ధరించినవాళ్లకు రక్షణ ఇవ్వగలవని తెలుసుకున్నారు. గోవండిలోని మోచీలు.. పాదుక్స్ సంస్థ కోసం సోల్స్ తయారు చేసి ఇచ్చేందుకు అంగీకరించారు. “ఇలా ప్రకృతికి మేలు చేసే పాదుక్స్‌ విక్రయాలకు డిమాండ్ బాగానే ఉంది” అన్నారు జే.

ఉపయోగించుకోవడం కాదు.. ఉపయోగపడాలి

పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నా.. జో, జ్యోత్స్నలు.. పరిశోధన కోసం ముంబైలోని థాకర్ బప్పా కాలనీకి వెళ్లారు. ఈ ప్రాంతంలో మెజారిటీ వర్గం మోచీ సామాజికవర్గానికి చెందినవారే. ఇలా చెప్పుల తయారీ యూనిట్ నెలకొల్పడానికి అవసరమైన సలహా, సూచనలను వారినుంచే తీసుకున్నారు. ఈ ప్రయాణంలో మేం ప్రాజెక్ట్‌కు సంబంధించినవే కాకుండా... మరికొన్ని విషయాలు తెలుసుకున్నామంటారు జే.

“ఈ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు మేం కసరత్తులు మొదలుపెట్టాక... మోచీలు, వారి కుటుంబాలు.. అనేక ఆర్థిక సామాజిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందుకే ఈ కంపెనీ ద్వారా వచ్చే లాభాలను మోచీల కుటుంబ సభ్యులకు వైద్య, ఆరోగ్య సౌకర్యల కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నాం”అని చెప్పారు జే రేజ్.

ప్రస్తుతం వారు మోచీల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర హోల్‌సేలర్స్, రిటైలర్స్ అందించే మొత్తానికి... 3 రెట్లకు పైగా వారికి చెల్లిస్తుండడం విశేషం. మోచీల కష్టాన్ని ఉపయోగించుకుని లాభాల పంట పండించుకోవాలని మేం అనుకోవడం లేదని చెబ్తారు వీరిద్దరు. అసలే పేదరికంతో బాధపడే ఈ నిరక్షరాస్యులకు వీలైనంతగా సాయం చేయాలి తప్ప... వారిని ధనార్జన కోసం ఉపయోగించుకోకూడదంటారు వీరు.

పాదుకులకూ దెబ్బలు తప్పవా ?

"కస్టమర్లకు వారి చెల్లించే మొత్తానికి తగిన విలువైన ఉత్పత్తులను అందించడమే ప్రధాన సమస్య. స్లిప్పర్స్, శాండల్స్ ధరించేవారిలో వాటి సోల్స్ ఏ పదార్ధంతో తయారైందో తెలుసుకునేవారు చాలా తక్కువ. వాటి తయారీలో ఉన్న వ్యక్తుల కష్టం, ఆయా వస్తువులపై వచ్చే లాభాల వంటి విషయాలపై సాధారణ కస్టమర్లకు అంతగా పట్టింపు ఉండదు. డిజైన్ ఎలా ఉంది... లుక్ బాగుందా.. వంటి అంశాలే కొనుగోలుదారులను ఇన్‌స్పైర్ చేస్తాయి. వారు శాండల్స్ కొనడం ఈ అంశాలపైనే ఆధారపడి ఉంటుంది." - జోత్స్న రెజ్

పాదుక్స్ ప్రధానంగా పోటీ పడాల్సింది మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండెడ్ వస్తువులతోనే. బ్రాండింగ్‌లో పోటీపడ్డం, లేదా తక్కువ ధరకు అందించి ఆకట్టుకోవడం... ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి వారి దగ్గర. దీంతో ధర విషయంలోనే జనాలకు అకట్టుకోవాలని భావించినా... అది వారి మార్కెట్ స్థాయిని కుదించేస్తుంది. అందుకే మొదటి ఛాయిస్‌కే మొగ్గు చూపారు. అందుకోసం దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను విస్తరించాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నం వారికి ఎన్నో పాఠాలను, అవకాశాలను తెలిసొచ్చేలా చేసింది. తోటి పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా అవగాహన ఏర్పడేందుకు ఉపయోగపడింది. సమాజానికి మేలు చేసే విషయం కావడంతో తమ ప్రాజెక్ట్ అన్‌లిమిటెడ్ ఇండియాకు సామాజికవేత్తలందరూ సహకరించాలని కోరుతున్నారు జే.

ఈ పాదుకల ప్రయాణం ఎంతవరకో ?

వివిధ రకాలైన శాండల్స్ తయారు చేస్తోంది పాదుక్స్. తమ పాత ప్రాజెక్ట్‌తోనే మొదటి పోటీ పెట్టుకున్నారు ఈ ఇద్దరు. ప్రతీ ప్రాజెక్టుకూ ఓ ప్రత్యేకత ఉంటుందని, అయినా పోటీతత్వం అభివృద్ధికి దోహదం చేస్తుందన్నది వీరి వాదన. కష్టాలకు వెరవకుండా ప్రయత్నాలను కొనసాగించడంతో... డిజైన్స్, మోడల్స్‌ విషయాల్లో వినూత్నత సాధించగలిగారు. పాదుక్స్ కంపెనీ పని చేసే విధానంపై ఒక వీడియోను కూడా రూపొందించారు. అలాగే పలు ఎగ్జిబిషన్లలో పాల్గొని ప్రచారం కల్పించేవారు. స్క్రాప్ టైర్ డీలర్స్‌ను, చివరికి ఎయిర్‌లైన్స్‌ను కూడా పాత టైర్ల కోసం సంప్రదించేవారు. తమ ఉత్పత్తిని మరింత పర్యావరణ హితంగా మార్చేందుకుగాను... శాండల్స్‌లో ఇతర భాగాల తయారీ కోసం బెండు, జనపనార వంటి ఇతర వస్తువులను కూడా పరిశీలించారు. తాజాగా పాదుక్స్ ఒక ఎగ్జిబిషన్‌లో పాల్గొని.. వినూత్నంగా అమ్మకాలు చేపట్టారు. “మీకు నచ్చినంత కట్టండి చాలు” అంటూ అమ్మకాలు చేయడంతో.., రెస్పాన్స్ విపరీతంగా వచ్చింది.

image


“నిజానికి ఇదో ఆసక్తికరమైన రిస్కీ ప్రయత్నం. కస్టమర్లు మా ఉత్పత్తులకు ఎంత ఖరీదు కడతారో మాకు అర్ధమైన సందర్భం ఇదే” అంటారు జే రెజ్.

మార్కెటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలని భావిస్తున్నారు జే, జ్యోత్స్నలు. అలాగే తమదైనా తయారీ యూనిట్ కూడా నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వర్కర్స్ అందరూ వారి సొంత ప్లేస్‌లోనే పని చేస్తున్నారు. అయితే పాదుక్స్‌కు ఓ మంచి తయారీ యూనిట్ నెలకొల్పాలనే యోచన అటు పనివారిలోనూ, ఇటు వ్యవస్థాపకుల్లోనూ ఉంది. అలాగే గట్టి సోల్‌ను ఉపోయోగించి, పాత ఫ్యాషన్ శాండల్స్ స్థానంలో... కొత్త మోడల్‌ను తెచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పైసల కోసం కాదు ఈ పాదుక్స్

“డబ్బు సంపాదించేందుకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించలేదు. కొన్ని జీవితాల్లో మార్పు తీసుకురాగలమనే నమ్మకమే దీనికి పునాది. అలాగే ప్రకృతికి సాయం చేస్తే... మన చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేసినట్లే అని భావించా. మాకు ప్రేరణ, ఉత్సాహం ఇచ్చే అంశాలివే ” అంటారు జే.

పాదుకల కోసం సాయం చేసే చేతులు

ఈ వెంచర్ కోసం మీరు దానం చేయాలనుకుంటే.. తోచినంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వచ్చు. దీనికోసం క్రౌడ్ ఫండింగ్ కేంపెయిన్ నిర్వహిస్తోంది పాదుక్స్. సమాజానికి సాయం చేసేందుకు ప్రారంభించిన కంపెనీల్ల... ఇలా విరాళాలు కోరేవారు తక్కువగా ఉంటారు. అయితే.., పదిమందికీ మేలు చేసేందుకు.. ఇలా విరాళాలు సేకరించడానికి తాము సిగ్గు పడ్డం లేదంటున్నారు జే, జ్యోత్స్నలు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags