సంకలనాలు
Telugu

అద్భుతమైన బయోపిక్ కథలు సిద్ధం..!తెరకెక్కించడమే ఆలస్యం..!!

vennela null
3rd Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఇప్పుడు బాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. యదార్థ జీవిత గాథ.. సినిమాకు సక్సెస్ ఫార్ములా అయింది. భాగ్ మిల్కా భాగ్ తో మొదలయిన ఈ ట్రెండ్- వెండితెరమీద సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది.

ప్ర‌స్తుతం బయోపిక్ నేపథ్యంతో తీసిన అనేక చిత్రాలు బాక్సాఫీసు ముందు క్యూలో నిల‌బ‌డ్డాయి. వాటిలో ఈమధ్య రిలీజైన నీర్జా, ఎయిర్ లిఫ్ట్ సక్సెస్ కాగా, అజ‌హ‌ర్‌, ధోనీ చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మహిళ‌ల బ‌యోపిక్ లో ముఖ్యంగా చెప్పుకునేది ఇండియ‌న్ బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ సినిమా గురించే. ఆ పాత్ర‌లో ప్రియాంక చోప్రా విమర్శకులను సైతం మెప్పించింది.

నిజానికి బాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు హీరో చుట్టూ సాగిన మూస సినిమాలే. జనం కూడా వాటిని చూసీచూసీ విసిగిపోయారు. ఇప్పుడిప్పుడే టేస్ట్ మారుతోంది. ట్రెండ్ మారుతోంది. బయోపిక్ బంపర్ హిట్ అవుతోంది. నిజ‌జీవితం నేపథ్యంలో సాగే సినిమాలకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. 

image


బయోపిక్ కథలకు లోటేం లేదు. ముఖ్యంగా మహిళల వీరోచితగాథలు పుష్కలంగా ఉన్నాయి. తెర‌కెక్కించాలే గానీ ఇన్ స్టంట్ గా ఓ 8 సినిమాలు చేతిలో ఉన్నట్టే. మరి అవేంటో ఒకసారి చదివేయండి!!

1. ఇరోం ష‌ర్మిలా ..!

మ‌ణిపూర్ ఉక్కు మ‌హిళ‌గా పేరొందిన ఇరోం ష‌ర్మిల పేరు విన‌గానే- ఆమె ముక్కుకు పైపు, మొహం మీద తెరలుతెరలుగా వాలిపోయిన ఉంగరాల జుట్టు, కళ్లో పోరాట ప‌టిమ.. మొత్తంగా ఆమె దేహమే ఒక ఆయుధంలా కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్ట్ ( ఆఫ్‌స్పా) చ‌ట్టం ర‌ద్దు చేయాల‌ని దాదాపు పదహారేళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న అలుపెరుగని యోధురాలు. 2000 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 2వ తేదీన మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంఫాల్ స‌మీపంలో మ‌లోం అనే గ్రామంలో ప‌ది మంది పౌరుల‌ను సైనిక బ‌ల‌గాలు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్చిపారేశాయి. ఆఫ్ స్పా చ‌ట్టం ప్ర‌కారం ఈశాన్య రాష్ట్రాల్లో సైన్యం ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయ‌వ‌చ్చు. అల్ల‌ర్లను అణ‌చేందుకు కాల్పులు జ‌ర‌ప‌వ‌చ్చు. అయితే ఈ చ‌ట్టాన్ని తొల‌గించాల‌ని ఇరోం నిరాహాదీక్ష మొద‌లు పెట్టింది. ఎన్నోసార్లు అరెస్టయింది. విడుదలైంది. గృహనిర్బంధంలోనూ ఉంది. చట్టాన్ని వెనక్కి తీసుకునేదాకా పచ్చిమంచినీళ్లు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేసింది. తల కూడా దువ్వుకోనని భీష్మించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షర్మిల పోరాటానికి కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్య దేశంలో చట్టం పేరుతో అమాయకులపై దౌర్జన్య పనికిరాదు అనేది ఆమె సిద్ధాంతం. అలా 2000 సంవత్సరం నుంచి నేటి వరకు నిరాహార దీక్షలోనే ఉంది. ఆరోగ్యం క్షీణించినప్పుడల్లా ముక్కు గొంతు ద్వారా బ‌ల‌వంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ప్రాణాలను నిల‌బెడుతున్నారు. సాటి మనుషుల కోసం ఆమె పడే తపనను, పోరాట పటిమను వెండితెరమీద ఆవిష్కరించగలిగితే ఇరోం జీవితగాథ భారతీయ సినిమా చరిత్రలో ఒక అపురూప చిత్రంగా నిలిచిపోతుంది.

2. సావిత్రి బాయి ఫూలే..!

దేశంలో తొలిత‌రం మ‌హిళా ఉద్య‌మ‌కారుడిగా పేరొందిన మ‌హాత్మా జ్యోతీరావు ఫూలే స‌తీమ‌ణి సావిత్రి బాయి ఫూలే. మ‌హిళ‌ల‌ సంపూర్ణ వికాసం కోసం నడుం కట్టింది. 12 ఏట‌నే జ్యోతిరావు ఫూలేకు ఇచ్చి వివాహం చేశారు. భ‌ర్త ప్రోత్సాహంతో చదువుకుంది. పుణెలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించడమే కాకుండా, దేశంలోనే మొట్టమొదటి మహళా అధ్యాపకురాలిగా సావిత్రి పని చేసింది. స్త్రీలు చదువుకోవడం పాపం అనే మూఢనమ్మకం రాజ్యమేలే ఆరోజుల్లో అడుగడుగునా అవరోధాలు ఎదుర‌య్యాయి. ఆమె పాఠశాలకి వెళ్ళేటప్పుడు ఇంకొక చీర పట్టుకుని వెళ్ళేదట. ఎందుకంటే, ఆమె మీద పేడ, చెప్పులు, కోడిగుడ్లు లాంటివి విసిరి, తిట్లూ శాపనార్ధాలూ పెట్టేవారట. స్కూలుకి వెళ్లాక చీర మార్చుకునేవారట. అలాంటి ప‌రిస్థితుల్లో సావిత్రి బాయి ఫూలే అకుంఠిత దీక్ష‌తో స‌మాజ సంస్క‌ర్త‌గా నిలిచారు. తెరచాటున ఉండిపోయిన వితంతువుల జీవితాల‌ను వెలుగులోకి తెచ్చారు, స్త్రీల‌పై జ‌రిగే అత్యాచారాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. ఒక బ్రాహ్మ‌ణ వితంతువు వ‌దిలేసిన శిశువును ద‌త్త‌త తీసుకుని.. అత‌ణ్ని పెంచి పెద్ద చేసి డాక్ట‌ర్ చదివించారు. 1897 లో వచ్చిన భయంకరమైన ప్లేగు వ్యాధి బాధితులకి తన కొడుకు ఆసుపత్రిలోనే వైద్యం చేయించే క్రమంలో- తను కూడా ఆ వ్యాధి సోకి చనిపోయారు. ఆమె జీవితంపై మ‌రాఠీలో మూడు చిత్రాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ జ‌నాద‌ర‌ణకు నోచుకోక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. బాలీవుడ్ త‌ల‌చుకుంటే సావిత్రి జీవితాన్ని స్ఫూర్తిదాయ‌కంగా మలచవచ్చు. 

3. కెప్టెన్ ల‌క్ష్మి సెహగల్..!

ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ జీవితంపై రెండు చిత్రాలు వ‌చ్చాయి. కానీ అంతే స్థాయిలో త్యాగం, దేశ‌భ‌క్తి, ధృడ‌సంక‌ల్పం ఉన్న ఒక మ‌హిళ జీవితం మాత్రం నేటికీ చ‌రిత్ర‌లో పెద్ద‌గా వినిపించ‌దు. ఆమె మ‌రెవ‌రో కాదు- సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీకి మ‌హిళా విభాగ‌పు సైనిక అధిప‌తి- కెప్టెన్ ల‌క్ష్మి సెహ‌గ‌ల్. ఆమె జీవితమంతా సాహ‌సాలే. 1942లో బ్రిటిషర్లతో కలసి జపనీయులు సింగపూర్‌ను ఆక్రమించుకున్నారు. అదే సమయంలో ఆమె సింగపూర్ లో ఉన్నారు. ఆ యుద్ధంలో గాయపడ్డవారికి లక్ష్మీ సెహగల్‌ వెైద్య సేవలు అందించారు. సరిగ్గా అప్పుడే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సింగపూర్‌కు వచ్చారు. అక్కడ ఆయన ప్రసంగాలకు ప్రభావితురాలెైన లక్ష్మీ సెహగల్- స్వాతంత్య్రోద్యమంలో నేను సైతం అంటూ దూకారు. బోస్ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ఆధ్వర్యంలోని జాన్సీ రెజిమెంట్‌కు ఆమె ప్రాతినిథ్యం వహించారు. ఆసియా మొట్టమొదటి మహిళా యూనిట్‌ కూడా అదే. ఆ యూనిట్‌ కెప్టెన్‌గా ఉన్న లక్ష్మీ... బ్రిటీష్‌ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.1945 మేలో బర్మాలో బ్రిటిష్ సేన‌ల‌కు చిక్కి స్వదేశానికి బందీగా వ‌చ్చారు. తర్వాత జ‌రిగిన విచార‌ణ‌ల్లో ఆమె విడుద‌లయ్యారు. స్వాతంత్ర్యానంత‌రం కెప్టెన్ ల‌క్ష్మీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

image


4. క‌ల్ప‌నా స‌రోజ్‌..!

జీవితంలో ఎదురైన ప్రతి అవమానాన్ని, ప్రతీ అపజయాన్ని సవాల్‌గా తీసుకున్నారు. బీదరికంలో పుట్టినప్పటికీ, అంచెలంచెలుగా నిలదొక్కుకుని ఇప్పుడో వ్యాపార‌ సామ్రాజ్ఞిగా ఎదిగారు. కూటికి వెతుక్కునే స్థితినుంచి వేలాదిమందికి జీవనోపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. ఆమె మ‌రెవ‌రో కాదు కల్పనా సరోజ్‌. ద‌ళిత కుటుంబంలో పుట్టిన పాపానికి అడుగడుగునా అవమానాలు. చీదరింపులు. చీత్కారాలు. ఓపికతో భరించారు. ఏడవ తరగతిలో ఉండగానే పెళ్లయింది. భర్త తనకంటే పన్నెండేళ్లు పెద్ద. అత్తగారింట్లో హింస మొదలైంది. పన్నెండేళ్ల పసిప్రాయం అని కూడా జాలి చూపలేదు అత్తింటివారు. ఒక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది. కానీ సమస్యకు పరిష్కారం చావు కాదనుకున్నారు. లైఫ్ విలువను తెలుసుకున్న క‌ల్ప‌న- ఆ జీవితాన్ని ఒక పూల‌బాట‌గా మలుచుకున్నారు. చిన్న ఉద్యోగాలు చేస్తూ, టైల‌ర్‌గా, ఫ‌ర్నిచ‌ర్ డీల‌ర్‌గా.. వ్యాపారరంగంలో నిల‌దొక్కుకున్నారు. మూతపడటానికి సిద్ధంగా ఉన్న కమానీ ట్యూబ్స్ అనే కంపెనీని అత్యంత సాహసంతో చేతుల్లోకి తీసుకుని తిరిగి నిలబెట్టింది కల్పన. ఒక చిన్న లోన్‌తో మొదలైన ఆమె వ్యాపారం.. ఇప్పుడు 122 మిలియన్ డాలర్ల అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైంది. ఈమె జీవితాన్ని తెర‌కెక్కించాల‌ని హాలీవుడ్ డైర‌క్ట‌ర్లు ఆ మధ్య సంప్ర‌దించారు. ప్రియాంక చోప్రా అయితే పాత్ర‌లో ఇమిడిపోతార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ కథే ఇప్పటిదాక సెట్స్ మీదకి రాలేదు. 

5. అరుణిమా సిన్హా...!

అరుణిమా సిన్హా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దివ్యాంగురాలు. కొండంత విషాదాన్ని దిగమింగి- ఎవరెస్టు అధిరోహించిన ఆమె సంకల్పానికి విధి సైతం మోకరిల్లింది. జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ- ఓసారి రైలు ప్రయాణంలో దోపిడీ దొంగల్ని ప్రతిఘటించారు. ఆ ఘర్షణలో దొంగలు ఆమెను రైలు నుంచి కిందకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె కాలు పోయింది. అయినా పట్టువదలకుండా జీవితంతో పోరాడింది. రెండు కాళ్లుంటేనే ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించాలంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది ఒంటికాలితో అత్యంత ఎత్తయిన శిఖరం అంచున విజయ గర్వంతో నిలబడటం అంటే.. మాటలు కాదు. ఎవ‌రెస్ట్ ఒక్కటే కాదు.. ఆఫ్రికాలో కిలిమంజారో, యూర‌ప్ లోని ఎల్‌బ్ర‌స్‌, ఆస్ట్రేలియాలోని కొజియోస్కోకో, అర్జెంటీనాలోని అకోంక‌గువా ప‌ర్వతాల‌నూ అరుణిమా అధిరోహించింది. ఇలాంటి వ్యక్తుల జీవితంపై సినిమా తీస్తే - వెండితెర ఆణిముత్యంలా నిలిచిపోతుందని ద‌ర్శ‌కుడు ఫర్హాన్ అఖ్త‌ర్ ముందుకొచ్చారు. 

6. శ్వేతా క‌త్తి..!

ముంబై మహానగరం. రెడ్‌లైట్ ఏరియా. ఎందరో అభాగినుల ఛిద్రమైన బతుకులు ఒత్తుగా పూసుకున్న మస్కారాలా కనిపిస్తాయక్కడ. శ్వేత కూడా అలా బలైన యువతే. దుర్భ‌ర‌మైన వ్య‌భిచార‌ కూపం నుంచి ఎలాగోలా బయటపడింది. కొత్త జీవితం కోసం సాగించే ఆమె అన్వేషణకు 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ తోడుగా నిలిచింది. ముంబై రెడ్ లైట్ ఏరియాలోని వ్యభిచార కూపంలో మగ్గుతున్న అమ్మాయిల్లో మార్పు తీసుకురావాలన్నదే ఆ సంస్థ ధ్యేయం. శ్వేతకు సీఏ చదవాలనుంది. ఆమె ఆశయానికి మెచ్చి రాబిన్ చౌరాసియా ఆమెకు ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, న్యూయార్క్ లోని బార్డ్ కాలేజీలో సైకాలజీ డిగ్రీ చదివేందుకు 30 వేల డాల‌ర్ల‌ స్కాలర్ షిప్ కూడా లభించింది. ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి వ‌చ్చి- న్యూయార్క్ లో చ‌దువుతున్న తొలి యువ‌తిగా శ్వేతా చరిత్ర సృష్టించింది. ఆమె జీవితాన్ని బయోపిక్ గా తెర‌కెక్కించడానికి ఇంతకంటే కంటెంట్ ఇంకేం కావాలి?

image


7. జ్యోతి రెడ్డి..!

ఆమె అనాథ కాదు. అయినా అనాథ శ‌ర‌ణాల‌య‌మే ఇల్లయ్యింది. పేద‌ర‌కం మూలంగా త‌ల్లిదండ్రుల పేరు ఎత్త‌లేదు. దుర్భ‌ర దారిద్ర్యం అనాథ అని అబ‌ద్ధం చెప్పేలా చేసింది. ప‌దోత‌ర‌గ‌తి పాస్ అయి బైటికి వ‌చ్చాక- త‌నకంటే ప‌దేళ్లు పెద్ద‌వాడైన వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఇంట్లో వాళ్లు. 18 ఏళ్లు దాటేస‌రికి ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లయింది. ఒక సాధార‌ణ వ్య‌వ‌సాయ‌కూలీగా జ్యోతి బ‌త‌కాల్సి వ‌చ్చింది. కొంతకాలం గ్రామంలోని ఒక ప్ర‌భుత్వ పాఠశాల‌లో కాంట్రాక్ట్ టీచ‌ర్‌గా ప‌నిచేసింది. అక్క‌డి నుంచి ఒక బంధువుల అమ్మాయి స‌హాయంతో అమెరికా వెళ్లాల‌ని సంకల్పించింది. రూపాయి రూపాయి పోగుచేసి సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకుంది. అనుకున్నట్టే అమెరికా చేరింది. సేల్స్ గ‌ర్ల్ గా, రూం స‌ర్వీస్ ప‌ర్స‌న్‌గా, బేబీ సిట్ట‌ర్, సాఫ్ట్ వేర్ రిక్రూట‌ర్.. ఇలా జ్యోతి అమెరికాలో చేయని పనంటూ లేదు. ఆనాడు120 రూపాయ‌ల‌తో మొద‌లైన జ్యోతి ప్రయాణం- మెరికాలో మల్టీ మిలియనీర్ వరకు సాగింది. జ్యోతిరెడ్డి జీవిత గాథను తెర‌కెక్కిస్తే.. నిజంగా పదిమందికి స్ఫూర్తిదాయ‌కమే కదా..

8. కృష్ణవేణి..!

73వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా, మూడింట ఒక వంతు పంచాయితీ రాజ్ లో మ‌హిళ‌ల‌కు స్థానం కేటాయించాల‌నే చ‌ట్టం అమల్లోకి వ‌చ్చింది. ఈ చ‌ట్టం ద్వారా తొలిసారిగా త‌మిళ‌నాడులోని నెళ్లయ్ జిల్లాలో త‌లైయుత్తు పంచాయితీలో కృష్ణ‌వేణి అనే దళిత మహిళ తొలి స‌ర్పంచ్‌గా ఎన్నికైంది. ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని ప‌రిస్థితుల్లో గ్రామ స‌ర్పంచ్‌గా ఎన్నికైన కృష్ణ‌వేణి.. ఒక చ‌రిత్ర సృష్టించింది. గ్రామంలో రోడ్లు వేయించింది. లైబ్ర‌రీలు నిర్మించింది. గ్రామ స్వ‌రూపాన్ని మార్చివేసింది. అయితే ఆమె ప్ర‌త్య‌ర్థులు ఒకసారి క‌త్తుల‌తో దాడి చేశారు. అగ్ర‌కుల‌స్తులు ఆక్ర‌మించుకున్న ద‌ళితుల భూముల్లో మ‌హిళ‌ల‌కు మ‌రుగుదొడ్లు నిర్మించినందుకే ఈ దాడి జ‌రిగింద‌ని తర్వాత తెలిసింది. కృష్ణ‌వేణికి న్యాయం జ‌ర‌గాల‌ని యువ‌త ఉవ్వెత్తున ఎగిసింది. ఇలా కృష్ణవేణి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. 

బాలీవుడ్ సినిమాల ద్వారా ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి క‌లిగించే వ్య‌క్తిత్వాలను తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. కానీ ఆ దిశ‌గా ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలా జ‌రిగితే జీవితాలు వెలుగులోకి వ‌చ్చి న‌లుగురికీ దారి చూపుతాయి.  

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags