చేనేతల వెతలు తీర్చిన మల్లేశంకు ఘనమైన గౌరవం

చేనేతల వెతలు తీర్చిన మల్లేశంకు ఘనమైన గౌరవం

Thursday January 26, 2017,

2 min Read

చేతులు లాగుతున్నాయి బిడ్డా అంటే.. ఆ కొడుకు మనసు తల్లడిల్లిపోయింది. అమ్మ భుజం నొప్పితో బాధపడుతుంటే ఏం చేయాలో తెలియలేదు. అమ్మ కష్టం గట్టెక్కేదెలా..? భుజం నొప్పినుంచి తల్లిని దూరం చేసేదెలా? అంతులేని మానసిక సంఘర్షణ. ఆలోచననల్లోంచే మెరుపులాంటి ఐడియా తట్టింది. ఆ ఐడియా ఆవిష్కరణగా మారింది. ఆ ఆవిష్కరణ పేరే లక్ష్మీ ఆసుయంత్రం. దాని సృష్టికర్త , పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశం.

యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన నేతకారుడు చింతకింది మల్లేశం. నిరుపేద చేనేత కుటుంబం. అమ్మచీరలు నేస్తుంది. ఆమె రోజంతా ఆసు పోస్తేగానీ ఒక చీర తయారుకాదు. పిన్నుల చుట్టూ 9వేల సార్లు దారాన్ని తిప్పుతుంది. అంటే దాదాపు 12-13 కిలోమీటర్ల దూరమంత పొడవు. అలా రోజుకి 18వేల సార్లు కండెల చుట్టూ తిప్పాలి. అలా చేస్తేగానీ రెండు చీరలు తయారుకావు. మెడ లాగేస్తుంది. వేళ్లు పీక్కుపోతాయి. భుజం పట్టేస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. తల్లి పడుతున్న బాధ మల్లేశాన్ని కదిలించింది. అమ్మ కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చేయాలని మనసులో బలంగా నాటుకుంది. ఒక మెషీన్ లాంటిది కనిపెడితే ఎలా వుంటుందీ అని అనుకున్నాడు. 

image


తనకొచ్చిన ఐడియాను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. కానీ, వాళ్లు అది అయ్యే పనికాదు వదిలేయ్ అన్నారు. మిషన్లు, మోటార్లు నీకెక్కడివి అని నిరుత్సాహ పరిచారు. దానికయ్యే ఖర్చు గురించి ఆలోచించావా అని హెచ్చరించారు. అయినా మల్లేశం ఆశ చావలేదు. సాధించి తీరుతాననే నమ్మకం ఉంది. అక్కడే ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని.. హైదరాబాద్ వచ్చాడు. అక్కడే ఒక పార్ట్ టైం జాబ్ చూసుకున్నాడు.

ఉద్యోగం చేస్తున్నాడు కానీ, మనసంతా యంత్రం మీదనే ఉంది. పరిశోధిస్తూ, ఆలోచనలకు పదును పెడుతూ ఒక్కో పార్ట్ జతచేశాడు. రోజుకి కొంత చొప్పున అలా ఏడేళ్లు కష్టపడి, యంత్రానికి ఒక రూపం తీసుకొచ్చాడు. ప్రాణాలు లేచివచ్చాయి. ఇంటిదగ్గర తల్లి కళ్లముందు కదలాడింది. అమ్మకు ఇక ఎలాంటి కష్టం ఉండదని కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక్క తన తల్లికోసమే కాదు.. తన ఊరిలో చేనేత కుటుంబాల్లోని ఎందరో తల్లుల బాధలను ఈ మిషన్ గట్టెక్కిస్తుందని సంతోషించాడు.

మిషన్ అంటే యంత్రాలతో హడావిడిగా వుండదు. రెండు తక్కువ కెపాసిటీ గల మోటార్లు, వుడ్ ఫ్రేమ్ మాత్రమే ఉంటాయి. శారీరకంగా ఎలాంటి శ్రమ ఒత్తిడీ ఉండదు. ఇంటిపని వంటపని చూసుకుంటూనే, వీలైనన్ని చీరలకు ఆసుపోయవచ్చు. టైం చాలా ఆదా అవుతుంది. ప్రొడక్షనూ పెరుగుతుంది. రోజులో రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం ద్వారా 6-7 నేస్తారు. మామూలు ఆసు యంత్రం ద్వారా ఒక చీర నేయడానికి 5-6 గంటల టైం పడుతుంది. కానీ ఈ మిషన్ ద్వారా అయితే గంటన్నరలో అయిపోతుంది.

ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారు చేశాడు. ఒక్కోదాని ఖరీదు 25వేలు. ఆరో తరగతిలోనే చదువు ఆపేసి, 8 ఏళ్లు కష్టపడి, లక్ష్మీ ఆసుయంత్రం ఆవిష్కరించిన మల్లేశం పేరు.. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. మొదటి ఏడాదిలో 60 మిషన్లు తయారు చేశాడు. 2002 నుంచి 2004 వరకు సంవత్సరానికి వంద మిషన్ల చొప్పున బిగించాడు. 2006లో యంత్రానికి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు జతచేశాడు.

లక్ష్మీ ఆసుయంత్రం ఆసియాలో ద బెస్ట్ అని అమెరికాకు చెందిన పాబ్ లాబ్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. 2010లో పేటెంట్ హక్కులొచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు వచ్చింది. 2011లో ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికాకు చెందిన ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఇలా అనేక ప్రశంసలు, అవార్డలు, రివార్డులు అందుకున్న మల్లేశాన్ని కేంద్రం.. పద్మశ్రీతో సత్కరించింది.