సంకలనాలు
Telugu

భారత కళలకు ప్రాణం పోస్తున్న ‘దస్తకరీ హాత్ సమితి’

hari prasad
13th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అంతరించిపోతున్న భారత కళలకు ప్రాణం పోస్తున్నారు జయ జైట్లీ. కొన్ని దశాబ్దాలుగా ఆమె చేస్తున్న కృషి ఫలితంగా కళలే కాదు. వాటినే నమ్ముకొని బతుకుతున్న ఎందరో హస్తకళాకారులు సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నారు. నమ్ముకున్న కళే వారిని కరవు కోరల్లోంచి బయటపడేసింది. వారి కాళ్లపై వారు నిలబడేలా చేసింది. మూడు దశాబ్దాల కిందట ఆమె నెలకొల్పిన ‘దస్తకరీ హాత్ సమితి’ సంస్థ ఎన్నో నిశ్శబ్ద విప్లవాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది.

image


తనకు చిన్నప్పటి నుంచీ సహజంగానే అబ్బిన కళాభిరుచి జయ జైట్లీని కళాకారుల సంక్షేమంపై దృష్టిసారించేలా చేసింది. గుర్తింపు, ఉత్పత్తులకు తగిన మార్కెట్ సదుపాయం కల్పిస్తే కళ ఎప్పుడూ అంతరించిపోదని ఆమె ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు డిజైన్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న జయ.. కళ ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిందో, నిజమైన మహిళా సాధికారత ఎలా సాధించారో వివరిస్తున్నారు. ‘కరవు బారిన పడిన కచ్ ప్రాంతంలోని మహిళలు తమ కళను పక్కనపెట్టి ఎర్రటి ఎండలో రాళ్లు కొడుతూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వారిలోని కళను ప్రోత్సహించాలని నిర్ణయించాం. వారి నుంచి పాత ఎంబ్రాయిడరీ దుస్తులను కొనడంతోపాటు కొత్తగా పని కల్పించాలని అనుకున్నాం. మొదట ఒక గ్రామంలో కేవలం రెండిళ్ల నుంచి ఈ పని ప్రారంభించాం. ఇప్పుడది 500 గ్రామాలకు విస్తరించింది. కరువు అక్కడి పంటపొలాలను, పశువులను కాటేసిందేమోగానీ.. కళను కాదు’ అంటూ తాను చేపట్టిన విజయవంతమైన ప్రాజెక్టుల్లో ఒకదాని గురించి వివరించారు జయ. 

ఆమె చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల కచ్ ప్రాంతంలోని మహిళలు ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నారు. సొంతంగా బ్యాంక్ అకౌంట్లు నిర్వహించుకునే స్థాయికి వారు చేరుకోవడం గమనార్హం. చదవడం, రాయడం కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల ఊళ్లల్లోకి కరెంట్ వచ్చింది. వాళ్లు ఆ కరెంటు బిల్లులు చెల్లించే స్థాయికి చేరారు. ఎంబ్రాయిడరీ అనే వాళ్ల కళకు తగిన గుర్తింపు, మార్కెట్ కల్పించడమే వాళ్ల ఈ ఆర్థిక ప్రగతికి ముఖ్య కారణమని జయ చెబుతున్నారు. 

కరువు పీడిత ప్రాంతంలో పురుషులకు కాకుండా మహిళలకు పని కల్పించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. దీనివల్ల ఆ మహిళల సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. నిజమైన మహిళా సాధికారతకు ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఇంకేం కావాలని జయ ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత అనగానే పాశ్చాత్య దేశాల వైపు చూసే సంస్కృతిని విడనాడాలని ఆమె సూచిస్తున్నారు. ‘పురుషాధిక్య సమాజంలో మహిళను గౌరవించి, ఆమె మాటకు విలువ ఇచ్చినంత వరకూ వారు తమ సాంప్రదాయ మూలాలను మరచిపోరు. నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి తమ పనులు తాము చేసుకోవడం, ఆసుపత్రులకు వెళ్లడం, చదవడం, రాయడం నేర్చకోవడం కోసం విద్యా కేంద్రాలకు వెళ్తుండటం కచ్ మహిళల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది’ అని జయ వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న జయ జైట్లీ.. ఇప్పుడు వారి కుటుంబాల్లో మూడోతరంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

image


చిన్నతనం నుంచే కళల పట్ల మక్కువ

జయ బాల్యం ఎక్కువగా జపాన్ లోనే గడిచింది. అక్కడే ఆమెకు కళలపై మక్కువ ఏర్పడింది. కళను బతికించాలన్న ఆమె ఆశయానికి అక్కడే బీజం పడింది. ‘1965లో నా వివాహం తర్వాత కశ్మీర్‌లో ఉండేవాళ్లం. నైపుణ్యం ఉన్న హస్త కళాకారులు ఎందరో తగిన గుర్తింపు లేక, తమ వస్తువులు అమ్ముడుపోక దీనస్థితిలో ఉండడాన్ని నేను గమనించాను. సామాజిక స్పృహ కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నన్ను సహజంగానే వాళ్ల కష్టాలు కదిలించాయి. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ డిమాండ్ చేయడం కన్నా.. వాళ్లు సాధికారత సాధించేలా చేయడం ముఖ్యమని సామాజిక ఉద్యమంలో భాగంగా నేను నేర్చుకున్నాను. హోదా వాళ్లకు ఏమీ ఇవ్వదు. తగిన మార్కెట్ వసతి కల్పిస్తే చాలు వాళ్లు తమ కాళ్లపై తాము నిలబడతారు. స్వతంత్ర భారతదేశంలో కళకు ఊపిరిలూదిన కమలాదేవి చటోపాధ్యాయ, ఖాదీపై గాంధీజీ చూపిన ఆసక్తి గురించి చదవడం నాపై ఎంతో ప్రభావం చూపింది. కళలపై నాకున్న ఆసక్తితో కళాకారుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలుగుతున్నాను’ అని జయ చెప్పారు. అందులోభాగంగానే 1986లో దస్తకరి హాత్ సమితిని స్థాపించారు. భారత్ లో కళల పునరుజ్జీవానికి ఈ సంస్థ తన వంతు పాత్ర పోషించింది. ‘35 ఏళ్లుగా మేము చేస్తున్న క్రుషి వల్ల చాలావరకు కళలు తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా మనగలుగుతున్నాయి. ఖుర్జా కుండలు కూడా అందులో ఒకటి. మేము ఈ కుండలపై పని ప్రారంభించిన సమయంలో ఈ కళ తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయే దశలో ఉంది. కానీ ఆ కళకు తగిన గుర్తింపు, మార్కెట్ ఇవ్వడంలో మేం విజయవంతమయ్యాం. ఇప్పుడు ఖుర్జా కుండలు పునర్వైభవాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కొత్త మార్కెట్ వల్ల ఎగుమతిదారులు నేరుగా తయారీదారుల దగ్గరికి వెళ్లి మరింత మెరుగైన రంగులు, విధానాలపై చర్చిస్తున్నారు. దీనివల్ల ఆ కుండలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది’ అని జయ జైట్లీ తమ సక్సెస్ స్టోరీని వివరించారు.

image


ఆధునిక కాలానికి తగినట్లు మలుస్తూ..

కళాకారుల పనికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ.. వాటికి ఆధునిక కాలానికి అనుగుణంగా మలిచేలా జయ విశేష కృషి చేస్తున్నారు. హద్దులు చెరిపేసి స్వేచ్ఛగా వాళ్ల సృజనకు తోడ్పాటునందిస్తున్నారు. తాజాగా అక్షర ప్రాజెక్ట్‌లో భాగంగా ఇండియన్ కాలిగ్రఫీకి కళ రూపం తీసుకొచ్చారు జయ జైట్లీ. వివిధ భారతీయ భాషల అక్షరమాలనే డిజైన్‌గా మలిచి విశేషంగా ఆకట్టుకున్నారు. టెర్రకోటతో రూపొందించిన బెంగాలీ అక్షరమాల, ఒడిశా స్ర్కిప్ట్‌ను మోసుకెళ్లే రామచిలుక.. ఇలా కళకు విభిన్న రూపాలు జోడించడం ఆమెకే సొంతమైంది. కాలీగ్రఫీని ఓ కళగా ఈ హస్త కళాకారులు ఎప్పుడూ చూడలేదు. దీనివల్ల తమకు వచ్చిన భాష, కళతోనే కొత్తగా ప్రయోగాలు చేసే వీలు కలిగింది. ‘అక్షర ప్రాజెక్టులో భాగంగా ఓ కళాకారుడు మొత్తం హనుమాన్ చాలీసాను ఓ పట్టు వస్త్రంపై మలిచిన తీరు అద్భుతం. అలాంటివి 15 నుంచి 20 వరకు అమ్మిన అతడు రూ. 25 లక్షల వరకు సంపాదించాడు. అతను ఎప్పటి నుంచో ఈ కళలో నిష్ణాతుడు. అయితే గతంలో 36 అడుగుల భారీ కాన్వాస్ పై ఈ పని చేసేవాడు. కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తన పనితీరుకు మెరుగులు దిద్దుకున్న అతడు క్రమంగా చిన్న సైజులోనే దానిని రూపొందించగలిగాడు’ అని జయ తెలిపారు.

image


నైపుణ్య మార్పిడి కార్యక్రమాలు

అంతర్జాతీయ మార్కెట్ కు తగినట్లుగా ఎప్పటికప్పుడు కళాకారులను మలచడంపైనే జయ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. దస్తకరీ హాత్ సమితి ఆధ్వర్యంలో నైపుణ్య మార్పిడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ కళాకారులతో ఇక్కడివాళ్లు ముచ్చటించే వీలు కలుగుతుంది. 

ఉదాహరణకు ఈజిప్ట్ కు చెందిన కళాకారులకు ఇక్కడి కళలపై శిక్షణ ఇస్తున్నారు. దానికి ప్రతిగా ఈజిప్ట్ కళలను ఇక్కడి 45 గ్రామాల వారికి అక్కడివాళ్లు నేర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల కొత్త కళలు దేశంలోకి వస్తాయని జయ అంటున్నారు. ఇతర దేశాల పద్ధతులు, ఆలోచనలు, వాళ్ల నైపుణ్యాలను ఇక్కడి వాళ్లు నేర్చుకోవడం.. ఇక్కడి పద్ధతులను వాళ్లకు నేర్పడం వల్ల నైపుణ్య మార్పిడి జరుగుతోంది. ఇద్దరి కళలు కలిసి ఓ కొత్త కళ ప్రాణం పోసుకుంటోంది. పర్యాటకుల కోసమే ప్రత్యేకంగా వస్తువులు రూపొందించేలా సమితి సభ్యులు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వచ్చే జనవరిలో ఢిల్లీ హయత్‌లో ఓ కార్యక్రమం నిర్వహించడానికి సమితి సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా వెదురు, లక్కతో చేసే వస్తువులు, పేపర్ గొడుగులు తయారు చేయడంలో నిష్ణాతులైన మయన్మార్ కళాకారులు.. స్థానిక కళాకారులతో తమ అనుభవాలను పంచుకోనున్నారు. దీనివల్ల కొత్త ఉత్పత్తులను తయారుచేసే వీలు కలుగుతుందని జయ నమ్మకంగా ఉన్నారు.

image


కళాకారులపై కాసుల వర్షం

కళాకారులకు సరైన గుర్తింపు, మార్కెట్ కల్పిస్తే ఎలా ఉంటుందో సమితి చేసి చూపించింది. ఎవరి చేయూత లేకుండా కేవలం హస్తకళాకారులు ఉత్పత్తి చేసే వస్తువుల సాయంతోనే సమితి నడుస్తోంది. తాము నిర్వహించే క్రాఫ్ట్ మేళాల్లో ఒక్కోదాంట్లో సగటున రూ. పది కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయని జయ చెప్పారు. కళాకారులు తాము సంపాదించే మొత్తంలో పదిశాతం సమితి నిర్వహణకు ఇస్తుండటం విశేషం. వీటితోనే ఉద్యోగుల జీతభత్యాలు, మేళాల్లో వినియోగించే జనరేటర్లు, కరెంటు, ఇతర ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఈ డబ్బుతోనే కళాకారులు తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తామని జయ జైట్లీ తెలిపారు. ఇండియా, చైనా ఎకనమిక్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఆహ్వానం మేరకు 25 మంది కళాకారులు అక్షర ప్రాజెక్ట్‌ను చైనాకు తీసుకెళ్లనున్నారు. 

‘21 కళా నైపుణ్యాలు, మనదేశంలోని 14 భాషలను ప్రదర్శించబోతుండటం గర్వంగా ఉంది. అంతేకాదు ప్రస్తుతానికి కళాకారులు చైనా వెళ్లడానికి తమ ఖర్చులు తామే భరించనుండటం మరో విశేషం. కళ ద్వారా వచ్చిన ఈ గుర్తింపును, తమకు దక్కుతున్న గౌరవాన్ని చూసి కళాకారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు’ అని జయ ఆనందం నిండిన కళ్లతో చెబుతున్నారు.

image


హస్తకళా అకాడమీకి ప్రణాళిక

భారత కళలు, చేతి వృత్తులపై తనకు ఉన్న ప్రేమను అవకాశం వచ్చినప్పుడల్లా చాటుకుంటూనే ఉన్నారు జయ జైట్లీ. అందులోభాగంగానే హస్తకళా అకాడమీని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు తమ అంగీకారం కూడా తెలుపడం విశేషం. ‘గత బడ్జెట్ లో ఈ అకాడమీ కోసం రూ.30 కోట్లు కేటాయించారు. ప్రతి ఉత్పత్తికి సాంస్కృతిక మద్దతు ఇవ్వడం ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం. కొన్ని రంగులను కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులకు వాడటాన్ని తప్పనిసరి చేయాలని అనుకుంటున్నాం. కొన్ని రంగులను ఎందుకు వాడటం లేదో కూడా వివరిస్తాం. ఏడాదిలో ఎందుకు కొన్ని నెలలు మాత్రమే చేనేత వస్తువులను ఉత్పత్తి చేస్తారో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి చేనేత ఉత్పత్తికి ఒక సంస్క్రుతితో అనుబంధం ఉంటుంది. ఆ వస్తువు ఆ సంస్క్రుతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది’ అని జయ తెలిపారు. 

పర్యాటకులు, విదేశీయులు, విద్యార్థుల కోసం కళాకారులే కొన్ని స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా సమితి ప్రోత్సహిస్తోంది. రాజకీయ జోక్యం లేని అకాడమీని స్థాపించాలని జయ భావిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రైవేట్ సెక్టార్ సాయంతో అకాడమీని నడిపించాలన్నది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే జయ ఈ పని ప్రారంభించారో అప్పటి నుంచే కళాకారుల దశ తిరిగిపోయంది. వారి పిల్లలు ఇప్పుడు కళకు సాంకేతికతను కూడా జోడిస్తున్నారు. వాళ్లు కూడా ఐఫోన్లు, ఐప్యాడ్స్ లాంటి గాడ్జెట్స్ వాడుతున్నారు. విదేశీ కొనుగోలుదారులతో ఈమెయిల్ లో బేరసారాలు సాగిస్తున్నారు. కొత్తకొత్త ఉత్పత్తుల కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. వారి జీవన విధానంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. కొందరు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతమైన కచ్ కు చెందిన ఓ హస్తకళాకారుడు సొంతంగా రిసార్ట్ ను నడిపిస్తున్నాడు. కళను ఆసరాగా చేసుకొనే ఆర్థికంగా వ్రుద్ధి సాధించాలని వారికి తాను చెబుతుంటానని జయ అంటారు. ‘వారు ఈ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. ఈ రోజు వారు ఈ స్థాయిలో ఉండటానికి కారణం కళే. కళలు మరుగున పడిపోతున్నాయన్న కొందరి విమర్శలతో నేను ఏకీభవించను. ఓ కళ అంతరిస్తుంటే మరో కొత్త కళ పుడుతూనే ఉంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట కళాకారుడు ఓ కొత్త కళను స్రుష్టిస్తూనే ఉన్నాడు. నేను జీవించి ఉన్నంత కాలం కళను బతికించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’ అని జయ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags