సంకలనాలు
Telugu

రూ.1500తో బెంగళూరు వెళ్లి ఓ ఆంట్రప్రెన్యూర్‌, మెంటార్‌, ఇన్వెస్టర్‌గా ఎదిగిన సోం సింగ్

team ys telugu
24th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

లక్ష్య సాధనలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయవద్దు. కుటుంబ నేపధ్యం, పుట్టి పెరిగిన వాతావరణం.. ఇవేమీ.. మీ అభివృద్ధిని ఆపలేవు. అనుకున్నది సాధించాలి. మనసుంటే మార్గం ఉంటుందన్నట్లుగా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించి చూపించారు సోం సింగ్.

తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యుల్ని కాదని, ఉన్న ఊరిని వదిలి అనుకున్న లక్ష్యాని చేరుకున్నారు సోం. కుటుంబ సభ్యుల సహకారం లేకున్నా, చేతిలో సరిపోయినంత డబ్బులు లేకపోయినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తను ఎంచుకున్న రంగంలో రాణిస్తూ, ఎంతోమందికి మార్గదర్శకురాలిగా నిలుస్తూ.. ఇప్పుడో ఆంట్రప్రెన్యూర్‌గా, ఓ ఏంజిల్ ఇన్వెస్టర్‌గా రాణిస్తున్నారు సోం.

image


కోల్‌కతాలో సంప్రదాయ బెంగాలీ కుటుంబంలో పుట్టారు సోం. తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ, వాళ్లు అనుకున్న కెరీర్‌నే అనుసరించాల్సిన పరిస్థితి ఉన్న కుటుంబ నేపధ్యం సోం సింగ్ ది. అయితే తనకు మాత్రం అలాంటి పద్ధతి నచ్చలేదు. తాను ఎంచుకున్న రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పట్టింపులకు పోయారు. చివరకు తమ మాట వినకపోతే.. రక్త సంబంధాన్ని కూడా తెంచేసుకునేందుకు వెనుకాడబోమని తేల్చేశారు. సోం సింగ్.. ఏ మాత్రం బెదరకపోవడంతో.. కుటుంబ సభ్యులు అన్నంత పనీచేశారు. అయినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో సోం తన కలల్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశారు. ఎవరి మద్దతూ లేకుండా, చేతిలో కేవలం 1500 రూపాయలతో బెంగళూరుకు చేరుకున్నారు. గుండెల నిండా ధైర్యం, తాను అనుకున్న లక్ష్యంపై స్పష్టమైన గురే ఆమెకు కొండంత అండ. అవే ఆమెను ముందుకు దూకేలా చేశాయి.

జీవిత ప్రయాణం

సర్జన్లుగా పనిచేస్తున్న తల్లితండ్రుల వృత్తి.. సోం సింగ్‌ని ఎంత మాత్రమూ ప్రభావితం చేయలేకపోయాయి. తన నాన్నమ్మే తనకు స్ఫూర్తి. ఆమె 13 ఏళ్ల వయసులోనే పెళ్లిచేసుకున్నా, డిగ్రీ పూర్తిచేశారు. పిల్లల్ని పెంచుతూనే లాయర్‌గా తన కెరీర్ కొనసాగించింది. తనే సోంకు స్ఫూర్తిగా నిలిచింది.

ప్రాక్టికల్‌గా ఆలోచించే సోం... మెడిసిన్, ఇంజనీరింగ్‌లను పక్కనపెట్టి మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. అప్పటికి మార్కెటింగ్ అనే పదం కోల్‌కతాలో వినిపించడం తక్కువే. మార్కెటింగ్ అంటే అక్కడి వాళ్లకు తెలిసింది.. ఒక్కటే. అది డోర్ టు డోర్ తిరిగి వివిధ రకాల వస్తువులు అమ్ముకోవడం.

మేనేజ్‌మెంట్ కోర్స్ అందుబాటులో లేకపోవడంతో తాను ఉన్న ఊరు వదిలి బెంగళూరు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు సోం. లక్ష్య సాధన దిశగా 1997 లో చేతిలో 1500 రూపాయలతో బయటి ప్రపంచంలోకి అడుగులు వేశారు.

image


చిన్నా చితకా ఉద్యోగాలు

బెంగళూరులోని జయానగర్ లో పేయింగ్ గెస్ట్‌గా చేరారు సోం. చేతిలో డబ్బులు లేకపోయినా తర్వాత వాటంతట అవే వస్తాయని ఈ ఇంటి ఓనర్ సోంకు ధైర్యం చెప్పి ప్రోత్సహించేది.

పేయింగ్ గెస్ట్‌గా చేరిన సోం, మరో రూం లో ఉంటున్న మరో అమ్మాయి దగ్గర చాక్లెట్స్ చేయడం నేర్చుకున్నారు. వాటిని తన కాలేజీలో అమ్మడం ద్వారా నెలకు 6,000 రూపాయలు సంపాదించడం ప్రారంభించింది సోం. ఒక బొటిక్ యజమానికి బిజినెస్ మెళకువలు నేర్పడం ద్వారా నెలకు మరో వెయ్యి రూపాయలు సంపాదించేది. అలాగే రెండు వారాల పాటు కష్టపడి, డేటా షీట్లు రాయడం ప్రారంభించారు. ఇప్పటిలాగా డేటా షీట్లు అప్పుడు లేకపోయినా వాటిని మాత్రం అప్పట్లో బాగా రిసీవ్ చేసుకునేవారు. 17 ఏళ్ల వయసు నుంచే రచనలు చేయడం ప్రారంభించిన సోం, వాటి ద్వారా మరో రూ. 500 సంపాదించేది. ఆ రోజుల్లో ఆమెకు అదే పెద్ద మొత్తం.

రచనా సామర్ధ్యం, ఇతర పార్ట్ టైం జాబ్స్ చేసే సోం కాలేజీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చదువులో చురుగ్గా.. తన బ్యాచ్‌లో ముందుండేది. ముందు నుంచీ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్న తను, ఈసారి పేరెంట్స్ సపోర్ట్ లేకుండానే చదువు కొనసాగించి పూర్తిచేసింది. కానీ ఏదో ఒక మూల కుటుంబాన్ని వదిలేసి వచ్చాననే బాధ లోలోపల తొలచివేస్తోంది. అమ్మా,నాన్నలను చూసి చాలా రోజులైపోయింది. వాళ్లు ఎలా ఉన్నారో.. ఏమో.. అనే ఆందోళన. ఓ సాధారణ యువతి మనోభావాలు ఎలా ఉంటాయో.. తానూ అలానే స్పందించింది.

ఒక రోజు తండ్రికి ఫోన్ చేసి విపరీతంగా ఏడ్చేసింది. కానీ.. తాను తప్పు చేశానని.. క్షమించమని చెప్పలేదు. బయటకు వెళ్లేలా చేసినందుకు ధన్యవాదాలు చెప్పింది. మీరు అంత కఠినంగా ఉండకపోయి ఉంటే.. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయేదాన్ని అంటూ.. తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.

image


సొంత వెంచర్ ప్రారంభమైంది

తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సోం.. అకమయి, హారిజొన్, రెడ్ హాట్ లాంటి కంపెనీల్లో పనిచేశారు. చాలా కంపెనీల్లో పనిచేసిన ఆమె.. తన స్వంత సంస్థను ప్రారంభించాలని అనుకుంది. అలా అన్ స్పన్‌ ప్రారంభమైంది.

అప్పటిదాకా ఉన్న మార్కెటింగ్ ప్రక్రియను సులభతరం చేస్తూ, అన్‌స్పన్‌ ద్వారా ఓ వేదికను రూపొందించారు. ACT పేరుతో ఓ ఖచ్చితమైన మార్కెటింగ్ చానల్‌ను ఈ స్టార్టప్‌ క్లైంట్లకు అందజేస్తుంది. సదరు క్లైంట్ ఓ రెవెన్యూ జనరేట్ చేసే టార్గెట్‌ను అనుకుంటే.. అన్‌స్పన్ సంస్థ... ACT ద్వారా వారిని చేరుకోవాలి. ఏ మార్గాన్ని అనుసరించడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు, వాళ్ల టార్గెట్ ఆడియన్స్‌ను ఎలా గుర్తించాలో.. అన్‌ స్పన్ సలహా ఇస్తుంది. ఇక్కడ క్లైంట్ల కోరిక మీద కాకుండా.. క్లైంట్‌కు ఏం కావాలో అర్థం చేసుకుని.. అన్‌స్పన్‌ టీం..ఆ ప్రొడక్ట్ ఇస్తుంది.

మూడేళ్ల తర్వాత తాము ఓ బి2సి కంపెనీ అని తనకు తెలిసొచ్చింది. అందుకే క్లైంట్లు తమ దగ్గరికి రావాల్సిన అవసరం లేదనుకున్నారు. వాళ్లు కేవలం వాళ్లకు ఎలాంటి ప్రొఫైల్స్, ఎలాంటి ఆసక్తి ఉన్నవాళ్లు కావాలో.. వివరిస్తే.. చాలు.. అన్‌స్పన్ సంస్థే స్వయంగా.. ఆ వివరాలను వెతికి.. తమ క్లైంట్లకు చేరుస్తుంది. దీని వల్ల క్లైంట్ల మార్కెటింగ్.. సరిగ్గా చేరాల్సిన వారి దగ్గరికే చేరి.. వ్యాపారం కూడా పెరిగేందుకు దోహదపడ్తుంది.

" మంచి రిజల్ట్స్ వచ్చేలా, సులభతరం అయిన మార్కెటింగ్ దీంతో సాధ్యమయింది. ప్రతీసారి కొత్తగా నేర్చుకుంటూ, కొత్త పద్ధతుల్ని అన్వేషిస్తే.. క్లైంట్లు కూడా లాభపడ్తారు " అని వివరిస్తారు సోం.


ఎన్నో బాధ్యతలు

అన్ స్పన్‌కే పరిమితం కాకుండా తాను.. ఎన్నో ఇతర బాధ్యతలనూ చేపట్టారు. టార్గెట్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల ఆక్సిలరేటర్ కార్యక్రమాలకు మెంటార్‌గా, చార్జ్ బీ, మాబ్ స్టాక్, హోటెలాజిక్స్, టూకిటాకి, ఎక్స్‌ప్లారా వంటి స్టార్టప్స్‌కు మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. కొంతమంది ఔత్సాహిక, ఎదుగుతున్న ఆంట్రప్రెన్యూర్లకు ఇన్వెస్టర్‌గానూ సాయం అందించారు సోం సింగ్.

" నేను నేర్చుకున్న దాంట్లో కొంతైనా ఇతరుల అవసరాలకు ఉపయోగపడితే, వారికి నా చేతనైనంత న్యాయం చేసిన దాన్ని అవుతానని అనిపిస్తుంది " అంటారు సోం.

MBA, మేనేజ్‌మెంట్‌లో PhD చేసిన సోం బెంగళూరులోని IFIM, IIITB లాంటి సంస్థల్లో మేనేజ్‌మెంట్ పాఠాలు కూడా బోధిస్తున్నారు.

ప్రభుత్వాన్ని.. పారిశ్రామివేత్తలనూ కలిపే వేదిక

విధాన నిర్ణేతలకూ.. పారిశ్రామికవేత్తలకూ మధ్యలో ఉన్న అగాధాన్ని పూడ్చేందుకు సెంటర్ ఫర్ ఆంట్రప్రెన్యూరియల్ ఎక్సలెన్స్‌ను రూపొందించింది. ప్రభుత్వ పాలసీలను గురించి బిజినెస్‌లోకి అడుగుపెట్టే వాళ్లకు తెలియ చెప్పడం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం సంస్థ లక్ష్యం. ఇందుకోసం వర్క్ షాప్స్, వెబినార్స్ నిర్వహిస్తారు. నిధుల సమీకరణ కార్యక్రమాలను నిర్వహించి, వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంట్రప్రెన్యూర్లకు అవసరమైన ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల స్టార్టప్స్‌కు మెంటారింగ్ లభిస్తే, వ్యాపార వాతావరణం గురించి ప్రభుత్వానికీ ఓ అవగాహన వస్తుంది.

image


సంపూర్ణ మహిళ

యుక్త వయస్సులో ఉన్నపుడు.. పేరెంట్స్ బిజీగా ఉండడంతో ఎక్కువ సమయం తాత, నాన్నమ్మలతోనే గడిపేది. ఆమె తల్లిదండ్రులు సోం కూతురుతో గడపుతూ.. తాము కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు పొందుతున్నారు. తన కూతురు.. ఇప్పుడు తన తల్లిదండ్రుల ప్రేమని ఆస్వాదించడం చూస్తుంటే.. ఎంచో ముచ్చటేస్తోందని.. సోం మురిసిపోతున్నారు.

చాలా కాలం పాటు సోం ఎన్నో రకాల అవాంతరాలనూ.. ఇబ్బందులు.. ఎదుర్కొంటూనే వచ్చారు. అయితే అవన్నీ ఆమె ఇష్టంగా స్వీకరించినవే. పాడడం అంటే ఇష్టమున్న సోం.. ఇప్పుడిప్పుడే గోల్ఫ్ కూడా నేర్చుకుంటున్నారు. 

లక్ష్యాన్ని చేరుతామనే బలమైన నమ్మకానికి తోడు పూర్తిగా దానిపై దృష్టి నిలిపితే.. ఏ పనిలోనైనా సంపూర్ణత, విజయం సాధ్యం అనేది సోం సింగ్ ఆఖర్లో చెప్పిన మాట.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags