సంకలనాలు
Telugu

ఈ 2016లో మీకోసం మీరు బతకండి..!!

team ys telugu
11th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇది కాస్త ఇబ్బంది కలిగించే ప్రశ్నే. ముఖ్యంగా నా ఏజ్ గ్రూప్ వాళ్లకు నిత్యం ఎదురయ్యే సవాలే. మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా అమ్మమ్మ. నన్ను చూడటానికి వచ్చినప్పుడల్లా ఒక ప్రశ్న అడుగుతుంటుంది. ఏమ్మా.. పిల్లల్ని ఎప్పుడు కంటావు అని! ఆ అడగడమూ కాస్త బిగ్గరగా, అందరికీ వినపడేట్టుగా! ఇప్పుడు చాలా టెస్టులు వచ్చాయని కూడా చెప్తుంది. నాకేమో చిర్రెత్తుకొస్తుంది. మేం మాట్లాడుకుంటాం. పోట్లాడుకుంటామంటే బాగుంటుందేమో! పరిపూర్ణ స్త్రీ, ఆధునికత, ఉద్యోగం, పెళ్లి, ఇంకా అనేకానేక విషయాల మీద వాదించుకుంటాం. ఒకవేళ సంతానం కలగకపోయినా బాధపడకు, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన హాస్పిటళ్లు ఉన్నాయని చెప్పి ముగిస్తుంది మా అమ్మమ్మ.

image


నాకేమీ బాధలేదని.. ఆరోగ్యంగా, నిక్షేపంగా ఉన్నానని ఆమెకు చెప్తుంటాను. అలా చెప్పినప్పుడల్లా నావైపు జాలిగా చూసి వెళ్లిపోతుంటుంది. మళ్లీ కలిసినప్పుడు షరామామూలే! అదేంటో గానీ ఈ ప్రశ్న విషయంలో మాత్రం మా కుటుంబమంతా ఏకమైపోతుంది. ఆ ప్రశ్న నాకు మాత్రం అదేదో దేశంలోనే పెద్ద పేరున్న యాంకర్ లా, కుటుంబమంతా కలిసి తెలుసుకోవాల్సిన పెద్ద విషయంలా కనిపిస్తుంటుంది.

నేను కూడా అలాంటి ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టను. మనలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఆలోచించాల్సిన భిన్నమైన ఫెర్టిలిటీ గురించి మాత్రం మాట్లాడుతాను. అంతకన్నా ముందు మీకో కథ చెప్తాను.

యువర్ స్టోరీకి 2015 మరపురాని సంవత్సరమని మీకు తెలుసు. ఏడేళ్ల ప్రస్థానం తర్వాత తొలిసారిగా ఫండ్స్ సేకరిస్తున్నాం. ఇప్పటికి 23 వేల ఒరిజినల్ స్టోరీలు రాశాం. 12 భారతీయ భాషల్లో వెబ్ సైట్ రన్ చేస్తున్నాం. 65 మందితో అద్భుతమైన స్టాఫ్ ఉంది. ఇక ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్, ప్రభుత్వ విభాగాలు, న్యూ బ్రాండ్స్ పై పనిచేస్తున్నాం. ఇవన్నీ ఒక్క ఏడాదిలో దాటి వచ్చిన మైలురాళ్లు! ఇన్నాళ్ల కష్టం ఫలితమే ఈ విజయాలని కూడా ఒక్కోసారి అనిపిస్తుంది.

కానీ ఒకటే సమస్య. ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే అంతగా నాలో బాధ, ఒంటరితనం లావాలా పెల్లుబుకుతున్నాయి. ఫండ్ రైజింగ్ గురించి మా స్టార్టప్ వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు గానీ.. అది నా గుండెను మెలిపెడుతోంది. రాత్రికి రాత్రే ఫ్రెండ్స్ ముఖం తిప్పేసుకోవడం, బంధాలు బీటలు వారడం, చాలా మంది మనుషుల ప్రవర్తన మారిపోవడం చూశాను. అది నన్నెంతో బాధ పెట్టింది. మరింతగా అంతర్మథనంలోకి నెట్టేసింది. ఇలాంటి ప్రపంచంలో మనుగడ సాగించగలనా? ఇక్కడ నేను ఫిట్ అవుతానా అనిపించింది.

ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి 2015 అంతా అవిశ్రాంతంగా పనిచేశాను. కాలం వెంట పరుగులు తీశాను. 64 ఈవెంట్లలో మాట్లాడాను. దాదాపు 6 వేల మందితో ఇంటరాక్ట్ అయ్యాను. 6 వేల మెయిల్స్ కు రిప్లై ఇచ్చాను, మరో 10 వేల మెయిల్స్ కి ఆన్సర్ చేయలేకపోయాను. అలా రిప్లై ఇవ్వని ప్రతీ మెయిల్, ఆన్సర్ చేయని ప్రతీ కాల్ నన్నెంతో బాధపెట్టినవే. దాని వల్ల కొందరు కోపగించుకున్నారు. ఇంకొందరు నిరుత్సాహానికి గురయ్యారు. ఇంతకుముందులా త్వరగా రెస్పాండ్ కావట్లేదని కొందరు అన్నారు. అదంతా నాలో ఒకరకమైన నైరాశ్యాన్నినింపింది. చాలా ఏళ్ల తర్వాత నిస్సహాయురాలిగా అనిపించింది.

మా టీంలో కొంతమంది, మా ఫ్యామిలీలో అందరూ నేను వారి కోసం ఏమీ చేయడం లేదని భావిస్తున్నారు. ఒక రోజు అయితే విజయవంతంగా పూర్తయిన ఒక మీటింగ్ తర్వాత, ఒక బిగ్ డీల్ కుదిరిన అనంతరం ఎందుకో గానీ నాకంతా శూన్యమే కనిపించింది. లోలోపల ఒక రకమైన మానసిక సంఘర్షణ! ఆ రోజు ఎంతగా ఏడ్చానో! అసలేం జరిగింది? 2015లో జరిగిన నా కథంతా ఇలా రాయాలా? నా చుట్టూ ఉన్నపరిస్థితులను బట్టి నడుచుకుంటున్నానా? లేదా నా కథలో నేనే హీరోనా? 365 రోజుల పాటు 24/7 పడ్డ కష్టానికి గర్వంగా ఫీలవ్వాలా.. లేదా ఇంకా బెటర్ గా పనిచేసి ఉండాల్సిందా? అనేక సందేహాలు. ఏడాది చివర్లో నవంబర్ మొదట్లో పరిస్థితులు, మనుషుల నుంచి దూరంగా ఉండటం మొదలుపెట్టాను. నాకు నేనే దగ్గరయ్యాను. మనసు చెప్పినట్టు నడుచుకున్నా. అంతరాత్మ చెప్పింది విన్నా. అక్కడే సమాధానాలు, ప్రశాంతత వెతుక్కున్నా.

15 ఏళ్ల కిందటి మాట. కాలేజ్ డేస్ లో నేను కలిసిన ఒక సైకియాట్రిస్ట్ గుర్తొచ్చాడు. ఆ సమయంలో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్ననన్ను దాన్నుంచి ఆయన బయటపడేశారు. అంతకన్నా ముందు ఆయన నాకో విషయం చెప్పారు. అది ఏంటంటే..

ఉత్తర భారతదేశంలోని మైదానాల్లో ఉండే సారవంతమైన నేలలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. పుష్కలమైన ఖనిజాలతో అలరారుతుంటాయి. కాబట్టి అవెప్పుడూ సారవంతంగా ఉంటాయి. అంత మంచి భూములు కూడా పంటకూ పంటకూ గ్యాప్ ఇవ్వకపోతే బీడు భూములుగా మరిపోతాయి. పంటలకు పనికిరాకుండా తయారవుతాయి. మనుషులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది! మనలోని భావోద్వేగాలు, మానసిక సంఘర్షణల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే బీడు భూమిలాగే తయారవుతాం. దుఖఃవంచితులుగా మిగిలిపోతాం.

కాబట్టి థింక్ యువర్ సెల్ఫ్! బీ సెల్ఫిష్! మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆరాధించుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇతరులకు ఎలా న్యాయం చేస్తారు? మీకు మీరు ప్రేమించుకోకపోతే ఇతరులను ఎలా ప్రేమిస్తారు? మీ బలహీనతలు, తప్పుల్ని మీరే గుర్తించనప్పుడు ఇతరుల్నిఎలా నిలదీస్తారు? అచ్చంగా నేను కూడా ఇవే తప్పులు చేశాను. నా ఆవేదనకు కారణం అవే. అందుకే మొన్న డిసెంబర్ అంతా వినడం, స్వాగతించడం, నన్ను నేను ప్రేమించుకోవడంతోనే గడిపాను. అదంత సులభమూ కాదు! కష్టమూ కాదు!

బౌద్ధ సన్యాసి థిచ్ న్హాత్ హనా రాసిన ది మిరాకిల్ ఆఫ్ మైండ్ ఫుల్ నెస్(ఇంగ్లిష్ అనువాదం మోబి హో) అనే పుస్తకం చదివాను. విషయాలపై సమగ్ర అవగాహన వచ్చింది. ఫోన్ స్విచ్డాఫ్ చేయడం కూడా హెల్ప్ అయింది. సమయానికి ఫోన్ కాల్స్ అటెండ్ చేయనంత మాత్రాన ప్రపంచమేమీ మునిగిపోదని గుర్తించాను. నా ఫోమో కంట్రోల్ లోనే ఉంది. పొద్దున్నే గార్డెన్ లో తచ్చాడుతున్న నా పెట్ డాగ్స్ ను చూస్తూ ఒక్కదాన్నే కూర్చొని టీ తాగుతుంటే అద్భుతంగా ఉంది. జాగ్రత్తగా మసలుకోవడానికి రోజూ బుడిబుడి అడుగులేస్తున్నా. ఇదే విషయం అందరు ఎంట్రప్రెన్యూర్లకు చెప్పాలనుకున్నా. మనలో ప్రతీ ఒక్కరు డైలీ లైఫ్ లో దేన్నో తరుముకుంటూ వెళ్తున్నాం. బుర్రనిండా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. అదే సమయంలో ప్రజలకు సేవ చేస్తున్నాం. పెద్ద పెద్ద పనులు భుజాన వేసుకుంటున్నాం. కానీ ఆ పరుగులో పడి మనల్ని మనం ప్రేమించుకోవడం మిస్సవుతున్నాం. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతున్నాం. ఈ కొత్త ఏడాది విజయాల గురించి ఆలోచించేటప్పుడు మన గురించి కూడా మనం మరచిపోవద్దు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ భూమి లాగే బీడువారిపోతాం. మన మనసులో ఒక సారవంతమైన ప్రదేశాన్ని కలిగి ఉండటం అద్భుతమైన బలాన్నిస్తుంది. కాబట్టి మీ కథలో మీరే హీరో! మీకోసం ఎవరో వచ్చి ఏదో మ్యాజిక్ చేస్తారని చూడకుండా.. ఈ 2016లో మీ కోసం మీరు బతకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్!!

రచయిత : శ్రద్ధా శర్మ

అనువాదం: రాకేశ్ సుంకరి

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags