సంకలనాలు
Telugu

ఒకప్పుడు అవిటివాడివని ఎగతాళి చేశారు..! ఇప్పుడు ఆదర్శవంతుడని హత్తుకుంటున్నారు..!!

28th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అన్ని సక్రమంగా ఉన్నా చాలామంది అదృష్టాన్ని తిడుతూ కూర్చుంటారు. లక్ కలిసి రాకపోవడం వల్లే అనుకున్నవి సాధించడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వినోద్ రావత్ మాత్రం విధి రాతనే తనకు నచ్చినట్టుగా రాసుకున్నాడు. ఆరేళ్ల వయసులో ప్రమాదంలో ఓ కాలు పూర్తిగా పోయినా, జీవితాన్ని మాత్రం మనో నిబ్బరంతో విజయపథాన నడిపిస్తున్నాడు.

జీవితమంటేనే కష్ట నష్టాల సమాహారం. కష్టాలు, కన్నీళ్లు, బాధ, సంతోషం- కాలంతోపాటు మారిపోతూ ఉంటాయి. అలాంటి ఘటనలే ముంబైకి చెందిన వినోద్ రావత్‌కు ఎదురయ్యాయి. కానీ అందరిలాగా ఆయన భయపడిపోలేదు. వాటినే భయపెట్టాడు. అలాంటి స్ఫూర్తిధాయకమైన స్టోరీ ఇది. జీవితంలో వినోద్ ఎదుర్కొన్న కష్టాలు ఆయన మాటల్లోనే..

‘‘ అప్పుడు నా వయసు ఆరేళ్లు. ఓ ట్రక్ నాపై నుంచి వెళ్లింది. ఆరునెలలపాటు ఆస్పత్రిపాలయ్యాను. ఆ సమయంలో ఎన్నో కఠినమైన సర్జరీలు చేశారు. సరైన సమయంలో మా తల్లిదండ్రులు 25 వేల రూపాయలు సమకూర్చకపోవడంతో నా శరీరంలో కొన్ని అవయవాలను కోల్పోయి వికలాంగుడిగా మారాను’’ అని వినోద్ రావత్ చెప్పారు.

image


ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత అందరూ వికలాంగుడంటూ నన్ను అందరూ ఆటపట్టించారు. ఇంకా బాధాకరం ఏంటంటే- ఇంట్లో వాళ్లు కూడా నన్ను చిన్నచూపు చూశారు. రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా బెగ్గర్ కనిపిస్తే గుండె బరువెక్కుతుంది. నా జీవితం కూడా అలానే అవుతుందేమో అన్న దిగులు నాన్న కళ్లలో కనిపించింది. ఆ క్షణంలో అతనికి కోపం కట్టలు తెగేది. ఒకసారి నన్ను కట్టేసి గొడ్డును బాదినట్టు బాదాడు. నాన్న కాళ్లు పట్టుకుని ఏడ్చాను. బిచ్చం ఎత్తుకోను నాన్నా.. ఏదో ఒకటి కష్టపడి సాధిస్తా అని- బతిమాలాను. గోడుగోడున ఏడ్చాను. నమ్మండి అంటూ వేడుకునేవాడిని. అయినా నా ఏడుపు నాన్నను కదిలించలేదు. నా మాటల మీద అతనికి నమ్మకం కుదిరలేదు. నేను కచ్చితంగా అడుక్కుతినే బతుకుతానని ఆయన డిసైడయ్యాడు.

అలా నా బాల్యమంతా పోరాటంతోనే గడిచిపోయింది. కాలు లేకపోయేసరికి ప్రజలంతా నాపై ఓ ముద్ర వేసేశారు. నాలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు. ఎవరి నుంచీ సపోర్టు లేదు. బయటవ్యక్తుల ఓదార్పు కోసం చూస్తూ పెరిగాను. కానీ అది ఎన్నాళ్లుంటుంది. వాళ్ల జాలి, సానుభూతి కంటే నాపై గౌరవం పెరగాలి. సలాం కొట్టాలి. అలా కావాలంటే ఏదో ఒకటి సాధించాలి. మస్తిష్కంలో వేరే ఆలోచన దూరనీయలేదు. అలా ఒకసారి అనుకోని పరిస్థితుల్లో ఓ ముఠాలో చేరాను. బొంబాయిలో అలాంటి గ్యాంగ్ లో చేరిన వాళ్లను అన్నా అని పిలుస్తారు. నేను కూడా భాయ్ గా మారిపోయా. బయటకు ధైర్యంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కుంగదీసింది.

ప్రజల జాలి, సానుభూతికి బదులుగా నాపై భయం, గౌరవం పెరగాలంటే ఏదైనా సాధించాలి అన్న ఆలోచనలు నా మైండ్‌లో నిండిపోయాయి. అలాంటి పరిస్థితులే నన్ను ఓ ముఠాలో చేరేలా ప్రేరేపించాయి. బాంబేలో అలాంటి గ్యాంగ్‌లలో చేరిన వారిని అన్నా అని పిలుస్తారు. నేను కూడా భాయ్‌గా మారిపోయా. బయటకు ధైర్యంగానే కనిపిస్తున్నప్పటికీ, లోలోపల మాత్రం ఇన్ఫిరియారిటీతో కుంగిపోయా. ఆ తర్వాత నేను చాలా క్రూరంగా మారిపోయా. అలాంటి మార్పు నాకు కూడా నచ్చలేదు. కానీ పోలీసులు 1994లో నన్ను అదుపులోకి తీసుకునే వరకూ అలానే ఉండిపోయా.

ఆ సమయంలో మరోసారి జీవితం దుర్భరంగా మారిపోయింది. భయంతో జీవితం గడపడం సాగించాను. ఆ సమయంలో ఓ వ్యక్తిని కలిశాను. అతను నాకు దేవదూతలా కనిపించాడు. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అప్పటికే నా జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా చేతిని పట్టుకుని నడిపించాడు. నేను నడుస్తున్న మార్గం సరైనది కాదన్నాడు. నా కోసం దేవుడు మరో మంచి మార్గం అప్పటికే సిద్ధం చేసి పెట్టారని చెప్పాడు’’ అని వినోద్ వివరించారు.

అప్పటివరకు నేనో హిందువును. అప్పటివరకు నాకెవరూ చెప్పలేదు దేవుడు నాకోసం ఎదురు చూస్తున్నాడని. ఒకవేళ దేవుడే కనుక ఉండి ఉంటే నన్ను ఈ నరకకూపం నుంచి బయటపడేసి, మంచి మార్గం వైపు మళ్లించేవాడని నేను చాలాసార్లు అనుకున్నాను. ఆ సమయంలో ఆ వ్యక్తి నన్ను అతను నడుపుతున్న ఎన్జీవో సంస్థలో చేరమని అడిగాడు. అనుకోకుండానే అతనితో కలిసి వెళ్లాను. అతను చెప్పిన పాఠాలు విన్నాను. ఆయన ఇలా చెప్పేవాడు.. క్షమించు, గొప్పగా ఉండు, ఇవ్వడంలో సంతోషాన్ని వెతుకు, అది డబ్బే కాకపోవచ్చు. సంతోషాన్ని, ప్రేమను, నవ్వును పంచడంలో ఆనందాన్ని వెతుక్కో అని. ఆ ఫిలాసఫీలో నిజమైన అర్థమేంటో అప్పుడు నాకు తెలిసొచ్చింది.

image


నా జీవితాన్ని మార్చుకునేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను కానీ, పరిస్థితులెప్పుడూ నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉన్నాయి. అయితే ఆ తర్వాత అలాంటి పరిస్థితుల నుంచే ధైర్యాన్ని కూడగట్టుకోవడం నేర్చుకున్నాను. నన్ను నేను మంచిగా మార్చుకున్నాను.

ఓ సారి తాజ్‌కు వెళ్లాను. అక్కడో విదేశీ జంట ఉంది. వారి చేతిలో పాప ముద్దొస్తోంది. ఆ చిన్నారి ముద్దుగా ఉందని వారికి చెప్పాలనుకున్నాను. అయితే వారు మాత్రం నన్ను ఓ బెగ్గర్‌గా భావించారు. నన్ను అక్కడి నుంచి తరిమికొట్టారు. అప్పుడే నిర్ణయించుకున్నాను వారితో సరిసమానంగా ఉండేందుకు వారి భాష నేర్చుకోవాలని.

అప్పటి నుంచి ఎన్నోకష్టాలు. నా ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు నానా తంటాలు. కానీ అన్ని చోట్లా ప్రతికూలతే. నా శారీరక వైకల్యం నుంచి బయటపడేందుకు కృత్రిమ అవయవం కోసం ప్రయత్నించాను. ఏ కంపెనీ కూడా నాకు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇంకా చెప్పాలంటే ఆ కృత్రిమ అవయవాలు చాలా ఖరీదైనవి.

కానీ అలాంటివాటిని పొందేందుకు డబ్బు సంపాదించాలనుకున్నాను. అందుకోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ‘ఐ యామ్ పాజిబుల్’ పేరుతో ఓ గ్రూప్‌ను ప్రారంభించాను. ఆ గ్రూప్ ద్వారా మ్యాజిక్ షోలు నిర్వహించాను. నా ఉద్దేశం స్ఫూర్తివంతమైన సందేశాలను పంపడమే. పంచివ్వడం ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో గ్రహించాను. ఇవ్వడం అంటే డబ్బొక్కటే కాదు, సమయం, ప్రేమ. మనకు ఉన్నదాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు వచ్చేది ఆనందం కంటే.. మన దగ్గర అసలు ఏమీ లేని సమయంలో ఇతరులకు పంచడంలో ఉన్న ఆనందమే వేరు.

ప్రపంచంలో ఎన్నో విచారాలున్నాయి. ప్రతి ఒక్కరు ఏదో ఓ సమయంలో తమ బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. 27 ఏళ్ల వయసులో నా సమస్యలను పరిష్కరించే అవకాశం నాకు వచ్చింది. జైపూర్ ఫుట్స్ నా కోసం ఉచితంగా ప్రోస్థటిక్ ఫూట్‌ను అందించింది. నడవాలని, పరిగెత్తాలని, కొండలు, గుట్టలు ఎక్కాలని, ఎక్సర్ సైజులు చెయ్యాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఇప్పుడు ఎలాంటి బ్యాండేజీ, కట్లు లేకుండా నా అదృష్టం నా చేతుల్లోకి తిరిగి వచ్చింది. నా కలల మార్గంలో నేను ఒక్కడినే నిలిచి ఉన్నాను.

జైపూర్ ఫూట్స్ ప్రోస్థటిక్ ఫూట్ ఇవ్వగానే వెంటనే శిక్షణ తీసుకున్నాను. దీంతో అథ్లెటిక్స్ చాలా సులభమైపోయింది. ఆ తర్వాత నేను చురుకుగా, కొన్ని క్రీడల్లో నిష్ణాతుడిగా మారిపోయాను.

కానీ ఓ ఫాంటసీ మాత్రం నన్ను వెంటాడుతూనే ఉండేది. నాకు ప్రేమలో పడాలని ఎప్పుడూ అనిపించేది. అయితే అది కూడా నెరవేరింది. ఓ దేవదూతలాంటి యువతిని ఎన్జీవోలో కలుసుకున్నాను. అయితే చాలామంది అనుకునేవారు నా భార్య కూడా వికలాంగురాలేనని. కానీ నాకు ఇలాంటి ధోరణే నచ్చదు. వైకల్యం నా జీవితంలో రాసి పెట్టి ఉండొచ్చు కానీ, నా మనసులో మాత్రం లేదు. ఇక నా భార్య చాలా ఆరోగ్యవంతురాలు. ఎలాంటి వైకల్యం లేదు. నేను ఊహించినట్టుగానే ఉంది. మేమిద్దరం మంచి జీవితాన్ని నిర్మించాం. మాకు ఇద్దరు అందమైన పిల్లలు. ఈ మధ్యలో ఈవెంట్లలో పాల్గొనడం వంటి కార్యక్రమాలను నేను చేపట్టి నా జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలనుకున్నాను.

2004లో ఎవరో నాకు ముంబై మారథాన్ గురించి చెప్పారు. దాంట్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. వర్లీ సముద్ర తీరాన పగలు, రాత్రి కష్టపడ్డాను. అయితే చాలామంది నన్ను ఎగతాళి చేయడం మాత్రం మానలేదు. ‘‘పేపర్లో పేరొచ్చేందుకు ఎలా పరిగెడుతున్నాడో చూడండంటూ’’ అంటూ వెక్కిరించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..

నాలో ఉన్న శక్తిని గుర్తించాను. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శిక్షణ పొందడమేకాదు, మరింత ఫిట్ అయ్యేందుకు ప్రయత్నించాను. శిక్షణ పూర్తయ్యే సరికి నా కలలన్నింటిని నెరవేర్చుకున్నాను. 20 వేల ఎత్తైన హిమాలయ శిఖరాన్ని, మహారాష్ట్ర కుల్సుబైని అధిరోహించాను. ఆ తర్వాత సైక్లింగ్, బైకింగ్ నా ఆక్సిజన్ గా మారిపోయాయి.

image


ఓ రోజు ఎంటీవీ రోడీస్ నగరానికి వస్తున్నారని తెలుసుకుని, నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను. రోజంతా ఏదో ఒక స్టంట్ చేస్తూ వారి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాను. నా బైక్‌తో నేను చేస్తున్న సాహసకృత్యాలు నిర్వాహకులు రఘు, రణ్ విజయ్ దృష్టిలో పడ్డాయి. అంతే నాకు కూడా అవకాశం వచ్చింది. నేను వికలాంగుడినన్న విషయాన్ని వారికి తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించాను. అందరిలాగే నేను కూడా పూర్తి ఆరోగ్యవంతుడినని వారు అనుకోవాలని భావించాను. అయితే వారు గుర్తించారు. కానీ నమ్మలేకపోయారు. వైకల్యంతో ఉండి కూడా అలాంటి స్టంట్ చేయడాన్ని. ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, నాకు సరిపోయేటన్నీ ఓట్లు రాలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగాను. అయితే రఘు నుంచి నాకు ఆశ్చర్యకరమైన బహుమతి అందింది. నేను చేసిన స్టంట్లు నచ్చి రఘు వ్యక్తిగతంగా కొన్ని రోజుల తర్వాత నాకు కరిజ్మా బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.

లడఖ్ రైడ్ వెళ్లే గ్రూపులో నా పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నా. ఓ క్యాంప్ ఫైర్‌కు వెళ్లేంత వరకు నేను వికలాంగుడినని ఎవరికీ తెలియదు. నాకు ఓ కాలు లేదని తెలిసిన తర్వాత నిర్వాహకులు గ్రూప్ నుంచి తప్పించారు. వికలాంగుడి బాధ్యతలు తాము తీసుకోలేమని క్లబ్ నుంచి బహిష్కరించారు. అప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇది నా ఓటమి కాదు.. మీదేనంటూ చెప్పేసి వెనక్కి వచ్చేశాను.

ఆ తర్వాత నేనే స్వయంగా ఓ క్లబ్ ను ఏర్పాటు చేశాను. దేశంలో ఎంతో మంది వినోద్‌లున్నారు. వైకల్యం కారణంగా అవకాశాలు అందుకోలేకపోతున్నవారెంతో మంది ఉన్నారు. ఒక్క అవకాశం దక్కితే అన్ని ఉన్నవారికంటే మరింత నైపుణ్యాన్ని, టాలెంట్‌ను ప్రదర్శించగలరు. అలాంటి వారినందరినీ నేను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చాను. ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించాను. సవాలుతో కూడుకున్న బైక్‌ను రైడ్ చేయాలనుకున్నాను. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కొన్నాను. అంతేకాదు ఓ కాజ్ కోసం రైడ్ నిర్వహించాలనుకున్నాను. అనుకున్నట్టుగానే మేం సాధించాం. అది 2010. లడఖ్‌లో భారీ వర్షాలు కురిశాయి. అక్కడ పునరావాస చర్యల్లో ఓ ఎన్జీవో సంస్థ పాలు పంచుకుంటోంది. ఒక్క ఇంటిని తిరిగి నిర్మించేందుకు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఈ పునరావాస ఖర్చుల కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించాం. దీని కోసం ముంబై నుంచి లడఖ్ వరకు రైడ్ చేయాలని డిసైడయ్యాం. షెడ్యూల్ ప్రకారం ఓ పిట్ స్టాప్ వద్ద నేను ఈ విషయం గురించి వివరించాను. చాలామందిని ఈ పునరావాసంలో పాల్గొనేలా ఒప్పించాను. ‘‘బియాండ్ ది ఆడ్’’ బ్యానర్ కింద మేం మొత్తంగా 18 లక్షల రూపాయలు సమీకరించాం. అప్పటి జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి కూడా నన్ను సన్మానించారు. నా జీవితంలో అదో మరిచిపోలేని రోజు.

ఈ ఘనతను చెప్పేందుకు మా ఆవిడకు ఫోన్ చేశాను. అయితే అక్కడి పరిస్థితి విని నిర్ఘాంత పోయాను. రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బు లేదని, రెంట్ ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తప్పదని మా ఆవిడ హెచ్చరించింది. దేశాలు పట్టుకు తిరిగింది చాలు ఇంటికి వచ్చేయమని ఆర్డర్ జారీ చేసింది. ప్రపంచంలో కష్టాలను తొలిగించేందుకు నేను ప్రయత్నించినప్పటికీ, నా ఇంటి సమస్యలను నేను పట్టించుకోవడం లేదు. నా ప్రయారిటీలు సరిగా లేవని, వికలాంగుల సమస్యలే తప్ప, నమ్మి వచ్చిన తనను, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ నా భార్య కోపంతో నన్ను విడిచి వెళ్లిపోయింది.

ఆమె అంటే నాకెంతో ప్రేమ. ఇప్పటికి కూడా. ఎప్పటికైనా ఆమె మనసును తిరిగి గెలుచుకుంటానన్న నమ్మకం నాకుంది.

కొన్నాళ్ల క్రితం నేను నథింగ్. చెల్లని నాణాన్ని. కానీ ఇప్పుడు నేను ప్రేమను, ఆనందాన్ని, విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందాను.

సూటు, బూటు ధరించి దర్జాగా ఉన్న 900 మంది అమెరికన్లను ఉద్దేశించి నేను ప్రసంగించాను. వారి కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడాను. ఇప్పుడు నాకు మార్కెటింగ్ జాబ్ ఉంది. అలాగే అథ్లెట్‌ను కూడా. ఎవరైనా తమ సమస్యలను నాతో చెప్పుకుంటే వారికి నేనొకటే చెబుతాను. మీ కోసం దేవుడు మంచి ప్లాన్‌ను నిర్దేశించాడని. అయితే అదెక్కడో తెలియని చోట ఉందని, దాన్ని వెతుక్కోవాలని సూచిస్తాను’’ అని వినోద్ రావత్ తెలిపారు.

సమస్యలు వస్తే బయపడి పారిపోవడం కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని నిరూపించాడు వినోద్. ఇలాంటి స్ఫూర్తివంతమైన స్టోరీ ఎంతోమందికి ఉత్తేజం కలుగుతుందని యువర్‌స్టోరీ ఆశిస్తోంది..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags