సంకలనాలు
Telugu

తొలి స్టార్టప్ ఎందుకు ఫెయిలైంది? నేనేం నేర్చుకున్నాను..?

Sri
13th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


అవి మా కాలేజీ రోజులు. రాత్రికి రాత్రే ఏదో చేసేయాలనే తపన. కొడితే దిమ్మదిరిగి పోవాలన్న పట్టుదల. ఒక్క స్టార్టప్ తో స్టీవ్ జాబ్సో, జుకర్ బర్గో కావాలన్న లక్ష్యం. ఇలాంటి కలలతో కొత్త వ్యాపారం గురించి తెగ ఆలోచించేవాళ్లం. ఇందుకోసం మా కాలేజ్ ప్లేస్ మెంట్స్ ని వదిలేసుకున్నాం. "స్టార్టప్ అంటే కొండపై నుంచి దూకిన తర్వాత నేలకు తాకే లోపు ప్యారచూట్ ను తయారు చేసుకోవడం లాంటిది" అని అందరూ అంటుంటారు. కానీ మా విషయంలో అలా జరగలేదు. మేం కొండ పైనుంచి దూకేశాం కానీ ప్యారచూట్ ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పరికరాలు తెచ్చుకోలేదు. అదీ జరిగింది. స్టార్టప్ ఆలోచన నుంచి పతనం వరకు మా ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే రీల్ ని కాసేపు వెనక్కి తిప్పాలి.

ఆశయం: ఏప్రిల్ 2013

ఆ రాత్రి నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను, నా ఫ్రెండ్ కలిసి నైటంతా యూనివర్సిటీలో చక్కర్లు కొడుతూ గొప్పగొప్ప కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయో చర్చించుకున్నాం. సొంత కంపెనీని నిర్మించాలన్న ఆలోచన నన్నెంతో ఉత్సాహ పరిచేది. తలచుకుంటేనే ఒళ్లు పులకరించిపోయేది. 'ఫలానా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇద్దరు కాలేజీ విద్యార్థులే యజమానులు' అన్న పేరొస్తుందని కలలు కనేవాళ్లం. తెల్లారేలోగా నేను ఆంట్రప్రెన్యూర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.

తొలి ఐడియా: మార్చి 2014

2013. ఆ ఇయర్ అద్భుతంగా గడిచింది. భవిష్యత్తులో నేను ప్రారంభించబోయే స్టార్టప్ కోసం ఓ వెబ్ సైట్ ని నిర్మించాలన్న ఒకేఒక్క ఆలోచన మనసులో పెట్టుకొని ప్రోగ్రామ్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. రీ-వర్క్, పర్పుల్ కౌ, స్టార్టప్ ప్లేబుక్ లాంటి ఎన్నో పుస్తకాలు చదివాను. అప్పట్నుంచే నేను యువర్ స్టోరీని ఫాలో అవుతున్నాను. అందులోని కథనాలు నన్నెంతో మోటివేట్ చేశాయి. వెబ్ సైట్ నిర్మించడానికి మెళకువలు, స్టార్టప్ ప్రారంభించడానికి కనీస పరిజ్ఞానం లభించాయి. మార్చి చివర్లోకి వచ్చేసరికి ఓ కొత్త ఐడియా నా మదిని తొలిచేస్తోంది. అది కాలేజీలో స్టూడెంట్ నెట్ వర్క్ కు సంబంధించిన ఐడియా. పూర్వ విద్యార్థుల్ని ప్రస్తుత విద్యార్థులతో కలపడం, వారి నుంచి సాయం, శిక్షణ, సహకారం పొందడం లాంటి వాటికోసం ప్లాట్ ఫామ్ అన్నమాట. దానికి 'స్కాలర్ నెట్' అని పేరు పెట్టాను. అది అతిపెద్ద ప్రాజెక్ట్. నాతో పాటు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కు చెందిన పలువురు గొప్ప మేధావులు సాయం చేశారు. నేను కొందరు ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్స్ ని కలిశాను. వాళ్లు ఆ వెబ్ సైట్ ని నిర్మించేందుకు ఐదు నుంచి ఎనిమిది లక్షలు అడిగారు. నేను ఆ డబ్బులు కట్టేవాడినేమో. కానీ నాకు నెలకు అందే స్కాలర్ షిప్ ఐదు వేలు మాత్రమే. దాంతో కుదర్లేదు.

అడుగు పడింది: జూలై 2014

భారీ ఖర్చు కావడంతో నా ప్రాజెక్టును కొంత కుదించాను. నేనే సొంతగా తయారు చేసుకోవచ్చనుకున్నా. ఓ కాగితంపై నా ఐడియాను రాద్దామనుకున్నా. కానీ ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాలేదు. 'ట్రైనింగ్' అన్న దగ్గర నా ఆలోచన ఆగింది. మన నగరంలో అన్ని రకాల వొకేషనల్ ట్రైనింగ్ కోర్సుల వివరాలు అందించే వెబ్ సైట్ అది. అందులో విద్యార్థుల రివ్యూలు కూడా ఉంటాయి. ఈ ఐడియా బాగుందనుకొని వెంటనే రీసెర్చ్ చేశా. అలాంటిది మా నగరంలో ఎవరూ చేయట్లేదని గుర్తించాను. నా ఐడియాతో గాఢమైన ప్రేమలో పడ్డాను. ఆలోచన నా స్నేహితుడితో పంచుకున్నా. తను కూడా ఎంతో ఆసక్తి చూపించాడు. ఇక ఆ స్టార్టప్ కి అతనే కో-ఫౌండర్ అయ్యాడు. మా ఐడియాపై కసరత్తు చేసేందుకు, డొమైన్ నేమ్ పొందేందుకు, నాలుగు రోజుల సమయం పట్టింది. ఐదో రోజు నుంచే పని మొదలు పెట్టేశాం.

కిక్: ఆగస్ట్ 2014

అది చాలా క్లిష్టమైన వెబ్ సైట్. ఓ నెల రోజులు పట్టింది తయారు చేయడానికి. కావాల్సిన కోర్సు ఏ ఇన్ స్టిట్యూట్ అందిస్తుందో విద్యార్థులకు సమాచారం ఇవ్వడం, ఆ కోర్సుపై రివ్యూలు చదవడం, డెమో లెక్చర్స్ వినడం, ఇన్ స్టిట్యూట్ ఫోటోలు చూడటం, గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ తెలుసుకోవడం... ఇలా అన్నీ ఉండేలా మా వెబ్ సైట్ తీర్చిదిద్దాం. అంతేకాదు... ఒక్క క్లిక్ తో విద్యార్థులు ఇన్ స్టిట్యూట్ లో అప్లై చేసుకోవచ్చు. కోర్సు ఫీజుల్లో ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. మేం తయారుచేసిన వెబ్ సైట్ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నామప్పుడు. ఇక మా ఐడియాను ఇన్ స్టిట్యూట్ లకు పరిచయం చెయ్యాలనుకున్నాం. మా ప్రొడక్ట్ గురించి వివరించేందుకు ప్రముఖ విద్యాసంస్థలతో ఓ సమావేశం నిర్వహించాం. వాళ్లకు మా ఐడియా బాగా నచ్చింది. అప్పటికప్పుడు పదిహేను వేలు చెల్లించేందుకు వాళ్లు సిద్ధమయ్యారు. అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.

తొలి విజయం: సెప్టెంబర్-అక్టోబర్ 2014

సంతోషంతో మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది తొలి విజయం. ఆ ఉత్సాహంతో మరో 15 విద్యా సంస్థల్ని కలిశాం. అందులో పది సంస్థలు వెంటనే మాతో ఒప్పందం చేసుకున్నాయి. అందరూ ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారాన్ని అందించిన ప్రొడక్ట్ మాది అని గర్వంగా ఫీలయ్యాం. మేము ఆయా విద్యాసంస్థల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. వారి ఇష్టాయిష్టాలకు, అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం.

దూకుడు: నవంబర్-డిసెంబర్ 2014

అప్పటివరకు పనులన్నీ మేం మేనేజ్ చేసుకున్నాం. కానీ పనిభారం పెరుగుతుండటంతో మా ఇధ్దరు స్నేహితులను టీమ్ లో చేర్చుకున్నాం. ఇంకా ఎక్కువగా లాభాలు ఆర్జించిపెట్టేలా మరింత అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేయడంపై దృష్టిపెట్టాం. మా ప్రొడక్ట్ ఎలా ఉందన్నదానిపై విద్యాసంస్థల నుంచి ఫీడ్ బ్యాక్ ఉంది కానీ... ఎండ్ యూజర్స్ అయిన విద్యార్థుల నుంచి తీసుకోలేదు.

హిట్ బదులు ఫ్లాప్ : జనవరి 2015

జనవరి 19, 2015న మా స్టార్టప్ ని ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టాం. ఉత్తమ విద్యాసంస్థల కోర్సుల వివరాలు, డిస్కౌంట్లు, ఉచితంగా రెజ్యూమె తయారు చేసే అప్లికేషన్... ఇలా మా దగ్గర అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక మేం లక్ష్యానికి దగ్గరయ్యాం అనిపించింది. కానీ అది హిట్ కాలేదు. ఆల్ రౌండ్ ఫ్లాప్ షో అయింది. మేం వందలాది మంది విద్యార్థులకు మా ప్రొడక్ట్ గురించి వివరించాం కానీ... ఒక్కరూ పట్టించుకోలేదు. మా ఎండ్ యూజర్స్ అయిన విద్యార్థులకు మా ప్రొడక్ట్ ను ప్రదర్శించడం అదే మొదటిసారి. అదే మేం చేసిన పెద్ద తప్పు కూడా.

మరో ఛాన్స్: ఫిబ్రవరి-మార్చి 2015

మా కాలేజ్ ఫెస్ట్ జరుగుతున్న సంవత్సరం అది. ఆ విధంగా మా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకునేందుకు మంచి అవకాశం దొరికింది. మేం పాపులర్ అయ్యాం... మా వెబ్ సైట్ ట్రాఫిక్ 300 శాతం పెరిగింది. కానీ... ఒక్కరు కూడా మా వెబ్ సైట్ ద్వారా కోర్సులో చేరలేదు. విద్యార్థులు విద్యాసంస్థల్లో నమోదు చేసుకుంటున్నారు కానీ... మా ద్వారా కాదని అర్థమైపోయింది.

పతనం: ఏప్రిల్-మే 2015

విద్యార్థులు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సుల్లో చేరే సమయం అది. ఇప్పుడైనా అద్భుతమైన ప్రదర్శన చేస్తాం అనుకున్నాం. అడ్వర్టైజింగ్ లో దూకుడు పెంచాం. మా ద్వారా ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు ఎక్కువ డిస్కౌంట్లు ప్రకటించాం. మాకు కేవలం 11 మంది అభ్యర్థులు మాత్రమే వచ్చారు. మా కంటే అధికంగా విద్యార్థులకు గ్రూప్ డిస్కౌంట్లు వస్తున్నాయని మాకు తెలిసింది. కొందరు ప్రభుత్వ విద్యాసంస్థల్లో వొకేషనల్ ట్రైనింగ్ కోసం చేరారు. అవన్నీ తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

షట్ డౌన్: జూన్ 2015

మేము మా స్టార్టప్ ని అధికారికంగా మూసేశాం. మా టీమ్ సభ్యులు ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు.

నేను నేర్చుకున్నదేంటంటే..?

1. ప్రణాళిక: మీకు నచ్చిందనో, సరైనది అనిపించిదనో తొందరపడి ఏదీ ప్రారంభించకండి. బయటకు వెళ్లండి. కసరత్తు చేయండి. మార్కెట్ రీసెర్చ్ చేయండి. కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యేంటో క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ ఐడియా ఆ సమస్యను పరిష్కరిస్తుందో లేదో తెలుసుకోండి. మీ ఆలోచన సరైనదని నిరూపించుకోండి.

2. కో-ఫౌండర్ ఎంపిక: ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానమంతా మీకు తెలిసుండదు. అందుకే ఓ తెలివైన కో-ఫౌండర్ తో కలిసి నడవడం మంచిది. మీ ఆప్తమిత్రుడైనంత మాత్రానా అతనే మీ కో-ఫౌండర్ గా ఫిక్స్ కాకూడదు. అందుకే కో-ఫౌండర్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగువెయ్యాలి.

3. ఐడియాతో జాగ్రత్త: నమూనా బాగున్నంత మాత్రానా దానిపై ఇష్టం పెంచుకోకండి. ఎందుకంటే అది కేవలం నమూనా మాత్రమే. నమూనాలు అంటేనే మార్పుచేర్పులుంటాయి. ఆ విషయం మర్చిపోకూడదు.

4. యూజర్ ఎవరు?: మీ అంతిమ యూజర్ ఎవరో తెలుసుకోండి. మా ఎండ్ యూజర్స్ విద్యార్థులు. కానీ మేము మా ప్రొడక్ట్ ని విద్యాసంస్థలకు తగ్గట్టుగా తయారు చేశాం. విద్యాసంస్థల ఫీడ్ బ్యాక్ తీసుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్ ని తీర్చిదిద్దాం. విద్యార్థులు కూడా ఆ ప్రొడక్ట్ ని ఇష్టపడతారని మేము భావించాం. కానీ అలా జరగలేదు.

5. ఆదాయం ముఖ్యం కాదు: డబ్బు వెనుక పరిగెత్తకూడదు. రెవెన్యూ అనేది మీ స్టార్టప్ ప్రతిఫలంగా ఉండాలి తప్ప... అదే అంతిమ లక్ష్యం కాకూడదు. మీ ఎండ్ యూజర్లు ఇష్టపడేలా ప్రొడక్ట్ ని తయారు చేయాలి. కానీ... మీ ప్రొడక్ట్ ఒక ఆప్షన్ గా మిగిలిపోకూడదు.

6. అడ్వర్టైజింగ్ ఒక బ్యాడ్ ఆప్షన్: మేం అదే చేశాం. మీక్కావాల్సింది మౌఖిక ప్రచారం. మీ ప్రొడక్ట్ అద్భుతంగా ఉంటే... అడ్వర్టైజింగ్ గురించి బెంగ అవసరం లేదు. మీ ఎండ్ యూజర్సే ప్రచారం చేస్తారు. మీ ప్రొడక్ట్ ఎంత బాగుందో వారి సహచరులకు చెబుతారు. అడ్వర్టైజ్ చేయాలని అనుకోవడానికి ముందు ఈ ప్రశ్నలు వేసుకోండి- 'ప్రొడక్ట్ లో ఉన్న లోపం ఏంటీ?', 'మౌఖిక ప్రచారం ఎందుకు లభించట్లేదు?' అని.

7. స్టార్టప్ ఎందుకు?: అసలు ఎందుకు చేస్తున్నాం అని ప్రశ్నించుకోండి. ఇది కాకపోతే ఇంకొకటి అన్న భావనలో ఉండకండి. ఆ ఆలోచనల్లో ఉంటే ఇప్పుడున్న స్టార్టప్ పై ఆసక్తి తగ్గుతుంది. మీ స్టార్టప్ విఫలం అవుతుంది.

రచయిత గురించి: సౌరభ్ సింగ్, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఐడియాలు రాసుకోవడానికి చిన్న పుస్తకం, ఓ కిండిల్ ఎప్పుడూ వెంట ఉంటాయి. బ్లాగ్ saurabh.io ఫాలో కావొచ్చు. స్టార్టప్ అడ్వైజ్ పొందవచ్చు. అతని ప్రయాణం నుంచి నేర్చుకోవచ్చు. సాయం చేయడానికి సిద్ధంగా వుంటాడు. మెయిల్ ఐడీ: connect@saurabh.io

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags