సంకలనాలు
Telugu

జడలో పూలు పెట్టుకున్నట్టు వచ్చిన కలను నిజం చేస్తున్న బాలవికాస

team ys telugu
24th Jun 2017
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వితంతువు అంటే ఇప్పటికీ సమాజంలో చిన్నచూపే. వాళ్లను శుభకార్యాలకు పిలవరు. పేరంటానికి రమ్మని బొట్టుపెట్టరు. గాజులకు అంటరానివారు. వాళ్ల చేత్తో పసుపు తాకొద్దు. పూలు పెట్టుకోవద్దు. ఏ శాస్త్రం చెప్పిందో, ఏ శాసనం రాసిందో గానీ, భర్తలేని స్త్రీ పట్ల శతాబ్దాల అనాగరికం రాజ్యమేలుతోంది. ఏ నేరం చేయకుండానే అంటిన పాపానికి.. వాళ్లు కళ్లలో కడలి కల్లోలాన్ని దాచుకుంటున్నారు. అలాంటి వారికి మేమున్నాం అంటూ ముందుకొచ్చింది బాలవికాస. ఎందరో వితంతువులను చేరదీసి వారిలో మానసిక స్థయిర్యాన్ని నింపుతోంది.

image


శుభం.. అశుభం. ఈ రెండింటి మధ్య ఎడతెగని మానసిక సంఘర్షణ. నుదుట బొట్టు, చేతులకు గాజులు లేకపోతే ఊరవతలి బతుకే. పేరంటాలకు పనికిరారు. పెళ్లిళ్లకు కొరగారు. శుభకార్యాలకు మొహం చూపించొద్దు. చివరికి కన్నకూతురు పెళ్లి చేసినా, మనసారా ఆ చిట్టితల్లిని ఆశీర్వదించొద్దు. ప్రాణం లేని గడపకు బొట్టు దిద్దిపోతారుగానీ. ఎదురుగా బతికున్న మనిషి కనిపించినా కనికరించరు. ప్రాణంలేని చెక్కపేడుకున్న విలువ ప్రాణమున్న మనిషికి లేదు.

కాళ్లకు పసుపు రాసుకున్నట్టు కలొస్తుంది. ఉలిక్కిపడి లేస్తారు. కళ్లలో కల్లోల తరంగం. ఏడుపు ఉప్పెనవుతుంది. దారెంట పువ్వులను చూడగానే మనసంతా కకావికలం. చిన్నప్పుడు మూరెడు పూలైనా లేకుంటే అమ్మ దగ్గర ఎంత గోల చేసేదని. ఇప్పుడు వాటిని కనీసం తాకడానికి కూడా వీల్లేదు. నుదుట రూపాయి కాసంత కుంకుమ దిద్దుకోవాలని, ఇష్టమైన షిఫాన్ చీర కట్టుకోవాలని, అమ్మలక్కలతో కలిసి పేరంటానికి వెళ్లాలని, పెళ్లిళ్లలో అవిరేని కుండలు ఎత్తాలని, ఆడపడుచు కాళ్లకు ఆత్మీయంగా పసుపు రాయాలని.. మనసు ఎంతగా ఆరాటపడుతుందో!! 

ఎవరైనా పెళ్లికి పిలిస్తే బాగుండు.. ఎవరైనా శుభకార్యం ఉందిరా అని చెప్తే బాగుండు.. గుండె లోతుల్లో ఎంతెంత ఆవేద. భర్త ప్రసాదించిన ఐదోతనం కోల్పోతే సమాజంలో ఇంత చిన్నతనమా. కట్టుకున్నవాడు కాలం చేస్తే జీవితాంతం ఇంత ఏకాకి తనమా. ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి భర్త అనుకోని ప్రమాదంలో చనిపోతే.. ఆ యువతికి తెల్లచీర కట్టించి, బొట్టు చెరిపేసి, చేతిలో బెల్లం పెడుతుంటే.. ఆ టైంలో ఆ అమ్మాయి అనుభవించే చిత్రవధను వర్ణించడానికి ఏ భాష సరిపోదు.

సముద్రమంత దుఖాన్ని దిగమింగి ఎలాగోలా బతకుదామన్నా సమాజం బతకనీయదు. కుట్టుమిషన్ పెట్టుకుంటే శుభకార్యంలో వితంతు కుట్టిన బట్టలు కట్టుకోం అంటారు. గాజుల దుకాణం పెడితే.. భర్తలేని ఆడదాని చేతులతో గాజులు వేయించుకోం అంటారు. మరి ఏం చేసి బతకాలి? ఐదోతనాన్ని ప్యాకేజీగా కలిపి ఇచ్చిన భర్త అనుకోకుండా కాలం చేస్తే సమాజం నుంచి దూరంగా మసులుకోవాలా? అదే మగాడైతే దర్జాగా మరో పెళ్లి చేసుకోవచ్చు. ఎటొచ్చీ వితంతువుల మీదే అందరి కళ్లు. 

image


ఈ దేశంలో కోట్లాది మంది వితంతువులు నేటికీ సామాజిక దురాచారాల కారణంగా చిత్రవధ అనుభవిస్తూనే ఉన్నారు. కొందరు ఆత్మస్థైర్యం కోల్పోయి తనువు చాలిస్తున్నారు. దేశంలో 29 శాతం మంది యువ వితంతువులు ఆత్మహత్యలకు ప్రయత్నించినట్టు ఒక సర్వేలో తేలింది. అలాంటి వారందరికీ బాలవికాస కొండంత అండగా నిలబడింది. వితంతువుల కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. పది వేల మంది వితంతువులతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాసభ.. ఈ సమాజాన్ని ఒకటే కోరిక కోరింది. తమని కూడా ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఇవ్వండి అని.

దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శంగా నిలిచిన బాలవికాస సంస్థను స్థాపించింది ఒక మహిళ. వరంగల్ జిల్లా రెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాల థెరీసా ఆధ్వర్యంలో 26 ఏళ్లుగా బాలవికాస పనిచేస్తోంది. కెనడాలో స్థిరపడినప్పటికీ మాతృభూమి మీద మమకారంతో ఆమె స్వదేశానికి తిరిగొచ్చారు. దేశానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో బాల వికాస పేరుతో సేవా కార్యక్రమలు మొదలు పెట్టారు. తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ మొత్తం ఐదు రాష్ట్రాల్లోని ఆరు వేల గ్రామాలకు బాల వికాస సేవలు విస్తరించాయి. 40 లక్షల మంది బాలవికాస నుంచి సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తోంది. 1,600 గ్రామాల్లో 2 లక్షల 20 వేల మందితో సంఘాలు ఏర్పాటు చేసింది. ఇవి మహిళలు, వితంతువుల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి.

1600 మంది అనాథ పిల్లలను కూడా బాలవికాస అక్కున చేర్చుకుంది. 15 వేల మంది వితంతువులకు అండగా నిలిచింది. 400 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు మెరుగుపరిచింది. దేశంలోనే తొలిసారి గ్రామీణ మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేసింది. 800 గ్రామాల్లో బాలవికాస వాటర్ ప్లాంట్లు పెట్టారు. వాటి ద్వారా ప్రతి రోజు 18 లక్షల మందికి రెండు రూపాయలకే క్యాన్ నిండా నీళ్లు ఇస్తున్నారు. 450 గ్రామాల్లో మంచినీళ్ల ట్యాంకులు కట్టారు. 6 వేల 500 బోర్లు, 6 వేల 450 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. మంచినీటి పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది బాలవికాస.

రైతులకూ బాలవికాస చేయూత అందించింది. 1999లోనే చెరువుల్లో పూడికతీత మొదలు పెట్టింది. 850 గ్రామాల్లో పూడికతీసి చెరువులను అభివృద్ధి చేసింది. 40 గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. గంగదేవిపల్లి లాంటి ఆదర్శ గ్రామాన్ని దేశానికి అందించింది బాలవికాస సంస్థే. వరంగల్ పట్టణంలో రూపాయికే లీటరు నీళ్లు అందించే ఏటీఎంలు ఏర్పాటు చేశారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు బాలవికాస ఆదర్శంగా నిలిచింది. 60 దేశాల నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వరంగల్ వచ్చి బాలవికాస ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని వెళ్లారు. టీ-హబ్ స్ఫూర్తితో హైదరాబాద్లో బాలవికాస ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసి.. అల్లిక, ఇష్మా లాంటి సోషల్ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సాహిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags