సంకలనాలు
Telugu

ఆ మార్పును మీతోనే మొదలుపెట్టండి !

3rd Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్, శ్రద్ధా శర్మ


''మీరు సరైన ప్రశ్న అడగకపోతే.. స్పష్టమైన సమాధానం రాదు. సరైన ప్రశ్నే.. సమాధానికీ మూలం. పరిష్కారాన్ని.. ప్రశ్నే కేంద్రబిందువు. సమాధానాల కోసం చేసే శోధనే ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది'' అంటారు ఎడ్వర్డ్ హాడ్‌నెట్.

image


'ఆడపిల్లగా పుట్టడమే నేరం' అని జనాలు భావించే ప్రాంతం నుంచి నేను వచ్చాను. మహిళలను ఓ బలహీనమైన, ద్వితీయ శ్రేణి జాతిగా ఈ సమాజం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ మాటకు వస్తే... అందరి మహిళలల్లానే నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ మహిళ అయి ఉండి.. మహిళా పారిశ్రామికవేత్తలకు ఏమీ చేయడం లేదని నాపైనా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.

' బీహార్‌లో ఉన్న మహిళలకు నువ్వేం చేస్తున్నావు ? ' అంటూ మా నాన్నమ్మ ఎప్పుడూ అడిగేది. ఆమె ఓ ధృడమైన మహిళావాది. 16 ఏళ్లకే పెళ్లై.. 18 ఏళ్లకే భర్తను పోగొట్టుకున్నా.. ఆమె చదువుకుంది. ఆ రాష్ట్రం నుంచి ఎంపికైన మొదటి మహిళా సివిల్ సర్వెంట్ స్థాయికి చేరుకుంది. మహిళల కోసం మేం నిర్వహిస్తున్న 'హర్ స్టోరీ'ని పరిగణలోకి తీసుకోవడం లేదా.. ? అని నేను ఆమెను అడిగాను. '' అది ఏ మాత్రం సరిపోదు '' అనేది తన నుంచి వచ్చిన సమాధానం. సిల్క్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ చేతులు పోగొట్టుకున్న మహిళలను కలసుకోవాలని.. ఇంకా ఏదో ఏదో చేయాలని మా నాన్నమ్మ సూచించేది. ఆమె మాటలు నన్ను కదిపేశాయి. మహిళాభ్యుదయం కోసం రిటైర్మెంట్ తర్వాత 'జాగో బెహన్' పేరుతో ఆమె ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహించేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఆమెతో పాటు ఆ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లేదాన్ని. నేను ఈ స్థాయిలో ఉండేందుకు.. విభిన్నంగా ఆలోచించేందుకు కారణం అప్పటి ప్రభావం నాపై ఎక్కువగా ఉండడమే. అందులో సందేహం లేదు.

లింగబేధం, సమానత్వం అనేది నా దృష్టిలో పూర్తిగా వ్యక్తిగతమైన అంశం. మహిళా హక్కులు, సమస్యలపై కేవలం మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని నాకు మొదట్లోనే అర్థమైంది. నా రాష్ట్రంలోని మహిళలందరికీ నేను ఓ ఉదాహరణగా నిలవాలనే నిశ్చయంతో కృషి చేశాను, కష్టపడ్డాను. ''తనే చేయగాలేనిది.. మనం చేయలేమా.. ? '' అని వాళ్లు అనుకోవాలి, అనేది నా తాపత్రయం.

నేను ఇప్పుడు నా స్టార్టప్ ప్రపంచంలోకి వస్తున్నాను. టెక్ ప్రపంచంలో మహిళల పాత్ర, టెక్నాలజీ సమావేశాల్లో వారి హాజరు వంటి విషయాలపై జనాలు మాట్లాడుకునేది ఎప్పుడు ? అనేది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి చర్చల వల్ల ప్రయోజనం ఉండొచ్చు.. కానీ ఇవి కేవలం మాటలకే పరిమితమైపోతున్నాయి. కేవలం చర్చలతోనే కాలాన్ని వెళ్లదీసే ప్రసంగాల్లో కూడా నేను పాల్గొనను. ఏదో ఒకటి చేయాలని నాకు బలంగా ఉంది. 

కనీసం మనమంతా కలిసి ఇప్పుడైనా సరైన ప్రశ్నలు అడుగుదాం. వాటితోనైనా మన ఆలోచనా పరిధి పెరుగుతుంది. అందుకే నేను మీ అందరినీ అడుగుతున్నా.. అభ్యర్థిస్తున్నా. ఇప్పటికైనా సరైన ప్రశ్నలను అడుగుదాం. వ్యక్తిగతంగా, కలిసికట్టుగా.. వాటన్నింటికీ సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం.

ప్రశ్నలలోకి వెళ్లేముందు నా వ్యక్తిగత విషయాలను మీతో పంచుకుంటున్నా. ఈ నెలలో ఒక వారం ఢిల్లోలో ఉన్నా, ఆ తర్వాత మూడు రోజుల పాటు బెంగళూరులోని టెక్ స్పార్క్స్‌కు హాజరయ్యాను. దీంతో ఇంట్లో నేను గడిపిన క్షణాలు తక్కువే. ఆ మాటకు వస్తే.. ఆంట్రప్రెన్యూర్ అవతారం ఎత్తినప్పటి నుంచి ఏడేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇంటి బాధ్యతల ఆందోళన నాకు ఏ మాత్రం లేదు. ఎందుకంటే భార్యాభర్తలిద్దరం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటాం. ఎవరి పని వాళ్లకు ముఖ్యం అనే భావన ఇద్దరిలోనూ ఉంది. ఇక్కడ మా ఆయన నాకు పర్మిషన్ ఇవ్వడం అనే మాట ఉండదు. ఎందుకంటే.. నా పని ఎంత ముఖ్యమో ఆయనకు తెలుసు. అలానే ఆయన పనుల ప్రాముఖ్యత ఏంటో నాకూ అవగాహన ఉంది. పనులకూ, ప్రాధాన్యతలకు లింగబేధం ఉండబోదని ఆయనకు తెలుసు.

ప్యానెలిస్టుల సంఖ్య పెరిగితే చాలా ?

టెక్ స్పార్క్స్‌లో జరిగిన ఈవెంట్స్ ప్యానెల్‌లో మహిళలు ఎక్కువ మంది ఎందుకు లేరు ? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. సమస్యను పరిష్కరించాలి అనే బలమైన కాంక్ష ఉంటే మనం వాస్తవ ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. 

ఎందుకు ఎక్కువ మంది మహిళలు పారిశ్రామిక వ్యవస్థలోకి అడుగు పెట్టడం లేదు ? ఎందుకు మహిళా పారిశ్రామికవేత్తలకు ఫండింగ్ అందడం లేదు ? మహిళ సారధ్యంలో ఉన్నతస్థాయికి చేరుకున్న కంపెనీ భారత్ నుంచి ఎందుకు రాలేదు ? మన దగ్గర ఎందుకు మహిళా ఇన్వెస్టర్లు లేరు ? ఇలా ఎన్నో అసంఖ్యాకమైన ప్రశ్నలు ఉన్నాయి.

అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది సమాజమే కానీ.. మహిళలు కాదు. ఇంకా చెప్పాలంటే.. మన ఇంటి నుంచే ఇది మొదలుకావాలి.

మీ కూతురు ఇంటి మొహం చూడకుండా.. ఎప్పుడూ తన కొత్త వెంచర్‌ కోసమే రాత్రింబవళ్లూ కష్టపడుతూ ఉంటే.. తల్లిదండ్రులుగా మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలరు ? ఏ మేరకు మీరు తనకు మద్దతు ఇవ్వగలరు ?

మీ స్నేహితురాళ్లు, మనవరాళ్లు, ఆడబిడ్డలు, మేనకోడళ్లు.. ఎవరైనా కావొచ్చు.. ఈ సమాజం ఎంతవరకూ వాళ్లకు మద్దతునిస్తుంది ? ఇంటి బాధ్యతలు, చుట్టుపక్కల వాళ్లు ఏం అనుకుంటారు ? అనే సాకుతో వాళ్లను కట్టడి చేయకుండా.. ఏ స్థాయిలో వాళ్లను ప్రోత్సహించి... వాళ్ల కలలను సాకారం చేసుకునేందుకు అవకాశం ఇస్తారు ?


మగవాళ్ల కోసం ఎక్కువ మంది మహిళలు తమ కెరీర్‌ను వదులుకుంటున్న సందర్భాలే మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో తనకు ఇష్టమైన పని చేయడానికో, లేదా తనకు నచ్చిన వెంచర్‌లోకి వెళ్లడానికో.. ఎంత మంది మగాళ్లు.. తమ భార్య, చెల్లెలు, గాళ్ ఫ్రెండ్‌ను ప్రోత్సహిస్తారు ?

అబ్బాయిల్లా.. అమ్మాయిలు కూడా తమ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తూ, ఎక్కడా ఎమోషనల్ అవకుండా.. తమ బాధ్యతలు నిర్వర్తిస్తారనే నమ్మకం ఎంత మంది ఇన్వెస్టర్లకు ఉంది ? మహిళా సారధ్యంలోనూ ఓ కంపెనీ అత్యున్నత స్థాయికి ఎదగగలదు అనే నమ్మకం ఇన్వెస్టర్లకు ఉందా ?

మన హక్కును మనం సాధించాలి

ఇవన్నీ చాలా కఠినమైన ప్రశ్నలే. టెక్ స్పార్క్స్ వేదికపై ఎక్కువ మంది మహిళలను ప్యానెలిస్టులుగా కూర్చోబెడితేనో, లేకపోతే వాళ్లు మాట్లాడేందుకు 15 నిమిషాల సమయం ఇస్తేనో.. వీటిన్నంటినీ సమాధానం దొరకదు. టెక్నాలజీ రంగంలో మహిళలు ఎక్కువగా ఉన్నప్పుడు, స్టార్టప్ ఎకో సిస్టంలో మహిళల పాత్ర కీలకంగా మారినప్పుడు, ఉద్యోగినుల సంఖ్య పెరిగినప్పుడు.. అడగాల్సిన అవసరం లేకుండానే వక్తల సంఖ్య పెరుగుతుంది. అంతే కాదు మహిళల కోసమే సమావేశాలు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి. 

అయితే తమకు అర్హమైన హక్కును మహిళలు డిమాండ్ చేసినప్పుడే ఇది సాధ్యపడ్తుంది.

మహిళా భాగస్వామ్యాన్ని మనం అన్ని రంగాల్లో కోరుకుంటున్నప్పుడు.. స్టేజీపై కేవలం 15 నిమిషాల ప్రసంగం అందుకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.

ఇంటి నుంచే ఆ ప్రోత్సాహం మొదలు కావాలి. భార్య, చెల్లెలు, స్నేహితురాలు, కూతురి వెన్నుతట్టాలి. అది కూడా ఆడపిల్లగా పుట్టిన మొదటి రోజు నుంచే ఆ మద్దతను తెలపాలి.

దోషిగా చూస్తారనే భయంతోనే ఉద్యోగాలు వదిలేస్తున్నారు

చదువుకుని, ఉద్యోగం చేస్తున్న మహిళలు కొద్దికాలం తర్వాత ఎందుకు ఉద్యోగ బాధ్యతల నుంచి పెద్ద సంఖ్యలో వైదొలుగుతున్నారో ఎప్పుడైనా గమనించారా ? లెక్కలు ఏం చెబ్తున్నాయో.. చూశారా ? ఉద్యోగాల నుంచి మహిళలు తప్పుకోవడానికి ప్రధాన కారణం కుటుంబం, సమాజం నుంచి వచ్చే ఒత్తిడే. కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శే మహిళలను వెనక్కితగ్గేలా చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే.. కుటుంబ బాధ్యతలనూ మోసే సపోర్టింగ్ వ్యవస్థ మన దగ్గర లేదు. అందుకే ఈ విమర్శను తట్టుకోలేక.. సమాజం దృష్టిలో దోషిగా నిలబడలేక మహిళలు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్.. వంటి ఛాలెంజింగ్ రంగాలను కాదనుకుని.. చిన్నాచితకా వాటితో సర్దుకుపోతున్నారు. పెద్ద బాధ్యతలు నిర్వర్తించే అవకాశం, సత్తా ఉన్నా.. ఇతరుల సంతోషం కోసం కాంప్రమైజ్ అయిపోతూ.. సర్దుకుపోతున్నారు.

ప్రపంచం అనే రణభూమిపై ప్రతీ మహిళా.. మగాడిలానే పోరాడి విజయం సాధించాలని అనుకుంటుంది. అంతే కానీ లింగబేధాన్ని అనుకూలంగా మార్చుకుని నెగ్గాలని అనుకోదు.

ఓ వేదిక మీద మహిళ ప్రాధాన్యాన్ని పెంచడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ అవి తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి తప్ప.. సమస్యకు సరైన పరిష్కారం మాత్రం కావు.

టెక్ స్పార్క్స్ 2015నే ఇందుకు ఉదాహరణగా తీసుకుందాం. భారత్ మెచ్చే 30 ఆశావాహ స్టార్టప్స్(టెక్ 30) స్టార్టప్స్ ఇక్కడ అవిష్కృతమవుతాయి. 3,000 మంది ప్రేక్షకులు, 12 మంది స్పాన్సర్స్ వచ్చిన ఈ కార్యక్రమాన్ని యువర్ స్టోరీ నిర్వహించింది. ఓ మహిళ సారధ్యం వహిస్తున్న యువర్ స్టోరీ సంస్థ.. దీన్ని ఆర్గనైజ్ చేసింది. ఈ కార్యక్రమంలో స్పీకర్, ప్యానెలిస్ట్‌గా పాల్గొనే అవకాశాన్ని కల్పించేందుకు మేం కొద్దిరోజుల క్రితం వెబ్ సైట్లో ప్రత్యేక పేజీ ఏర్పాటు చేశాం. మాకు 200 నామినేషన్లు అందితే.. అందులో డజను కంటే తక్కువ మంది మహిళలే స్వయంగా తమను తాము నామినేట్ చేసుకున్నారు. మగవాళ్లను నామినేట్ చేసిన మగువల సంఖ్యే ఎక్కువగా ఉంది.. ఆశ్చర్యంగా.. !

'' మీ ఇంట్లో, మీరు పనిచేసే చోట, ఆంట్రప్రెన్యూరల్ ఎకో సిస్టంలోనే మీ హక్కుల కోసం మీరు పోరాడండి. ప్రాతినిధ్యం తగ్గుతోందని.. పోస్ట్ మార్టం చేసుకునే కంటే.. మీ హక్కులను మీరు సంపాదించుకోండి. మహిళా పారిశ్రామికవేత్తలే మార్గదర్శకులు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఈ రంగంలోకి అడుగుపెట్టేలా మీ చర్యలు ఉండాలి. అలాంటి పనులు మీరే చేయకపోతే.. ఇతరులకు ఎలా తెలుస్తుంది ? మహిళలూ ఆలోచించండి.

ఫెమినిస్టులు అంటారనే భయం వద్దు

మహిళలను, మహిళా పారిశ్రామికవేత్తలను ఈ సమాజం, తల్లిదండ్రులు, స్నేహితులు, అక్కలు,చెల్లెళ్లు, అన్నాదమ్ములు, ప్రొఫెసర్లు, టీచర్లు.. ఇలా వారూవీరూ అనే తేడా లేకుండా అందరూ సపోర్ట్ చేయాలి. దీనివల్ల మీరు ఫెమినిస్టులుగా ఏం మారిపోరు. ఓ మంచి మనిషి అనిపించుకుంటారు.

మహిళలకు

దూరాలకు చేరుకోవడానికి మీకు ఇతరుల సాయమో, ఊతమో అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైనా.. పెద్ద అంగలు వేస్తూనో.. లేక పరిగెడుతూనో.. మీ లక్ష్యాలను చేరతారు. ఆలస్యమైతే కావొచ్చు.. కానీ విజయాన్ని మాత్రం తప్పక అందుకుంటారు.

''ప్రపంచంలో కోరుకుంటున్న మార్పును... మొదట నీ నుంచే ప్రారంభించు'' - మహాత్మా గాంధీ.
image


- శ్రద్ధా శర్మ

చీఫ్ ఎడిటర్ - ఫౌండర్, యువర్ స్టోరీ

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags