సంకలనాలు
Telugu

వైవిధ్య వస్తువుల ప్రత్యేక వేదిక 'చాక్ బొటిక్'

Sri
7th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆశ ఒకటే... ఆశయం ఒకటే... అందుకే వారిద్దరూ ఒక్కటయ్యారేమో. కళలపై అమితాసక్తి ఉన్న ఆ ఇద్దరు మహిళలు... ఓ బొటిక్‌ను స్థాపించి కళాభిమానులకు సేవలందిస్తున్నారు. అసలు వీరి ప్రయాణం ఎలా మొదలైంది ? ఇప్పుడేం చేస్తున్నారు ? లక్ష్యం ఏంటో తెలుసుకుందాం.

ది చాక్ బొటిక్

కాజల్ దాగా, కవితా చౌదరీ... ఓసారి వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు ఒక్కటని మాటల్లో తెలిసింది. కళలు, కళాఖండాలు అంటే వీరికి అమితమైన ప్రేమ. అలా కళలపై వారికున్న అభిరుచి, రూపొందించిన కళాఖండాలు వారిని ఒక్కటి చేశాయి. సొంతగా ఏదైనా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏం చేసినా అది ఇంటికి, ఇంటి అలంకరణకు సంబంధించినదై ఉండాలనుకున్నారు. ఇద్దరివీ ఒకే అభిరుచులైనా ఎవరికీ రిటైల్ రంగంలో అనుభవం లేదు. అయినా ధైర్యంతో ముందుకెళ్లారు. ది చాక్ బొటిక్‌కు రిబ్బన్ కట్ చేశారు. అనుకున్నట్టుగానే ఇంటి అలంకరణకు సంబంధించిన స్టోర్ అది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఇలాంటి స్టోర్ లేదు. అది వీరికి బాగా కలిసొచ్చింది.

అలా ది చాక్ బొటిక్ ప్రారంభమైంది. ఇది మిగతా స్టోర్లలా కాదు. భావి డిజైనర్లను ప్రోత్సహించడమే వీరి మొదటి లక్ష్యం. చేత్తో తయారు చేసిన కళాఖండాలకే ప్రాధాన్యమిస్తుంటారు. వీటితో పాటు ఇద్దరూ కలిసి సేకరించిన అరుదైన కళాఖండాలు కస్టమర్ల మనసు దోచేస్తున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు తరచూ అభినందించుకోవడం, అర్థం చేసుకోవడం ఎంతో ప్రోత్సాహంగా ఉండేది. ఒకరు సృజనాత్మకంగా, మరొకరు వ్యాపారపరంగా ఆలోచించేవారు. ఒక వెంచర్‌కు కావాల్సిన ఈ రెండు లక్షణాలు వీరి వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాయి.

"తరచూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేవాళ్లం. మేం ఏం చేసినా అది కళలు, హస్తకళలకు సంబంధించినదై ఉండాలని అనుకునేవాళ్లం. అలాంటి స్టోర్లకు వెళ్లడం మాకు స్ఫూర్తిగా, ప్రోత్సాహకంగా ఉండేది. మా స్టోర్‌ను కస్టమర్స్ అభిరుచులకు తగ్గట్టుగా రూపొందించేందుకు చాలా కష్టపడ్డాం. ఎక్కడ అరుదైన కళాఖండాలు కనిపిస్తే వాటిని తీసుకొచ్చి స్టోర్‌లో ఉంచాం" అంటారు 32 ఏళ్ల కాజల్.
image


లేక్ సిటీ టూ గార్డెన్ సిటీ

సరస్సుల నగరమైన భోపాల్‌లో జన్మించారు కాజల్. బాల్యం సాధారణంగా గడిచింది. బాలికల మిషనరీ పాఠశాలలో చదువుకున్నారామె. పదో తరగతిలో టాపర్. ఆ తర్వాత సైన్స్ చదివించాలన్నది తల్లిదండ్రుల కోరిక. కానీ కాజల్ మాత్రం హ్యుమనిటీస్ ఎంచుకున్నారు. కామర్స్ చదివి 22 ఏళ్లకే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారు. తన తండ్రి కూడా ఛార్టర్డ్ అకౌంటెంటే. ఆయనతో కలిసి ఓ ఏడాది పనిచేశారు కాజల్. పెళ్లి తర్వాత బెంగళూరు వచ్చారు. ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టారు. మల్టీనేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ కార్పొరేషన్ లో మూడేళ్లు పనిచేశారు. ఆ తర్వాత భర్తతో కలిసి అసైన్‌మెంట్ కోసం యూఎస్ వెళ్లారు. అక్కడే సీపీఏ పూర్తి చేశారు. రెండేళ్ల తర్వాత తిరిగి బెంగళూరు వచ్చారామె. అప్పుడు ఆమె గర్భవతి. ఉద్యోగానికి విరామం తీసుకున్నారు. కళలపై తనకున్న అభిరుచితో ఆర్ట్ క్లాసెస్‌లో చేరారు. కళలను ప్రేమించే స్నేహితుల్ని తరచూ కలుసుకునేవారు. లైబ్రరీలకు వెళ్లి కళలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాళ్లు. వారంలో కనీసం ఒకసారైనా చిత్రకళా పరిషత్ కు వెళ్లేవారు. చిత్రకళా పరిషత్ ఇంటికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఆమె గర్భవతి కావడంతో వారానికోసారి మాత్రమే వెళ్లేవారు. నాలుగు ఆర్ట్ మేగజైన్లకు చందాకట్టి ఇంట్లోనే రోజంతా కళలపై అధ్యయనం చేసేవారు.

"డెలివరీ తర్వాత కళలపై పూర్తిగా దృష్టిపెట్టాను. అయితే కుటుంబానికి సపోర్ట్ కోసం నాలుగేళ్లు ఉద్యోగం చేశా. కానీ 9 టు 9 వర్క్ తో బోర్ కొట్టేసింది. ఒత్తిడి పెరిగింది. అందుకే ఉద్యోగం వదిలేశాను. జీవితంలో ఇంకా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడే కవితను కలుసుకున్నాను" అంటారు కాజల్.
కాజల్ దాగా

కాజల్ దాగా


కవిత కథ

కవిత కూడా చార్టర్డ్ అకౌంటెంటే. సీపీఏ చేశారు. రాజస్తాన్‌లోని చిన్న పట్టణమైన బన్స్వారా స్వస్థలం. కవిత తండ్రి కూడా సీఏ చేశారు. కవిత కథ కూడా కాజల్ గతంలానే ఉంటుంది. అందుకేనేమో ఒకే గూటి పక్షుల్లా ఒకేచోట చేరారు. " మేం స్టోర్ కు సంబంధించిన అంశాలన్నీ ఫైనలైజ్ చేస్తున్న సమయంలో నేను రెండోసారి తల్లయ్యాను. నా మొదటి బిడ్డ ఇంట్లో... రెండో బిడ్డ కడుపులో... ఇక మూడో బిడ్డ... అదే ది చాక్ బొటిక్ అప్పుడప్పుడే రూపుదిద్దుకోవడం మర్చిపోలేని విషయం " అని గతాన్ని గుర్తుచేస్తారు కాజల్. అలాంటి సమయంలో ఆంట్రప్రెన్యూరల్ జర్నీ కొనసాగించడమంటే... ఎంతో సాహసమైనదే. అయితే భర్త, తల్లి సాయంతో మేనేజ్ చేసుకోగలిగారు కవిత. స్టోర్‌ను తీర్చిదిద్దడానికి వీరిద్దరికీ ఎనిమిది నెలల సమయం పట్టింది. సెప్టెంబర్ 2013లో ది చాక్ బొటిక్ ప్రారంభమైంది. స్టోర్ ప్రారంభించడం చిరస్మరణీయం.

"సరికొత్త, వినూత్న వస్తువులకు ప్రాధాన్యమిస్తూ కళాఖండాలను సేకరించాం. అన్నీ సరసమైన ధరలకు లభించేవే. మేం రూపొందించిన 'ఫేమస్ బ్లాక్ బోర్డ్ వాల్' మాకెంతో గర్వకారణం. మా స్టోర్ దినదినాభివృద్ధి చెందాలని మేం కోరుకున్నాం" అంటారు కవిత.
కవితా చౌదరీ

కవితా చౌదరీ


కళాఖండాల సేకరణ, అకౌంట్స్, ఫోటోగ్రఫీ, మార్కెటింగ్... ఇలా అన్ని వ్యవహారాలను ఈ ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. ఏ ఆంట్రప్రెన్యూర్‌కైనా సరైన ఉత్పత్తి, ధర, మార్కెటింగ్ అనే మూడు సవాళ్లుంటాయి. అభిరుచి, పట్టుదల ఉంటే ఈ సవాళ్లను సులువుగా అధిగమించొచ్చని నమ్ముతారు ఈ ఇద్దరు స్నేహితులు. లాభదాయకమైన వ్యాపారం చేయడం ఒక్కటే ముఖ్యం కాదు... దినదినాభివృద్ది చెందడమూ ముఖ్యమే అన్నది వీరి సూత్రం. ఆంట్రప్రెన్యూర్ ఎప్పుడూ డల్‌గా ఉండకూడదు. ప్రతీ రోజూ కొత్త సవాళ్లతో సరికొత్తగా ఉండాలి. కొత్తకొత్త అనుభవాలు నేర్చుకోవాలి అంటూ స్ఫూర్తిని నింపుతారు కాజల్, కవిత.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags