సంకలనాలు
Telugu

వాలెట్ లేకుండా వావ్ అనేలా షాపింగ్

పర్సు లేకున్నా ఫోన్ ఉంటే చాలు.. పేమెంట్స్ చేసేయచ్చుక్యాష్‌లెస్ కాన్సెప్ట్‌లో మరో యాప్మోమో పేరుతో హల్‌చల్ చేస్తున్న మొబైల్ యాప్కరెన్సీ డిజిటలైజేషన్‌లో తొలి అడుగు మాదే అంటున్న మోమో

ABDUL SAMAD
13th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

చేతిలో కరెన్సీ నోట్లు లేకుండా బయటకెళ్లడం ఇప్పుడు చాలాచోట్ల సాధ్యమే. అయితే.. అసలు పర్స్ లేకపోయినా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చని కొన్ని నగరాలు నిరూపిస్తున్నాయి. బెంగుళూర్ నగరాన్ని తీసుకుంటే ప్రస్తుతం చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో క్యాబ్ వాలెట్స్, ఈకామర్స్ వాలెట్స్, ఫోన్ రీఛార్జ్ వాలెట్స్ లాంటి చాలా కాన్సెప్ట్‌లున్నాయి. బెంగుళూర్‌లోని అనేక రెస్టారెంట్లలో కాష్‌లెస్ పేమెంట్లను యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి చూస్తే... కాషే కాదు... పర్స్ కూడా లేకుండా మనం ఎక్కడికైనా వెళ్లొచ్చేయచ్చు. మొబైల్‌లోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, రెస్టారెంట్‌లో బిల్ పేమెంట్ చేయచ్చు, మూవీ టికెట్స్ కొనుగోలు చేయచ్చు. షాపింగ్ మాల్స్‌లోనూ ఈ తరహా... ఫోన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరం లేవు.

పర్స్ లేకున్నా పేమెంట్స్ కు ఇబ్బందేమీలేదు

పర్స్ లేకున్నా పేమెంట్స్ కు ఇబ్బందేమీలేదు


మోమో... ఇదో స్మార్ట్ ఫోన్ యాప్. దీంతో దాదాపు బెంగుళూర్ అర్బన్ ప్రాంతంలోని రెస్టారెంట్ అన్నింటిలోనూ పేమెంట్ చేసేయచ్చు. మొబైల్‌లోని లైవ్ ట్యాబ్‌లో బిల్లు చూసుకుని చెల్లించేయచ్చు. కనీసం వెయిటర్ మన టేబుల్ దగ్గరకొచ్చి బిల్ ఇచ్చేవరకూ కూడా ఆగక్కర్లేదు. ప్రస్తుతం దేశంలో ఔటింగ్, ఈటింగ్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. వీకెండ్ ప్రోగ్రాంస్‌లో ఇవి ఖచ్చితంగా ఉంటున్నాయి. వీళ్లు యాప్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఇష్టపడ్తున్నారు. మోమో యాప్‌తో చేసే పేమెంట్లలో... సగటు బిల్లు విలువ రూ.1,500. దీన్ని చూస్తే అర్ధమవుతుంది టీంలుగా వెళ్లేవాళ్లు మోమో యాప్ వాడేందుకు ఎక్కువగా ఇష్టపడ్తున్నారని చెప్పడానికి. ప్రస్తుతం రెస్టారెంట్లకే పరిమితమైన ఈ యాప్ సౌలభ్యాన్ని, త్వరలో షాపింగ్ మాల్స్, అప్పెరల్ స్టోర్స్, రిటైల్ ఔట్‌లెట్లకూ విస్తరించాలని... మోమో వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.


వాలెట్ లెస్

ఐఐఎంఏ స్టూడెంట్ కార్తీక్ వైద్యనాథన్ మోమో వ్యవస్థాపకులు. ఈయనకు ఐఐటీబీ నుంచి డిజైనింగ్ పూర్తి చేసిన ఉత్కర్ష్, చికాగో యూనివర్సిటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అష్రఫ్, ఐఐటీబీ-ఐఐఎంబీల్లో చదివిన గణేష్, ఐఐటీకే విద్యార్ధి నీలేష్ తోడయ్యారు. వీరంతా కలిపి అపార అనుభవం ఉన్న పర్ఫెక్ట్ టీంగా మారి... ఒక కొత్త పేమెంట్ సొల్యూషన్ యాప్‌కు జీవం, ప్రాణం పోశారు. వీరికి టెక్నాలజీ, వ్యాపార రంగం, కస్టమర్ నిర్వహణకు సంబంధించిన మరో ఏడుగురు సమర్ధమైన ఉద్యోగులు తోడయ్యారు. మొత్తం కలిపితే మోమో టీం.

ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రతీ ఒక్కరి చేతిలోనూ దర్శనమిస్తోంది. అందులోనూ స్మార్ట్ ఫోన్ కల్చర్ రాజ్యమేలుతోంది. సమాచారం, లావాదేవీల విషయంలో ఇది ప్రతీ ఒక్కరి పర్సనల్ డివైజ్. మొబైల్ అప్లికేషన్ల ద్వారా రీఛార్జ్‌ల వంటి ప్రహసనాలు కూడా ఈ కామర్స్ సైట్ల ద్వారా ఈజీగా పూర్తయిపోతున్నాయి. ఫుడ్, డ్రింక్స్ వంటి రోజువారీ అలవాట్లకూ యాప్ ఉపయోగించగలిగే రోజులొస్తాయని ముందే ఊహించింది మోమో టీం. వీరి సక్సెస్‌కి ముందస్తు ఆలోచనే అసలు కారణంగా చెప్పచ్చు.

మొబైల్ ద్వారా రెస్టారెంట్ బిల్లులో ఉండే సమాచారాన్ని సులభంగా విశ్లేషించుకోవచ్చు. అదే సమయంలో పలు రకాల పేమెంట్ సదుపాయాలుండడంతో... ఇది మరింత సౌకర్యవంతంగా మారిపోయింది. మరే ఇతర సాధనం అవసరం లేకుండా కేవలం మొబైల్ ద్వారానే చెల్లింపులు జరిపే సదుపాయం.. కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, దీనిలో ఉండే సౌకర్యాన్ని అర్ధవంతంగా చెప్పే సమయంలోనే... భద్రత గురించి కూడా కస్టమర్లను నమ్మించాల్సి ఉంది.

పేమెంట్స్ మేడ్ ఈజీ

"మోమో ద్వారా ప్రజలకు చాలా సులభమైన పేమెంట్ సదుపాయాన్ని కల్పించదలచాం. మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు సాధ్యమే అని మేం నమ్మాం. ఆ మార్పు మోమో నుంచే ప్రారంభం కావాలని భావించాం. అలవాటైపోయిన విధానాల నుంచి ప్రజలు ఒక పట్టాన మారేందుకు ఇష్టపడరు. కానీ అందులో ఉండే సౌకర్యం అర్ధమైతే... ఇక విడిచిపెట్టరు కూడా. ఒక కాన్సెప్ట్‌ను తీసుకుని, ప్రోడక్ట్‌గా మార్చడంలో మా ప్రయాణం ఎంతో సంతోషాన్నించ్చింది. అనేక మంది ప్రజలను ఒప్పించగలిగేలా ఒక ప్రోడక్ట్ డిజైన్ చేశామనే సంతృప్తి ఉంది. ప్రస్తుతం ప్రజలు అలవాటుపడ్డంతోపాటే... అనేక మంది వ్యాపారులు కూడా మోమోపై ఇంట్రస్ట్ చూపుతున్నారు" - కార్తీక్

రెస్టారెంట్లలో మోమో ద్వారా చెల్లింపులు చేసే సమయంలో... కస్టమర్లు తమ బిల్లును చూసుకోవచ్చు, విశ్లేషించుకోవచ్చు. స్నేహితులందరూ కలిసి ఒకే బిల్లును పంచుకోవచ్చు కూడా. పేమెంట్ సంబంధిత పనులు లేకపోవడంతో... వెయిటర్‌కు పని భారం తగ్గుతుంది కూడా. ఆర్డర్లు తీసుకోవడం, వాటిని హ్యాండిల్ చేయడం, సర్వీస్ చేయడం వంటి పనులు సరిపోతాయి. దీంతో అతనికి తన వర్క్‌పై మరింతగా శ్రద్ధ పెట్టేఅవకాశం చిక్కుతుంది. రానున్న కాలంలో హోమ్ డెలివరీలకూ క్యాష్‌లెస్ సదుపాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు కార్తీక్.

కొన్నేళ్లలో క్యాష్ బ్యాలెన్స్ అంటే... కేవలం మొబైల్‌లో నెంబర్‌గా మారిపోయే రోజులు రానున్నాయి. పర్స్ నిరుపయోగం కానుందనే వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందే. అన్నిటా స్మార్ట్ ఫోన్ రాజ్యమేలే రోజులు అతి త్వరలోనే వచ్చేందుక ఆస్కారం ఎక్కువగానే ఉంది. ఒకవేళ మోమో లాంటి సదుపాయం అన్ని చోట్లా అంగీకారం పొందితే.. క్యాష్ లెస్ అనే కాన్సెప్ట్ కార్యరూపం దాల్చినట్లే. దీన్ని అందుకోవడమే మా లక్ష్యమంటారు కార్తీక్.

ఎక్కడెక్కడ ఉపయోగించచ్చో ?

ఎన్ని ప్రాంతాల్లో, ఏఏ పేమెంట్లకు సంబంధించి మోమో యాప్‌ను ఉపయోగించచ్చు అనే అంశంపై.. ఈ టీం విస్తృతంగా పరిశోధన చేస్తోంది. నగదు సేవలను మొబైల్‌కు మార్చేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. నిత్యావసరాలు, దుస్తులు వీళ్ల జాబితాలో తర్వాతి ప్రాధాన్యం ఉన్న అంశాలు. ఈ-కామర్స్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టగలిగితే... ఇక మోమోకు తిరుగుండదనే అంచనా ఉంది.

కరెన్సీ నోట్లను డిజిటలైజ్ చేసే దిశగా మేం అడుగులు వేశాం. బ్యాంక్ బ్యాలెన్సులు కూడా కస్టమర్ల మునివేళ్లపైనే ఉంటున్నాయిప్పుడు. అలాగే ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్‌టీ వంటి లావాదేవీలు ఇట్టే పూర్తి చేయగలుగుతున్నారు. ఈ అభివృద్ధే... మోమో ఎదుగుదలకు అండగా వ్యవస్థాపకులు చెబ్తున్నారు. ఈ యాప్‌ను విస్తృతపరచడం ద్వారా... రోజువారీ నగదుతో చేసే పనులన్నిటికీ ఈ సదుపాయాన్ని వర్తింపచేయాలన్నదే లక్ష్యమంటున్నాయి కంపెనీవర్గాలు.

image


మన దేశంలో విస్తృత అవకాశం

మన దేశంలో అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్‌కీ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం.. ఇక్కడ క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువగా లేకపోవడం, అదే సమయంలో స్మార్ట్‌ఫోన్ల ఉపయోగం విపరీతంగా పెరిగిపోవడం. డేటా ప్యాక్‌లు అందుబాటు ధరల్లోకి రావడంతో... ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత వినియోగదారుల కొనుగోలు శక్తి వేగంగా పెరగడం కూడా... పేమెంట్ ఆధారిత వ్యవస్థలకు చక్కని అవకాశంగా చెప్పాలి.

అయితే నగదురహిత ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం అంత సులభమేం కాదు. ప్రతీ లావాదేవీలోనూ రెండంచెల భద్రతా వ్యవస్థను తప్పనిసరి చేసింది ఆర్బీఐ. దీంతో... చెల్లింపుల విషయంలో సులభంగా జరిగిపోయే అవకాశాలు కొంత తక్కువే. ఇప్పుడిప్పుడే చిన్న లావాదేవీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ తన పట్టు సడలిస్తోంది. ఒక స్థాయి భద్రతతోనూ.. లావాదేవీ పూర్తయ్యేందుకు అంగీకరించనుంది. ఇది కార్యరూపం దాలిస్తే మాత్రం... మొబైల్ పేమెంట్లకు లక్కీఛాన్స్ అని చెప్పాలి.

లాంఛింగ్ నుంచే టాప్ గేర్

లాంఛ్ అయిన అనతి కాలంలోనే మోమో యాప్‌కు చక్కని ఆదరణ లభించింది. కొన్ని వారాల్లోనే 3వేలకు పైగా డౌన్‌లోడ్లు, రూ. 10 లక్షలకు పైగా లావాదేవీలను పూర్తి చేయడం విశేషం. కస్టమర్లలో పదిశాతానికి మించి తిరిగి ఉపయోగిస్తుండడం.. యాప్ భవిష్యత్తును సూచించే అంశంగా చెప్పచ్చు. ప్రారంభంలోనే వినియోగదారుల నుంచి లభించిన ఈ ప్రోత్సాహంతోనే... రోజువారీ లావాదేవీల్లోకి చొచ్చుకొచ్చేస్తామని నమ్మకంగా చెబ్తోంది మోమో టీం.

కస్టమర్ల నిర్వహణకు మోమో సంస్థ దగ్గర శక్తివంతమైన సీఆర్ఎం వ్యవస్థ ఉంది. వ్యాపారులు తమ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులు, ఖర్చు పెట్టే అలవాట్లపై తగిన రివ్యూలు, రిపోర్టులు తీసుకునే అవకాశం కూడా ఉంది. లాయల్టీ ప్రోగ్రామ్‌ల నిర్వహణ ద్వారా రిపీట్ కస్టమర్లకు పెంచుకునేందుకూ ఆస్కారం లభిస్తుంది. వ్యాపారులు మోమో చెల్లింపులకు జాయిన్ అయ్యేందుకు ఎలాంటి ఫీజులు కట్టక్కర్లేదు. అయితే... సాధారణ లావాదేవీలతో పోల్చితే.. ట్రాన్సాక్షన్ పేమెంట్ కొంత అదనంగా ఉంటుంది ఈ మోడల్‌లో.

స్టార్టప్‌లు ఎదుర్కునే అతి పెద్ద సమస్య యూజర్ల సంఖ్య పెంచుకోవడం. స్మార్ట్ ఫోన్లలో హోమ్ స్క్రీన్‌కి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కి ఉన్నంత డిమాండ్ ఉంది. మొబైల్ యూజర్ల హోమ్ స్క్రీన్ పైకి తమ యాప్ చేరేలా చేసేందుకు ప్రతీ కంపెనీ ప్రయత్నిస్తుంది. అందుకే మరింతమంది వ్యాపారులు, మరిన్ని రంగాలను... తమ నెట్వర్క్‌లోకి తెచ్చుకోవాలని... పేమెంట్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది మోమో టీం.

ఫ్యూచర్ ప్లాన్స్

కస్టమర్లను ఆకట్టుకునేందుకు తగిన ప్రణాళికలనే రచించారు వీళ్లు. ప్రతీ డౌన్‌లోడ్‌కీ రూ.100 విలువైన క్రెడిట్స్ అకౌంట్లో జమవుతాయి. వీటిని మొదటి బిల్లులో రిడీమ్ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల మోమో పేమెంట్లకు ఉచితంగా బీర్లు ఇచ్చేలా ఒప్పందాలు కుదిరాయి కూడా. అలాగే ఫ్రీ బీర్ ఎట్ నియరెస్ట్ బార్ అంటూ... కేంపెయిన్ చేయనుంది మోమో. ఈ కాన్సెప్ట్ మీద వీరికి నమ్మకం కూడా ఎక్కువగా ఉంది.

సాధారణ చెల్లింపు అలవాట్లకు విభిన్నమైన రూట్లో వెళ్తోంది మోమో. రెస్టారెంట్లు కేవలం ప్రారంభం మాత్రమే. గ్రాసరీ, అప్పెరల్స్ వంటి ఇతర రంగాలు కూడా త్వరలోనే సాకారం కానున్నాయి. వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని మరో యాప్ కూడా సిద్ధమవుతోంది. సంస్ధాగతం కాని చెల్లింపులను వ్యవస్థీకృతం చేయడమే దీని లక్ష్యంగా తెలుస్తోంది. అలాగే బెంగుళూరుతో పాటు ఇతర నగరాలకూ విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇది అంతర్జాతీయ స్థాయికి ఎదగగల సామర్ధ్యం ఉన్న యాప్ అంటారు మోమో టీం. అయితే ఈతరహా చెల్లింపులకు అంగీకరించిన వ్యాపారులందరూ స్థానికులే కావడంతో... అనుకున్న వెంటనే విస్తరించడం అంత సులభం కాదు. ఇదే సమయంలో విదేశాల్లోనూ సత్తా చాటాలనే లక్ష్యాన్ని అందుకోవాలంటే.. ముందు దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో అయినా తమని తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. మోమో టీం ఆలోచనలు, అంచనాల ప్రకారం ఈశాన్య ఆసియా దేశాలు, మధ్య ఆసియా దేశాల్లో ఇలాంటి మొబైల్ చెల్లింపులకు ఎక్కువ మార్కెట్ ఉంటుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే కస్టమర్లకు సౌకర్యాన్ని కల్పిస్తూనే... వారి సాంప్రదాయ చెల్లింపు అలవాట్లను మార్చే యత్నం చేస్తోంది మోమో.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags