సంకలనాలు
Telugu

గంగానది కాలుష్యాన్ని తగ్గిస్తున్న వీళ్ల ఐడియా సూపర్!!

Sri
24th Jan 2016
3+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు"

పంచోపచార, షోడశోపచార పూజావిధానాల్లో, పెళ్లిళ్లు శుభకార్యాల్లో ఈ ఏడునదుల్నీ స్మరిస్తూ కలశాలను అభిషేకిస్తాం. ఈ ఏడు పుణ్యనదుల్లో గంగమ్మనే ముందు వరుసలో ఉంటుంది. నీటికి పర్యాయపదం గంగే. పవిత్రకు మారుపేరు గంగ. ఆ పుణ్య నదీమతల్లి స్పర్శతో జీవితాలు పునీతమవుతాయని నమ్మకం. గంగాజలంతో చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానకాంతులు వెల్లివిరుస్తాయని చెబుతారు. అందుకే ఆ పుణ్యనదిని జ్ఞానగంగ అని పిలుస్తుంటారు. 

భగీరథుడు తన తపస్సుతో శివుడిని ఒప్పించి గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చాడు. దాన్నే భగీరథ ప్రయత్నం అంటారు. గంగ పేరు వింటే భారతీయుల హృదయం భక్తితో పులకిస్తుంది. హిందువుల విశ్వాసాల ప్రకారం గంగానది అత్యంత పవిత్రమైనది. అందులో స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. 

కానీ ఒకప్పటి గంగానది వేరు. ఇప్పుడు వేరు. మనిషి స్వార్ధం దాన్నొక మురికి కూపంగా మార్చేసింది. పవిత్ర నది కాస్తా అపవిత్రంగా తయారవుతోంది. ఈ పరిస్థితి ఇద్దరు కుర్రాళ్లను కలచి వేసింది. గంగ నదిని కాలుష్యం బారి నుంచి కాపాడే పవిత్ర యజ్ఞాన్ని మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి 'హెల్ప్ అజ్ గ్రీన్'ను ప్రారంభించారు. ఇది కాన్పూర్ కు చెందిన సోషల్ ఎంటర్ ప్రైజ్.

image


మిషన్ గంగ

అంకిత్ అగర్వాల్, కరణ్ రస్తోగీ. కాన్పూర్ లో ఓ ట్యూషన్ సెంటర్ లో కలుసుకున్నారు. ఆ తర్వాత అందరిలాగా వీళ్లు కూడా ఉన్నత విద్య, ఉద్యోగాల వైపు అడుగులు వేశారు. కానీ... వారికి నగరంపై ఉన్న ప్రేమ, చేంజ్ మేకర్స్ కావాలన్న ఆలోచన- వారిని ఉద్యోగాలు విడిచిపెట్టేలా చేసింది. తిరిగి కాన్పూర్ కు చేరుకున్నారు. పర్యావరణంపై వారికున్న ఆసక్తే ఇటువైపు అడుగులు వేసేలా చేసింది. 26 ఏళ్ల కరణ్... వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ అనలిటిక్స్ అండ్ కన్సల్టింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. మాస్టర్స్ సమయంలోనే క్లైమేట్ ఛేంజ్, కార్బన్ క్రెడిట్స్ పై థీసిస్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. 26 ఏళ్ల అంకిత్... సిమాంటిక్ కార్పొరేషన్ లో మూడేళ్లు పనిచేసి కాన్పూర్ కు తిరిగొచ్చాడు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత పుణెలోని సింబసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ నుంచి ఇన్నొవేషన్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. పాడైపోయిన టైర్ల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని తన పరిశోధనలో తేలినప్పుడు- పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెరిగింది. పలు అంతర్జాతీయ పత్రికల్లో 13 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయ్యాయి.తన పరిశోధనలపై పలు పేటెంట్ ఆఫీసుల్లో సమీక్ష జరుగుతోంది. వేర్వేరు నగరాల్లో పర్యటించిన వీరిద్దరూ... వారి నగరం ఎలాంటి సమస్యలతో బాధపడుతుందో అర్థం చేసుకున్నారు. తమ ఊరిలో మార్పు ఎలా తీసుకురావాలని ఆలోచించారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఓసారి పవిత్ర గంగా నది ప్రస్తావన వచ్చింది.

గంగా నది ఇప్పటికీ పవిత్రంగా ఉందా?

ప్రపంచంలో కలుషితమైన అతిపెద్ద రెండో నది గంగ. సుమారు 40 కోట్ల మందిపై ప్రభావం చూపుతోంది. విరేచనాలు, కలరా, హెపటైటీస్, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. భయంకరమైన వ్యాధుల మూలంగా చిన్నపిల్లలు చనిపోతున్నారు. 

భారతదేశంలోని ఆలయాలు, మసీదులు, గురుద్వారాల్లో పువ్వులను సమర్పించడం అందరికీ అలవాటు. ఇలా పువ్వులను సమర్పించి వారి భక్తిని చాటుకుంటారు భక్తులు. అలా నదుల్లో కూడా పువ్వులను విడిచిపెట్టి భక్తిని చాటుకుంటారు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్లు పట్టించుకోరు. ఈ పువ్వుల వల్లే చేపలు చనిపోతున్నాయని, జలాశయాల్లో పొరలు దెబ్బతింటాయని, అపారమైన కాలుష్యానికి కారణమవుతుందని వారికి తెలియదు. ఎందుకంటే పువ్వులు పెరగడానికి పురుగుమందులను, రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు. ఈ పువ్వులను నదిలో కలపడం ద్వారా నీళ్లు అత్యంత విషపూరితంగా మారుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఎనిమిది లక్షల టన్నుల పువ్వులను భారతీయ నదుల్లో వేస్తారని అంచనా. గంగా నదిలో కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. అందుకే ప్రజల ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు వీరిద్దరు. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు. ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.

పవర్ ఆఫ్ ఫ్లవర్

పువ్వుల్లో ఉన్న శక్తిని గుర్తించడమే పనిగా పెట్టుకున్నారు వీరిద్దరు. అయితే "మంచి ఉద్యోగాలు వదిలేసి పువ్వులు ఏరుకుంటూ కూర్చుంటారా"... ఇదీ అంకిత్ తల్లి స్పందన. ఇక కరణ్ కుటుంబం అంయితే ఈ ఆలోచనే వద్దని చెప్పేసింది. కానీ వీరిద్దరూ వెనక్కితిరిగి చూసుకోలేదు. పువ్వులను కంపోస్ట్ చేసి సేంద్రియ ఎరువును ఎలా తయారు చేయాలన్నదానిపై వీరిద్దరూ పరిశోధన చేయడం మొదలుపెట్టారు. పలువురు బోటనీ ప్రొఫెసర్లతో, రైతులతో మాట్లాడారు. కంపోస్టింగ్ అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులతో, ఆలయ కమిటీలతో, సేంద్రీయ ఎరువులు తయారుచేసేవాళ్లతో, పువ్వుల వ్యాపారులతో మాట్లాడారు. ఆవు, గుర్రం, మేక, గొర్రె, కోళ్ల పరిశ్రమల నుంచి జీవ వ్యర్థాలతో ఎరువులు ఎలా తయారు చేస్తున్నారనే దానిపై స్టడీ చేశారు. ఉత్తమమైన నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియ్ తయారు చేసి వెర్మికంపోస్ట్ విలువేంటో చాటాలనుకున్నారు. వీరి ప్రయత్నం ఆరు నెలలకు ఫలించింది. 17 సహజపదార్థాలతో తయారు చేసిన ఎరువును కనుగొన్నారు. ఈ 17 పదార్థాల్లో ఒకటి కాఫీ అవశేషాలు. వాటిని కాన్పూర్ లోని కాఫీ షాపుల నుంచి సేకరించారు. వర్మీకంపోస్ట్ లో నైట్రోజన్ లెవెల్ ను పెంచేందుకు కాఫీ అవశేషాలు తోడ్పడతాయి. ఖనిజాలు పుష్కలంగా ఉన్న పోషకాలు, ఎంజైమ్ లతో తయారు చేసిన ఎరువుకు 'మిట్టీ' అని పేరు పెట్టారు. రసాయన ఎరువులతో పోలిస్తే కర్బన ఉద్గారాలు లేని ఈ ఎరువు సురక్షితమైన, అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. మిట్టీ ఎరువులో ఎలాంటి కెమికల్స్ లేకపోవడంతో దీన్ని ఉపయోగించి పండించిన పంటలన్నీ సేంద్రీయమైనవే.

image


మిట్టీ సక్సెస్ తర్వాత వీరిద్దరూ అగరుబత్తీల తయారీపై పరిశోధనలు మొదలుపెట్టారు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే అగరుబత్తీల్లో వాడే బొగ్గు క్యాన్సర్ కారకమైంది. అందుకే అందుకు భిన్నంగా పువ్వులను ఉపయోగించి అగరుబత్తీలు తయారు చేసే పద్ధతిని కనిపెట్టారు. 'స్టిక్స్ అండ్ స్టోన్స్' పేరుతో చేతితో సహజసిద్ధమైన అగరుబత్తులను తయారుచేస్తున్నారు. ఎక్కడా పర్యావరణానికి హాని కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నారు. ప్యాకింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ప్యాకేజింగ్ పై రీసెర్చ్ చేసిన తర్వాత వీరికి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ప్యాకెట్ పైన దేవుడి బొమ్మ ఉంటే సేల్స్ పెరుగుతాయని తేలింది. కానీ ప్రజలు ఆ ప్యాకెట్లను డస్ట్ బిన్ లో పారెయ్యలేరు. దీనికి ఓ ఆసక్తికరమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సీడ్ పేపర్ తో ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేశారు. ఖాళీ అయిన రేపర్ ను ఓ తొట్టిలో ఉంచి రోజూ నీళ్లు పడితే కొద్దిరోజుల్లో మొలకెత్తుతుంది. అద్భుతమైన ఐడియా.

image


ప్రస్తుతం వీళ్లు 13 ఆలయాలు, మూడు మసీదుల నుంచి పువ్వుల్ని సేకరిస్తున్నారు. ప్రతీ రోజు ప్రార్థనా మందిరాలకు వెళ్లి, వ్యర్థాలను సేకరించి, అందులోంచి పాలప్యాకెట్లు, పువ్వుల దారాలు, పేపర్లు, ప్లాస్టిక్ పాత్రలను వేరు చేస్తారు. ప్రతీ రోజూ ఐదు వందల కిలోల పువ్వులను తిరిగి ఉపయోగిస్తున్నారు. మొదట్నుంచీ ఇప్పటివరకు ఇలా లక్షన్నర కిలోల పువ్వులను సేకరించారు. కాన్పూర్ లోని 85 నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది హెల్ప్ అజ్ గ్రీన్. 

ఎక్కువ లాభాలుండటం వల్ల ఎగుమతి రంగంపై దృష్టి పెడుతోంది హెల్ప్ అజ్ గ్రీన్. వీరి ఉత్పత్తులు స్విట్జర్లాండ్, జర్మనీలకు ఎగుమతి అవుతున్నాయి. వీళ్లు చేసే ఉత్పత్తి తక్కువ. ఎగుమతి రంగంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పవిత్రమైన గంగానదిలోని పువ్వులతో తయారు చేసిన ఉత్పత్తులు అని చెప్పి మా ఉత్పత్తులను అమ్మట్లేదు. మేం ఇస్తున్న క్వాలిటీని చూపించే ఉత్పత్తుల్ని అమ్ముతున్నాం. ప్రపంచంలో ఆర్గానిక్ మార్కెట్ విలువ 48,743 కోట్లు. అగరుబత్తుల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మూడు వేల కోట్లు. అక్కడ అన్ని అవకాశాలున్నాయి కాబట్టే ఎగుమతి మార్కెట్ పై ప్రధానంగా ఫోకస్ పెట్టాం అంటున్నారు.

image


"పర్యావరణానికి మేలు చేసే విషయం ఏదైనా ఉందంటే పాశ్చాత్యులు వెంటనే అమలుచేస్తారు. వారి అలవాట్లు మార్చుకుంటారు. అందుకు ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడరు. కానీ భారతదేశంలో ప్రజలు తక్కువ ధరకు దొరికే వస్తువుల కోసం వెంటపడ్తారు. డిస్కౌంట్ల కోసం ఆశపడ్తారు. మార్కెట్లో శాండల్ వుడ్ అగరుబత్తుల్ని 30 రూపాయలకు కొంటారు. కానీ శాండల్ వుడ్ ఆయిల్ ధర కిలోకు లక్షపైనే ఉంది. ఈ లెక్కలు చాలు... వాళ్లు కేవలం కెమికల్స్ తో తయారైనవి కొంటున్నారని చెప్పడానికి. మా అగరుబత్తుల్ని చేత్తో తయారు చేస్తారు. స్టిక్స్ అండ్ స్టోన్స్ అగరుబత్తుల్ని సహజసిద్ధంగా సేకరించిన ఆయిల్ లోనే ముంచి తీస్తాం." అంటారు అంకిత్.

హెల్ప్ అజ్ గ్రీన్ ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి. యజ్ఞ పేరుతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లాంటి ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్స్ లో అమ్ముతున్నారు. ఈ పోర్టల్స్ నుంచి రెండు శాతం సేల్స్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లో అడుగుపెట్టిన హెల్ప్ అజ్ గ్రీన్ లాభనష్టాలు లేని దశను ఎప్పుడో దాటేసింది.

image


అవార్డుల పంట

హెల్ప్ అజ్ గ్రీన్ కు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐఎస్బీ ఐడియా ఛాలెంజ్ 2015, ఐఐఎం ఇండోర్ కల్పవృక్ష ఛాలెంజ్ 2015, ఐఐటీ కాన్పూర్ సోషల్ ఛాలెంజ్ 2015 అవార్డులు గెలుచుకున్నారు. టాటా సోషల్ ఎంటర్ ప్రైజ్ ఛాలెంజ్ 2016లో ఫైనలిస్ట్. ఈ స్థాయిలో వస్తున్న గుర్తింపు వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల అభిప్రాయాల్ని మార్చేశాయి.

ఇది ప్రారంభం మాత్రమే. ఈ ఇద్దరి ఆశలు, ఆశయాలు, కలలు చాలా పెద్దగా ఉన్నాయి. గంగానది ప్రవహిస్తున్న రెండువేల కిలోమీటర్ల మార్గంలో వీరు ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. 25 వేల మంది పేద మహిళలకు జీవనోపాధి కూడా మరో టార్గెట్. అందరి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. కళ్ల ముందు భారీ ప్రయాణం కనిపిస్తుండటంతో... సక్సెస్ అవుతామా లేదా అన్న ఆందోళన కూడా ఉంది. వారి స్ఫూర్తి ఏంటని అడిగితే రతన్ టాటా అని చెబుతారు కరణ్. హారీ పోటర్ సిరీస్ అంటారు అంకిత్.

3+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags