సంకలనాలు
Telugu

ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్‌ను జయించిన మధుసింగ్

GOPAL
19th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొద్ది కష్టమొస్తేనే తల్లడిల్లిపోయే వారెంతోమంది. అలాంటిది క్యాన్సర్ సోకితే ఇంకెంత మానసికంగా కుంగిపోతారు. అప్పటివరకు ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యం అంతా గుండె అట్టడుగుక్కి జారిపోతుంది. జీవితం మీద నిరాశ నిస్పృహ ఆవహిస్తుంది. అయితే, 53 ఏళ్ల మధు సింగ్ అందరిలాగా భయపడిపోలేదు. ఐదేళ్లపాటు కేన్సర్‌ మహమ్మారితో పోరాడి జయించడమే కాదు.. నోయిడాలో ఓ ప్రీ స్కూల్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు.

మధు సింగ్‌ది జార్ఖండ్‌లోని చిన్న పారిశ్రామిక ప్రాంతం జాప్నా. అక్కడే ఆమె విద్యాబ్యాసం పూర్తయింది. బాల్యమంతా ఆటపాటలతో ఉల్లాసంగా సాగింది. కష్టాలంటే ఏంటో తెలియదు. ముగ్గురు అన్నల ముద్దుల సోదరి కావడంతో ఇంట్లో కూడా గారాబంగా పెరిగారు. రాంచీ యూనివర్సిటీలో హిస్టరీ హానర్స్ పూర్తిచేశారు. తర్వాత 1983లో యూనియన్ బ్యాంక్‌ జెమ్‌షెడ్‌పూర్‌ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసే ఆచల్ సింగ్‌తో మధు పెళ్లయింది. భర్త ఉద్యోగరీత్య ఆమె దేశమంతా పర్యటించాల్సి వచ్చింది. కొడుకు అంకేశ్, భర్తతో జీవితం సాఫీగా సాగిపోయింది. జీవితం సెటిల్ కావడంతో తన చిరకాల స్వప్నం బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించాలన్న యోచన చేశారు మధు సింగ్.
undefined

undefined


రిథమ్ స్కూల్ చిన్నారులతో మధు సింగ్..

 

 


మనమొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందట. మధు విషయంలో అదే జరిగింది. మధుపెళ్లయిన ఐదేళ్ల తర్వాత తొలిసారిగా బ్రెస్ట్‌లో చిన్న కణతిలాంటిది ఏర్పడింది. నొప్పిగా ఉండటంతో డాక్టర్ల దగ్గరికి వెళ్లింది. వారు చిన్న సర్జరీ చేసి దాన్ని తొలగించారు. అయితే ఆ కణతి మళ్లీ వచ్చింది. 1989 నుంచి 1992 వరకు అదే పరిస్థితి. ఎన్నిసార్లు సర్జరీ చేసినా లాభం లేదు. పదే పదే సమస్య రిపీటవుతుండటంతో డాక్టర్లు బయాప్సీ కూడా చేయించారు. అందులో కూడా ఎలాంటి వివరాలు తెలియలేదు. చివరకు బయాప్సీ రిపోర్టును ముంబైలోని టాటా మెమొరియల్ హాస్పిటల్ (టీఎంహెచ్)కు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షలో కళ్లు బైర్లు కమ్మే విషయం బయటపడింది. బ్రెస్ట్‌లో ఏర్పడిన కణతిలో కేన్సర్ అని తేలింది.

‘‘అప్పటివరకు ప్రశాంతంగా సాగిన నా జీవితంలో ఆ ఘటన భయంకరమైంది. కేన్సర్ వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అప్పుడు మా అబ్బాయి గుర్తొచ్చాడు. నేను లేకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి’’ మధు 

ప్రాణాంతక క్యాన్సర్‌ కణతిని తొలగించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు టోటల్ రాడికల్ మాస్టెక్టమీ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. రాడికల్ మాసెక్టమీ సర్జరీ ఆ పేరు వినగానే కాళ్ల కింద భూమి కదిలినట్టనిపించింది. బ్రెస్ట్‌ను పూర్తిగా తొలగించడాన్ని వైద్య పరిభాషలో రాడికల్ మాసెక్టమీ అంటారు. ఆ సర్జరీ జరిగితే ఎలా ఉంటుందో ఆమె ఊహించుకున్నారు. అంతే జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ భర్త, ఏడేళ్ల కొడుకు కొండంత భరోసా ఇచ్చారు. వారికోసమైనా బతకాలని అనుకున్నారు. శరీరంలో ప్రవేశించిన శత్రువుతో పోరాడాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. 

క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు పూర్తిగా ఏడేళ్లు పట్టింది. ఆ సమయంలోనే బోన్ టీబీ, ఆస్తమా కూడా వచ్చాయి. బరువు ఒక్కసారిగా సగానికి సగం తగ్గింది. అయినా ఆమె పోరాటం వృథా కాలేదు. విజేతగా నిలవడమేకాదు. జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు మరింత శక్తిని కూడదీసుకున్నారు. క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్న సమయంలో ఆమె ఆలోచనలో పడ్డారు. జీవితమంటే ఏంటి? దాన్ని సార్థకం చేసుకోవడం ఎలా? అని ఆలోచించారు. ఆ సంఘర్షణే ప్రీ స్కూల్ ప్రారంభించాలన్న సంకల్పానికి దారితీసింది. 

undefined

undefined

 క్యాన్సర్‌కు ముందు..             క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయం..   ట్రీట్‌మెంట్ తర్వాత..

రిథమ్‌ పేరుతో ప్రీ స్కూల్. మధు కలల ప్రాజెక్ట్‌. దానికి ఆమె అత్తగారే శంకుస్థాపన చేశారు. పనులైతే ప్రారంభించారు కానీ ఆ ప్రయాణం ఎంత కష్టమైనదో తెలిసొచ్చింది. 2006 ఫిబ్రవరిలో ఏడుగురు చిన్నారులతో రిథమ్ ప్రారంభమైంది. ఆరంభంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మూడేళ్లు ఎంతో కష్టంగా గడిచాయి. ఆ తర్వాత పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు వచ్చింది. ఆ నోటా ఈ నోటా మంచి మాటలు రావడంతో తల్లిదండ్రులు కూడా చిన్నారులను మా స్కూల్‌కు పంపడం ప్రారంభించారు. 

రిథమ్ స్కూల్‌తో మధు ఓ చరిత్ర సృష్టించారు. ఆమె స్కూల్‌లో అందరూ మహిళా ఉద్యోగులే. అప్పటివరకు ఇంటిపట్టున ఉన్న మహిళలను ఆమె ప్రొఫెషనల్స్‌గా మార్చేశారు. ఏకంగా ఓ సర్టిఫైడ్ కోర్సే సృష్టించారు. మంచి ట్రైనింగ్ ఇచ్చి సమర్థమైన టీచర్లుగా తీర్చిదిద్దారు. రిథమ్ స్కూల్‌లో ప్రతి యేటా ఐదుగురు బలహీనవర్గాల పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు మధు. అంతేకాదు మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులు, ఆరోగ్యవంతంగా ఉన్నవారితో పోటీ పడేందుకు ప్రత్యేక కోర్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రిథమ్‌లో 150 మంది విద్యార్థులున్నారు. నోయిడాలో టాప్ ప్రి స్కూల్స్‌లో ఒకటిగా 2013లో ఎడ్యుకేషన్ వరల్డ్ గుర్తింపు కూడా పొందింది రిథమ్. అంతేకాదు రక్షణ, మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు అద్వితీయంగా ఉన్నాయని జాతీయ న్యూస్ చానల్ ఏబీపీ ప్రశంసలు కూడా పొందింది.

మరణపుటంచుల వరకు వెళ్లి వచ్చి, తిరిగి జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో సాగిస్తున్న మధుసింగ్ లైఫ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలి. చిన్న సమస్యలకే, ధైర్యాన్ని కోల్పోయి, నిరాశ చెందేవారు మధును చూసి ఎంతో నేర్చుకోవాలి. కష్టాల నుంచి బయటపడి స్వప్నాన్ని ఆమె ఎలా సాకారం చేసుకున్నారో తెలుసుకుని అదే మార్గంలో పయనించాలని యువర్ స్టోరీ కోరుకుంటోంది..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags