సంకలనాలు
Telugu

గ్రామీణ విద్యార్థులకు వరంగా మారిన స్టడీమాల్

Sri
23rd Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


"Education is the manifestation of the perfection already in man" -Vivekananda.

విద్య అంటే మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తుల సంపూర్ణ వికాసం అన్నారు వివేకానంద. మరి ఓసారి మన విద్యావ్యవస్థను చూస్తే అలా ఉందా? సృజనాత్మకత, వికాసం లాంటి పదాలకు క్లాస్ రూమ్ లో చోటుందా? ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల మధ్య చదువుతున్న వాళ్లు సైంటిస్టులు, డాక్టర్లు కాగలరా? ఆ కలల్ని అదే పాఠశాలలో సమాధి చేయడం తప్ప పరిస్థితిలో మార్పు వస్తుందా? పట్టణాల సంగతి సరే పల్లెల్లో చూస్తే విద్యా వ్యవస్థ ఎలా అఘోరించింది? ఈ వ్యత్యాసాన్ని చూసిన ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్.. సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ తో విద్యావ్యవస్థ రూపురేఖల్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. 

సంతోష్ దిగంబర్ రావు ఫడ్. మహారాష్ట్ర మాండ్వాలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మరాఠీ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఇంటర్ చదివేందుకు తాలుకాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం మహారాష్ట్ర బీడ్ కు వెళ్లాడు. ఎంబీఏ కోసం ముంబై వెళ్లాడు. ఇలా పల్లె నుంచి పట్టణాలు, నగరాల వరకు అన్ని చోట్లా తిరిగాడు. విద్యా వ్యవస్థ ఎక్కడ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూశాడు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల విద్య విషయంలో ఎన్నో అసమానతలు దగ్గర్నుంచి చూశారు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. ఆ మధ్య ఓసారి మాండ్వాకు వెళ్లాడు. అక్కడ పాఠశాలలు చూసి షాకయ్యాడు. తాను చదువుకున్నప్పుడు స్కూల్ ఎలా వుందో ఇప్పుడూ అలానే ఉంది. వ్యవస్థలో ఏ మార్పూ కనిపించలేదు. లైబ్రరీలాంటి కనీస సౌకర్యాలు కూడా మెరుగుపడలేదు. 

పట్టణ, గ్రామీణ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు 2011లో థింక్ షార్ప్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు సంతోష్. అతడితో సచిన్ పవార్, దీపాలీ బసుర్ ట్రస్టీలుగా చేరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సచిన్, దీపాలీలకు సమస్య గురించి బాగా తెలియడంతో థింక్ షార్ప్ లో తమ వంతు సాయాన్ని అందించారు.

image


స్టడీ మాల్... గ్రామీణ విద్యార్థులకు వరం

మాల్ పేరు వినగానే మీకు ఏం గుర్తొచ్చింది? ఇంటికి కావాల్సిన వస్తువుల నుంచి ఒంటికి కావాల్సిన దుస్తుల వరకు దొరికే ఆల్ ఇన్ వన్ షాపింగ్ మాల్ గుర్తొచ్చింది కదా? సంతోష్ కూడా మాల్ పదంలోని సారాంశాన్ని గ్రహించి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థను చక్కదిద్దే కాన్సెప్ట్ ని రూపొందించాడు. 2013లో టీమ్ మెంబర్స్ భగ్వాన్ జాదవ్, శ్రద్ధ భంగెల సహకారంతో థింక్ షార్ప్ ఫౌండేషన్ తొలి 'స్టడీ మాల్'ను మహారాష్ట్రలోని సురంగలీలో ప్రారంభించారు. హెడ్ మాస్టర్లకు తన కాన్సెప్ట్ వివరించాడు. రెండో స్టడీ మాల్ ను 2015లో జల్గావ్ సమీపంలోని వరంగావ్ లో, మూడో సెంటర్ ని ముంబై సమీపంలోని వంగనిలో ప్రారంభించారు. వంగనిలో డిజిటల్ స్టడీ మాల్ ఉంది.

థింక్ షార్ప్ ఫౌండేషన్ ఓ స్థలాన్ని అద్దెకు తీసుకొని, లేదంటే పాఠశాల ఆవరణను ఉపయోగించుకొని స్టడీ మాల్ ను నిర్వహిస్తోంది. మాల్ లో విద్యకు సంబంధించిన పుస్తకాలతో పాటు, విజ్ఞానాన్ని అందించే మరెన్నో బుక్స్ ఉంటాయి. స్టడీ మాల్ ఫ్రీ సర్వీస్. ఇక్కడుండే వస్తువుల్ని పిల్లలు ఉచితంగా వాడుకోవచ్చు. స్కూల్ ముగిసిన తర్వాత కూడా పిల్లలు అక్కడ చదువుకోవచ్చు. ఆడుకోవచ్చు. డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు కళలు, ఎడ్యుకేషనల్ గేమ్స్, ఆటవస్తువులు, ఇతర నైపుణ్యాలు అందించేవి ఎన్నెన్నో ఉంటాయి. స్టడీ మాల్ లో కొందరు పిల్లలు స్వంతగా నేర్చుకుంటారు. మరికొందరు టీచర్ల సాయంతో నేర్చుకుంటారు. స్టోరీ టెల్లింగ్, పద్యాలు, కవితలు లాంటి పలు యాక్టివిటీస్ లో పిల్లల్ని నిమగ్నం చేస్తారు వాలంటీర్లు.

" ఎడ్యుకేషనల్ ట్యాబ్లెట్స్ వాడుతూ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సరదాగా గణితం నేర్పించే ఆటలవి. ప్రొజెక్టర్ ద్వారా యానిమేషన్ చూసేందుకు, పొయెమ్స్ వినేందుకు పిల్లలు ఎంతో ఉత్సాహం చూపిస్తారు" అని వివరిస్తున్నారు సంతోష్.

తాము చేస్తున్న కృషికి అన్ని వైపుల మద్దతు లభిస్తోందని అంటున్నారు సంతోష్. థింక్ షార్ప్ ఫౌండేషన్ కు గూగుల్, రిలయన్స్ క్యాపిటల్, ప్రథమ్ బుక్స్, వోల్టాస్, వైవీఓ, రేసిల్పూర్, ఇంప్రింట్స్ లాంటి సంస్థల మద్దతుంది. దాంతో పాటు సంతోష్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయ సహకారాలున్నాయి. ఔరంగాబాద్ లోని చికత్ గావ్ లో నాలుగో సెంటర్ ప్రారంభించేందుకు నిధులు సమకూరుతున్నాయి.

image


స్టడీమాల్ ఎలా ప్రభావం చూపిస్తోందంటే...

* మూడు గ్రామాల్లోని వెయ్యి మందికి పైగా పిల్లలు స్టడీ మాల్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు.

* విద్య విషయంలో మరింత అవగాహన పెంచుతుంది. కనీసం 25 నుంచి 30 శాతం అవగాహన పెరగాల్సి ఉంది.

* స్టడీ మాల్ ను పరిచయం చేసిన తర్వాత హాజరు శాతం పెరుగుతోంది.

* డిజిటల్ లెర్నింగ్ పద్ధతులు ఉపయోగించడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది.

* పిల్లల్లో స్టడీ టైమ్ 300 నుంచి 350 శాతం పెరిగింది.

* చదవడం, రాయడం, నేర్చుకునే మెళకువలు 30 నుంచి 40 శాతం పెరిగాయి.

* మార్కులు కూడా ఐదు నుంచి పది శాతం పెరిగాయి.

* స్టడీ మాల్ ఉపయోగించుకొని టీచర్లు కొత్త తరహాలో బోధన చేస్తున్నారు. తద్వారా టీచర్ల ప్రమేయం కూడా పెరుగుతోంది.

* పిల్లల కోసం కంప్యూటర్ ని ప్రవేశపెట్టారు.

* విద్యాపరమైన అభివృద్ధి, కెరీర్ అవకాశాలు, వ్యక్తిగత వృద్ధి లాంటివన్నీ పెరుగుతున్నాయి.

image


కష్టాల ప్రయాణం

ఫుల్ టైమ్ వర్క్ చేస్తూ ఇలాంటి స్వచ్ఛంద సంస్థను నిర్వహించడమంటే తలకుమించిన భారమే. అందుకే సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ అనేది కాస్త కష్టమైన వ్యవహారం. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రధానమైన సవాల్. ప్రభుత్వ మద్దతు లేకపోవడం మరో పెద్ద ఎదురుదెబ్బ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల విషయంలో ఉన్న నియంత్రణ మరో ఇబ్బంది. సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ పై కోర్సులు అందించే సంస్థలు లేవు. దీంతో అన్నీ సొంతగా నేర్చుకోవాల్సి వస్తోంది. 

చికట్ గావ్ లో నాలుగో స్టడీ మాల్ ప్రారంభించేందుకు, ప్రస్తుతం ఉన్న మాల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన నిధులు సేకరించడమే ప్రస్తుతం థింక్ షార్ప్ ముందున్న సవాల్. ఇక సోషల్ ఆంట్రప్రెన్యూర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాల్ ఏంటంటే స్థిరత్వం, వనరుల కొరత. ఎన్ని కష్టాలు ఎదురైనా దేశంలోని ప్రతీ గ్రామంలో స్టడీ మాల్ ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అంటున్నారు సంతోష్. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ ఆశిద్దాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags