సంకలనాలు
Telugu

మొక్కను నాటి... ప్రాణం పోసి...

గ్రీన్ ఇండియా లక్ష్యంతో 'మాన్సూన్ వుడ్డింగ్'ఏటేటా మొక్కలు నాటే కార్యక్రమంపచ్చదనానికి ప్రాణం పోస్తున్న 'స్వేచ్ఛ'

Sri
20th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కాలుష్యం, పర్యావరణం, పచ్చదనం... ఈ మధ్య ఈ పదాలు ఎక్కువగా వింటున్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం... కాలుష్యం... కాలుష్యం. పల్లెల సంగతి తర్వాత పట్టణాల్లో అయితే కాలుష్యం రెట్లు చాలా ఎక్కువ. అదే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో అయితే మితిమీరిన కాలుష్యం. పలు సంస్థలు చేపట్టిన అధ్యయనాల్లో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఢిల్లీ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటోంది. అవును... నిజంగానే ఢిల్లీలో పరిస్థితులు అలా ఉన్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. ఇది భావితరాలకు ఏమాత్రం మంచిది కాదని గుర్తించింది స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ. పచ్చదనాన్ని పరిరక్షించేందుకు నడుంబిగించింది. మాన్సూన్ వుడ్డింగ్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

భూమికి పచ్చని రంగేసినట్టు...

స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ లక్ష్యం గ్రీన్ ఇండియా. భారతదేశమంతా పచ్చదనంతో కళకళలాడటమే ఈ సంస్థ ధ్యేయం. గ్రీన్ ఇండియా లక్ష్యాన్ని మొదట దేశరాజధాని ఢిల్లీ నుంచే మొదలుపెట్టిందీ సంస్థ. ఏటేటా మాన్సూన్ వుడ్డింగ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తోంది. ఈ వర్షాకాలంలో పదివేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాలంటీర్ల సాయంతో వీకెండ్ లో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కృషి చేస్తోంది. దేశరాజధానిలో తొలి 'ఫ్రూట్ అండ్ బట్టర్ ఫ్లై గార్డెన్'ను ఏర్పాటు చేయడం వీరి ప్రయత్నానికి సజీవ సాక్ష్యం.

"గత పదిహేనేళ్లలో ఢిల్లీలో 32 వేల హెక్టార్లలో పచ్చదనం కోల్పోయాం. ఒకప్పుడు చెట్లతో కళకళలాడిన ఢిల్లీ కాంక్రీట్ జంగిల్ లా మారింది. అంతేకాదు రెండు దశల్లో మెట్రో రైలు విస్తరణతో 34 వేల చెట్లు నేలకొరిగాయి. మూడో దశ కోసం మొత్తం పదకొండు వేల చెట్లను తొలగిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అందుకే ఢిల్లీలో మళ్లీ పచ్చదనం నింపేందుకు మా వంతు కృషి చేస్తున్నాం" అంటారు స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విమ్లెందు ఝా.

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను ఒంటరిగా భుజానికెత్తుకోలేదు ఈ సంస్థ. ఈ బృహత్తర కార్యక్రమంలో యువతను, మీడియాను, ప్రభుత్వాన్ని, పౌర సమాజాన్ని భాగస్వాములను చేస్తోంది. వారి చేయూతతోనే ప్రతీ ఏడాది మాన్సూన్ వుడ్డింగ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తోంది. 2006 నుంచి వెయ్యికి పైగా వాలంటీర్లు ఢిల్లీ అంతటా 5000 మొక్కలు నాటారు. అంతే కాదు... తమ ఇళ్లల్లో మొక్కలను పెంచుకోవాలని ఆసక్తి ఉన్న పర్యావరణ ప్రేమికులకూ మొక్కలను అందజేశారు. ద్వారకాలోని సెయింట్ మేరీస్ స్కూల్ లో మొదటి అర్బన్ మినీ ఫారెస్ట్ ను రూపొందించారు.

"పర్యావరణ పరిరక్షణ కోసం స్వేచ్ఛ ఆధ్వర్యంలో యువ బృందం అహర్నిశలూ పాటుపడుతోంది. పర్యావరణ సమస్యలను గుర్తించి పరిష్కరించడమే మా పని. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మాన్సూన్ వుడ్డింగ్ 2006లో ప్రారంభమైంది" అంటారు విమ్లెందు ఝా.
విమ్లెందు ఝా

విమ్లెందు ఝా


మౌనంగానే ఎదుగుతూ...

జరిగేదేదో జరుగుతుంది లే... మనం చూస్తూ పోవాలి అనుకునే వ్యక్తులు మనకు చాలామంది కనిపిస్తూనే ఉంటారు. కానీ అలా ఎదురుచూసే వ్యక్తి కాదు విమ్లెందు. తన కాలేజీ రోజుల నుంచీ అంతే. తనచుట్టూ ఉన్న సమస్యల్ని గుర్తించడం, పరిష్కరించడంలో మిగతా వారి కంటే నాలుగడుగులు ముందే ఉంటారాయన.

“మనం ఏ మార్పునైతే కోరుకుంటున్నామో, ఏ మార్పునైతే చూడాలనుకుంటున్నామో... ఆ మార్పును మనమే తీసుకురావాలి. ఆ బాధ్యత మన భుజాలపైనే ఉంటుంది. మనం తలచుకుంటే మన పరిసరాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దొచ్చు. ఇన్నేళ్లుగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. పరిశుభ్రతపైన ఎంతో చైతన్యం తీసుకొచ్చాం. ప్రతీ మనిషిలో అంతర్లీనంగా దాగి ఉండే మంచితనాన్ని బయటకు తీసుకురావడమే మా లక్ష్యం. ప్రతీ ఒక్కరిలో మేము మార్పు కోరుకుంటున్నాం" అంటారు విమ్లెందు.

ఆ ఆలోచనల ఫలితమే మాన్సూన్ వుడ్డింగ్ క్యాంపైన్. నగరాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేయడమే ఈ క్యాంపైన్ లక్ష్యం. యువ వాలంటీర్ల సాయంతో ఈ కార్యక్రమం ఏడాదికొక్కసారి ఓ సీజన్ లో మాత్రమే జరుగుతుంది. జరిగేది ఏడాదికొక్కసారే అయినా... ఆ ప్రభావం అనునిత్యం ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రజల భాగస్వామ్యం కోసం బిట్ గివింగ్ అనే సంస్థతో చేతులు కలిపింది స్వేచ్ఛ. అంతే కాకుండా సామాజిక, పర్యావరణ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే గ్రూపుల సహకారం కూడా తీసుకుంటోంది.

మొక్క నాటాలంటే ఒక్క క్లిక్ చాలు

చాలామందికి పర్యావరణానికి మేలు చేయాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడాలన్న తపన ఉంటుంది. కానీ బిజీ లైఫ్ కారణంగా సమయం దొరకదు. అలాంటి వారికీ ఓ మంచి అవకాశాన్ని కల్పించిందీ సంస్థ. ఈ సంస్థ సహకారంతో ఎవరైనా ఒక్క క్లిక్ తో మొక్కలు నాటొచ్చు. ఒక మొక్కకు మూడు వందల రూపాయలు చెల్లిస్తే చాలు. మీ తరఫున మొక్కలు నాటే బాధ్యత ఈ సంస్థదే. మొక్కలు నాటడానికి ముందు నేలను సిద్ధం చేయడం దగ్గర్నుంచి మొక్కను నాటడం, ఎరువులు సేకరించడం, మొక్క నాటిన తర్వాత వాటి నిర్వహణ చూసుకోవడం వరకు అంతా స్వేచ్ఛ చూసుకుంటుంది. 2014 ఫిబ్రవరి 14న మొక్కల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి మూడు వారాల్లోనే కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు 395 మొక్కలను దత్తత తీసుకోవడం విశేషం.

"మార్పు రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిదానంగా వస్తుంది. దేశ నిర్మాణానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం ప్రేక్షకపాత్ర పోషించడమే కాదు... సమస్యల పరిష్కారంలో తాము భాగస్వాములవుతామని మా కార్యక్రమం యువత చాటి చెబుతోంది. యువతీయువకులను చురుకైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు, సమాజంలోని సమస్యలకు వినూత్నమైన, సృజనాత్మకమైన పరిష్కారాలను కనుగొనేందుకు స్వేచ్ఛ వేదికగా నిలుస్తోంది"

స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ 2000వ సంవత్సరంలో ప్రారంభమైంది. కాలుష్యం బారిన పడుతున్న యమునా నదిని కాపాడటమే లక్ష్యంగా ఈ సంస్థను ప్రారంభించారు విమ్లెందు. అప్పట్నుంచీ పర్యావరణ సమస్యలపై చిన్నారులతో, యువతీ యువకులతో కలిసి పనిచేస్తోంది. వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్న ప్రజలను ప్రచారాలు, కార్యక్రమాలు, శిక్షణ, పర్యటనల్లో భాగస్వాములను చేస్తోందీ సంస్థ.

"యమునా నదిని కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే మా లక్ష్యం. ప్రారంభించిన కొన్ని నెలల్లోనే మాకు వాలంటీర్ల సంఖ్య వందల్లో పెరిగింది. 2001లో మేము ఎన్జీఓగా రిజిస్టర్ చేసుకున్నాం" అంటారు విమ్లెందు.

"మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది. ఎదిగినకొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది" అన్నారు ఓ సినీ కవి. స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ కూడా మౌనంగానే ఎదిగింది. ఎదుగుతోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags