సంకలనాలు
Telugu

కర్నూలు కడుపేద రైతుబిడ్డ కొడుకు.. ఇప్పుడు చిన్న పిల్లల పాలిట దేవుడు..

పుట్టింది గ్రామంలో... పెరిగింది పేదింట్లో. ఆస్తులు లేకపోవచ్చు కానీ.. ఏదో సాధించాలనే తపన మాత్రం ఆకాశమంత. బుడ్డి దీపంలోనే చదువులు. ఆ బుడ్డీలోని కిరోసిన్‌నూ తక్కువ వాడాలనే తాపత్రయం. చివరకు ఆ కష్టం.. ఎంబిబిఎస్ డాక్టర్‌ను చేసింది. కానీ అర్థం కాని ఇంగ్లిష్.. చూడగానే భయమేసేంత పుస్తకాలు ఆ కుర్రాడిని ఖంగుతినేలా చేశాయి. భయంతో సిటీ నుంచి గ్రామానికి పరుగులు తీశాడు. తండ్రి ఇచ్చిన భరోసా, గుర్తొచ్చిన బాధ్యతలు రెట్టించిన ఉత్సాహాన్నిచ్చాయి. కిందపడిన బంతిలా పైకెగిరాడు. ఈఎన్‌టి డాక్టర్ అయి పిల్లలకు ప్రాణదాతగా నిలుస్తున్నాడు.

ARVIND YADAV
29th Jun 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అదొక గ్రామం. ఎక్కడో విసిరిసినట్టు ఉండే ఆ ఇల్లు. అందులో ఓ అతి సామాన్య రైతు. సగటు రైతు ఇంటిలానే అది కూడా ఉంది. పొగచూరిన గోడలు.. పాడుబడిన పైకప్పు... ఓ మట్టి పొయ్యి. ఇది అక్కడి చిత్రం. సంపదను ఇవ్వని ఆ దేవుడు సంతానాన్ని మాత్రం మెండుగా ఇచ్చాడు. ఇదీ ఆ రైతు స్థితి. తనకో భార్య, వాళ్లిద్దరి అన్యోన్యతకు గుర్తుగా పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అంతా అదే ఇంట్లోనే సంసారం. కూర్చుంటే ఎక్కువ.. పడుకుంటే తక్కువ. వర్షమొస్తేనే పంటలు... నాలుగు డబ్బులు. కరువొస్తే.. కూలీనాలీ తప్ప కూటికి వేరే దిక్కులేదు. ఆరుగురికి ప్రతీ రోజూ ఐదు వేళ్లో నోట్లోకి వెళ్లాలంటే.. ఒకరో ఇద్దరో కష్టపడితే కుదిరేపనికాదు. అందులో అమ్మానాన్నతో పాటు ఆ పసిచేతులూ కలిశాయి. పారలు పట్టలేకపోవచ్చోమో కానీ పాదులు తీశాయి. నాట్లు వేయలేకపోవచ్చు కానీ.. నాన్న జాడల్లో నడిచి చేతనైనంత పనిచేశాయి. ఎందుకంటే అలా చేయకపోతే పొట్ట ఎండిపోతుంది. అయితే ఇలా ఎంత కాలం. మా నాన్నలానే నేనూ.. నాలానే వీళ్లూ.. ఇలా పేదరికంలో మగ్గి బుగ్గి కావాల్సిందేనా అనిపించి ఆ తండ్రికి. ఇక ఆ చేతులు మట్టిపిసకనీయకుంటా చేయాలనుకున్నారు. బడికి పంపితే ఈ బతుకేమైనా మారుతుందేననే ఆశతో ధైర్యం చేశాడు. అంతే కాదు పొద్దున్నే తన పొలంలో రాత్రిళ్లు వేరే వాళ్ల పొలాల్లో పనిచేసేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించలేదు. ఇక ఆ కన్నతల్లి వాళ్లను కడుపులో పెట్టి చూసుకునేది. అమ్మానాన్నల కష్టం ఆ చిన్నారులను కరిగించింది. ఆ దీపం బుడ్డీలో చదివితే.. కిరోసిన్ అయిపోతుందేమోనని కట్టెల పొయ్యి నుంచి వచ్చే ఆ వెలుతురులోనే చదువును సాగించారు. అలా పడిన ఆ కష్టమే వాళ్లను ఇప్పుడు కాపాడింది. ఆ నలుగురి పిల్లలోని అబ్బాయి ఇప్పుడో ఫేమస్ డాక్టర్. అంతకంటే ప్రముఖ సర్జన్. అతని నైపుణ్యాన్ని చూసి ప్రపంచమంతా శాల్యూట్ చేస్తోంది.

ఇదంతా చదివాక సినిమాటిక్‌గా అనిపించవచ్చు. లేకపోతే ఏ హిట్ సినిమాలోనో.. సీరియలో గుర్తుకూ రావొచ్చు. కానీ ఇది నిజ జీవితం. అలాంటి ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన జీవితమే అతనిది. ఆయన డాక్టర్ PVLN మూర్తి.

డా. పివిఎల్ఎన్ మూర్తి

డా. పివిఎల్ఎన్ మూర్తి


మూర్తి కథ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మొదలవుతుంది. దస్తగీరయ్య, నాగమ్మలకు పుట్టిన మొదటి సంతానమే మూర్తి. అతని తర్వాత మరో ముగ్గురు ఆడపిల్లలు తోబుట్టువులుగా వచ్చారు. మూర్తి తండ్రికి ఊళ్లో ఐదెకరాల సాగు భూమి ఉంది. వాళ్లకు తెలిసిన విద్య వ్యవసాయమే. అదే జీవనాధారం కూడా. కానీ తనలా వాళ్లు ఈ పొలంలోనే పండిపోకుండా ఉండాలని నిర్ణయించుకున్న దస్తగీరయ్య.. ఆళ్లగడ్డలోని భారతీయ విద్యామందిరం స్కూళ్లో వాళ్లను చదువుకు పంపించారు. అయితే ఆ ఖరీదైన విద్యను అందించే శక్తి తన పొలానికి లేదని తెలుసు. అయినా సరే మొండి ధైర్యంతో ముందుకు దూకారు. వేరే వాళ్ల పొలాల్లోనూ పనిచేశారు.. నాలుగు పైసలు సంపాదించేందుకు ప్రయత్నించారు. ఇలా కష్టించిన తల్లిదండ్రుల ఆశలను ఏ మాత్రం నిరాశపరచలేదు ఆ పిల్లలు. ఊరంతా కరెంట్ లేకపోయినా వాళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. బుడ్డీ దీపం కిందనే ఆ సరస్వతి దేవి వాళ్లను కటాక్షించింది. అయితే అమ్మ వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యి నుంచి వచ్చి వెలుగులో చదువుకుంటూ లాంతరును ఆపేసే అక్కడ పొదుపు పాటించేవారు. అలా అబ్బిన గుణం, పెద్దతనం వాళ్లను చిన్నవయస్సులోనే ఆకాశమంత ఎత్తుకు చేర్చింది. చేతకాదని తెలిసినా తండ్రి పొలంలోకి వెళ్లి ఏదో చేయాలనే తాపత్రయం. కనీసం కలుపు మొక్కలైనా తీసేస్తామనే వాళ్ల మాటలు విన్న ఆ తల్లిదండ్రులు అడ్డుచెప్పలేకపోయారు.

ఐదో తరగతి వరకూ ఆళ్లగడ్డలో చదివిన మూర్తిని.. చిన్నాన్న కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె తీసుకెళ్లారు. పిల్లలు లేని లోటు తీర్చుకోవాలని ఆ బాబాయితాపత్రయపడితే.. తండ్రికి కొద్దిగానైనా భారం తగ్గించాననే ఆలోచన ఆ పిల్లాడిది. ఐదు నుంచి ఎనిమది వరకూ జిల్లాపరిషత్ స్కూల్లో.. ఆ తర్వాత కడప టౌన్‌లోని శారదా నిలయంలో పై చదువు చదివారు. అయితే అంత వరకూ అంతా తెలుగు మీడియంలో సాగిన విద్య కాస్తా ఇంగ్లిష్‌కు మారింది. ఆంగ్లం అనగానే నోటమాట ఆవిరైపోయే పరిస్థితులనూ అతడు తట్టుకున్నాడు. కష్టమో.. నష్టమో.. మళ్లీ వెనక్కి వెళ్లకూడదు అనే ధృడ సంకల్పంతో ఆంగ్లాన్ని అణిచి అక్కున చేర్చుకున్నాడు.

చదువులో రాణిస్తున్న మూర్తిని మరింత రాటుదేలిస్తే డాక్టర్ అవుతాడనే నమ్మకం అతని తండ్రి, బాబాయిలో కలిగింది. అందుకే ధైర్యం చేసి కడప జిల్లాలోని నాగార్జున రెసిడెన్షియల్ స్కూల్లో బైపిసిలో చేర్చారు.

ఈ లోపు ఓ సంఘటన మూర్తిని మరింత ఆలోచింపజేసి డాక్టర్ అయ్యేందుకు కారణమైంది. ఓ సారి వాళ్ల నాన్నమ్మకు అనారోగ్యమొచ్చి ఆస్పత్రిలో చేరితే.. చూసేందుకు వెళ్లి వచ్చేవాడు మూర్తి. అయితే ఆ ముసలావిడ ఆ నోటితో ఎందుకందో తెలియదు కానీ అదే నిజమైంది. నా మనుమడు.. డాక్టర్.. నా మనుమడు డాక్టర్ అంటూ అక్కడున్న వాళ్లందరికీ చెప్పడం మొదలుపెట్టింది.

పాత రోజులను గుర్తు చేసుకున్న డాక్టర్ మూర్తి.. ఇలా అంటారు.. " మా నాన్నమ్మ ఆ రోజు అలా ఎందుకనిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరిన ఐదో రోజుకే మరణించింది. కానీ ఆమె అన్న మాటలు నాకు ఊపిరాడనీయలేదు. రాత్రింబవళ్లూ అదే ధ్యాస. జీవితంలో ఇక ఏదైనా సాధించాలి అంటే.. అది డాక్టర్ కావడం ఒక్కటే అనే ఏకైక లక్ష్యాన్ని పెట్టుకున్నాను. కానీ ఓ విషయం మాత్రం ఇప్పటికీ బాధిస్తుంది. అదేంటంటే.. మా అవ్వ ఎందుకు చనిపోయిందో అప్పుడు డాక్టర్లు గుర్తించలేకపోయారు. ఆమె కష్టానికి కారణమేంటో కనుక్కునేలోపే కాలం చేసింది''.

ఆ ఘటన తర్వాత మూర్తిలో కసి మరింత పెరిగింది. ''ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో నేను పడిన కష్టం, మానసిక వేదన అంతా ఇంతా కాదు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివిన నాకు ఆ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలోని పదాలు వింటేనే భయమేసేది. ఇక ఇంగ్లిష్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్లాస్ అంటేనే కాళ్లు వణికేవి. అయితే అలానే తిప్పలు పడ్తూ నేర్చుకునేవాడిని. ఇది మనకు అవసరమా అనిపించిన ప్రతీసారీ మా అమ్మానాన్న, వాళ్ల కష్టం, వాళ్ల లక్ష్యాన్ని గుర్తుచేసుకునే వాడిని. అంతే నాలో తెలియని ఉత్సాహం వచ్చేది'' అంటారు మూర్తి.

బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకాలను ఇంగ్లిష్ చదివితే ఓ పట్టాన అర్థమయ్యేవి కాదు. అందుకే తెలుగు పుస్తకాలను కూడా కొని రెండింటినీ చదివేవాడు. అర్థంకాని ఇంగ్లిష్ పదాలపై తెలుగు అనువాదాన్ని అక్కడే రాసుకుని ఉంచుకోవడం వల్ల మరోసారి రివిజన్‌లో రెండు పుస్తకాలు చదవాల్సిన అవసరం రావొద్దనేది అతని టెక్నిక్. ఇక ఇంగ్లిష్‌ను ఔపోసన పట్టేందుకు చేతిలో ఎప్పుడు డిక్షనరీ అనే ఆయుధం సిద్ధంగా ఉండేది. అయితే ఇలా సాగిన ప్రిపరేషన్‌ కూడా అతడిని ఎంసెట్‌లో ముందు వరుసలో నిలపలేకపోయింది.

నిజం ఫస్ట్ అటెంప్ట్‌లో మూర్తికి చుక్కెదరు. సీట్ వచ్చేంత ర్యాంక్ రాలేదు. అయినా కుంగిపోలేదు. తల్లిదండ్రులు మరో అవకాశం ఇవ్వాలని ముందుకొచ్చారు. ఈ సారి ఉన్నదంతా ఊడ్చేసి నెల్లూరులోని కోరా కోచింగ్‌లో చేర్పించారు. అక్కడ తను ఏ అవకాశాన్ని వృధా చేసుకోలేదు. ఎందుకంటే ఈ సారి కూడా ర్యాంక్ రాకపోతే.. తల్లిదండ్రుల మొహం చూసేందుకు కూడా ధైర్యం సరిపోని స్థితి. ఇదే సమయంలో అక్కడ మూర్తి అమ్మానాన్న కూడా రెక్కలు ముక్కలు చేసుకునేవారు. ఉదయాన్నే నాలుగింటికే పనులకు పోతూ పదో పరకో సంపాదించేందుకు నానా పాట్లూ పడేవారు. ఎందుకంటే అబ్బాయితో పాటు ముగ్గురమ్మాయిల భారం వాళ్లపైనే ఉంది కాబట్టి.

అయితే ఈ సారి మాత్రం ఎంసెట్‌లో ర్యాంక్ కొట్టాడు మూర్తి. అతనిలో ఆనందానికి అవధులులేవు. పడిన కష్టానికి దక్కిన మొదటి ప్రతిఫలంలా భావించాడు. "నేను చాలా సంతోషించా. కోచింగ్ సెంటర్లో సమయం ముగిశాక నేను టీచర్ల ఇంటికి వెళ్లేవాడిని. నా డౌట్లన్నీ తీర్చుకుంటూ సబ్జెక్ట్‌పై మరింత గ్రిప్ పెంచుకున్నా. నాలోని తపన చూసి వాళ్లు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించారు. డాక్టర్ కావాలనే నా తపన, అవసరాన్ని గుర్తించి వెన్నుతట్టారు''.

తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న మూర్తి.. కొద్దిసేపు ఉద్విగ్నభరితుడయ్యాడు. కంటతడి పెట్టుకుని కడుపుతీపిని పంచుకున్నాడు. 'నేను ఆ రోజు రెండోసారి ఎంసెట్ పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. అయితే ఈ సారి ఊరి నుంచి తాను రావడం లేదంటా నాన్న ముందే కబురు పెట్టాడు. కానీ మా నాన్న పరీక్ష రోజు ఉదయాన్నే ఊరొచ్చాడు. కానీ నా దగ్గరికి వస్తే ఎక్కడ ప్రిపరేషన్‌కు అంతరాయం కలుగుతుందో అనే భయంతో బస్టాప్‌లోనే ఉండిపోయాడు. మరికాసపేట్లో ఎగ్జాం సెంటర్‌కు బయలుదేరబోతున్నాను అనుకున్నప్పుడు నాన్న కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే మా నాన్న నాకు చాలా లక్కీ. తను ఎదురొచ్చిన ప్రతీ సారీ నేను విజయం సాధించాను. ఈ సారి విజయలక్ష్మిని వరించయం ఖాయమని అప్పుడే అనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో నాన్న ప్రోత్సాహంతో ఎగ్జాం సెంటర్‌కు వెళ్లాను. ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీతో పరీక్ష రాసిన నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఎంబిబిఎస్‌లో చేరేందుకు మార్గం దొరికింది' అంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు మూర్తి.

కడప నుంచి విశాఖపట్నానికి మారింది మూర్తి కథ. అక్కడ సీట్ రావడంతో ఉత్సాహంగా వెళ్లి చేరాడు. కానీ ఎంబిబిఎస్ మొదటి రోజులు తలుచుకుంటే భయంతో పాటు నవ్వు కూడా వస్తుందంటారు. ''అప్పట్లో నన్ను చాలా ర్యాగింగ్ చేశారు. పేరుకు తెలుగే అయినా మాండలికం మాత్రం వేరుగా ఉండేది. నా రాయలసీమ భాష వల్ల ప్రత్యేకంగా చూస్తూ ఆటపట్టించేవారు. ఇది మొదట్లోనే నన్ను మరింత కుంగదీసింది. వీటికితోడు లెక్చరర్ల మాటలు, అర్థం కాని పెద్ద పెద్ద పదాలు మరింత గందరగోళంలో పడేశాయి. ఆ భయానికి తట్టుకోలేక ఓ రోజు రైలెక్కి ఊరు బయలుదేరాను. అదే ఒంటరిగా నేను చేసిన పెద్ద ప్రయాణం. ఇంటికెళ్లి నాన్నకు చెప్పగానే వాళ్లు గాబరా పడకుండా సర్దిచెప్పారు. ఇప్పుడు నువ్వు డాక్టర్ కాకపోతే... ఇక మనమంతా పేదరికంలో మగ్గిపోవాల్సిందేనని ఊరడించారు. నాలో ధైర్యం నింపి పంపారు. మళ్లీ వైజాగ్ వెళ్లిన నాకు కొంత మంది సీనియర్ల మద్దతు లభించింది. నా నేపధ్యాన్ని విన్న వాళ్లు ప్రోత్సహించారు. మెల్లిగా పరిస్థితులను అర్థం చేసుకుని బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడంతో నా సహచరులే కొంత మంది ఈర్ష్య పడడం మొదలుపెట్టారు''.

అయితే ఇలాంటి చిన్నవాటికి చెలించిపోకుండా ధృడచిత్తంతో చదివాడు. ఇంగ్లిష్‌పై పట్టులేకపోవడం, గ్రామీణ నేపధ్యం అనే సాకులు చూపకుండా రాత్రింబవళ్లూ చదువుతూ తన సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకున్నారు. 2001వ సంవత్సరంలో ఎంబిబిఎస్ పట్టా అందుకున్నారు.

''ఎంబిబిఎస్ పూర్తయ్యాక సర్జన్ కావాలనే ఆశ నాలో బలీయంగా ఉండేది. అయితే ప్లాస్టిక్ సర్జన్ కావాలని అనుకునేవాడిని. ఎందుకంటే అది చాలా టఫ్ జాబ్. కాలిన గాయాలతో బాధపడ్తున్న వాళ్లను చూసి చెలించడం వల్లే నాకు ఆ ఆలోచన వచ్చింది. కానీ నాకు వచ్చిన ర్యాంక్‌తో నాకు ఈఎన్‌టి విభాగంలో సీట్ దొరికింది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో చేరాను''.

అయితే ఈ మధ్యలో జరిగిన ఓ సంఘటన మళ్లీ కుటుంబ బాధ్యతలను గుర్తుచేసింది. 'డాక్టర్ అయ్యావు కదా.. నీ డబ్బుతో మా అందరికీ కడుపు నిండా ఎప్పుడు భోజనం పెడ్తావు' అంటూ సరదాగా తండ్రి అడిగిన మాటలు ఆలోచింపజేశాయి. కానీ స్పెషలైజేషన్ పూర్తికానిదే ఆదాయం రాదనే విషయం తెలిసినా చెప్పలేకపోయారు మూర్తి. ఈ లోపు గ్రామంలోని కొంత మంది దస్తగీరయ్యను మాటలతోనే మింగేసేవారు. కొడుకు డాక్టర్ అయ్యావు అని ఊరంతా చెప్పుకుంటున్నావు. అయితే నవ్వెందుకు ఇంకా కూలీ పనులు చేసుకుంటున్నావు. నిజంగానే కొడుకు డాక్టర్ అయ్యాడా.. లేక అబద్ధాలు చెప్పుకుని తిరుగుతున్నావా అంటూ హేళనగా మాట్లాడిన సంగతులను గుర్తుచేసుకుని ఇప్పటికీ బాధపడ్తారు మూర్తి.

అయితే ఎవరినీ నొప్పించడానికి ఇష్టపడని అతను పార్ట్ టైం ఉద్యోగం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఉదయం కాలేజీకి వెళ్తూనే సాయంత్రం డా. రాధాక్రిష్ణ అనే చిన్నపిల్లల వైద్యుడి దగ్గర జూనియర్‌గా చేరారు. పిల్లల వైద్య విధానంపై ఎంతో అవగాహన పెంచుకున్నారు. డా. రాధాక్రిష్ణ కూడా ఓపికగా సమాధానాలు చెప్తూ.. మూర్తిని సానబెట్టారు. ఇక్కడ అతనికి రెండు రెట్ల ఆనందం లభించింది. మొదటిది పిల్లల వైద్యం, రెండోది కొంత ఆదాయం. ఒకటి ఆత్మ సంతృప్తినిస్తే.. రెండో ఆర్థిక తృప్తిని మిగిల్చింది. ఆ డబ్బును తల్లిదండ్రులకు పంపడం వల్ల వాళ్లూ సంతోషపడ్డారు. చూడండి నా కొడుకు డాక్టర్ అయ్యాడు. నా నుంచి డబ్బు తీసుకోకుండా.. వాడే పంపుతున్నాడంటూ.. ఆ తండ్రి గర్వంగా ఊళ్లో తలెత్తుకుని మాట్లాడాడు.

image


ఈఎన్‌టి స్పెషలైజేషన్ పూర్తయ్యాక.. మూర్తి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. చెవి, ముక్కు, గొంతు సంబంధ వ్యాధులకు వైద్యాన్ని అందిస్తూ పేరు తెచ్చుకున్నారు. ప్రఖ్యాత సర్జన్‌ అయ్యారు. ఈ మధ్య రెండు కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా సేవలందిస్తున్నారు.

ఆర్థికంగా మెల్లిగా నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకున్న డాక్టర్ మూర్తి ఒక చెల్లి పెళ్లి చేశారు. మరోచెల్లి చదువు ఖర్చును భరించి ఆమె డెంటల్ సర్జన్ అయ్యేందుకు తోడ్పడ్డారు. తన ఆనందాన్ని యువర్ స్టోరీతో పంచుకున్న మూర్తి ఉబ్బితబ్బిబ్బయ్యారు. 'ఇప్పుడు మా ఊళ్లో సొంతిల్లు ఉంది. ఆ ఇంటికి ఏసీ, గీజర్ కూడా ఉన్నాయంటూ' మురిసిపోతారు.

వృత్తిగతంగా కూడా ఓ అనుభవాన్ని పంచుకున్నారు మూర్తి. ''నేను ఈఎన్‌టి స్పెషలైజేషన్ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా ఓ పేషెంట్ గొంతు క్యాన్సర్‌తో బాధపడ్తూ హాస్పిటల్ వచ్చాడు. అతనికి శ్వాస తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది ఉండేది. నేను అతనికి ట్రైకోస్టమీ చేయడంలో సహకరించాను. ఆ తర్వాత ఆ రోగి శ్వాస ప్రక్రియ సులువైంది. కొద్ది రోజుల పాటు అతనికి క్రమంగా డ్రెస్సింగ్ చేయడం, అక్కడ ఏర్పడే చీమును శుభ్రం చేయడం చేశాను. కొద్ది రోజుల తర్వాత ఆ పేషెంట్ ఇంటికి వెళ్లిపోయాడు. ఒక రోజు హఠాత్తుగా వచ్చి అతడు నా చేతిలో ఓ కోడిని పెట్టాడు. 'బాబూ.. ఇదే నేను మీకు ఇచ్చుకోగలను. నేను పేదోడిని. నా దగ్గర ఉంది ఇదే. మీరు నాకు చాలా సహకరించారు. మంచి వైద్యం చేసి నాకు స్వస్థత చేకూర్చారు' అని చెప్పుకుంటూ ఆ కోడిని నా చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతని కృతజ్ఞతా భావానికి నా కళ్లు చెమర్చాయి. కానీ చుట్టుపక్కలున్న కొంత మంది ఇతర వైద్యులు ఈ సంఘటన చూసి నవ్వుకున్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. నాలుగు నెలల తర్వాత ఆ రోగి చనిపోయాడు. ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనిపించి నా చేతనైనంత చేశా' అంటారు మూర్తి.

image


ఇప్పటివరకూ తన కెరీర్‌లో చేసిన అత్యంత కఠినమైన ఆపరేషన్‌ను డా. మూర్తి గుర్తుచేసుకున్నారు. 'యమన్ దేశం నుంచి ఆరేళ్ల పసిపాపను తీసుకుని ఓ జంట వచ్చింది. ఆ పిల్లకు కూడా ఇలాంటి శ్వాస సంబంధ ఇబ్బందే ఉండేది. ఆ పాప తల్లిదండ్రులు అప్పటికే వివిధ ఆస్పత్రులు తిరిగి విసిగిపోయారు. ఎందుకంటే ఆ పసి ప్రాణానికి అప్పుడే మూడు సార్లు ఆపరేషన్ కూడా జరిగింది. అయినా ప్రయోజనం లేదు. మరో ప్రధాన సమస్య ఏంటంటే.. వాళ్లకు మన భాష తెలియదు. మన భాష వాళ్లకు అర్థం కాదు. అతి కష్టమ్మీద ఓ ట్రాన్స్‌లేటర్ వాళ్ల సమస్యను వివరించారు. అన్నీ విన్నాక ఆ ఆపరేషన్ తాను చేయగలను అనే ధీమా కలిగింది. జఠిలమని తెలిసినా రిస్క్ చేసి ఆపరేషన్ చేయడం వల్ల ఆ పసిపాప ఆ తర్వాత సుఖంగా శ్వాస తీసుకుని ఊపిరి పోసుకుంది. అక్కడ నా అనుభవం ఎంతో పనికొచ్చింది'.

ఈ సందర్భంగా డా. మూర్తి మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. పిల్లలకు ఆపరేషన్ అనేది చాలా కఠినమైనది. ఎందుకంటే వాళ్ల శ్వాస నాళం చాలా చిన్నదిగా, సున్నితంగా ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యమూ తక్కువే. అందుకే చాలా డెలికేట్‌గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. . పెద్ద వాళ్లైతే.. తాము పడ్తున్న ఇబ్బందేంటో చెప్పగలరు. పిల్లల విషయంలో అలా జరగదు. అందుకే వాళ్ల సమస్యేంటో మనమే గుర్తించి చికిత్స అందించాలి. ఈ విషయంలో డా. రాధాక్రిష్ణ దగ్గర నేను తెలుసుకున్న విషయాలు బాగా ఉపయోగపడ్డాయి'.

డా. రాధాక్రిష్ణతో పాటు డా. శ్రీనివాస్ కిషోర్ కూడా మూర్తిని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరు. కార్పొరేట్ హాస్పిటల్‌లో తనతో కలిసి పని చేసేందుకు 2009లో అవకాశమిచ్చారు. ఆయన నాకు చాలా విషయాలు నేర్పించారు. కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేసిన నాకు మొదటి చెక్ ఆయన చేతులతోనే ఇచ్చారు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తింది అంటారు మూర్తి.

ఓ ప్రశ్నకు సమాధానంగా డా. మూర్తి చెప్పే సంగతి ఇది - 'నా జీవితంలో రెండు,మూడు ఘటనలు కీలకం. మొదటిది సాధ్యమైనంత ఎక్కువ మందికి సేవ చేయాలి. రెండోది అధిక శాతం మంది పిల్లలకు వైద్యం చేసి వాళ్ల జబ్బును నయం చేయాలి. మూడు... తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ నా భార్యాపిల్లలను సుఖంగా సంతోషంగా ఉంచడం' అంటారు.

మొత్తం ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో తండ్రి పేరును పదే పదే ప్రస్తావించారు డా. మూర్తి. అతని జీవితంలో తండ్రి పాత్రకు అమూల్యమైన స్థానాన్ని ఇచ్చారు. 'అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే.. నా ఉన్నతిని చూసి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ విషయాన్ని నా దగ్గర మాత్రం ప్రస్తావించరు. ఎందుకంటే ఇది విని నాకు పొగరు తలకెక్కుతుందేమోననే భయం వాళ్లది. అయితే మా నాన్న నాకు పదే పదే చెప్పే విషయం ఒక్కటే. నా కంటే గొప్పోడు ఎవరూ లేరనే అహంకారం వద్దే వద్దు. ఇక అంతా సాధించేశాను.. సాధించడానికి ఏమీ లేదు అని రిలాక్స్ అయిపోవద్దు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రపంచానికి నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేవారు మా నాన్న' అంటారు డా. మూర్తి.

image


ఈ విజయగాధలో డాక్టర్ అయ్యేందుకు మూర్తి ఎంత కష్టపడ్డారో.. వాళ్ల తండ్రి దస్తగీరయ్య, తల్లి నాగమ్మ అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. చెల్లెళ్లు లక్ష్మి, శివపార్వతి, సుభధ్రలు కూడా చేతనైనంత సాయం చేశారు. చాలీచాలని బతుకులు పొలాల్లోనే మగ్గిపోకుండా ఉండాలని అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయమే ఆ ఇంట్లో ఇద్దరిని డాక్టర్లను చేసింది. ఊరి వాళ్లు ఎగతాళి చేసినా.. ఎప్పుడూ కుంగిపోకుండా పిల్లలను ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఈ స్ఫూర్తిదాయక గాధలో ఇద్దరు హీరోలైన దస్తగీరయ్య, డా. మూర్తికి అభినందనలు చెప్పాల్సిందే.

తెలుగు అనువాదం - నాగేంద్ర సాయి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి