సంకలనాలు
Telugu

వయసు 24 ఏళ్లు.. జీతం కోటి రూపాయలు!!

Ratna Shree
18th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కలలు అందరూ కంటారు! కానీ ఆ కలల్ని కొందరే సాకారం చేసుకుంటారు!! అలాంటి వారిలో శ్రీరామ్‌ భార్గవ్‌ ఒకడు! చదవింది ఐఐటీ. అయితే ఏంటి? దేశంలో చాలామంది ఐఐటీ కుర్రాళ్లున్నారు. ఇతని ప్రత్యేకత ఏంటనేగా మీ సందేహం? స్పెషాలిటీ కాదు. పెను సంచలనం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లో 80లక్షల జీతం. మాటలు కాదు. గట్స్ ఉండాలి. గోల్‌ రీచ్‌ అవ్వాలన్న కసి ఉండాలి. కల నిజం చేసుకోవాలన్న తపన ఉండాలి. కానీ తన గురించి గొప్పగా చెప్పుకోవాలి. నలుగురూ శభాష్ అని మెచ్చుకోవాలి. కన్నందుకు తల్లిదండ్రులు గర్వపడాలి. ఫలానా పిల్లాడిలా ఉండాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవన్నీ కావాలంటే ముందు కమిట్‌మెంట్ కావాలి. దానికి తగ్గట్టుగా ఎఫర్ట్‌ కావాలి. ఆ విషయంలో శ్రీరామ్‌ భార్గవ్‌ కాంప్రమైజ్‌ అయ్యేరకం కాదు.

image


శ్రీరామ్‌ తండ్రి విజయ్‌ కుమార్‌ ట్రెజరరీ ఉద్యోగి. అమ్మ అరుణ గృహిణి. మధ్యతరగతి కుటుంబం. చదువులన్నీ నోట్ల కట్టలతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో.. ఓ సాదాసీదా కుటుంబంలో పుట్టి ఐఐటీలాంటి పెద్ద చదువులు చదవాలంటే అత్యాశే. అయినా విజయ్‌ కుమార్‌ భయపడలేదు. కొడుకును చదివించాలి. కలెక్టర్‌ని చేయాలి. అమ్మ ఆశ కూడా అదే. కానీ శ్రీరామ్‌ భార్గవ్‌ ఆలోచన అలాలేదు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్ కావాలని కలలు కనేవాడు. తండ్రి ఆశయం వేరే అయినా- కొడుకు డ్రీమ్‌ని కాదనలేదు. 2009లో ఆలిండియా ఓపెన్ కేటగిరి ఐఐటీలో భార్గవ్‌కి 55వ ర్యాంక్‌ వచ్చింది. ముంబై ఐఐటీలో సీటు! దానికే అదే పెద్ద విజయమని మురిసిపోయేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ భార్గవ్ గోల్ అది కాదు. ఐఐటీలో జాయిన్‌ అయిన తర్వాత అందరూ కెరీర్‌ని అశ్రద్ధ చేస్తారు. ప్లేస్‌మెంటుదేముంది అదే వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు. చదివామా.. ఏదో ఒక జాబ్ చేశామా అన్నది కాదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అదీ గోల్ అంటే!!

జరిగింది కూడా అదే. రోబోటెక్ , చాట్ బాక్స్ తదితర ప్రాజెక్టులను వినూత్నంగా చేసి శ్యాంసంగ్ మొబైల్ కంపెనీని ఆకర్షించాడు. అక్కడిక్కడే డీల్ కుదిరింది. ఏడాదికి 80 లక్షల ప్యాకేజీ. అమెరికాలో కొలువు. 40 ఏళ్లు పైబడినా ఐదంకెల జీతానికే అరవ చాకిరీ చేసే రోజులివి. మరి 22 ఏళ్లకే 80 లక్షలంటే మాటలు కాదు. అయినా శ్రీరామ్‌ సంతృప్తిగా లేడు. ఇంకా ఏదో సాధించాలి. అదే ఆలోచనలోనే పడ్డాడు. విజయానికి కారణం ఎప్పటికప్పుడు గోల్స్ సెట్ చేసుకుంటూ హార్డ్‌ వర్క్‌ చేయడమే అంటాడు శ్రీరామ్. ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే పేరుమోసిన స్కూళ్లలోనే చదవాల్సిన అవసరం లేదనేది కుర్రాడి అభిప్రాయం. అయినా చదువొక్కటే సరిపోదు.. తల్లిదండ్రుల నుంచి మోరల్ సపోర్ట్‌ కూడా కావాలంటాడు. భార్గవ్ జీవితాశయమల్లా ఒక్కటే. తనలా పేద పిల్లల్లోనూ టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఐఐటీ లాంటి చదువులు అందుబాటులోకి తేవాలి. ఇదే భార్గవ్ జీవిత లక్ష్యం!

image


వాస్తవానికి భార్గవ్ చదివింది గొప్ప బళ్లో ఏంకాదు. ఓ మోస్తరు స్కూల్లోనే చదివాడు. ఎల్‌కేజీ నుంచి 5 వరకు నల్లగొండ శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో! 6, 7 క్లాసులు వైష్ణవి స్కూల్లో! ఎయిత్ క్లాస్‌ ఎస్పీఆర్ స్కూల్లో! ఆ తర్వాత 9, 10 గుడివాడలో చదివాడు. ఇంటర్ విజయవాడలో చేశాడు. 2009లో ఐఐటీ 55 ర్యాంక్ కొట్టాడు. ముంబాయి ఐఐటీలో చదువుతున్న 73 మంది విద్యార్దుల్లో 65 మందికి ప్లేస్ మెంట్ దొరికింది. కానీ అందులో భార్గవ్ ఒక్కడికే అత్యుత్తమ ప్లేస్‌మెంట్! కొడుకు సాధించిన విజయంతో తండ్రి గుండె గర్వంతో ఉప్పొంగింది. కలా నిజమా అని కొన్నాళ్లపాటు తేరుకోలేదు. కృషి, పట్టుదల ముందు ఎంతటి కష్టమైనా బలాదూర్‌ అవుతుందని మావోడు రుజువు చేశాడని విజయ్‌ కుమార్‌ గొప్పగా చెప్పుకుంటున్నాడు.

అమ్మానాన్నతో శ్రీరామ్‌ భార్గవ్

అమ్మానాన్నతో శ్రీరామ్‌ భార్గవ్


ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన 22 ఏళ్ల కుర్రాడు ఏడాదికి 80 లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తున్నాడంటే మాటలు కాదు. తల్లి అరుణకైతే ఆనందంలో మాటలు రాలేదు. భార్గవ్ గోల్ ఎంచుకునే తీరు.. దాన్ని రీచ్ అయ్యే అప్రోచ్‌ ఎంతో నచ్చిందంటున్నారు. ఇంతకంటే పేరెంట్స్ కి ఇంకేం కావాలి అంటారామె. కొడుకు ఐఏఎస్ కావాలనేది ఆవిడ కల. కానీ తన అభిప్రాయం భార్గవ్ మీద రుద్దలేదు. సాఫ్ట్‌ వేర్‌ ఫీల్డ్ ఎంచుకుంటానంటే కాదనలేదు. పిల్లలకు ఏ రంగం మీద ఇష్టముందో ఆ రంగంలోనే వెళ్లనీయాలనేది అరుణ అభిప్రాయం.

భార్గవ్ అందరిలాంటి కుర్రాడు కాదు. చదివాం అంటే చదివాం అన్నట్టు ఉండడు. ఎంత డిస్ట్రబెన్స్ ఉన్నా పట్టించుకోడు. సబ్జెక్ట్‌ అంతుచూసేవాడు.చిన్నప్పట్నుంచి అలవడిన క్రమశిక్షణ భార్గవ్‌ని ఈ స్థాయిలో నిలబెట్టింది. విజయ్‌ కుమార్ కలిగ్స్ అంతా భార్గవ్‌ మీద ప్రశంసల వర్షం కురిపిస్తుంటే తండ్రిగా ఎంత మురిసిపోయాడో అతడి గుండెకు మాత్రమే తెలుసు. ఇక స్నేహితులు.. చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ల ఆనందమైతే అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం భార్గవ్ శ్యాంసంగ్ నుంచి గూగుల్‌కి మారాడు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్నాడు. 2014 అక్టోబర్లో అందులో జాయిన్ అయ్యాడు. ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ. శ్రీరామ్ భార్గవ్ ఫిలాసఫీ ఒకటే.. భవిష్యత్ ఎలా వుంటుందో ఎవరూ ఊహించలేరు. లైఫ్‌ ని ఒక ఆటగా తీసుకుని గెలవాలంతే! అంతేకదా మరి!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags