సంకలనాలు
Telugu

చేతిరాత మారితే తలరాత మారుతుంది..! నిరూపిస్తున్న లిఖిత్ పిటారా..!!

team ys telugu
25th Oct 2016
6+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


కొందరు రాస్తే.. కోడి కెలికినట్టుగా ఉంటుంది! వాళ్ల రైటింగ్ ఒక పట్టాన అర్ధం కాదు! అలాగే వాళ్లూ అర్ధం కారు! అదే కొందరు పెన్ను పడితే.. అక్షరాలన్నీ ముత్యాలు గుదిగుచ్చి పేర్చినట్టుగా అనిపిస్తాయి!! గడ్డిపరకలమీద వాలిన తుషార బిందువుల్లా మెరుస్తాయి!! అందమైన దస్తూరి ఎల్లప్పుడూ మనసుని మార్దవంగా తడుముతుంది! ఉదాహరణకు దర్శకుడు బాపునే తీసుకుందాం..! ఆయన గీత ఎంత కొంటెగా నవ్వుతుందో.. ఆయన రాత కూడా అంతే కంటికి ఇంపుగా ఉంటుంది!! ఆయన పెన్ను ఎన్నెన్ని హొయలు పోయిందో మనకు తెలియంది కాదు! బాపు చేతిరాత ఏకంగా ఫాంట్ గా మారి మనల్ని అలరిస్తోంది!!

డిజిటల్ యుగం రాజ్యమేలుతోంది. అనేకానేక ఫాంటుల ప్రవాహంలో పడి చేతిరాత మరుగున పడిపోతోంది. కీ బోర్డు టకటకల మధ్య పెన్ను విషాదంగా మూలన కూర్చుంది. మెయిల్స్.. మెసెంజర్లు తప్ప కాయితం మీద కలం కదిపే అవసరమే రావడం లేదు. ఫలితంగా చేతిరాత కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

నిజానికి అందంగా రాయడమనేది ఒక ఆర్ట్! కలం పడితే అక్షరాలు పూలవర్షమై కురవాలి. గుండె లోలోతుల్లో నాటుకోవాలి. దస్తూరిని మళ్లీమళ్లీ చూడాలనిపించేలా ఉండాలి. అందమైన చేతిరాత చూసిన మరుక్షణమే అప్రయత్నంగానే ఆహా.. రైటింగ్ సూపర్ అంటుంటాం. అంటే డిజిటలైజేషన్ మనల్ని ఎంత మానిపులేట్ చేసినా.. హృదయాంతరాల్లో మనకు తెలియకుండా చేతిరాతకు సింహాసనమే వేశాం.

image


చేతిరాత బాగుంటే తలరాత మారుతుందంటారు. సరిగ్గా ఈ కాన్సెప్టుతో భవిష్యత్ ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చో ప్రాక్టికల్ గా నిరూపించారు హైదరాబాదుకు చెందిన కాలిగ్రఫీ నిపుణురాలు. ఇంతకూ ఎవరామె? ఏం అద్భుతాలు చేసింది?

వనిత. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. భద్రుకాలో బీకాం. ఆ తర్వాత కంపెనీ సెక్రటరీ కోర్స్. అవకాశాలు అందివచ్చాయి. కెరీర్ గాడిలో పడింది. కానీ ఎందుకో తృప్తి లేదు. రొటీన్ లైఫ్‌. పైగా బోరింగ్. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. ఏం చేయాలన్న ఆలోచన చేతిరాత మీదకు మళ్లింది. పైగా ఆమెకు మొదట్నుంచీ హాండ్ రైటింగ్ మీద ఇంట్రస్ట్ ఉంది. ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదూ అనుకున్నారు. అలా గ్రాఫాలజీ మీద దృష్టి పెట్టారు. చేతిరాతలను, సంతకాలను విశ్లేషించే పద్ధతినే గ్రాఫాలజీ అంటారు. హాండ్ రైటింగ్, సిగ్నేచర్లను బట్టి మనుషుల స్వభావాలను, వ్యక్తిత్వాలను అంచనా వేస్తారు. అతి తక్కువ టైంలోనే గ్రాఫాలజీ మీద పట్టుసాధించారు. దేశవ్యాప్తంగానే కాకుండా, అమెరికా బీజింగ్ లాంటి దేశాల నుంచి చేతిరాత అనలైజ్ చేయమని సంప్రదించేవారు. తర్వాత కాలిగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మూడేళ్ల క్రితం లిఖిత్ పిటారా అనే సంస్థను స్థాపించారు.

లిఖిత్ పిటారా కాన్సెప్ట్ ఏంటి?

తలకట్టు తీర్చిదిద్దిన తెలుగు అక్షరం మకుటం పెట్టుకున్న మహారాజులా ఠీవీగా కనిపిస్తుంది. మెలికలు తిరిగిన ఆంగ్లాక్షరం పందిరి మీద మల్లెచెట్టు పాకినట్టుగా రొమాంటిక్ గా ఉంటుంది. తీర్చిదిద్దిన హిందీ అక్షరాలు నిండైన విగ్రహంలా కనిపిస్తాయి. లిఖిత్ పిటారా చేసేదదే. అక్షరాల తలకట్టును తీర్చిదిద్దే మహత్కార్యం. బెంగళూరు, ముంబైలో యాభైకి పైగా వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. మన దగ్గర హిమాయత్ నగర్, బర్కత్ పురా, బంజారాహిల్స్ లో రెగ్యులర్‌ గా క్లాసులు తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారుచేసేవారు, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ ఇలా ఎందరో లిఖిత్ పిటారా వర్క్ షాపులకు హాజరువుతుంటారు. అన్నట్టు ఈ మధ్య చాలామంది టీచర్లు కూడా హాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోడానికి వస్తున్నారట. పిల్లలకు అక్షరాలు అందంగా నేర్పాలంటే ముందు వాళ్ల రైటింగ్ బాగుండాలి కదా!

image


ఇక సమ్మర్లో అయితే జనం తాకిడి విపరీతంగా పెరుగుతుంది. పొద్దున 8.30 నుంచి రాత్రి 7.30 వరకు విరామం లేకుండా క్లాసులు జరుగుతుంటాయి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ చేతిరాతను మెరుగుపరుచుకోడానికి వస్తుంటారని సంస్థ ఫౌండర్ వనిత అంటున్నారు. అలా వచ్చిన వారిలో మంచి ఉద్యోగాలు పొందినవారు, లైఫ్ స్టయిల్ మార్చుకున్నవాళ్లూ ఉన్నారు. ఇటీవలే నల్సర్ యూనివర్శిటీలో కూడా వర్క్ షాప్ కండక్ట్ చేశామని ఆమె తెలిపారు. 

image


కేవలం హాండ్ రైటింగే కాకుండా కాలీగణేశ్, అబ్‌స్ట్రాక్ట్ కాలీగ్రఫీ, మాన్యువల్ స్క్రిప్ట్ రైటింగ్ టెక్నిక్స్, త్రీడీ కాలీగ్రఫీతో పాటు వెడ్డింగ్, బర్త్ డే పార్టీ ఇన్విటేషన్ మేకింగ్ కూడా నేర్పిస్తారట. సెల్ఫ్‌ ఇంక్ స్టాంప్స్, అబ్‌ స్ట్రాక్ట్ లోగో డిజైనింగ్, ఫోనిక్స్, ఆర్టిస్టిక్ రైటింగ్.. ఇవే కాకుండా సెమినార్స్, వర్క్‌ షాప్స్.. ఇలా లిఖిత పిటారా జీవితాన్ని అందంగా మార్చే వన్ స్టాప్ డెస్టినేషన్ గా మారిందని చెప్పడంలో సందేహం లేదు.

image

6+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags