సర్కారీ స్కూల్లో సైన్స్ టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ భార్య

సర్కారీ స్కూల్లో సైన్స్ టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ భార్య

Thursday July 20, 2017,

1 min Read

ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ మంగేశ్ ఘిల్దియాల్ ఒకాసారి రొటీన్ ఇన్ స్పెక్షన్ మీద జిల్లాలోని ఓ బాలికల పాఠశాలకి వెళ్లారు. సమస్యలు, సదుపాయాల మీద ఆరా తీస్తుంటే ఒకమ్మాయి చెప్పింది.. సార్ మాకు సైన్స్ టీచర్ లేరు అని. చాలాకాలంగా 9,10 తరగతులకి సామాన్య బోధించే ఉపాధ్యాయుడు లేరని తెలిసి మంగేశ్ మనసు చివుక్కుమంది. సరే.. నేను ఈ విషయం విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి అక్కడి నుంచి కదిలారు.

image


ఆ రోజు జరిగిన విషయాన్ని ఇంట్లో తన భార్య ఉషకు చెప్పాడు. ఆమె కూడా అయ్యో అని నిట్టూర్చింది. అంతలోనే ఆవిడకి మెరుపులాంటి ఐడియా తట్టింది. వాళ్లకు సైన్స్ టీచర్ వచ్చేంత వరకు నేనే పాఠాలు చెప్తా అని ఉత్సాహం కనబరిచింది. ఆమె మాటకు మంగేశ్ సంతోషించారు. సరే.. అలాగే కానీయ్ అన్నారు.

ముందుగా స్కూల్ ప్రిన్సిపల్ మేండంతో మాట్లాడాడు. సైన్స్ టీచర్ రిక్రూట్ అయ్యేంత వరకు తన భార్య పాఠాలు చెప్తుందని ఒప్పించాడు. ప్రిన్సిపల్ సరే అన్నారు. ఇంకేముంది కలెక్టర్ భార్య వలంటీర్ టీచర్ అవతారమెత్తింది. నైన్త్, టెన్త్ క్లాసులకు చెరో పీరియడ్ చెప్తూ వాళ్లకు సైన్స్ మాస్టార్ లేని లోటు పూడ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువుకోడమే ఈ రోజుల్లో గగనం. అందునా అరకొర ఉపాధ్యాయులుంటే అంతకంటే విద్యావ్యవస్థకు చెడ్డపేరు మరొకటి లేదు.

కలెక్టర్ భార్య అయినప్పటికీ, చొరవ తీసుకుని ఓ గవర్నమెంటు పాఠశాలలో పిల్లలకు సైన్స్ పాఠాలు చెప్తున్న ఉష ఔదార్యాన్ని చూసి స్కూల్ టీచర్లంతా సంతోషపడ్డారు. భార్యను స్ఫూర్తిగా తీసుకుని మంగేశ్ కూడా స్కూళ్లలో విద్యాప్రమాణాలను పెంచే పనిలో పడ్డారు.