సంకలనాలు
Telugu

మహిళలకు శిక్షణనిచ్చి మరీ ఉద్యోగాలు చూపిస్తున్న ‘జంప్ స్టార్ట్’

17th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మహిళలు ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అని నమ్మారు ఆ ఇద్దరు మహిళలు.. అందుకే మహిళా సాధికారత కోసం.. వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం కోసం 'జంప్ స్టార్ట్' పేరుతో ఓ ఫౌండేషన్ ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేసి ఆర్థికంగా మరొకరిపై ఆధారపడుతున్న అబలలకు దీని ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తూ వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు.

image


నమ్రతా భామర్.. ఈమె ఒక ఫుడ్ టెక్నాలజిస్ట్. ఎనిమిదేళ్లుగా యూకే, ఇండియాల్లో ఆహార తయారీ రంగంలో పనిచేస్తున్నారు. గత మూడేళ్లుగా ఓ ప్రముఖ ఫుడ్ సంస్థ సక్సెస్‌లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తనలాగే మహిళలంతా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలన్నది ఆమె లక్ష్యం. అందుకే ఆ అవకాశం లేని మహిళల కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. మరో మహిళ, తన స్నేహితురాలు రాధికా మజుందార్‌తో తన ఆలోచనను పంచుకున్నారు. దానికి ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. ‘మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలన్నది నా బలమైన విశ్వాసం. ఆ అవకాశం లేని వారి కోసం ఏదో ఒకటి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాలాగా కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలన్నా, అందులో రాణించాలన్నా ఎలాంటి నైపుణ్యం అవసరమో నా ఎనిమిదేళ్ల అనుభవంలో నేర్చుకున్నాను’ అని నమ్రతా చెబుతున్నారు. ఆమె స్నేహితురాలు రాధికా మజుందార్ ఓ విద్యావేత్త. విద్యారంగంలో ఆమెకు 11 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. గత రెండున్నరేళ్లుగా ఓ కే12 స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడే ఓ సంస్థ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ లో మంచి పట్టు సాధించారు.

image


మహిళా సాధికారత కోసం జంప్ స్టార్ట్

ఇద్దరూ కలిసి 'జంప్ స్టార్ట్' పేరుతో ఓ స్కిల్ ఫౌండేషన్ ఏర్పాటుచేశారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాళ్లు ఉద్యోగాలు సంపాదించుకునేలా చేయడం ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఏమాత్రం నైపుణ్యం లేని సాధారణ మహిళలను స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం వల్ల వారి కుటుంబ సంక్షేమంతోపాటు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో ఆత్మగౌరవంతో జీవించగలుగుతారు. ఈ ఉద్దేశంతోనే 18 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను ఎంపిక చేసుకొని వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కనీసం పదో తరగతైనా పాసై ఉండాలి. 

ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు, విడాకులు తీసుకున్న స్త్రీలు, పెళ్లికాని యువతులు, భర్తను కోల్పోయినవాళ్లు, వివిధ వేధింపులకు గురైన బాధితురాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యోగం సంపాదించడానికి కావాల్సిన కనీస నైపుణ్యాలను గుర్తించి ఆ దిశగా వారికి శిక్షణ ఇవ్వాలని ఫౌండేషన్ నిర్ణయించింది. ‘మేం స్వయంగా సొంత ప్రశ్నావళి రూపొందించి వివిధ రంగాల పరిశ్రమల్లో సర్వే నిర్వహించాం. వచ్చిన ఫలితాల ఆధారంగా మేము మా బేసిక్ కోర్సును రూపొందించుకోవడానికి అవకాశం కలిగింది’ అని నమ్రత తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు.

image


ఉద్యోగమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి

ప్రస్తుతం జంప్ స్టార్ట్‌లో రెండు తరగతి గదులు, ఒక కంప్యూటర్ లాబొరేటరీ, తొమ్మిది మంది అధ్యాపకులు ఉన్నారు. ఒక కోర్సు కాలవ్యవధి సుమారు 18 వారాలు. కోర్సులో చేరాలంటే రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్, కంప్యూటర్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, నాయకత్వ లక్షణాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కోర్సు పూర్తయిన తర్వాత రిసెప్షనిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, సెక్రటరీ, హెచ్‌ఆర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ సూపర్ వైజర్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఆరోగ్యం, పనిచేసే చోట హక్కులు, ఆత్మరక్షణలాంటి వాటిపై అదనపు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

image


నిధుల సమీకరణే సమస్య

మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్న జంప్ స్టార్ట్ ఫౌండేషన్‌కు మాత్రం ఆర్థికంగా కష్టాలు తప్పడం లేదు. మొదట్లో రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వడానికి అయిన ఖర్చును ఫౌండేషన్ డైరెక్టర్లే భరించినట్లు నమ్రత తెలిపారు. ‘ప్రారంభంలో సంస్థ డైరెక్టర్లే కొంత పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం విరాళాలపైనే పూర్తిగా ఆధారపడ్డాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కొన్ని కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. బ్యాచ్ స్పాన్సర్షిప్ దిశగా కూడా ఆలోచిస్తున్నాం’ అని ఆమె చెప్పారు. ఒక్కో బ్యాచ్ నడపడానికి ఫౌండేషన్‌కు రూ. 1.1 లక్షల నుంచి 1.3 లక్షల వరకు ఖర్చవుతోంది. శిక్షణ పొందినవారికి ఉద్యోగాల కోసం వడోదరాలో ఉన్న చిన్న, మధ్య తరగతి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది జంప్ స్టార్ట్ ఫౌండేషన్. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ శిక్షణ పొందుతోంది. ‘నాలుగో బ్యాచ్‌లతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 35 నుంచి 40 మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. 

2016లో మరో 60 నుంచి 80 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్నవారిలో 90 నుంచి 95 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి’ అని రాధిక మజుందార్ తెలిపారు. అయితే నిధుల సమీకరణే సంస్థకు ప్రధాన సమస్యగా మారింది. విరాళాలపై ఆధారపడకుండా సొంతంగా సంస్థను నడిపించేలా ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తున్నామని నమ్రత చెప్పారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, గాంధీనగర్ లాంటి టైర్ 2, 3 సిటీస్‌లో జంప్ స్టార్ట్ కార్యకలాపాలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఇద్దరు మహిళలు. చిన్న, మధ్య తరహా ఉద్యోగాల కోసం శిక్షణ, నియామకాలు మొత్తం జంప్ స్టార్ట్ నుంచే జరగాలన్నది తమ ఉద్దేశమని వారు చెబుతున్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు పెంచే వృత్తి నైపుణ్య శిక్షణను ఓ ఉద్యమంలా మార్చాలన్న తమ కలలకు అనుగుణంగానే ఫౌండేషన్‌కు జంప్ స్టార్ట్ అనే పేరు పెట్టినట్లు నమ్రత, రాధిక తెలిపారు. ‘మహిళలను మరింత శక్తివంతం చేసేందుకు కావాల్సిన అవకాశాలను మేము సృష్టిస్తున్నాం. భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందేలా వారి జీవితాలను మారుస్తున్నాం. ప్రతీ ఇంట్లోని మహిళ వృత్తి నైపుణ్యంలో శిక్షణ పొంది తద్వారా ఉద్యోగం సంపాదించి ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలన్నదే మా లక్ష్యం’ అంటూ స్ఫూర్తిదాయక సందేశం ఇస్తున్నారు నమ్రత, రాధిక.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags