సంకలనాలు
Telugu

గేదెలు కాసుకున్న ఆ అబ్బాయే.. ఇప్పుడు రోబో ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్వైజరీకి సిద్ధమవుతున్నాడు !

పైసా ఎక్స్ పైసా ఫౌండర్ హను సక్సెస్ స్టోరీ

Chanukya
21st Mar 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్లలేరా ? చిన్నప్పుడు గేదెలు కాస్తే చదువు అబ్బదా ? కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం చదువుతో సంబంధం లేకుండా ట్యూషన్లు చెబితే కెరీర్ ఆగిపోయినట్టేనా ? అన్నీ తప్పు అని ప్రూవ్ చేశారు హనుమంతరావు... ఉరఫ్ హను. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ వరల్డ్‌లో ఇప్పుడో పెద్ద సంచలనానికి తెరతీయబోతున్నారు. రోబో ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్వైజరీ దిశగా ఆయన వేస్తున్న అడుగులు.. ఈ రంగంలో ఓ ట్రెండ్ సెట్ చేయబోతున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం వదులుకుని ఇక్కడికి వచ్చి ఆయన సాధించింది ఏంటో చూడాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే !

image


హనుమంతరావు యెడ్లూరి.. సింపుల్‌గా హను. గుంటూరు జిల్లాకు చెందిన వీళ్ల కుటుంబానిది వ్యవసాయ నేపధ్యం. పేరుకు పొలాలు ఉండేవే కానీ.. ఆర్థిక స్వేచ్ఛ మాత్రం అంతంతే. మామూలుగానే రైతుల ఇళ్లలో పాడి కూడా ఉండేది. అదీ ఓ జీవనాధారమే. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన హను.. తండ్రికి సాయంగా చిన్నప్పుడు పొలం పనులూ చేశాడు. పెద్ద కొడుకు బాధ్యత తీసుకుని గేదెలు కూడా కాసేవాడు. అదే ఊళ్లో ప్రభుత్వ పాఠశాలలో చదువు కూడా సాగేది. ఉదయాన్నే లేచి గేదెల పని చూసి.. పొలంలోనే స్నానం చేసి అటునుంచి అటే స్కూలుకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో పనులేవైనా ఉంటే చూసుకోవడం.. అది ఒక దశ వరకూ ఆ పిల్లగాడి రొటీన్ వర్క్.

చదువుకంటే.. ఈ పనులపైనే ఎక్కువ శ్రద్ధపెట్టడంతో తల్లిదండ్రులకు ఆవేదన పెరిగింది. అప్పటికే స్కూలుకు వెళ్లనని మారాం చేస్తుండడంతో పరిస్థితి చేజారిపోతోందని భావించిన వాళ్లు.. అక్కడి నుంచి గుంటూరుకు మకాం మార్చేశారు. ఇదో టర్నింగ్ పాయింట్. ఇక అక్కడ ప్రైవేట్ స్కూల్లో పడటంతో చదువు ధ్యాసలో పడిపోయాడు హను. ఈ లోపు డాక్టర్ కావాలనే కోరిక ఎందుకనో బలంగా ఉండిపోయింది. కుటుంబం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఒక వేళ ఎంసెట్‌లో సీట్ రాకపోతే.. డబ్బులు కట్టి ఎంబిబిఎస్‌లో చేర్పించే స్థోమత లేదని తండ్రి తెగేసి చెప్పారు. ఇష్టం లేకున్నా ఎంపిసిలో చేరి.. చదువు అయిందనిపించాడు. డిగ్రీలో చేరడంతో ఒక్కసారిగా రెక్కలు వచ్చినట్టైంది, చదువు ధ్యాస ఇంకా తగ్గింది. ఒక రోజు కుటుంబ బాధ్యతలన్నీ కళ్లముందు కదిలాయి.

image


డిగ్రీ అయింది కానీ ఏం చేయాలో స్పష్టత లేదు. తెలిసిన వాళ్లు ఉండడంతో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల్లో 1997లో మ్యాథ్య్ టీచర్‌ అవతారమెత్తాల్సి వచ్చింది. ఆరునెలలకే 'మ్యాథ్స్ హనుమంతరావు' అనే పేరొచ్చింది. అప్పట్లోనే గంట హోం ట్యూషన్‌కు నెలకు రూ.1000 తీసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటారు హను. ఈ సమయంలో కుటుంబానికి ఆర్థికంగా ఆసరా దొరికింది. అయితే ఇక్కడే ఉంటే టీచర్‌గా మిగిలిపోవాల్సి వస్తుందేమోననే భయం పట్టుకుంది. 1998లో వరంగల్‌లో ఎంసిఏలో చేరారు. చదువు పూర్తై అలా బయటకు వస్తున్న సమయంలో ఐటి బుడగ పేలింది, ఉద్యోగాలే లేవు. బ్యాక్ టు పెవిలియన్. ట్యూషన్లు చెప్పుకోవడం మొదలు. ఈసారి 2002లో మరో అటెంప్ట్. హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగం కోసం వేట. బ్లూస్టార్, ఏడిపి ఉద్యోగం వచ్చినా ఏదో అసంతృప్తి, అస్పష్టత. 2006లో కంట్రీ వైడ్‌లో చేరారు. అక్కడ ప్రకాశ్ శుక్లా, రాజేష్ జా వంటి మెంటర్ల పర్యవేక్షణలో హను గాడిలో పడ్డారు. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో తన ఫ్యూచర్ వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యాడు.

స్టూడెంట్స్, టీచర్లతో కాకతీయ విద్యాసంస్థల అధినేత 

స్టూడెంట్స్, టీచర్లతో కాకతీయ విద్యాసంస్థల అధినేత 


2008లో బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్‌లో ఉద్యోగం సంపాదించాడు. గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అక్కడ కుదుటపడేలోపే సబ్ ప్రైమ్ సంక్షోభం మార్కెట్లను కుదిపేసింది. దీంతో మళ్లీ గందరగోళం. అయితే అనుకోకుండా Linda Orlans అనే ప్రఖ్యాత ఆంట్రప్రెన్యూర్ హనూను తన టీంలో చేర్చుకున్నారు. అక్కడ తను ఎంటర్‌ప్రైస్ ఆర్కిటెక్ట్‌గా మారాడు. ఇక్కడ తను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా అసలైన వృద్ధిని ఎంజాయ్ చేశాడు. 5 ఏళ్ల అనుభవం తర్వాత ఇండియాకు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. మార్టిగేజ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఓ స్టార్టప్ మొదలుపెట్టాలని అనుకున్నారు.

ఆర్థిక సేవల రంగం ఓ మహాసముద్రం లాంటిది. తెల్లారి లేచినప్పటి నుంచి డబ్బుతో వ్యవహారం. అయితే పెట్టుబడుల కంటే రుణాలకే మన దేశంలో డిమాండ్ ఎక్కువ. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇచ్చే అన్ సెక్యూర్డ్ పర్సనల్ లోన్ మార్కెట్ విలువ రూ.2,00,000 కోట్లు ఉంటుంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఎవరికి వారు ఈ సెగ్మెంట్‌ను మార్కెట్ చేసుకుంటాయి కానీ, అన్ని సంస్థలూ ఒకే చోట ఉన్న పరిస్థితి అప్పట్లో తక్కువ. ఇక్కడ రిటైల్ కస్టమర్లకు అలాంటి ఓ సింగిల్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫాం లేదనే విషయాన్నే నాలుగేళ్ల క్రితం గుర్తించారు హను. 2012లో జూలైలో పైసా ఎక్స్ పైసా పేరుతో స్టార్టప్ మొదలుపెట్టారు. ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అమ్మడంతో పాటు బిజినెస్ సర్వీస్ సొల్యూషన్స్ అందించేందుకూ ఓ విభాగాన్ని మొదలుపెట్టారు. 2013 నాటికి దేశంలో ఉన్న ప్రధాన మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నింటితోనూ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. పెట్టుబడులు, రుణాలకు సంబంధించిన సేవలు ఒకే వేదికపై అందించేలా వ్యవస్థను రూపొందించారు. 2014లో ఐసిఐసిఐ బ్యాంక్‌తో కలిసి లోన్ సెగ్మెంట్లో బిజినెస్ ఎంటర్ అయ్యాక రూ.40 కోట్ల బిజినెస్ చేశారు. ఈ లోపు వెబ్ సైట్లకు క్రేజ్ తగ్గుతోందని గుర్తించి మొబైల్, యాప్ వైపు దృష్టి మళ్లించారు.

''అప్పటికే పైసా బజార్, బ్యాంక్ బజార్ అనే సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకుని ఉన్నా వాళ్లు ప్రోడక్ట్ స్పెసిఫిక్ సేవలను మాత్రమే అందిస్తున్నారు. పూర్తిస్థాయి ఫైనాన్షియల్ ప్లాన్ ఎవరూ ఇవ్వడం లేదు. హౌజింగ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, ఇన్వెస్ట్‌మెంట్.. ఇలా వివిధ విభాగాలు ఉన్న ఈ రంగంలో అన్నీ ఒకే చోట లభ్యం కావు. ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్, లోన్ సెగ్మెంట్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడానికే పైసా ఎక్స్ పైసా మొదలుపెట్టాను'' - హను

కస్టమర్ ఇంటి దగ్గర కూర్చుని జస్ట్ స్మార్ట్ ఫోన్‌లో అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూప్.. స్కాన్ చేసి అప్ లోడ్ చేయగానే... సిబిల్ స్కోర్ చెక్ చేసి.. 8 గంటల్లో లోన్ అప్రూవ్ అవుతుందో లేదో చెప్పేసే వ్యవస్థను పైసా ఎక్స్ పైసా రూపొందించింది. ఫోన్‌లోనే ఆధార్, ఓటర్ ఐడి, సెల్ఫీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా బ్యాంకింగ్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తోంది. ప్రధాని జన్ ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటివాటిని ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని పెట్టుబడులు ప్రారంభించేలా ఓ ప్రత్యేక యాప్‌ను ఈ మధ్యే తయారు చేసింది పైసా టీం.

image


ఒకప్పుడు ఏ ఎల్ఐసి ఏజెంటో.. లేక ఇంకెవరో వచ్చి చెబితేగానీ మనకు ఆర్థిక వ్యవహారాల గురించి అంతగా పట్టు తెలియదు. ఇప్పటికీ మన జనాల్లో 5-6 శాతం మందికి మాత్రమే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ విషయంలో అవగాహన ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడ్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా మంచి చెప్పినా నమ్మలేని స్థితి వచ్చింది. ఆర్థిక సేవల విషయంలో ఎలాంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చే సలహాల కోసం జనం చూస్తున్నారు. విదేశాల్లో ఈ వ్యవస్థ ఎప్పుడో అభివృద్ధి చెందింది. మన ఆర్థిక స్థితిగతులు, కుటుంబ అవసరాలు, లక్ష్యాలను ఎంటర్ చేయగానే.. మనకు సూట్ అయ్యే ప్రోడక్ట్స్‌ను సిస్టమ్ సూచిస్తుంది. ఇలాంటి రోబో ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్వైజరీ సేవల్లో వెల్త్ ఫ్రంట్, పర్సనల్ క్యాపిటల్ లాంటి సంస్థలు విదేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తన సంస్థ ద్వారా తీసుకురావాలని చూస్తున్నారు హను.

బిటుసి విభాగంలోనే కాకుండా బి2బి విభాగంలో ముందంజ వేస్తోందీ స్టార్టప్. హైదరాబాద్‌కు చెందిన ఓ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు స్మార్ట్ ఫోన్ ఆధారిత సేవలను ఔట్ సోర్స్ చేస్తోంది. కస్టమర్ ఇంటి దగ్గర నుంచే ఖాతా తెరిచేందుకు వీలుగా టెక్నాలజీని అందిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మిగిలిన చిన్న బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు. లోన్ ప్రాసెసింగ్‌ను మొత్తం సింప్లిఫై చేసేందుకు వీలుగా పైసా టీం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిరాక్స్ డాక్యుమెంట్లు, ఫోటోలు, సంతకాలు, బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించి ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ప్రాసెస్‌ను మార్చాలని చూస్తోంది. ఆధార్, ఓటర్ ఐడి అనుసంధానం వల్ల నకిలీ జనాలను మొదట్లోనే అరికట్టేందుకు వీలవుతుందనేది వీళ్ల భావన.

''అప్లికెంట్ ఫైనాన్షియల్ కెపాసిటీ వంటివి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చూసుకుంటాయి.. కేవలం అప్లికషన్ ప్రాసెస్‌ను సులువు చేసి ఇవ్వడమే మా బాధ్యత. సిబిల్ స్కోర్ కూడా చూసేందుకు వీలుగా వ్యవస్థ ఏర్పాటు చేశాం. కస్టమర్ తమ లోన్ అప్లికేషన్ ఎంటర్ చేసిన వెంటనే.. గంటల్లో స్టేటస్ తెలిసిపోతుంది. ఇది బ్యాంకులకు ఎంతగానో ఉపయోగపడే ప్రోడక్ట్'' - హను.

సింపుల్ యాప్ ద్వారా ఏ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కావాలన్నా కొనేందుకు వీలుగా కస్టమర్లకు, ఎలాంటి లోన్ కావాలన్నా కస్టమర్లకు ఇచ్చేందుకు వీలుగా ఏజెంట్లకూ మరో యాప్‌నూ రూపొందించారు. రాబోయే రోజుల్లో 50,000 మంది ఏజెంట్ల స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ స్టార్టప్. ప్రస్తుతానికి ఇందులో 22 మంది ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి సొంత నిధులతోనే బిజినెస్ రన్ చేస్తున్న ఈ స్టార్టప్... ఈ మధ్యే బ్రేక్ ఈవెన్ స్థాయికి వచ్చింది. 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags