ఉద్యోగులను నియమించుకోవడంలోనే కంపెనీ విజయ రహస్యం దాగుంది

ఉద్యోగులను నియమించుకోవడంలోనే కంపెనీ విజయ రహస్యం దాగుంది

Tuesday March 22, 2016,

4 min Read


కంపెనీ భవిష్యత్ ఉద్యోగులపైనే ఆధారపడి ఉంటుంది. కంపెనీ బలం ఎంప్లాయిసే. ప్యూన్ నుంచి సీఈఓ వరకు కంపెనీని ఒక దేవాలయంగా భావించి కష్టించి పనిచేస్తేనే లాభాలొస్తాయి. నెల జీతంకోసం కోసమే పనిచేసేవారి వల్ల ఒరిగేదేమీ లేదు. అయితే అన్నింటికన్నా కష్టమైన పని జనాన్ని మేనేజ్ చేయడమే. ఉద్యోగులను తీసుకోవడం… తొలగించడం అది అంత ఈజీ కాదంటున్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజీవ్ ధావన్. తన అనుభవాలను యువర్ స్టోరీతో పంచుకున్నారు.

ఔత్సాహిక వ్యాపారవేత్తల విజయ రహస్యం ఉద్యోగులను మేనేజ్ చేయడంలోనే దాగుంది. సమర్థులైన ఉద్యోగులను తీసుకోవడం ఎలా… వారిని మేనేజ్ చేయడం ఎలా అన్నదానిపై చాలా కంపెనీలు ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నాయి. మానవవనరులే ఏ కంపెనీకైనా గొప్ప ఆస్తి. ఆఫీసులో కంప్యూటర్ పోతే మరో కంప్యూటర్ కొనుక్కోవచ్చు. సాఫ్ట్ వేర్ పాడైపోతే వేరేది వేసుకోవచ్చు. కానీ టాలెంటెడ్ ఎంప్లాయిస్ పోతే మళ్లీ తెచ్చుకోవడం కష్టం. ఒక కంపెనీ ఎలాంటిదో … ఆ కంపెనీ ఉద్యోగులను చూస్తే తెలిసిపోతుంది. ఉద్యోగులు సరైనవారు కాకపోతే కంపెనీ నిండా మునగడం ఖాయం.

నిజమైన నాయకుడు రిఫ్లెక్షన్ – ఎక్స్ టెన్షన్ మధ్య తేడా గుర్తించగలడు. ఎక్స్ టెన్షన్ అంటే ఒక వ్యక్తి జస్ట్ ఖాళీలను పూరించడం లాంటిది. అందులో బలాలు, బలహీనతలు ఉంటాయి. కంపెనీ కల్చర్ అనేది నాయకునితోనే ప్రారంభమవుతుంది. కానీ అది అక్కడే ఆగదు. లీడర్ తోపాటు అందరిలోనూ ఆ కల్చర్ కనిపించాలి. నేను మొదట్లో బడా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశాను. నేను కాస్త భిన్నంగా ఉండాలనుకునేవాణ్ణి. కంపెనీ హయరార్కీ ఉండాలని నేనెప్పుడూ కోరుకోలేదు. అందరూ ఒకటేనని అందరూ సమష్టిగా పనిచేయాలనేదే నా ఉద్దేశం. నేను చాలా మంది గొప్ప మేనేజర్లతో పనిచేశాను. నన్ను కొంతమంది విసిగించారు. జీవితంపై విరక్తిపుట్టేలా చేశారు. వారిని ఇప్పటికీ మర్చిపోలేను. నేను సొంతంగా వ్యాపారవేత్తగా ఎదగడానికి కారణం వారే. అందుకే వారందరికీ ధన్యవాదాలు.

నేను కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసినప్పటి నుంచే … సొంతంగా ఒక సంస్థను పెట్టాలనుకున్నాను. అందులో హయరాక్కీ ఉండదు… మేనేజర్లండరు. అందరూ సమానమే అనుకుని కలిసి పనిచేయడమే. అందరికీ బోలెడంత స్వేచ్ఛ ఉంటుంది.

ఈ హయరార్కీ అంటే ఇష్టం లేకపోవడానికి మరో కారణం కూడా ఉంది. దీనివల్ల ఒకరిపై మరొకరికి అపనమ్మకం ఏర్పడుతుంది. ఎవరూ స్వేచ్ఛగా పూర్తి స్థాయిలో పనిచేయరు. బాస్ చెప్పినదానికి తలూపుతారు. క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఇలాంటి చోట ఉద్యోగులను కాపాడుకుంటూ సంస్థను నిలబెట్టడం లీడర్ పని. ఏమాత్రం తేడాలొచ్చినా టీం లీడర్ ఉద్యోగాన్ని కోల్పోతారు. అందుకే మనుషులతో డీలింగ్ అంటే చాలా సున్నితమైన అంశం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం మరోదానిపై పడుతుంది. సంస్థలో ప్రతి పనికి వేరే పనితో లింక్ ఉంటుంది. తప్పు ఒకచోట జరిగినా ప్రభావం వేరేదానిపై పడి మొత్తం వ్యవస్థే నాశనమవుతుంది. ఈ విషయం తెలియడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోవచ్చు. గతంలో ఎన్నడూ చూడని కొత్తకొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. మొదట్లో వీటిని ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండలేం.

2016 ఫిబ్రవరిలో జాబ్స్ మానేసినవారి సంఖ్య.. మేనేజ్మెంట్ తీసేసినవారి సంఖ్య కంటే చాలా ఎక్కువ. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మా చిన్న కంపెనీలో టీం హఠాత్తుగా 85 శాతం తగ్గిపోయింది. చాలామంది చెప్పాపెట్టకుండా మానేశారు… కొంత మందిని ప్రవర్తన బాగాలేక తీసేశారు. 85 శాతం మంది ఒక్కసారిగా తగ్గిపోవడమంటే చిన్న కంపెనీకి చావుతో సమానం. అంటే ఆల్మోస్ట్ అది మూతపడినట్లే.

అయితే మేం లక్కీగా వెనువెంటనే ఉద్యోగాలను భర్తీచేశాం. ఈ క్రమంలోనే బ్లండర్ మిస్టేక్స్ చేశాం. మానేసివారితో… కొత్తవారిని బేరీజు వేసుకున్నాం. మానేసినవారితో వీరికి కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. అకడమిక్ క్వాలిఫికేషన్, శాలరీ, ఐక్యూ, జీల్ విషయంలో కొన్ని పోలికలున్నాయి. అయితే మేం నేర్చుకున్న పాఠాలేమిటి..?

image


కంపెనీ స్థాయినిబట్టే ఉద్యోగులను తీసుకోవాలి

అధికారక్రమం (హయరార్కీ) లేకుండా అందరూ సమానమే అన్నది పాశ్చాత్య భావన. అక్కడ కూడా జపోస్ లాంటి కొన్ని ఆన్ లైన్ కంపెనీలు మాత్రమే ఈ సూత్రాన్ని పాటిస్తాయి. కొన్ని కంపెనీలు బయటకు అలా కనిపిస్తాయిగానీ లోపల ఉండాల్సిన హయరార్కీ ఉంటుంది.

అందరూ సమానంగా ఉండే సంస్థను ఏర్పాటు చేయాలనుకోవడం చాలా మంచి ఐడియా. ఇలాంటి వ్యవస్థను సృష్టించాలంటే… ప్రతి ఉద్యోగి తనను తాను పర్యవేక్షించుకోవాలి. నిజయతీగా తమను తాము బేరీజు వేసుకోవాలి. అయితే మేం వ్యక్తిలో ఈ లక్షణాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే వాస్తవానికి – మా విధానానికి చాలా గ్యాప్ ఉండిపోయింది.

నియామకం అంటే నిరాశ కాదు

ఒకవైపు సమానత్వ సంస్థను స్థాపించాలన్న సవాల్ ను స్వీకరించి పనిచేస్తున్నారు. మరోవైపు కంపెనీ నుంచి ఉద్యోగులు మానేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలో ఎవరికి వారు నిజాయతీగా పనిచేస్తూ పర్యవేక్షించుకోలేకపోతే దాని ప్రభావం ప్రొడక్టివిటీ, నాణ్యతపై పడుతుంది. ఇలాంటి సమయంలో వారిని మేనేజ్మెంట్ ఉద్యోగాల నుంచి తీసివేస్తుంది. లేదా వారికి వారే జాబ్స్ మానేస్తారు. దీనివల్ల మళ్లీ గ్యాప్ వస్తుంది. చిన్న కంపెనీకిది శరాఘాతం. పెద్ద కంపెనీకైతే ఫర్వాలేదు. మేముకూడా ఇలాగే దెబ్బతిన్నాం. ఉద్యోగులు మానేయడంతో త్వరగా మళ్లీ రిక్రూట్ చేశాం. ఇలా వచ్చినవారు అలా వెళ్లిపోయేవారు. దీంతో ఖాళీలు మళ్లీ పెరిగిపోయాయి. ఒక్కర్ని ఉద్యోగంలోకి తీసుకుంటే ఇద్దరు మానేసేవారు. సమస్య పెద్దదయింది.

తొందరపాటు పనికిరాదు

మిగతా చిన్న కంపెనీల్లాగే మేము కూడా ఉద్యోగాలను మానేసినవారినే తీసుకున్నాం. కాస్త ఎక్స్ పీరియన్స్ వాళ్లను తీసుకుంటే వెంటనే మా కంపెనీ అభివృద్ధి చెందుతుందని భ్రమపడ్డాం. కానీ అది ఆత్మహత్యాసదృశ్యం అని తెలుసుకున్నాం. ఒక విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు దానికి రియాక్షన్ లా ఉద్యోగ నియామకాలు ఉండరాదు. ఒక్క పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్దంగా ఎంప్లాయిస్ ను రిక్రూట్ చేసుకోవాలి.

నియామకాలు అన్ని కంపెనీకి అత్యంత ముఖ్యమైన పని. ఆ పని సరిగా చేయకపోతే అంతే సంగతులు. ఒక కంపెనీకి ముఖం, కళ్లు, ముక్కు చెవులు అన్నీ ఉద్యోగులే. ఒక్క స్కిల్ చూసే ఉద్యోగులను తీసుకోలేం. వ్యక్తిత్వం చాలా ముఖ్యం. కంపెనీకి కల్చరల్ గా ఒక వ్యక్తి సరిపోతాడా… లేదా అన్నది చూసుకోవాలి. అందుకే ఇప్పుడు స్కిల్ కన్నా వ్యక్తిత్వానికే ప్రాధాన్యతనిస్తున్నారు.

జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను. చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు రాటుదేలిపోయాను. కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చాను. మిగతా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లాగే ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను. తాము చేస్తున్న సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, తమ అభివృద్ధిని తమ సంస్థ అభివృద్ధిలో చూసుకొనే ఉద్యోగులు.. ఏ సంస్థ కైనా గుండెకాయలాంటి వారు. ఉద్యోగులనే పునాది బలంగా ఉంటేనే సంస్థ ఎంత ఎత్తుకైనా ఎదగగలదు. లేకపోతే పతనం తప్పదు.