సంకలనాలు
Telugu

ఉర్దూ భాష ఆ ఊరి తలరాతనే మార్చేసింది..!

ఉర్దూ విద్యార్హతతో ఉద్యోగాలు పొందిన సేందడా గ్రామస్థులు--ఉర్దూ చలువతో గ్రామంలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి --ఉర్దూ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు--

uday kiran
15th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మాతృభాష కాకపోయినా మమకారం పెంచుకున్నారు. నేర్చుకోవాలన్న తపన ఉండాలే గానీ ఏ భాషలోనైనా ప్రావీణ్యం సంపాదించవచ్చని నిరూపించారు. ఎంతో కఠినమైన ఉర్దూ భాషను నేర్చుకుని సర్కారీ కొలువుల్ని సొంతం చేసుకుంటున్నారు రాజస్థాన్ లోని సేందడా గ్రామస్థులు.

రాజస్థాన్ టోంక్ జిల్లాలోని సేందడా గ్రామం. రాజధాని జయ్ పూర్ కు 100కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామస్థులంతా మీనా సామాజిక వర్గానికి చెందినవారే. ఒకప్పుడు చేసేందుకు పని దొరకక నానా అవస్థలు పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఊరిలోని ప్రతి ఇంట్లో ఇప్పుడో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. అందుకు కారణం ఉర్దూ. ఒక్క మాటలో చెప్పాలంటే ఉర్దూ భాష ఆ ఊరి తలరాతనే మార్చేసింది.

image


వాస్తవానికి సేందడా గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో పదకొండు, పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులు కూర్చునేందుకు కూడా బెంచీలు లేవు. కనీసం తాగేందుకు సురక్షితమైన మంచినీరు అందుబాటులో ఉండదు. కనీస సౌకర్యాలు లేకపోయినా స్కూల్ మాత్రం విద్యార్థులతో కళకళలాడుతుంటుంది. దీనికి కారణం ఉర్దూ సబ్జెక్ట్. 2000 జనాభా ఉన్న గ్రామంలో ఉర్దూ కారణంగా చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. దీంతో ఉర్దూ నేర్చుకుంటే ఉద్యోగం గ్యారెంటీ అన్న నమ్మకం స్టూడెంట్స్ ఆ భాష నేర్చుకునేలా ప్రేరేపించింది. విశేషం ఏంటంటే గ్రామంలో ఒక్క ముస్లిం కూడా లేరు. అయినా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా నేర్చుకుంటుండటంతో ఉర్దూకు ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది.

image


“మా ఊరిలో ఉర్దూ నేర్చుకున్న చాలామందికి ఉద్యోగం లభించింది. వారిలాగే నాకు కూడా ఉద్యోగం దొరుకుతుందని ఉర్దూ నేర్చుకుంటున్నాను” - సీమ, స్టూడెంట్

సేందడా గ్రామంలో ఉర్దూకు ప్రాధాన్యం పెరగడం వెనుక కారణం ఉంది. ఉర్దూ విద్యార్హతలతో ఉద్యోగాలున్నా అభ్యర్థులు లేక ఎస్సీ, ఎస్టీ పోస్టులు ఖాళీగానే ఉండిపోయేవి. ఈ విషయాన్ని న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకున్నారు గ్రామస్థులు. దాంతో ఉర్దూ నేర్చుకోవాలన్న నిర్ణయానికొచ్చారు. ఇంకేమంది అంతా కలిసి స్కూల్ లో ఉర్దూ టీచర్ ను నియమించాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. సర్కారు సానుకూలంగా స్పందించి టీచర్ ను నియమించడంతో స్కూల్ లో 11వ తరగతి నుంచి ఉర్దూ బోధన ప్రారంభమైంది. అంతకు ముందు సంస్కృతం సబ్జెక్ట్ బోధించేవారు.. ఉర్దూ టీచర్ రాకతో ప్రతి విద్యార్థి ఉర్దూ భాషను ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఎంచుకున్నారు. పిల్లలకు ఉర్దూ పట్ల ఉన్న మక్కువ చూసి ఉర్దూ ఉపాధ్యాయుడు సైతం మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే ఆయన స్టూడెంట్స్ కోరిక మేరకు ఎక్స్ ట్రా క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉర్దూ నేర్పడం పదకొండో తరగతి నుంచి ప్రారంభిస్తుండటంతో టీచర్ కొంత శ్రమించాల్సి వస్తోంది.

“ఇక్కడ లెక్చరర్ పోస్ట్ ఉంది. కానీ ఉర్దూ లెక్చరర్ లేకపోవడంతో జూనియర్ టీచర్ నైన నన్ను నియమించారు. పిల్లల్లో ఉర్దూ నేర్చుకోవాలన్న తపన చూసి ఎక్స్ ట్రా క్లాసులు తీసుకునేందుకు టోంక్ నుంచి ఉదయమే స్కూల్ కు వచ్చేస్తాను.” -మహమూద్, ఉర్దూ టీచర్

ఉర్దూ బోధన ప్రారంభమైన తర్వాత స్కూల్ లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్టూడెంట్ ఎన్ రోల్ మెంట్ పెరగడంపై స్కూల్ ప్రిన్సిపల్ నాథూలాల్ మీనా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్ లో మౌలిక సదుపాయాల కొరత ఉంది. అయినా ఉర్దూ నేర్చుకోవాలన్న తపన విద్యార్థుల్ని స్కూల్ కు రప్పిస్తోంది. ఉర్దూ సబ్జెక్ట్ లో విద్యార్థులెవరూ ఫెయిల్ అవ్వరంటే వారికి దానిపై వారికున్న ఆసక్తి అర్థం అవుతుంది. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో ఒకరికి ఉర్దూ కారణంగా ఉద్యోగం లభించింది. ఉర్దూ నేర్చుకునేందుకు అమ్మాయిలు సైతం ముందుకురావడం ఎంతో సంతోషకరం.” -నాథూలాల్ మీనా, ప్రిన్సిపల్
ఉర్దూ పుణ్యమాని నాకు ఈ ఏడాది గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. నాతో పాటు గ్రామానికి చెందిన మరో 14మందికి కూడా లెక్చరర్లుగా నియమితులయ్యారు.”- గోపాల్ మీనా, ఉర్దూ లెక్చరర్

ఉర్దూ నేర్చుకోవడంలో ఉన్న ఇబ్బందుల గురించి పిల్లలకు తెలుసు. అయితే ఇష్టంతో చదువుతున్నందున కష్టం అనిపించడంలేదన్నది వారి మాట. పద కొండో తరగతి నుంచి ఉర్దూ నేర్పుతున్నందున కొంత ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఫస్ట్ క్లాస్ నుంచే ఉర్దూ నేర్పడం మొదలుపెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

image


సేందడా గ్రామంలో ముస్లింలు లేకపోయినా ఉర్దూకు మాత్రం మహర్దశపట్టింది. అక్కడ ఉర్దూకు పెరుగుతున్న ప్రాధాన్యం చూస్తే భాషకు మతం ఉండదని దానిపై ఎవరూ అజమాయిషీ చేయలేరన్న విషయం స్పష్టమవుతోంది. ఉర్దూ అర్హతతో సేందడాలో ఇప్పటికి 100మందికి పైగా వ్యక్తులు మెడికల్, ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లలో ఉద్యోగం సంపాదించారు. ఉర్దూ అర్హత గల అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ తామే సొంతం చేసుకుంటామన్నది ధీమాగా చెబుతున్నారు స్టూడెంట్స్. మొత్తమ్మీద ఒకప్పుడు ఉపాధిలేక అల్లాడిన ఆ గ్రామస్థులకు... ప్రభుత్వ ఉద్యోగమన్నది ఊహకందని విషయం. కానీ అదే గ్రామంలో ఇప్పుడు ఇంటికో ప్రభుత్వోద్యోగి ఉన్నారంటే అదంతా ఉర్దూ చలువే.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags