సంకలనాలు
Telugu

చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ కుర్రాడు..! ఇప్పుడు ఆన్సర్లు చెప్తున్నాడు..!!

ప్రశ్నించే మంత్రమే ఎన్నో విజయాలను సిద్ధింపజేసింది 

Arvind Yadav
6th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ప్రశ్నలపై ప్రశ్నలు. ఆ కుర్రాడికీ ప్రతీదీ ప్రశ్నగానే కనిపించేది. దానికి సమాధానం కనుక్కోవాలనే జిజ్ఞాస, ఉబలాటం అతడిని ఎక్కడికో తీసుకుంది. ప్రశ్నించే తత్వమే అతడి భవిష్యత్తును పటిష్టం చేసింది. ''ఆకాశంలో మేఘాలు తనంతట తాము ఓ రూపాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాయి ? ఉన్నట్టుండి మనిషి శరీరం వేడిగా ఎందుకు మారుతుంది ? పిల్లలకు ఎందుకు జ్వరాలు వస్తాయి ? '' వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ పిల్లాడు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.

చివరకు ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. గడియారం లోపల ఏముంది ? అది ఎలా నడుస్తోంది. లోపలున్న యంత్ర, తంత్ర, మంత్రాలేంటి? అని కనుక్కునేందుకు ఓ రోజు గడియారాన్ని మొత్తం విప్పదీసి చూసేలా చేసింది. ఇంతకీ కాల్యుకులేటర్ ఎలా పనిచేస్తోంది ? ప్రతీసారీ చిన్న తప్పు కూడా చెప్పకుండా పనిచేయడం ఎలా సాధ్యపడుతోంది?.. ఇలా ఒక్కటేమిటి చిన్నప్పుడే అతగాడి మైండ్‌లో ఎప్పుడూ ఓ క్వశ్చన్ బ్యాంక్ రన్ అవుతూ ఉండేది. ఏదో సినిమాలో ఉన్నట్టు.. కూతురిని ఇవ్వమంటే క్వశ్చన్ బ్యాంక్‌ను ఇచ్చేవేంటి తండ్రీ అనే డైలాగ్ ఇక్కడ ఇతనికి కరెక్ట్‌గా సరిపోతుంది. కానీ ఇక్కడ సీన్ కొద్దిగా రివర్స్. కొడుకు అడుగుతున్న ప్రశ్నలకు విసుగు చూపించకుండా.. ఆ తండ్రి అంతే ఓపికగా సమాధానం చెప్పేవారు. అది కూడా యూకేలో ఓ అతిపెద్ద డాక్టర్ అయి ఉండి, క్షణం తీరికలేని బిజీలో ఉండి కూడా.

undefined

undefined


ఆ మంత్రమే ఎన్నో విజయాలను సిద్ధింపజేసింది -

ఇలా చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటూనే పెద్దయ్యేసరికి ఓ గురుమంత్రాన్ని ఔపోసన పట్టాడు. అదేంటంటే.. సరైన వ్యక్తిని సరైన ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుందనే సంగతిని పక్కాగా తెలుసుకున్నాడు. దాన్నే తన కెరీర్‌లో ఫాలో అయిపోతూ వచ్చాడు. ఆ గురుమంత్రమే విజయానికి బాటలు పరుస్తూ వెళ్లింది.

ఆ పిల్లాడే ఇప్పుడు ఎంతో మంది ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలుగా ప్రపంచానికి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరే వాళ్లకు సరైన మార్గదర్శనం చేసి వాళ్ల కలలు సాకారమయ్యేలా చేయడంలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరాడు.

చిన్నప్పటి ఆ క్వశ్చన్ బ్యాంక్ కుర్రాడే శ్రీనివాస్ కొల్లిపార. తెలంగాణ ఐటీ, స్టార్టప్ ప్రపంచానికి తలమానికంగా ఉన్న 'టి-హబ్‌'కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. టి-హబ్ అనే కాన్సెప్ట్ ఆలోచన స్థాయినుంచి అది కార్యరూపం దాల్చేంత వరకూ కష్టపడిన అతికొద్ది మంది వ్యక్తుల్లో శ్రీనివాస్ కూడా ఒకరు అంటే అతిశయోక్తి కాదు.

undefined

undefined


క్వశ్చన్ బ్యాంక్ కుర్రాడు.. ఆన్సర్లు రాబడుతున్నాడు -

ఇప్పుడు శ్రీనివాస్.. స్టార్టప్స్‌, ఆంట్రప్రెన్యూర్స్‌గా మారాలని అనుకుంటున్న వాళ్లకు ఓ విశిష్ట సలాహాదారుగా మారారు. యువర్‌ స్టోరీతో ముచ్చటిస్తున్న సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వేసుకున్న బలమైన ఫౌండేషన్ ఇప్పుడీ స్థాయికి తీసుకొచ్చిందంటారు శ్రీనివాస్. అదే ఇప్పుడు తనకు పనికివచ్చిందంటారు. స్టార్టప్స్‌ను కూడా సరైన ప్రశ్నలు అడుగుతూ వాళ్లను ఓ దారిలోకి తీసుకురావడం, వాళ్ల ఆలోచనల్లో మరింత స్పష్టతను వాళ్లకే అర్థమయ్యేలా చేయడం ఇప్పుడు తన జీవితంలో భాగమైపోయింది. స్టార్టప్స్‌లోకి దిగాలనుకుంటున్న వాళ్ల నుంచి సమాధానాలు రాబడుతూ ఆ కాన్సెప్ట్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది, బిజినెస్ మోడల్ ఏంటి అనే విషయాలను అర్థం చేసుకుంటారు. 

''నేను ఎవరికీ సలహాలు, సూచనలూ ఇవ్వను. నేను అడిగే ప్రశ్నల నుంచి వాళ్లే సమాధానాలు వెతుక్కునేలా చేస్తాను. సరైన ప్రశ్న అడిగినప్పుడే సరైన సమాధానం కూడా వస్తుందనే విషయాన్నే వాళ్లకు అర్థమయ్యేలా చేస్తాను'' అంటారు

తన మాటల ప్రకారం ఏదైనా రాష్ట్రం ఒక రంగంలో పురోభివృద్ధి సాధించేందుకు ఒకటి రెండు కార్యక్రమాలతో పనిజరగదని, అందుకు వివిధ మార్గాల్లో విభిన్నమైన కార్యక్రమాల రూపకల్పనతో సాధ్యమని అంటారు.

అందుకే స్టార్టప్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో కూడా ఓ స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. టి-హబ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే శ్రీనివాస్ కొల్లిపార తన లక్ష్యసాధనలో సఫలీకృతమవుతున్నట్టు అర్థం చేసుకోవాలి.

ఏదో ఒకటి సాధించానని అప్పుడే అనిపించింది -

2015 నవంబర్ 5వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన 'టి - హబ్'. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, విశిష్ట అతిథి అయిన రతన్ టాటా చేతుల మీదుగా ఈ హబ్ ప్రారంభమై ప్రపంచాన్ని ఆకర్షించింది. గవర్నర్ నరసింహన్, ఐటి శాఖా మంత్రి కేటీఆర్ సహా వివిధ పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల మధ్య టి-హబ్ మొదలైంది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ వంటి దిగ్గజ సంస్థల కలయికతో మొదలైన ఈ హబ్ భవిష్యత్‌లో జరగబోయే ఎన్నో అద్భుతాలకు వేదిక కానుంది.

హైదరాబాద్‌లో ఉండే ఔత్సాహికలు, స్టార్టప్స్‌ సౌలభ్యం కోసం ఓ అత్యద్భుతమైన వేదికను తయారు చేయడమే టి - హబ్ ప్రధాన ఉద్దేశం.

ట్రిపుల్ ఐటీలో ఏర్పాటైన టి-హబ్‌లో 70 వేల చదరపు అడుగుల స్థలం ఉంది. స్టార్టప్స్‌ ఇక్కడ తమ పనిచేసుకునేందుకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఎన్నో వందలాది స్టార్టప్స్ ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలను సాఫీగా నడిపిస్తున్నాయి. టి-హబ్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్స్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. అంతే కాదు ఎంతో మంది వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లను కూడా ఇక్కడ కలుసుకునే వెసులుబాటు ఉంది. ఎన్నో నెట్వర్కింగ్ కార్యక్రమాలకు కూడా టి-హబ్ ఇప్పుడో అడ్డాగా మారింది.

undefined

undefined


సీఓఓ శ్రీనివాస్‌కు ఉన్న నమ్మకం ఏంటంటే.. రాబోయే రోజుల్లో టి-హబ్‌ సృష్టించబోయే సంచలనాల గురించి ప్రపంచం తప్పక మాట్లాడుతుంది. దేశనలుమూలలు ఇక్కడి విజయగాధలను విని స్ఫూర్తి పొందుతాయి. ఇలాంటి సెంటర్ ఇక్కడ మొదలుపెట్టడం వల్ల బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య ఏదో పోటీని పెడుతున్నారనే విషయాన్ని మాత్రం శ్రీనివాస్ ఏకీభవించారు. దేశ ప్రగతిలో ప్రతీ రాష్ట్రం, ప్రతీ నగరం భాగస్వామ్యం కావాలని ఆయన అంటారు. ప్రతీ రాష్ట్రం.. తాము నెంబర్‌ వన్‌గా ఉండాలని, ఇతరులతో పోలిస్తే ఉన్నతంగా ఉండాలనే భావిస్తాయని అంటారు. స్నేహపూర్వక పోటీ ఉన్నప్పుడే ఎక్కడైనా అభివృద్ధి ఉంటుందనే విషయాన్ని ఆయన వివరించారు.

దేశంలో ఎన్నో నగరాలు ఉండగా.. స్టార్టప్స్‌ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌నే ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్న అడిగినప్పుడు శ్రీనివాస్ ఉద్వేగభరితుడయ్యారు. ఈ ప్రాంతంలో ఉన్న అనుభవాన్ని పంచుకుంటూనే పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

స్కూలింగ్ యూకే, డిగ్రీ విజయవాడ -

''హైదరాబాద్‌తో నా బంధం చాలా బలమైంది. ఇక్కడ నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎంతో మంది ప్రభావశీల వ్యక్తులతో నాకు చాలా అనుబంధం ఉంది. అందుకే హైదరాబాద్ నాకు ఎంతో ఇష్టమైన నగరం. నేను అనుకున్న లక్ష్యం ఇక్కడ నెరవేరుతుందనే నమ్మకం నాకు కలిగింది. నాయకులు, అధికారుల నాకు ఎంతగానో సహాయపడతారనే ధీమా ఉండడం వల్లే హైదరాబాద్‌ను ఎంచుకున్నా'' - శ్రీనివాస్ కొల్లిపార.

undefined

undefined


హైదరాబాద్ విజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్. ఎన్నో వైవిధ్యమైన రంగాల్లో తన ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసింది. అందుకే ఇక్కడ స్టార్టప్స్‌ ఆ ప్రయోజనాన్ని పొందాలనే ఉద్దేశం ఆయనిది. టి-హబ్ ఏర్పాటు వల్ల గమ్యాన్ని త్వరగా పొందేందుకు ఇక్కడి యువ ఔత్సాహికులకు మార్గం లభిస్తుందని శ్రీనివాస్ బలంగా నమ్మారు.

యూఎస్, యూకెలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అక్కడ కొన్ని ప్రముఖ సంస్థల్లో పనిచేసి అనుభవాన్ని పొందిన ఆయన ఓ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతీ దేశం, ప్రతీ రాష్ట్రం 'సిలికాన్ వ్యాలీ'లా మారాలని గుడ్డిగా ఉబలాటపడతారు. తమ ఆర్థిక, సామాజిక అవసరాలను పట్టించుకోకుండా ఒక ఫార్ములాను ఫాలో అయిపోవడం వల్ల ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇక్కడి ప్రజల అవసరాలు, వాస్తవ స్థితిగతులను అంచనా వేయకుండా ఒకరిని గుడ్డిగా ఫాలో అయిపోవడం వల్ల జరిగే అనర్ధాలే ఎక్కువ. అలాంటి ఆలోచనల నుంచి హైదరాబాద్‌ను మినహాయింపజేయాలనేదే తన లక్ష్యమంటారు.

శ్రీనివాస్ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. అధికారుల నుంచి రాజకీయనాయకుల వరకూ, మీడియా నుంచి విద్యార్థుల వరకూ ప్రతీ ఒక్కరూ స్టార్టప్ అనగానే బెంగళూరు నగరాన్ని ఆదర్శంగా తీసుకునేవారు. ప్రతీ దానికీ ఆ నగరంతోనే పోల్చేవారు. ఇక్కడి టాలెంట్‌ కూడా వలసవెళ్లిపోతున్న పరిస్థితి. దీన్ని ఎలా అయినా మార్చాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు శ్రీనివాస్. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడిప్పుడే కొంత ప్రతిఫలాన్ని అందిస్తోంది. ఇందులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పాత్ర కూడా కీలకం అంటారు శ్రీనివాస్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి అభివృద్ధి మరింత వేగం పుంజుకుందని అంటారు శ్రీనివాస్. ఐటి మంత్రిగా కేటీఆర్ తీసకున్న చొరవ వల్ల ఇది సాధ్యపడిందని వివరిస్తారు. కేవలం హైదరాబాద్‌ను ఐటికి పరిమితం చేయకుండా ఓ ఆంట్రప్రెన్యూర్షిప్‌కు, స్టార్టప్స్‌కు కేంద్రంగా మార్చడంలో సఫలమైనట్టు చెప్తారు. ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ వల్లే ఇక్కడి స్టార్టప్స్‌కు ఎంతో లబ్ధి చేకూరుతోందని అంటారు.

కుటుంబం ఎంతో నేర్పింది -

కార్పొరేట్ ఉద్యోగాలను వదులుకుని ఇలా స్టార్టప్స్ వెంట పరుగులు ఎందుకు తీస్తున్నారు ? దీని వల్ల మీకు కలుగుతున్న ప్రయోజనం ఏంటని అని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన చెబ్తున్న సమాధానం ఇది.

''ఆంట్రప్రెన్యూర్షిప్ అనేది మా కుటుంబంలోనే ఉంది. మా తాత గారైన డా. సి.ఎల్.రాయుడు గారు నన్ను ఎంతగానో ప్రభావితం చేశారు. అప్పట్లో ఆయన ఓ పెద్ద వామపక్ష నేత. విజయవాడ, గన్నవరం ప్రాంతాల అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు. జనాలకు ఉపయోగపడే ఎన్నో సామాజిక కార్యక్రమాలను డా. సి.ఎల్ రాయడు గారు చేపట్టారు. నిస్వార్థ సేవను ఆయన ధృడంగా నమ్మేవారు. దేశానికి తమ చేతనైనంత సేవ చేయడమే లక్ష్యంగా బతికారు. అలాంటి ఆయనను చూసి నేను ఎంతో ప్రభావితుడనయ్యాను. డబ్బు, అధికారం, ప్రభుత్వ గుర్తింపుల కోసం పాకులాడకుండా వాళ్లు చేసిన ప్రయత్నాలు నన్ను ఎంతో ఆకర్షితుడిని చేశాయి. అందుకే మా తాతగారి లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసకుని నేనూ సమాజానికి ఏదైనా మంచిపని చేయాలనుకున్నా''.

నైతిక విలువలు, సిద్ధాంతాల విషయంలోనూ శ్రీనివాస్‌లో చాలా స్పష్టత ఉంది. ఈ విషయంలో తన మామ గారైన డా. వసంత్ కుమార్ ప్రభావం తనపై చాలా ఉంది. డా. వసంత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి క్లాస్‌మేట్ మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా.

శ్రీనివాస్ బాల్యం, స్కూలింగ్ అంతా యూకేలో సాగింది. తండ్రి పేరున్న డాక్టర్‌తో పాటు పారిశ్రామికవేత్త కూడా. అక్కడే తన తండ్రికి వ్యాపారంలో కూడా సాయం చేసేవారు శ్రీనివాస్.

యుక్తవయస్సులో కాలేజీ విద్యను అభ్యసించేందుకు యూకె నుంచి విజయవాడ వచ్చారు. ఇక్కడి వాతావరణం తనకు ఎంతో విభిన్నంగా అనిపించింది. తిండీ బట్ట, కట్టూ బొట్టు, సంస్కృతిలో ఎన్నో మార్పులు చూసిన విజయవాడ పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యేందుకు కొంత కాలం పట్టింది.

అయితే వాటన్నింటినీ వేగంగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తాత, మామల మార్గదర్శనంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నారు. ఇక్కడి మనుషులు, వాళ్లకు ఉన్న సామర్ధ్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడి సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలను కనుగొనాలనుకున్నారు.

undefined

undefined


చదువు పూర్తికాగానే శ్రీనివాస్‌కు ఓమెగా ఇమ్యునోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. డయాగ్నస్టిక్ ఎంజైమ్ రంగంలో ఈ కంపెనీ తన సేవలను అందించేది. అయితే కొద్దికాలానికే ఈ సంస్థలను ఓ విదేశీ సంస్థ టేకోవర్ చేసింది. దీని తర్వాత ట్రాన్స్‌జీన్ బయోటెక్, కంప్యూలెర్న్‌టెక్, యాస్పెక్ట్ సాఫ్ట్‌వేర్, పీపుల్ సాఫ్ట్ వంటి సంస్థల్లో ఉన్నతోద్యోగిగా కీలకబాధ్యతలు నిర్వహించారు శ్రీనివాస్.

అయితే 2007 తర్వాత తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఇక ఉద్యోగాలు చేయడం వద్దనుకున్నారు. తన మనసుకు నచ్చిన, తాను ప్రాణంగా ప్రేమించే స్టార్టప్స్ సర్వస్వం అనుకున్నారు. అలా మొదలైన ప్రయాణంలో 'స్టార్టప్ మెంటర్'గా ఖ్యాతి గడించారు. స్టార్టప్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

'' టి-హబ్ స్థాపన ఇప్పటివరకూ నా జీవితంలో నేను సాధించిన ఓ గొప్ప విజయం. నాకు జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సంఘటన అది. ఎప్పుడైతో ప్రపంచమంతా ఇక్కడి కంపెనీల నుంచి ఇక్కడి నుంచి వెళ్లి సక్సెస్ అయిన స్టార్టప్స్ గురించి మాట్లాడుతుందో అప్పుడే నా కల సాకారమైనట్టు. నేను విజయం సాధించినట్టు. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరినట్టుగా భావిస్తాను''.

పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు తెలిసొచ్చింది?

అయితే ఎవరికీ విజయం అంత సులువుగా సిద్ధించదు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చితేనే అది సాధ్యపడ్తుంది. శ్రీనివాస్ కూడా తాను ఎదుర్కొన్న సంఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

నేను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. కిందపడిన ప్రతీసారీ ఏదో ఒక్క కొత్త అనుభవాన్ని నేర్చుకున్నారు. మా నాన్నగారి కంపెనీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు మా కుటుంబం పడిన వేదన నాకు ఇప్పటికీ గుర్తుంది. కంపెనీకి చాలా కష్టమొచ్చిపడింది. అప్పుల వాళ్లు వెంటపడ్డారు. అవి చాలా కష్టమైన రోజులు. నేను ఎన్నో రోజులు వాటిని తలుచుకుని కుమిలికుమిలి ఏడ్చాను. కష్టకాలంలో 'నా' అనుకున్న స్నేహితులు ఎవరూ దగ్గరికి రాలేదు. కానీ అనుకోకుండా కొంత మంది మాత్రం మమల్ని ఒడ్డున పడేసేందుకు ముందుకు వచ్చారు. కష్టాల సుడిగుండంలో మునిగిపోతున్న మమల్ని అదుకున్నారు.

''మీరు చేసిన కొన్ని మంచి పనులు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఇలాంటి కష్టకాలంలో ఉన్న మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత'' అని వాళ్లు చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. చేసిన మంచి పనులు ఎప్పుడో ఒకసారి మనకు అక్కరకు వస్తాయనే విషయం నాలో చాలా బలంగా నాటుకుపోయింది''.

కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి, స్టార్టప్ వెంట పరుగులు తీస్తున్న శ్రీనివాస్‌కు మూడు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి.

1. సామాజంపై తనదైన ముద్రవేసి ఏదో ఒక ప్రయోజనకరమైన కార్యక్రమం చేపట్టాలి.

2. ఎప్పుడూ మనసుకు నచ్చిన పనే చేయాలి. ఇష్టమైన పనిలో కష్టం ఉన్నా ఆనందంగా ఉంటుంది.

3. తను కుటుంబం నుంచి నేర్చుకున్న సామాజిక సేవను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి