రాజకీయాల్లో జయలలిత చెరగని సంతకం

తమిళనాట చరిత్ర సృష్టించిన అమ్మ
0 CLAPS
0

జయలలిత పడిలేచిన కెరటం.. అధపాతళం నుంచి ఎగిసి.. శిఖరాగ్ర స్థాయిని చేరుకున్న ధీరవనిత. హీరోయిన్ గా, అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షురాలిగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా తమిళనాట చరిత్ర సృష్టించారు. నాటి మైసూర్‌... రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలూకాలోని మెల్కోటేలో గ్రామంలో 1948, ఫిబ్రవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లిలు. ఆ కాలంలోనే జయలలిత తల్లి వేదవల్లి...సంధ్య పేరుతో ప్రముఖ నటిగా వెలుగొందారు. జయ రెండేళ్ల వయసులోనే ఆమె తండ్రి చనిపోయారు. దీంతో బెంగళూరులోని అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉండాల్సి వచ్చింది. తల్లి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో చిన్నతనంలో జయలలిత తల్లితండ్రుల ప్రేమను కోల్పోయారు.

కుటుంబ కష్టాలు పెరగటంతో జయలలిత సైతం బాల నటిగా సినిమాల్లో నటించటం ప్రారంభించారు. చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్‍‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చదవుకుంటూనే తల్లితో పాటు సినిమాల్లో నటించేవారు. సినీరంగంలో రాణించిన జయ...జీవితం పూర్తిగా మారిపోయింది మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అని చెప్పాలి. ప్రముఖ నటుడు అన్నాడీఎంకే అధినేత ఎం.జి రామచంద్రన్‌ తో పరిచయం జయలలిత లైఫ్‌ లో టర్నింగ్‌ పాయింట్. 1977 లో తమిళనాడుకు ఎం.జి రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎం.జి.ఆర్ ప్రోత్సాహంతోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982 లో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచండూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. ఐతే 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. వాక్చాతుర్యం...రాజకీయాలపై ఎంతో పట్టున్న జయలలిత...రాజ్యసభలో అన్నాడీఎంకే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

జయలలిత రాజకీయ గురువు ఎంజీఆరే. ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలైన సమయంలో పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండేందుకు జయలలితను ప్రచార కార్యదర్శిగా నియమించారు. కానీ పార్టీ పెద్దల నుంచి ఎదురైన నిరసనలతో జయలలితను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఐతే ఎం.జి.ఆర్ ఉన్నంత వరకు పార్టీలో జయ హవా నడిచేది. 1987 లో ఎం.జి.ఆర్ మృతి చెందటంతో జయలలిత భవిత్యవం కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ఎం.జి.ఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకేలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎం.జి.ఆర్ సతీమణి జానకి సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. ఎం.జి.ఆర్‌ సతీమణికి కొంతమంది మద్దతు ఇవ్వగా జయలలిత వర్గానికి మరికొంత మద్దతిచ్చారు.


ఇక్కడి నుంచి జయలలిత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పాలి. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎంజీఆర్ మృతి తర్వాతే పాలిటిక్స్ పై ఆమె పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఎంజీఆర్‌కు నిజమైన రాజకీయ వారసురాలిగా ప్రకటించుకొని...అన్నాడీఎంకే అధినేత్రి అయ్యారు. ఆ తర్వాత జయకు రాజకీయ ప్రయాణమేమీ నల్లేరు పై నడకలా సాగలేదు. అడుగడునా అడ్డంకులు, అవమానాలు ఎదురయ్యాయి. ఐతే చిన్ననాటి నుంచే ధృడ సంకల్పం కలిగిన జయ పడిలేచిన కెరటంలా దూసుకుపోయారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు.

పార్టీ అధినేత్రిగా మారిన తర్వాత... 1991 ఎన్నికల్లో అన్నాడీఎంకే – కాంగ్రెస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రాజీవ్‌ గాంధీ హత్యతో వెల్లువెత్తిన సానుభూతి పవనాలు, ఎల్‌టీటీఈకి డీఎంకే మద్దతివ్వడంపై తమిళ ఓటర్ల ఆగ్రహం జయలలితకు కలిసొచ్చింది. అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. గతంలో తనను వ్యతిరేకించిన సీనియర్ల మద్దతుతోనే జయ తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఘోర ఓటమిని చవిచూసిన జయలలిత.. 2001లో మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత అమ్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆ ఎఫెక్ట్‌ 2004 లోక్‌సభ ఎన్నిక్లలో స్పష్టంగా కనిపించింది. 39 స్థానాల్లో డీఎంకే - కాంగ్రెస్‌ కూటమి అన్నాడీఎంకేను చిత్తుగా ఓడించింది... 2006 లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే మళ్లీ అధికారాన్ని కోల్పోయింది. ఐతే 2011 లో మళ్లీ జయ అధికారాన్ని దక్కించుకున్నారు. అప్పటి నుంచి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి...వాటిని పక్కగా ఆమలు చేశారు. దీంతో తమిళనాడు ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం ఇవ్వని రికార్డును జయ చేరిపేశారు. 2015 లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది సత్తా చాటారు.

1991 లో అన్నాడీఎంకే అధినేతగా మారిన తర్వాత...జయలలిత రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. 25 ఏళ్ల తమిళనాట రాజకీయాల్లో జయలలిత ఐరన్‌ లేడీ. అనుయాయులకు ఆమె తమిళనాడు మార్గరెట్‌ థాచర్‌. దృఢ వైఖరి, రాజకీయ చతురత ఆమె సొంతం. ప్రత్యర్థులను తన ఎత్తుగడలతో గడగడలాడించే వారు. తమిళనాడు ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే పోటీ. ఐతే జయలలిత, కరుణానిధి మధ్య రాజకీయ వైరం కాస్తా కాలక్రమంలో వ్యక్తిగత శత్రుత్వంగా రూపాంతరం చెందింది. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు కేరాఫ్‌గా మారిపోయింది. అసెంబ్లీ సాక్షిగా డీఎంకే ఎమ్మెల్యేలు జయలలిత చీరలాగి పరాభవిస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు పురుచ్చితలైవి నిద్రపోలేదు. తాను అధికారంలోకి వచ్చాక కరుణానిధిపై కేసు పెట్టించిన జయ అర్థరాత్రి ఆయనింటికి పోలీసుల్ని పంపి అరెస్ట్‌ చేయించింది. ఈ ఘటనలు తమిళ రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయాయి. ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత్రి, ప్రతిపక్ష నేతగా జయలలిత వందకు వంద మార్కులు సాధించారు.

ఇక పార్టీలోనూ జయ చెప్పిందే వేదం. ఆమె మాటే శాసనం. అమ్మ మాటకు ఎదురు చెప్పే సాహసం చేసిన వారే లేరు. అన్నాడీఎంకేలో కార్యకర్తలు ఆమెను దేవతగా భావిస్తారు. అమ్మ ఎదురుగా నిలబడి మాట్లాడిన వారు కూడా పార్టీలో ఒక్కరు కనిపించారు. ఐతే ఈ వైఖరి కారణంగా జయలలిత నియంత అని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. జయ ఎంతో కఠినంగా వ్యవహారిస్తారో అంతా మృధుస్వభావి. పేదల పక్షపాతి. పేద ప్రజల బాగోగుల కోసం ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఆమె ఎంతో కృషి చేశారు. ఈ కారణంగా జయలలితను ఆ రాష్ట్ర ప్రజలు అమ్మగా సంభోదిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాల్లో మార్పులకు కారణమైన జయను విప్లవ వనితగా భావిస్తారు. పురచ్చితలైవిగా పూజిస్తారు. అమ్మ పేరుతో జయలలిత ప్రకటించిన పథకాలు పేద ప్రజలకు వరంగా మారాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాలను ఆదర్శంగా తీసుకున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ జయ చక్రం తిప్పారు. కాంగ్రెస్ తో సహా ఎన్డీఏ పొత్తులు పెట్టుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి రాష్ట్రానికి కావాల్సిన పనులను చేయించుకున్నారు. 1999 ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి సంచలనం సృష్టించారు. దీంతో వాజ్‌ పేయ్‌ సర్కార్ ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోయింది. రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కేంద్రంలో ఉన్న సర్కార్ తో జయ జతకట్టేవారు.

Latest

Updates from around the world